“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

19, మే 2010, బుధవారం

హోమియోపతి భూతవైద్యమా? లేక అలా అనేవాళ్ళు పిశాచాలా?

హోమియోపతి భూతవైద్యంతో సమానమని దానిని నిషేధించాలని బ్రిటన్ లో డాక్టర్లు డిమాండ్ చెయ్యడం చూస్తే చాలా వింత అనిపించింది. మూఢ నమ్మకాలు సామాన్య ప్రజలలోనే కాదు బాగా చదువుకున్న వారిలో కూడా ఉంటాయి.

హోమియోపతి అనేది వైద్య శాస్త్రంలో ఒక కొత్త విప్లవం. ముడి పదార్ధం తో కాకుండా పొటెన్ టైజ్ చెయ్యబడిన శక్తితో రోగాన్ని ఎదుర్కొనే విధానం. రోగం అనేది శరీరం యొక్క బయో ఎనర్జీలో వచ్చిన తేడాలవల్లే వస్తుందని నేడు నవీన వైద్య శాస్త్రం కూడా ఒప్పుకుంటున్నది. కనుక క్రూడ్ స్టేట్ లో ఉన్న మందులు ఎనర్జీ లెవెల్ లో ఉన్న రోగాన్ని నయం చేయలేవు అన్నది చాలా సింపుల్ విషయం. పని పొటెన్సీ లోనికి మార్చబడిన ఔషధాలు సమర్ధవంతంగా చెయ్యగలవు అనేది కూడా రుజువైన సత్యం.

శామ్యుల్ హాన్నెమాన్ అల్లోపతి వైద్యంలో 200 ఏళ్ళ క్రితమే ఎమ్. డి చేసిన మహామేధావి. ఆయన నేటి డాక్టర్ల వలె డబ్బుసంపాదనే జీవిత పరమావధి అనుకోలేదు. వైద్యశాస్త్రంలో ఆయనకు కనిపించిన లొసుగులను, మందుల వల్ల వస్తున్న సైడ్ఎఫెక్ట్ల్ లను చూచి విసుగుచెంది తన జీవితమంతా శ్రమించి కనిపెట్టిన కొత్త విధానమే హోమియోపతి. ఇది భూత వైద్యంఎంతమాత్రం కాదు. తెలిసీ తెలియక ఎవరు ఏమైనా మాట్లాడవచ్చు. కాని వైద్య విజ్ఞానం ఉన్న డాక్టర్లు ఇలా మాట్లాడటంవిడ్డూరం.

నాకు తెలిసిన అనేక మంది అల్లోపతి డాక్టర్లు వారి ఇళ్ళలో హోమియోపతి వాడటం నాకు తెలుసు. నా స్నేహితుడైన ఒకడాక్టర్ నాతో ఇలా చెప్పాడు. "మేం ఇస్తున్న మందుల వల్ల ఎంతటి సైడ్ ఎఫెక్ట్ లు వస్తాయో మాకు బాగా తెలుసు. అందుకనే మా ఇళ్ళలో మందులు వాడం. నిరపాయకరమైన హోమియో మందులే వాడతాం. ఆహార నియమాలుపాటిస్తూ యోగా చేస్తూ సాధ్యమైనంతవరకూ రోగాలు రాకుండా చూచుకుంటాం". మరి రోగులతో మీరు ఎలా చెలగాటంఆడుతున్నారు అని అడిగాను. "లక్షలు ఖర్చు పెట్టి చదివాము. మరి డబ్బు వడ్డీతో సహా సంపాదించాలిగా?" అనిఆయన సమాధానం చెప్పాడు.

మధ్యనే జరిగిన ఒక సంఘటన. ఒక అమ్మాయి తలనెప్పితో గిలగిల లాడుతున్నది. రాత్రిపూట చన్నీళ్ళతో తలస్నానం చేసినతర్వాత ఉన్నట్టుండి తలనొప్పి ఎత్తుకున్నది. మెడుల్లా ప్రాంతంలో రెండువైపులా కొద్దిగా పైన తీవ్రమైన నొప్పి అనిచెబుతున్నది. లైట్ చూడలేకపోతున్నది. చిరచిర విసుగు చికాకు బాగా ఉన్నాయి. నొప్పి హఠాత్తుగా పెద్దఎత్త్తున మొదలైంది. లక్షణాలకు సామాన్యంగా బెల్లడోనా ఇవ్వాలి. కాని కళ్ళు ఎర్రగా లేవు. ముఖం ఉబ్బరించి లేదు.
So congestion of brain is ruled out. కనుక బెల్లడోనా సూచింపబడటం లేదు. కనుక నక్స్ వామికా ఒక్క డోస్ ఇచ్చాను. అయిదు నిమిషాలలో నొప్పి మంత్రం వేసినట్లు మాయం అయింది. నవ్వుతూ మామూలు మనిషిఅయింది. ఇది భూత వైద్యం ఎలా అవుతుంది?

ప్రతి దానికీ స్కానింగులంటూ వేలకు వేలు గుంజటం, చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలని ప్రతి దానికి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఏంటీ బయోటిక్స్ వాడకం, నిర్లక్ష్యంగా ట్రీట్మెంట్ ఇవ్వటం, డయాగ్నసిస్ సరిగా చెయ్యకుండా ఉజ్జాయింపుగా మందులు వాడి రోగాన్ని ముదరబెట్టి చివరకు చేతులెత్తెయ్యటం అల్లోపతి వైద్యులకు సర్వ సాధారణాలు. నా దృష్టిలో ఇదే అసలైన భూతవైద్యం.నూటికి తొంభై శాతం అల్లోపతి డాక్టర్లు లైసెన్సుడ్ కిల్లర్స్ అని నా నిశ్చితాభిప్రాయం. ఇటువంటి చెత్తవైద్యం చేసే అల్లోపతీ వైద్యులు హోమియోని భూతవైద్యం అనడం పిశాచాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది.

హోమియో పొటెన్సీలు ఎలా పని చేస్తున్నాయో ఇంకా పూర్తిగా ఋజువు కాలేదు. కాని అంతమాత్రాన ఇది అసలు వైద్యమేకాదు అనడం తార్కికం కాదు. హోమియోపతికి పెరుగుతున్న ఆదరణ చూచి ఓర్వలేని వారే ఇటువంటి చెడు ప్రచారాలుచేస్తున్నారు. ఆరోపణల వెనుక ఉన్నది అసూయ మాత్రమే గాని సైంటిఫిక్ స్పిరిట్ కాదు. ఈ ఆరోపణలు చేసినవారు అల్లోపతిలో జూనియర్ డాక్టర్లుట. వారికి హోమియోపతిలో ఏం అనుభవం ఉందని ఈ ఆరోపణలు చేస్తున్నారు?

హోమియోపతి అనేది వైద్యం కాదు అనేవారికి నేను ఒక్కటే సవాల్ విసురుతాను. చిన్న పని చేసి చూడండి. హోమియో వైద్యవిధానంలో అతి చిన్న మందు అయిన "ఎకోనైట్ ౩౦" నిపావుగంటకొకసారి చొప్పున ఒక నాలుగు డోసులు వేసుకోండి. ఏమి జరుగుతుంతో చూడండి. 6 పొటెన్సీ దాటితే అందులో పదార్ధం ఉండదు అని సైన్స్ కూడా ఒప్పుకుంటున్నది. అప్పుడు సైన్స్ దృష్టిలో అవి ఉత్త పంచదార మాత్రలు మాత్రమే. అలా వేసుకుంటే ఏం జరుగుతుందో నేను ముందే చెబుతాను.

విపరీతమైన దడ, భయం, ఆదుర్దా, ఆందోళన, చికాకు మనిషిలో కలుగుతాయి. హటాత్తుగా టెంపరేచర్ పెరుగుతుంది. అసహనంగా ఉంటుంది. విపరీత దాహం అవుతుంది. ఆ లక్షణాలు ఖచ్చితంగా ఆ మనిషిలో కనిపిస్తాయి. మరి అవి ఉత్త పంచదార మాత్రలే అయితే ఈ లక్షణాలు ఎలా వస్తాయి? అన్న ప్రశ్నకు అల్లోపతి సమాధానం చెప్పలేదు. ఇవే లక్షణాలు ఉన్న జ్వరం కేసులలో ఇదే ఎకోనైట్ వాడి ఈ లక్షణాలను నిమిషాలలో తగ్గించవచ్చు. హోమియో పతి నిదానంగా పని చేస్తుంది అనేవారికి కూడా ఇదే సమాధానం. ఇది కూడా అవగాహనా రాహిత్యంతో ఏర్పరచుకున్న అభిప్రాయమే అని నేను నా అనుభవం నుంచి గట్టిగా చెప్పగలను.

హోమియోపతి చక్కగా పనిచేస్తుంది. హోమియో పొటెన్సీలు పనిచేస్తాయి. అయితే అవి ఎలా పనిచేస్తున్నాయో శాస్త్రపరంగా ఇంకా నిర్ధారణగా చెప్పలేక పోతున్నాము. ఆ పని పరిశోధకులు చెయ్యాలి. ఈనాడు అణువులోనికి మనం తొంగి చూడ గలుగుతున్నాం. ప్రస్తుతం మన దగ్గర ఉన్న అత్యాధునిక పరికరాలతో రీసెర్చి చేసి, పొటెన్సీలోకి మార్చినపుడు మందులోని మాలిక్యులర్ ఎనర్జీ లెవెల్స్ ఎలా మారుతున్నాయో పరిశోధకులు నిర్ధారించి వివరించాలి. అంతేగాని మనకు అర్ధం కానంత మాత్రాన హోమియోపతి అసలు వైద్యమే కాదు అనడం సరికాదు. నాకు అర్ధం కాలేదని ఫిజిక్స్ అసలు సైన్సేకాదు అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఈ జూనియర్ డాక్టర్ అజ్ఞానుల ధోరణీ అలాగే ఉంది.వీరి చిత్త శుద్ధిని శంకించక తప్పదు. అసూయా, అజ్ఞానాలతో నిండిన వీళ్ళు ముందు ముందు విలువలతో కూడిన వైద్యాన్ని ఎంతవరకూ అందించగలరు అనేది ప్రశ్నార్ధకమే.