నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

4, జనవరి 2009, ఆదివారం

వింగ్ చున్ కుంగ్ ఫూ - చరిత్ర

క్రీ.శ.1368 - 1644 తో చైనాలో మింగ్ వంశం అంతరించి, చింగ్ వంశం మొదలయ్యింది. మంచురియన్ వీరులు చైనాను జయించి చింగ్ వంశ స్థాపన చేసారు. మొదటి చింగ్ రాజు 'యూ జూన్ వాంగ్' సింహాసనం ఎక్కడానికి ఎనిమిదిమంది సైన్యాధిపతులు సాయపడ్డారు. కాని అతను రాజు కాగానే, తన తండ్రిని,ఈ ఎనిమిది మందిని చంపించాడు. 

వారిలో ఒకరి కూతురు నగమయి. చైనాభాషలో వేరేగా పలకొచ్చు. కాని మనకు దగ్గరగా ఇలాగె ఉంటుంది. ఆమె అప్పటికే వీరవిద్యలు వచ్చిన వనిత. ప్రతీకారం కోసం ఆమె రాజును హతమార్చి పారిపోయి షావోలిన్ ఆలయంలో తలదాచుకుంది. అక్కడ ఒక సన్యాసినిగా జీవితాన్ని సాగించింది. తనకు వచ్చిన వీరవిద్యలను ఇంకా సాధన చేసి పంచమహాగురువులలో ఒకరుగా పేరు పొందింది. 

అక్కడికి దగ్గరలోనే ఒక ఊరు. ఆ ఊరిలో ఒక తండ్రి, కూతురు రొట్టెలు చేసి అమ్ముకుంటూ బ్రతికేవారు. అమ్మాయి పేరు యిం వింగ్ చున్, చాలా అందగత్తె. ఆ ఊరి జమీందారు వింగ్ చున్ పైన కన్నేసి పెళ్లి చేసుకుంటానంటే, వింగ్ చున్ ఒప్పుకోదు. జమీందారు కొన్నాళ్ళు సమయం ఇచ్చి తరువాత వచ్చి బలవంతంగానైనా తీసుకుపోతానని చెప్పి వెళ్ళిపోతాడు. దిక్కు తోచని వింగ్ చున్, సన్యాసిని అయిన నగమయిని ఆశ్రయిస్తుంది. నగమయి అప్పటికే తనకున్న వీరవిద్యల అనుభవంతో ఒక కొత్తవిధానాన్ని కనిపెట్టి ఉంటుంది. అది సులభంగా ఎవరైనా నేర్చుకునే విధంగా ఉంటుంది. ఆ విద్యను వింగ్ చుంకు నేర్పిస్తుంది నగమయి. 

ఆ విద్యను బాగా సాధనచేసి జమీందారుకు ఒక షరతు పెడుతుంది. ఫైటింగ్ లో తనను ఓడించినవాడినే తాను చేసుకుంటానంటుంది. ఆడదికదా అని చులకనగా రంగంలోకి దిగిన జమీందారుకు చావుతప్పి కన్నులొట్ట పోతుంది. అతణ్ని అతని అనుచరులను తేలికగా ఓడించి ధీమాగా నిలబడుతుంది వింగ్ చున్. తరువాత తనకు నచ్చినవాణ్ని పెళ్లిచేసుకుని అతనికి ఈవిద్యను నేర్పుతుంది.

అలా వంశపారంపర్యంగా వచ్చిన ఈ విద్య చివరకు మాస్టర్ యిప్మాన్ ద్వారా దివంగత బ్రూస్లీ వరకు వచ్చింది. కాని దీన్ని బ్రూస్లీ చివరవరకు సాధన చెయ్యకుండా మధ్యలోనే ఒదిలిపెట్టి తానే "జీత్కునేడో" అనే ఒక కొత్త విద్యను కనుక్కున్నానంటూ విషాదాంతంగా తనువు చాలించాడు. చాలామంది నమ్మకం ఏంటంటే వింగ్చున్ విద్యను  మధ్యలోనే వదిలిపెట్టిన శాపమే అతని చావుకు కారణం అని.

అదలా ఉంచితే నగమయితో మొదలైనా వింగ్చున్ కుంగ్ఫూ గానే ఈవిద్య ప్రాచుర్యంలోకి వచ్చింది. కుంగ్ఫూలోని అనేకశాఖలలో ఇది ఒకటి. ఇదీ దీని చరిత్ర. ప్రస్తుతం దీనికి ప్రపంచవ్యాప్తంగా కొన్నివేల స్కూళ్ళు ఉన్నాయి.