“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

9, ఆగస్టు 2009, ఆదివారం

దశ మహావిద్యలు-తార||కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ

భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమవతీ తధా
బగలా సిద్ధ విద్యా చ మాతంగీ కమలాత్మికా
ఏతా దశ మహావిద్యా సిద్ధ విద్యా ప్రకీర్తితా||

సిద్ధవిద్యలైన దశ మహావిద్యలలో మొదటిగా కాళీవిద్యను తెలుసుకున్నాం.రెండవదియైన తారావిద్య గురించి ఇకముందు తెలుసుకుందాం.తరింప చేయు శక్తి తార.దేనినుంచి తరింప చేయటం?కష్టాలు,బాధలు, అజ్ఞానం, పేదరికం, ఆపదలు, భయాలు, తెలివితక్కువ తనం ఇత్యాది కష్టం నుంచైనా తరింపచేయగల శక్తి స్వరూపిణి తారాదేవి.

ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తం మీద అందరూ రకరకాలైన పేర్లతో ప్రార్థిస్తున్న జగన్మాత తారాదేవియే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరైనా కోరేది ఆపదలనుండి తరింపచేయమనీ, సుఖాన్ని ఇవ్వమనీ అంతే కదా.కనుక తెలిసో తెలియకో అందరూ ప్రార్థిస్తున్నది దేవినే.కాని విద్యను ఉపదేశ పూర్వకంగా తెలుసుకుంటే ఆలస్యం లేకుండా చక్కగా సూటిమార్గంలో ప్రయాణం చేసి గమ్యం చేరవచ్చు. తారామహాదేవి కాళీ కంటే వేరు కాదు. ఈమె జగన్మాత రూపాలలో ఒకటి. వీరందరూ వేర్వేరు అని తలచుట తప్పు అని తంత్రములు చెప్పాయి. నిజానికి వీరందరూ ఒకే ఆద్యాశక్తి యొక్క వివిధ రూపాలు అని చెప్పవచ్చు.

మంత్ర భేదాలతో విద్య తార, ఏకజట, ఉగ్ర తార, నీల సరస్వతి అనే విధాలుగా ఉన్నది. ముఖ్యంగా ఈ దేవి కృపవల్ల కవిత్వశక్తి, ధారణాశక్తి,జ్ఞానశక్తి కలుగుతాయి.పాండిత్యాభిలాషులు సాధారణంగా తారా మంత్రోపదేశం కలిగిఉంటారు. తారానుగ్రహం వల్ల అనర్గళమైన వాక్శక్తి,మంచి జ్ఞాపకశక్తి,వాక్శుద్ధి కలుగుతాయి.ఇతర మహావిద్యల వలెకాక తారావిద్య బౌద్ధ జైనమతాలలో కూడా ప్రవేశించింది. జ్ఞానానికి అధిదేవతగా,కరుణామూర్తిగా,ఆపదలనుంచి కాపాడే దయామయిగా తారాదేవి ఆయా మతాలలోపూజించ బడుతున్నది.

తారాదేవి రూపం కొన్నికొన్నిసార్లు సరస్వతీదేవి రూపంలా ఉంటుంది. కనుక ఇద్దరూ ఒకటే అని కొందరు అంటారు.తారా మంత్రాలలో ప్రాంతీయ మంత్రాలు కొన్ని ఉన్నాయి. అవి శాబర మంత్రాలవలె ఉండి చూడగానే సంస్కృత భాషామంత్రాలు అని అనిపించవు. అయినా కూడా ఇవి సంస్కృత మంత్రాల కంటే ప్రభావవంతములు అంటారు. వీటికి అవైదికక్రియా కలాపాలతో సంబంధం ఉంటుంది. అందుకని శిష్టాచారసంపన్నులు వీటి జోలికి పోరు.

తారా సాధకునికి చతుర్విధ పురుషార్ధాలు శీఘ్రంగా లభిస్తాయి. భవ సాగరాన్ని దాటి మోక్షాన్ని పొందాలంటే తారాసాధన చాలా శీఘ్ర ఫలదాయిని.తారాదేవి ఇహమున భోగాన్ని,పరమున మోక్షాన్ని ఇవ్వగలదు.దేవి సంసారులకు సన్యాసులకు సమానంగా వరదాయినిసంసారులకు ఈతిబాధలను పోగొట్టగలదు. సన్యాసులకు ఆంతరిక శత్రువులైన కామాది షడ్వర్గములను సునాయాసంగా దాటించి మోక్షాన్ని కరతలామలకం చేయగలదు.

జ్యోతిర్విద్యలో దేవి బుధగ్రహాది దేవతగా చెప్తారు. దానికి తగినట్లే ఈమె రూపం కూడా పొట్టిగా,కొంచెం పెద్ద పొట్టతో,ఎప్పుడూ నవ్వు ముఖంతో ప్రసన్నంగా ఉంటుంది. బుధ గ్రహానికి కూడా ఇదే రూపం ఉన్నట్లు జ్యోతిర్వేత్తలకు తెలుసుకదా. విజయవాడ కనకదుర్గమ్మగా ఈనాడు పూజలందుకుంటున్న మూర్తి నిజానికి తారాదేవి అని బౌద్ధసాంప్రదాయంలో చెబుతారు. హుఎన్ సాంగ్ మన దేశానికి వచ్చినపుడు, ఆయన అమరావతివద్ద గల ధరణి కోటకువచ్చి అక్కడ తాంత్రిక బౌద్ధం అభ్యాసం చేసాడు.అప్పుడు దారిలో విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపైన ఆయనకు పెద్దవెలుగు కనిపించిందని చెప్పాడు.అది తారాదేవి యొక్క తేజోరూపదర్శనం అని భావించాడు. టిబెటన్ తంత్రంలో తారాదేవిని పదహారేళ్ళ బాలికగా భావిస్తారు.ఈ భావన షోడశీ భావనకు దగ్గరిది.పదహారు కళల చంద్రుడు ఎలాగైతే పూర్ణం గా వేలుగుతూ తన చల్లని వెలుగుతో లోకానికి చల్లదనం ఇస్తున్నాడో అలాగే దేవికూడా తన చల్లని వెలుగుతో కరుణాపూరిత హృదయంతో బాధలనుంచి కాపాడుతుంది అని భావన.

ఏదైనా రెండు అవస్థలమధ్య సందిగ్దంలో పడి తీరాన్ని చేరలేక ఉన్నవారికి తారాదేవి ఉపాసన చక్కని మార్గంచూపటమే గాక మార్గంలో గల ఆటంకాలను తొలగించగలదు.సమస్యలన్నీ అనుకోకుండా దూదిపింజలవలె తేలిపోవటం తారాసాధకులకు అనుభవంలోకి వస్తుంది. ఆపదలనుంచి తరింపచేయటం తారాదేవి ప్రధాన లక్షణం.ఈమెఆకుపచ్చ రంగులోనూ, కొన్ని రూపాలలో నీలం రంగులోనూ ఉంటుందని వేత్తలు చెబుతారు.

నిజానికి ఈమె ఏ రూపంలో అయినా సాధకునికి దర్శనం ఇవ్వగలదు. ప్రసన్నమైన రూపాలనుంచి అతి భయంకరమైన రూపాలవరకూ ఏ రూపాన్నైనా ఈమె ధరించగలదు. ఉగ్రతార,స్మశానతార మొదలైన రూపాలు అతి భయంకరంగా ఉంటాయి.ఆషామాషీ సాధకులు ఈ దర్శనాలు తట్టుకోలేరు. 

తారాదేవిని త్రిమూర్తులకు జన్మ నిచ్చిన ఆదిశక్తిగా వర్ణిస్తారు.తారా రూపం చాలాసార్లు ప్రసన్నంగా, కరుణామయిగా, దయాస్వరూపిణిగా ఉంటుంది. జీవులు పడే బాధలు ఆమెకు తెలుసు గనుక, దయా హృదయంతో తనను ఆశ్రయించిన వారికిఆ బాధలు పోగొట్టటానికి ఎప్పుడూ సిద్ధం గా ఉంటుంది. శివునికి కాలకూట విషాన్ని మింగిన బాధను పోగొట్టటానికిజగన్మాత తారాదేవిగా మారి ఆయనకు తన చనుబాలను ఇచ్చిందని, ఆ అమృతాన్ని తాగటం వల్లనే శివుడు ఆ భయంకరవిషం యొక్క ప్రభావం నుంచి బతికి బయట పడ్డాడని తంత్రాలలో ఒక గాధ ఉన్నది. ప్రపంచాన్ని ఉద్దరించటానికి వచ్చే ప్రవక్తలందరూ ఆమె బిడ్డలే అని బౌద్ధంలో భావిస్తారు. ఆమె 'కరుణ' అనే భావనకు ప్రతిరూపం.

హిందూతంత్రముల నుండి బౌద్ధతంత్రముల లోనికి వెళ్లి అక్కడ అత్యున్నత స్థానాన్ని పొంది నేటికీ నేపాల్,టిబెట్,అస్సాం,ఇంకా హిమాలయ సానువులలో ఆరాధించబడుతున్న శక్తి--తార. మన తంత్రగ్రంధాలు అన్నీ నాశనం అయినా అవి చాలావరకూ టిబెట్టులో భద్రంగా ఉన్నాయి. క్రీ శ 1000 ప్రాంతంలో బెంగాల్ నుండి తిబెట్టుకు వెళ్లి అక్కడ మొదటి తంత్రగురువుగా పరిగణింపబడుతున్న అతిశ దీపాంగారుడు మొదటగా తారావిద్యను తిబెట్టుకు పరిచయం చేశాడు.

ఆయనకు తారాదేవి ప్రత్యక్షమై నీవు తిబెట్టుకు వెళ్ళటంవల్ల నీ ఆయువు క్షీణిస్తుంది. కాని నీవల్ల కొన్ని వేలమంది జ్ఞానాన్ని పొంద గలుగుతారు. నీకు ఏం కావాలి? అని కోరితే తన ఆయువు తగ్గినా పరవాలేదు. అంతమంది తనవల్ల మోక్షాన్ని పొందగలిగితే చాలు అంటూ విలువైన తంత్రగ్రంధాలను టిబెటన్ భాషలోకి అనువదిస్తాడు.నేడు మన దేశంలో అగ్నికి ఆహుతి అయిన తంత్ర గ్రంధాలు టిబెట్టులో భద్రంగా ఉన్నాయి.వాటిని మళ్ళీ టిబెటన్ భాష నుంచి సంసృతంలోకి అనువాదం చేసేపని కొందరు చేస్తున్నారు.

హిమాలయ ప్రాంతాలలో ఇప్పటికీ క్రూరమృగాలు ఎదురైనపుడు తారాదేవిని స్మరించటం వల్ల అవి తొలగిపోవటం సర్వ సాధారణం. ఇవి మనం నమ్మము కాని భక్తితో అమాయకంగా ప్రార్ధించే హిమాలయ పల్లె ప్రజలకు తారాదేవి చూపిన ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. బౌద్ధంలో తారాదేవిని అందరు బుద్ధులకు తల్లిగా భావిస్తూ ఒక భావన ఉన్నది.ఎందుకంటే బుద్ధత్వం అనే స్థితి పొందినవారు తమ నిర్వాణం తాము చూచుకోకుండా లోకాన్ని ఉద్దరించటానికి కరుణతో పని చేస్తారు కనుక కరుణాభావన అనేది తారాదేవి స్వరూపమే అని తలుస్తారు.

కనుకనే అవలోకితెశ్వర బోధిసత్వుని పక్కనే తారాదేవి కొలువై ఉన్నట్లు మనం విగ్రహాలు చూడవచ్చు.దీని అర్థం ఆయనలో ఉన్నటువంటి కరుణాభావమే తారా స్వరూపం అని. మన దేశంలో తారాదేవి యొక్క దేవాలయాలు బెంగాల్,అస్సాం,హిమాలయ ప్రాంతాలు,ఇంకా నేపాల్,తిబెట్టులలో ఉన్నాయి.మరి ఇప్పుడు చైనా మొండి నిరంకుశత్వానికి బలైపోతున్న టిబెట్టులో ఎన్ని దేవాలయాలు,ప్రాచీన గ్రంధాలు నశించి పోతున్నాయో దేవునికే ఎరుక.మన సాంప్రదాయంలో శ్రీవిద్యలో ఈదేవిని శ్రీచక్ర ఆవరణదేవతలలో ఒకరైన తారిణిగా పూజిస్తారు.