“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

21, జులై 2011, గురువారం

రాహుకేతువులు - దుర్మరణాలు

మే నెలలో రాహుకేతువులు గోచారరీత్యా నీచస్థితిలోకి రావడం జరిగింది. మే, జూన్, జూలై నెలలలో ఆ ప్రభావం వల్ల ప్రజాజీవితంలో  అనేక ప్రమాదాలూ, రక్తపాతాలూ, గొడవలూ, అసహజమరణాలూ, దుర్మరణాలూ జరిగాయి.

రాహుకేతువులు ప్రమాదాలకూ, స్మశానాలకూ, చావుకూ ఆధిపత్యం వహిస్తారు. వారు ప్రస్తుతం నీచస్తితిలో ఉండటం వల్ల బాగా బలాన్ని పుంజుకున్నారు. క్రూరగ్రహాలు నీచస్తితిలో ఉంటే మహా బలవత్తరములౌతాయి. అప్పుడు వాటి ప్రభావం బలంగా కనిపించడం మొదలౌతుంది. తమ తమ పరిధిలో భూభారాన్ని తగ్గించే పని అవి ఆ సమయంలో అతి సమర్ధవంతంగా చేస్తాయి. అలా చెయ్యడానికి మనిషిలోని అహంకారాన్నీ, పొగరునూ, అతితెలివినీ, నిర్లక్ష్యాన్నీ ఊతంగా తీసుకుని తమ కార్యాన్ని చక్కగా పూర్తి చేసుకుంటాయి.

ఒక్క జూలై నెలలోనే నాకు తెలిసిన వారు 4 గురు చనిపోయారు. వీరంతా బాగా ముసలి వారా అంటే కానేకాదు. అందరూ ఏభై లోపు వారే. హటాత్తుగా గుండెపోటుతో పోయిన వారు కొందరైతే, ఆత్మహత్యలు చేసుకున్నవారూ, ప్రమాదాలలో పోయినవారూ ఇంకొందరు. వీరిలో ఎవరూ కూడా చావును ఎక్స్పెక్ట్ చేసినవారు కారు. ఇటువంటి రకమైన ఆకస్మిక చావులు రాహు కేతుల అధీనంలోనే జరుగుతాయి.

ఇలా మరణించినవారిలో అందరూ హటాత్తుగా పోయినవారే. దీర్ఘకాలిక రోగాలతో మంచానపడి పోయినవారు ఎవరూ లేరు. అప్పటిదాకా బాగానే ఉండి సడెన్ గా ఆత్మహత్యలు చేసుకున్న వారూ, అప్పటిదాకా ఆనందంగా కేరింతలు కొడుతూ ప్రయాణం చేస్తూ సడెన్ గా యాక్సిడెంట్ అయి పోయినవారూ వీరిలో ఉన్నారు. రాహు కేతువుల ప్రభావం వల్ల జరిగే సంఘటనలు ఇలాగే హటాత్తుగా జరుగుతాయి. కన్ను మూసి తెరిచేలోపల అంతా అయిపోతుంది.
 
ఇలాటి కేసులను జాగ్రత్తగా గమనిస్తే, వీరిలో ఎక్కువమంది 17, 22. 40 , 44 , 48  ఏళ్ల వారే కనిపిస్తున్నారు. కారణం ఏమంటే 2, 4, 8 అంకెలకు రాహుకేతువులకూ సంబంధం ఉండటమే. జాతకంలో చెడు దశలు జరుగుతున్నవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. సాహసకార్యాలకూ దుడుకుపనులకూ దూరంగా ఉండాలి. అహంకారం పనికిరాదు. రాహువు జ్యేష్టానక్షత్ర సంచారం ఫిబ్రవరి 2012 వరకూ ఉంటుంది. ఈలోపల ఇటువంటి ఘోరాలు మరిన్ని జరిగే అవకాశం ఉందని చెప్పక తప్పదు.