“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

16, మే 2010, ఆదివారం

అక్షయ తృతీయ- వ్యాపారుల మోసాలు

ఈ రోజు అక్షయ తృతీయ పర్వ దినం. మహా పుణ్య ప్రదమైన రోజు. ఎలా? మన శాస్త్రాలన్నీ ఈ రోజున ఇచ్చేటటువంటి దానాలు అక్షయమైన ఫలితాలను ఇస్తాయని చెబుతున్నాయి. ఈ రోజున చేసే జప తపాలు మహత్తరమైన ఫలితాలను ఇస్తాయని చెబుతున్నాయి. నియమ నిష్టలతో ఈ రోజు చేసే పూజలు ఊహించని ఫలితాలను ఇస్తాయని చెబుతున్నాయి.

కాని మనమేం చేస్తున్నాం???

పిచ్చి పట్టిన వాళ్ళలా ఎగబడి బంగారం కొట్ల వద్ద క్యూలు కట్టి ఎంతో కొంత బంగారం కొంటే చాలు మన ఇంట ధనలక్ష్మి శాశ్వత నివాసం ఉంటుంది అని భ్రమిస్తూ అప్పుచేసి మరీ బంగారం కొంటున్నాం. ఈ పిచ్చి పనికి శాస్త్ర సమ్మతి ఎక్కడా లేదు. కేవలం బంగారం వర్తకుల మాయాజాలంలో పడి, వారితో కుమ్మక్కైన టీవీలు, పేపర్ల మాయలో పడి ప్రజలందరూ గొర్రెల్లా ఈ పని చేస్తున్నారు.

మనదేశంలో మహోన్నతమైన మతం ఉన్నది. కాని దానిని వ్యాపారం గా మార్చుకునే వాళ్ళ సంఖ్య కూడా తక్కువేమీ కాదు. సామాన్య జనంలో ఉన్న భయ భక్తులను మూఢ నమ్మకాలను ఆసరాగా తీసుకొని అసలైన ధర్మాన్ని పక్కదారి పట్టిస్తూ, ఇటువంటి ఆధార రహిత నమ్మకాలను వ్యాపింప చేసి, జనాన్ని వెర్రివెంగళప్పలను చేసి ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు ఆడిస్తున్నారు. వారి వారి దొంగ వ్యాపారాలలో ప్రజలను పావుల్లా చేసి వాడుకుంటున్నారు.

ఒక్క విషయం తెలిస్తే ఈరోజు ఎగబడి బంగారం కొనే వాళ్ళకు తల గిర్రున తిరుగుతుంది. అక్షయ తృతీయ ఒక పెద్ద మాఫియా రాకెట్ ఆధారంగా పనిచేస్తున్నది. ఈ రోజున దొంగ బంగారం, క్రిమినల్స్ దొంగతనం చేసిన బంగారం పెద్ద ఎత్తున అమ్ముడౌతుంటుంది. దీనిలో దొంగలకు, పోలీసులకు, దొంగ వ్యాపారులకు భాగాలుంటాయి. కొనేవాళ్ళు పిచ్చిగా ఎగబడి కొంటుంటారు. ఆ దొంగ సరుకుతో బాటు ఎంతటి చెడుకర్మా, ఆ పోగొట్టుకున్న వారి ఏడుపూ మన వెంట మన ఇంటికి చేరుకుంటుందో తెలిస్తే, ఈ రోజున ఎగబడి బంగారం కొనే వారి గుండె గుభిల్లుమంటుంది.

ఈ రోజున బంగారం కొనడానికి శాస్త్ర ఆధారాలు ఎంతమాత్రం లేవు. బంగారం మాఫియాల యాడ్ మాయలలో పడి మోసపోకండి. వెర్రి వెర్రి అంటే వేలం వెర్రి అనే సామెతను నిజం చేయకండి.

ఈ రోజున మంచినీరు,మజ్జిగ,చెప్పులు,గొడుగు దానం చేస్తే అక్షయమైన పుణ్య బలం మన ఎకౌంట్ లో జమ అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనికి రీజన్ ఉన్నది. అక్షయ తృతీయ మండు వేసవిలో వస్తుంది. కనుక చెప్పులు గొడుగు లేక ఎండలో మలమల మాడుతున్న వారికి, దాహంతో గొంతెండిపోతున్న వారికి సాయం చేస్తే భగవంతుడు మన చెడుకర్మను తొలగించి మనకు కూడా సహాయం చేస్తాడు. అనగా మనకు కూడా ఆపత్సమయంలో అనుకోని సహాయం ఎవరినుంచన్నా అందుతుంది. అంతేగాని అప్పు చేసి దొంగబంగారం కొని బీరువాలో దాచుకొని మురిసిపోతుంటే పాపఖర్మం పెరుగుతుంది. ధనలక్ష్మి ఇంటిలో నివాసం ఉండటం మాట అటుంచి స్వార్ధ దేవత మన మనసులలో తిష్ట వేసుకుంటుంది.

ఈ రోజు పరమ పవిత్రమైన రోజు అనడానికి ఎటువంటి సందేహమూ లేదు. అయితే ఆ పవిత్రతకూ, డబ్బుకూ బంగారానికీ ఎటువంటి సంబంధమూ లేదు. ఈ రోజున చేసిన దానాలు, జప తపాలు, సాధనలు విశిష్ట ఫలితాలను ఇస్తాయి. మన పుణ్య బలాన్ని పెంచుతాయి. మోక్షాన్ని సుగమం చేస్తాయి. కారణమేమనగా ఈ రోజు అవతార మూర్తి యగు పరశురాముని విశిష్ట జన్మ దినం.

శ్లో ||యం శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారకాత్
న స సిద్ధి మవాప్నోతి న సుఖం న పరాంగతిం ||

శాస్త్రము చెప్పిన దానిని వదలిపెట్టి, తన ఇష్ట ప్రకారం చేసేవానికి సిధ్ధీ కలుగదు, సుఖమూ కలుగదు, మోక్షమూ కలుగదు అని భగవానుడే భగవద్గీతలో చెప్పాడు.

కనుక జనులు తెలివి గలిగి దొంగ వ్యాపారుల మాయలో పడకుండా ఉండటం శ్రేయస్కరం. ఈరోజున దానాలు, జపం, ధ్యానం, సాధనలు చేయాలి, ఆకలితో దాహంతో ఉన్నవారికి సహాయం చెయ్యాలిగాని బంగారం కొని దాచుకోవడం వంటి తెలివితక్కువ పనులు చెయ్యరాదు. వీటికి శాస్త్ర అనుమతి ఎంతమాత్రం లేదు.