“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

25, ఏప్రిల్ 2009, శనివారం

జెన్ పుట్టుక

గౌతమ బుద్ధుడు గృధ్ర కూట పర్వతం మీద ఉన్నప్పుడు ఒకరోజు భిక్షువుల సమావేశం జరిగింది. ఆ సమావేశం లో ఎప్పటి లాగే ఆయన ఏదో ఒక ప్రవచనం చేస్తాడని అందరూ ఎదురు చూశారు. కాని ఆ రోజున ఒక విచిత్రం జరిగింది. బుద్ధుడు ఒక పద్మాన్ని తన చేతిలో పట్టుకొని మౌనంగా ఉండి పోయాడు.

అక్కడ ఉన్న వేలాది భిక్షువులు ఆయన చర్యను అర్థం చేసుకొన లేక పోయారు. కాని మహా కాశ్యపుడు ఒక్కడే ఆయన మౌనాన్ని అర్థం చేసుకొని చిరునవ్వు నవ్వాడు. అప్పుడు బుద్దుడు తన చేతిలోని పద్మాన్ని మహా కాశ్యపుని చేతికి ఇచ్చి ఇలా అన్నాడు.

"నేను ధర్మ నేత్రాన్ని కలిగి ఉన్నాను. నిర్వాణ మనస్సును కలిగి ఉన్నాను. అరూప రూపాన్ని కలిగి ఉన్నాను. ప్రత్యెక ధర్మం నా వద్ద ఉన్నది. ఈ ధర్మం మాటలకు, శాస్త్రాలకు అతీతమైనది. ఇది మాటలతో పని లేకుండా సరాసరి ఇవ్వ బడుతుంది. దీనిని ఈరోజు మహా కాశ్యపునికి ఇస్తున్నాను. "

ఈ విధంగా మొదలైన జెన్ పరంపరలో మొదటి గురువు మహా కాశ్యపుడు, రెండవ గురువు ఆనందుడు, పద్నాలుగవ గురువు నాగార్జునుడు, ఇరవై ఏడవ గురువు ప్రజ్ఞాతార లేక ప్రజ్ఞాధరుడు, ఇరవై ఎనిమిదవ గురువు బోధి ధర్ముడు. తరువాత భారత దేశంలో ఈ జ్ఞానాన్ని పొందే అర్హత ఉన్న వాళ్లు లేక పోవటంతో, బోధిధర్మ చైనాకు వెళ్లి మౌన ప్రచారం చేసాడు.


జెన్ వెలుగు ఈ విధంగా భారత దేశాన్ని విడిచి చైనాకు చేరింది. అక్కడ చాన్ గా పిలవబడి బోధి ధర్మ తరువాత అయిదుగురు మహా గురువులను ఉద్భవింప చేసింది. తరువాత కొన్ని శాఖలుగా చీలి జపాన్ చేరి జెన్ గా మారింది.

మహాయాన బౌద్ధం మరియు యోగాచార సాంప్రదాయముల కలయిక ధ్యాన బౌద్ధం. ఈ ధ్యాన అనే పదం చైనాలో చాన్ గా మారింది. జపాన్ చేరి జెన్ అయింది. ఈ నాటికీ చైనా, జపాన్, హాంగ్ కాంగ్, మలేషియా, బర్మా, థాయిలాండ్, కాంబోడియా దేశాలలో ఈ శాఖలు ఉన్నాయి. దీనిని అనుసరించి ఈనాటికీ జ్ఞానులు ఉన్నారు. నిర్వాణ మహా లాభాన్ని పొందుతూనే ఉన్నారు.