“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

12, ఏప్రిల్ 2009, ఆదివారం

తావో తే చింగ్


లావో జు వ్రాసిన టావో తే చింగ్ కు తెలుగులో నా స్వేచ్చానువాదం నేటినుంచి వరుసగా ఇస్తాను. లావో జు గురించి ఇంతకూ ముందు వ్రాసి ఉన్నాను. ఆయన క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం లో చైనాలో నివసించిన తాత్వికుడు. చైనా సంస్కృతిని గొప్పగా ప్రభావితం చేసిన గ్రంథాలలో టావో తే చింగ్ మరియు దీని తరువాత అనలేక్త్స్ ఆఫ్ కన్ఫూషియస్ ముఖ్యమైనవి. తావో తే చింగ్ మార్మిక భాషలో ఉన్నటువంటి గ్రంధం. దీని ఆధారంగా తాత్విక చింతనా ధోరణులు, తై ఛి మొదలగు వీర విద్యలు, ఇంకా కొన్ని క్షుద్ర విద్యలు కూడా పుట్టు కొచ్చాయి. ఇక చదవండి.
------------------------------------------------------------------------------
తావో తే చింగ్- ఒకటి

తావో ను గురించి చెబితే అది తావో కాదు
పేరు పెట్టామంటే అది నిజమైన పేరు కాదు.
పేరు లేనిదే నిత్యమైనది
పేరు తోనే అన్నిటికీ మొదలు కలిగింది

తృష్ణ లేకుంటే నీకు రహస్యం తెలిసిపోతుంది
తృష్ణ లో చిక్కుకుంటే నువ్వు సృష్టినే చూస్తావు

అయినా రహస్యమూ సృష్టీ రెండూ
ఒకే మూలం నుంచి ఉద్భవిస్తాయి.
ఈ మూలమే చిమ్మ చీకటి.

ఈ చీకటిలోని చీకటి
అన్ని ఆశ్చర్యాలకూ నెలవు.

బ్రహ్మమొక్కటే ఎంగిలి పడనిది అంటారు శ్రీ రామకృష్ణులు. అంటే నిర్వచనానికి అతీత మైనది. దేన్నైనా నిర్వచించ గాలిగా మంటే అది మన నోటిలో ఎంగిలి అవుతుంది. బ్రహ్మమొక్కటే అనిర్వచనీయం. అదే జగత్తుకు మూలం. వాక్కుకు అతీత మైనది గా దానిని వేదములు వర్ణించాయి. ఇదే బ్రహ్మం. దీనినే లావో జు తన భాషలో టావో అన్నాడు. దీనినే వేదాంతము బ్రహ్మము అని, పురాణములు భగవంతుడు అని, తంత్రములు పరమ శివుడు అని పిలిచాయి. ఇది బుద్ధికి అతీత మైన అనిర్వచనీయమైన, అనుభవైక వేద్యమైన ఒక స్థితి.

పేరు పెట్టి దానిని పిలిచినా మరు క్షణం అది ఎంగిలి అవుతుంది. అప్పుడది నిజమైన టావో కాదు. మాటల స్థాయికి దిగి వచ్చిందంటే అది తన స్వ స్వరూపం నుంచి ఒక మెట్టు దిగినట్లే. కనుక అది అసలైన టావో కాదు. అందుకనే జ్ఞానులు మౌన బోధ చేశారు. బుద్ధుని దేవుని గురించి అడిగితె మౌనం వహించాడు. రమణ మహర్షి కూడా అదే పని చేశాడు. శ్రీ రామకృష్ణుడూ అదే చేశాడు.

నిర్వచనకు మూలం కోరిక. ఏదో చేయాలని తపన. దానితో అనేక భావాలలోచిక్కుకొనుట జరుగుతుంది. ప్రతి దానినీ నిర్వచించి అర్థం చేసుకోవాలని తపన కలుగుతుంది. సత్యము ఈ తపనకు అతీత మైనది. కనుక కోరిక తో సృష్టి మొదలైనది. కోరిక లేకపోతే సృష్టి మూలం ఎరుకలోకి వస్తుంది.

కాని ఈ అతీతమూ అనిర్వాచ్యమూ అయిన స్థితీ సృష్టీ రెండూ ఒకే చీకటి నుంచి ఉద్భవించాయి. సృష్టి ఉనికి అయితే, ఉనికి లేమి దాని నీడలా ఉందనే ఉంటుంది. ఈ రెంటికీ మూలమే చిమ్మ చీకటి. ఆ చీకటికి మూలమైన చీకటి లో సర్వం ఉంది. అన్ని ఆశ్చర్యాలూ అక్కడ కలసి మెలసి ఉన్నాయి. అది అద్భుతాలకు నెలవు.

ఇది చదువుతుంటే వేదంలోని సృష్టి సూక్తం గుర్తుకు వస్తుంది. ఇవే భావాలు అక్కడా కనిపిస్తాయి. అదలా ఉంచితే ఈ పద్యం నుంచి తాయి జి అనే ప్రతీక పుట్టుకొచ్చింది. తావోఇజం లో దీనిని యిన్ యాంగ్ అనే ప్రతీకగా చూపుతారు. యాంగ్ పురుష శక్తి యిన్ ప్రక్రుతి. యాంగ్ తెల్లని భాగం, యిన్ చీకటి. సృష్టి సమస్తం ఈ రెండు శక్తుల కలయిక. దేనికీ మూలం వు జి. దీనిని ఒక శూన్య వృత్తం తో చూపిస్తారు. ఇవన్నీ మన తంత్ర శాస్త్రం లో గల యంత్రాల వంటివి. ప్రతీ గీతకూ అర్థం ఉంటుంది. ఈ భావం నుంచి తాయి ఛి అనబడే వీర విద్య పుట్టింది. తరువాతి పద్యాలలో దాని గురించి వివరంగా చూద్దాము.

నేటి మోడరన్ ఫిజిక్స్ కూడా దీనికి దగ్గరిగా వచ్చింది. ప్రపంచంలో మేటర్ మరియు ఏంటి మేటర్ ఉన్నాయి. వీటినే యాంగ్ మరియు యిన్ అనవచ్చు. ఈ రెంటికీ మూలమైన దాన్ని డార్క్ మేటర్ అని ఫిజిక్స్ నేడు చెబుతోంది. దానినే లావో జి చిమ్మ చీకటి అన్నాడు. ఆ చీకటికి మూలమైన చీకటి అంటే, డార్క్ మేటర్ కు మూలం ఏదైతే ఉందొ అది అన్ని అద్భుతాలకూ నెలవు అంటాడు.

సమస్త సృష్టికీ మూల పదార్థం కనుక అది సమస్త అద్భుతాలకు నెలవు. ఇంత వైవిధ్య భరిత మైన సృష్టి ని మూల స్థితిలో కలిగి ఉన్నా శూన్యం మరి అద్భుతమెగా.

తంత్రం దీనినే శివ శక్తులుగా పిలిచింది. వీటికి అతీత మైన స్థితిని పరమేశ్వర తత్త్వం అన్నది. దానిని మించిన స్థితి పేరు పెట్టలేని స్థితి. మౌనం అని కూడా దానిని అనలేము. ఎందుకంటే మౌనం అని ఒక పేరు పెట్టిన క్షణంలో దానిని ఒక మెట్టు కిందికి లాగినట్లు అవుతుంది.