“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

26, అక్టోబర్ 2010, మంగళవారం

ఒక చిన్న దీపం చాలు

"ఒక చిన్న దీపం చాలు యుగాల చీకటిని తొలగించడానికి"

మొన్న ఒకరోజు ట్రెయిన్ లో ప్రయాణిస్తున్నాను. సామాన్యంగా ఏసీ బోగీలో ప్రయాణీకులు ఒకరు ఇంకొకరితో మాట్లాడుకోరు. లాప్ టాప్ లో సినిమా చూడటమో, లేక పాటలు వింటూ పడుకోటమో, లేకుంటే ఏదైనా పుస్తకం చదువుకోటమో చేస్తారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం మోటుగా భావిస్తారేమో నాకర్ధం కాదు. కాని ఆరోజు నేను ఎక్కేసరికి అక్కడ కూచున్న వారిమధ్యన మంచి చర్చ జరుగుతున్నది. బహుశా వాళ్ళు స్నేహితులనుకుంటాను.

ఒకాయన జ్యోతిష్యాన్ని సమర్ధిస్తున్నాడు. ఇంకొకాయన విమర్శిస్తున్నాడు. నేను మధ్యలో ఎక్కాను కనుక మౌనంగా నా సీట్లో కూచుని కిటికీ లోంచి చూస్తూ వాళ్ల సంభాషణ వింటున్నాను. చర్చ చాలా సేపు జరిగింది. ఇద్దరూ బాగా చదువుకున్నవాళ్ళే.

సమర్ధిస్తున్న వ్యక్తికి కొన్ని అనుభవాలున్నాయి. వాటి ఆధారంగా అతను జ్యోతిష్యాన్ని నమ్ముతున్నాడు అని నాకు అర్ధమైంది. విమర్శిస్తున్న వ్యక్తికి అనుభవం లేదు. సైన్సు ఒప్పుకోదు కనుక జ్యోతిష్యం బూటకం అని వాదిస్తున్నాడు. ఎక్కడో ఉన్న గ్రహాలు మన మీద ఎలా పని చేస్తాయి మొదలైన వాదనలు నడుస్తున్నాయి.

చాలాసేపు వారి వాదనలు జరిగినా విషయం ఎటూ తేలేటట్లు కనిపించడం లేదు. ఈ లోపల విమర్శిస్తున్న వ్యక్తి చేతులు ఊపుతూ మాట్లాడేటప్పుడు అతని చేతి రేఖలు కొన్ని నాకు కనిపించాయి. మళ్లీ ఒకటి రెండు సార్లు పరీక్షగా చూచి నిర్ధారించుకున్న తరువాత ఇలా అడిగాను.

మీ మాటల్లో కల్పించుకుంటున్నందుకు క్షమించాలి. ఒక చిన్న మాట అడగనా? అన్నాను.

శ్యూర్. శ్యూర్. అన్నారు వాళ్ళు.

మీరు చిన్నప్పుడు మీ ఇంటికి దూరంగా పెరిగారు. అవునా కాదా? జ్యోతిష్య విమర్శకుణ్ణి అడిగాను.

అతను ఆశ్చర్యంగా చూచాడు.

డు యు నో మి? అన్నాడు అనుమానంగా.

ఆఫ్ కోర్స్ ఐ నో యు. బట్ ఐ డోంట్ నో యు ఇన్ ది వే యు సపోజ్. అన్నాను.

అవును. నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉండి చదువుకున్నాను. అన్నాడు.

మీరేమనుకోకపోతే ఇంకొకటి అడగనా? అన్నాను.

చెప్పండి.

మీ తల్లిదండ్రులు గొడవపడి విడిపోయారా? మీకు ఇబ్బంది లేకుంటెనే చెప్పండి. అన్నాను.

అతని ముఖంలో బాధ కదలాడింది.

అవును. మా నాన్న మా అమ్మను వదిలేశాడు. ఆమె పల్లెటూళ్ళొ తాతయ్య ఇంట్లోనే ఉండి చనిపోయింది. అన్నాడు విచారంగా.

అతని విషాదగతాన్ని గుర్తు చేసినందుకు నాకు బాధ కలిగింది. కాని తప్పదు మరి. సామాన్యంగా ఇలాటి విమర్శలు చేశేవారి జీవితాలలో బాధామయ విషయాలుంటాయి. ఇలాటి శాస్త్రాలు ఉండికూడా ఎవరూ తమకు సాయం చెయ్యలేదన్న బాధ వాళ్ళను అలా మాట్లాడేందుకు పురికొల్పుతుంది.

ఇప్పుడు జ్యోతిష్యాన్ని నమ్ముతారా? నవ్వుతూ అడిగాను.

అతను నివ్వెరపోయినట్లు ఉండిపోయాడు. చాలాసేపు ఏం మాట్లాడలేదు.

హౌ ఈస్ ఇట్ పాసిబుల్? అడిగాడు

ఇట్ ఈస్ పాసిబుల్. యు హావ్ సీన్ ఇట్. హావెన్ట్ యు? అన్నాను నేను.

అతను తలూపాడు.

కెన్ యు టెల్ మి సంతింగ్ మోర్? అన్నాడు.

ఐ కెన్. బట్ ఐ డోన్ట్ వాన్ట్ టు. అన్నాను నేను.

వాళ్ల వాదన అంతటితో ఆగిపోయింది. ఇద్దరూ నాతో చర్చ మొదలు పెట్టారు. ఈ రెండు విషయాలూ ఎలా చెప్పానో తెలుసుకుందామని వారి ప్రయత్నం. జ్యోతిషం మీదా మార్మిక శాస్త్రాలమీదా మా చర్చ సాగింది.

ఒక గంట ప్రయాణం తర్వాత ముగ్గురం స్నేహితులమయ్యాము. ఈలోపల నేను దిగాల్సిన స్టేషన్ వచ్చింది.

థాంక్ యు సో మచ్ ఫర్ కన్విన్సింగ్ మై ఫ్రెండ్.అన్నాడు రెండో వ్యక్తి. వి విల్ చెరిష్ థిస్ మెమొరబుల్ డే ఫరెవర్. అన్నాడు విమర్శకుడు.
నా ఫోన్ నంబర్ తీసుకుని గుంటూరు స్టేషన్ రాగానే నాకు వీడ్కోలు చెప్పారు.

ఒక చిన్న దీపం చాలు యుగాల చీకటిని తొలగించడానికి.