“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

24, అక్టోబర్ 2023, మంగళవారం

వీధి కుక్కల దాడికి బిజినెస్ టైకూన్ మృతి - It happens only in India

ఇండియాలో అనేక నమ్మలేని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. వాటికుండే కారణాలు మాత్రం చాలాసార్లు అధికారవ్యవస్థ యొక్క నిర్లక్ష్యధోరణి, ప్రజల యొక్క బాధ్యతలేని లేకి ప్రవర్తనలే అయి ఉంటాయి.

ఈ దేశాన్ని బాగుచెయ్యడం చాలా కష్టం.

వీధికుక్కలు రోడ్లమీద చిన్నపిల్లల్ని దాడిచేసి చంపెయ్యడం మన సిటీలలో టౌన్స్ లో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అదొక న్యూసే కాదు. దానినెవరూ పట్టించుకోరు కూడా. కానీ నేడు పరాగ్ దేశాయ్ అనబడే గుజరాతీ బిజినెస్ టైకూన్ వాటిబారిన పడ్డాడు. ఇతను వాఘ్ బక్రీ టీ కంపెనీకి అధిపతి. ఈ కంపెనీ వార్షిక టర్నోవర్ రెండువేల కోట్లు. అలాంటి వ్యక్తి వీధి కుక్కలకు బలయ్యాడు. ఎదుటి మనిషి సామాన్యుడో, అసామాన్యుడో వాటికేం తెలుసు? రోడ్డుమీద పోతున్న ఎవరైనా వాటికి ఒకటే.

అయినా సరే, యానిమల్ యాక్టివిస్ట్ లు ఏమీ మాట్లాడరు. పాలస్తీనా చేసిన దారుణాలను ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు సమర్ధించినట్లే ఇది కూడా జరుగుతూ ఉంటుంది.

ఇది జరిగింది ఎక్కడో కుగ్రామంలో కాదు. ఇండియాలోని పెద్ద సిటీలలో ఒకటైన అహమ్మదాబాద్ లో. తన ఇంటిబయట మార్నింగ్ వాక్ చేసున్న పరాగ్ దేశాయ్ ని వీధికుక్కలు వెంటపడి దాడిచేశాయి. ఆయన భయపడి పరిగెత్తి క్రింద పడిపోయాడు. తలకు గాయమైంది. బ్రెయిన్ హేమరేజ్ జరిగింది. కోమాలోకి పోయాడు. ICU లో వారం ఉండి ఆదివారంనాడు చనిపోయాడు. ఈయన వయసు కేవలం 49 ఏళ్ళు.

వీళ్ళ కుటుంబం నాలుగు తరాలనుంచి టీ బిజినెస్ లో ఉంది. ఈయన నాలుగో తరం వాడు. న్యూయార్క్ దగ్గర లాంగ్ ఐలెండ్ యూనివర్సిటీలో మేనేజిమెంట్ చదువుకున్నాడు. 1995 లో తన తండ్రి నడుపుతున్న ఈ కంపెనీలో అడుగుపెట్టాడు. అప్పటికి దాని టర్నోవర్ 100 కోట్ల లోపే. తన ప్లానింగ్ తో, నేడు దానిని 2000 కోట్లకు తెచ్చాడు. మార్కెటింగ్, సేల్స్, ఎక్స్ పోర్ట్ అన్నీ తనే చూసుకునేవాడు. కానీ అర్ధాంతరంగా వీధికుక్కలకు బలయ్యాడు.

ఒలింపిక్ రన్నింగ్ ఛాంపియన్, తన ఇంటిముందు మురికికాల్వలో కాలుజారి పడి చనిపోయినట్లుగా ఇది ఉంది. ఎంతటి ఖర్మ?

ప్రతీకంపెనీకి ఉన్నట్లే వీళ్ళ కంపెనీకి కూడా CSR (Corporate Social Responsibility) ఉంది. దానిక్రింద వందలాది కోట్లు ఖర్చుపెట్టి సేవా కార్యక్రమాలు చేసేవాడు. బ్లైండ్ పీపుల్ అసోసియేషన్ కు, 'జీవదయ' అనబడే జంతుసంరక్షణా సంస్థకు, ఇంకా అనేక సేవా సంస్థలకు బాగా విరాళాలు ఇచ్చేవాడు. కానీ అదే జంతువుల చేతిలో చివరకు బలై పోయాడు.

ఈయనను వీధికుక్కలు వెంటాడి దాడిచేసిన సంఘటన సరిగ్గా ఈ నెల 15 తేదీన జరిగింది. అది అమావాస్య మరుసటి రోజు. మానవజీవితంపైన గ్రహప్రభావాల గురించి, అమావాస్య పౌర్ణముల ప్రభావం గురించి  పదేళ్లనుంచీ నేను వ్రాస్తున్నాను, దానికి ఇది ఇంకొక రుజువు.

అమావాస్య పౌర్ణముల ఛాయలలో మనుషులు అతలాకుతలం అవుతారు. జంతువులు ఇంకా ఎక్కువగా డిస్టర్బ్ అవుతాయి. ఆ సమయంలో వాటితో జాగ్రత్తగా ఉండాలి. అది వాటి మేటింగ్ సీజన్ అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి.

వీధికుక్కలపైన ఎవరూ జాలి చూపకూడదు. వాటిని నిర్మూలించాలి. లేకపోతే మనుషులు రోడ్లపైన తిరగలేని పరిస్థితి వస్తుంది. ఒంటరిగా ఉన్న చిన్నపిల్లలను, ఆడపిల్లలను జంతువులు ఎటాక్ చేస్తాయి. ముఖ్యంగా అవి వైల్డ్ యానిమల్స్ అయినప్పుడు, గుంపులుగా తిరుగుతున్నప్పుడు మరీ ప్రమాదకరంగా ఉంటాయి. కనుక వాటి విషయంలో PETA లాంటి సంస్థలు చెప్పే దయ, జాలి లాంటి కబుర్లు పనికిరావు.

ఒక సంపన్న కుటుంబంలో పుట్టి, అమెరికాలో చదువుకుని, తమ కంపెనీని అత్యున్నత శిఖరాలకు తీసికెళ్ళిన ఒక వ్యాపారవేత్త, మంచిమనిషి ఈ విధంగా వీధికుక్కల దాడికి బలైపోయాడు. ఇది బాధాకరం కాదా?

It happens only in India !

అయినా ఎవరికీ చీమ కుట్టదు. ఈ దేశంలో ఏమి జరిగినా ఎవరికీ ఏమీ పట్టదు. మళ్ళీ జనజీవనం యధావిధిగా సాగిపోతూనే ఉంటుంది. రేప్పొద్దున మళ్ళీ క్రొత్త న్యూస్ కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. కానీ దానినుంచి ఏమీ నేర్చుకోదు. ఇదింతే.

పచ్చి స్వార్థం, బాధ్యతారహిత ప్రవర్తన - ఇవి రెండే మనదేశపు అధికారులలోను, ప్రజలలోను కనిపించే సద్గుణాలు !

ఈ సంఘటన ఇస్కాన్ టెంపుల్ ఉన్న వీథిలో జరిగిందని న్యూస్ చెబుతోంది. వారికి భూతదయ, జాలి ఎక్కువ కదా! వీధికుక్కలకు రోజూ ఆహారం పెట్టి పోషిస్తున్నారేమో? అవి ఇలా చేశాయి. ఈ సంఘటనలో వీరియొక్క indirect పాత్ర ఎంతో ఎవరికీ తెలీదు !

ఈ సంఘటన జరిగిన ఈ నెల 15 వ తేదీన ఉన్న గ్రహస్థితిని పైన ఇచ్చాను చూడండి.

  • కుజశనుల మధ్యన చాలా దగ్గరి డిగ్రీదృష్టి ఉంది. ఇది యాక్సిడెంట్లకు కారణమౌతుందని మెడికల్ ఎస్ట్రాలజీ   పుస్తకంతో సహా ఎన్నోచోట్ల గతంలో వ్రాశాను. మళ్ళీ రుజువైంది.
  • రాహుకేతువులు సున్నా డిగ్రీలలో ఉంటూ, కొద్ది రోజులలో రాశులు మారబోతున్నారు. వీరి రాశిసంధి స్థితి మంచిది కాదు. ఇలాంటి సంఘటనలే జరుగుతాయి.
  • నీచస్థితికి దగ్గరగా ఉన్న చంద్రునికి మీనంలో ఉన్న నెప్ట్యూన్ తో ఖచ్చితమైన డిగ్రీదృష్టి ఉంది. ఈ స్థితి,  మనుషులలోను,జంతువులలోను విపరీత దూకుడు ప్రవర్తనను ప్రేరేపిస్తుంది. ఇది కొన్ని వేల జాతకాలలో రుజువైన సత్యం.
  • కన్యలోని సూర్యునికి మేషంలోని యురేనస్ కు ఖచ్చితమైన డిగ్రీదృష్టి ఉంది. ఇదికూడా పై విధంగానే పనిచేస్తుంది.
  • ఆ రోజు అమావాస్య తరువాత పాడ్యమి. అంటే, అమావాస్య షాడో నడుస్తోంది.

ఇంకా కారణాలు కావాలా? మనుషులపైన, జంతువులపైనా గ్రహప్రభావం ఉందా లేదా? మీరే చెప్పండి !

పరాగ్ దేశాయ్ జాతకం ఎక్కడా దొరకలేదు. కనీసం జననతేదీ కూడా దొరకడం లేదు. దొరికితే, ఈ సంఘటన వెనుక ఉన్న కనిపించని కారణాలను ఇంకా స్పష్టంగా చెప్పడం వీలవుతుంది.

ఈయనకు ప్రస్తుతం 49 ఏళ్ళు అంటున్నారు. అంటే 1973 లేదా 1974 లలో పుట్టి ఉండాలి. అప్పుడు రాహుకేతువులు నీచస్థితులలో ఉన్నారు. 1973 లో అయితే, ధనుస్సు - మిధునాలలో ఉన్నారు. 1974 అయితే వృశ్చిక - వృషభాలలో ఉన్నారు.  రాహువుకు నీచభంగం జరిగి ఉంటుంది. అందుకే సంపన్నకుటుంబంలో పుట్టి అమెరికాలో చదువుకున్నాడు. కానీ ఇతర గ్రహస్థితులు బాగుండి ఉండవు. అలాగే కేతువుకు నీచభంగం జరిగి ఉండదు. కేతువు కుక్కలకు కారకుడు. అందుకే చివరకు ఇలా చనిపోయాడు.

ఇండియాలో మనుషుల జనాభా మాత్రమే కాదు, కుక్కల జనాభా కూడా బాగా తగ్గాలి. ప్రస్తుతం ఇది అత్యవసరం. పొద్దున్నే రోడ్లపైన వాకింగ్ చేసేవారికి రెండో విషయం బాగా తెలుసు కదూ !

మనిషి జీవితంలో అన్నీ పర్ఫెక్ట్ గా ఎవరికీ ఉండవు, జరగవు. ఒకటి బాగుంటే నాలుగు బాగుండవు. ఇది ప్రతివారి జాతకంలోనూ ఉంటుంది. కాకపోతే, అనంత వైవిధ్యాలతో కూడిన మనిషి జీవితం అతని జాతకంలో స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. మీకు  అర్ధమైనా, అర్ధం కాకపోయినా, ఇది సత్యం.

ఏదేమైనా, మనిషి జీవితం ఎలా ముగుస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకే, ఎంతటివారికైనా సరే, అహంకారం ఎంతమాత్రమూ మంచిది కాదనేది అర్ధం చేసుకోవాలి.

ప్రతిమనిషి జీవితమూ చివరకు విషాదాంతమే అవుతుంది. సుఖాంతం ఎవరికీ ఉండదు. అలా ఉంటుంది అనుకోవడం కేవలం భ్రమ మాత్రమే.

అనేక జీవిత సత్యాలలో ఇదీ ఒకటి.

బీ కేర్ ఫుల్ !