“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, జులై 2023, ఆదివారం

పరమహంస యోగానంద గారి జాతకం - Part 2 (Life events and Dasas)

ఈ సీరీస్ లో మొదటిభాగాన్ని 2010 లో వ్రాశాను. మిగిలిన భాగాలను 'మళ్ళీ చూద్దాం' అని చెప్పాను. ఎవరికిచ్చినదైనా, ఏ చిన్నమాటనూ తప్పకూడదు గనుక, లేటైనా ఇన్నాళ్లకు ఈ సీరీస్ లో తరువాతి భాగాలను ప్రచురిస్తున్నాను.

మొదటి భాగాన్ని ఇక్కడ చూడండి.

పరమహంస యోగానంద గారి జీవితాన్ని, ఆయా దశలనూ ఇక్కడ సంక్షిప్తంగా చూద్దాం.

ఈయన జననం 8.38 PM అని రికార్డ్ అయింది. కానీ దానిని 8.39 గా సవరించాను. అదంతా ఎలా చేశాను అన్నది మళ్ళీ మళ్ళీ వ్రాయను. జననకాల సంస్కరణ అనే పోస్టులలో అదంతా గతంలో చాలాసార్లు వివరించాను. జ్యోతిష్యశాస్త్రాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసేవారికి అది తేలికగా అర్ధమౌతుంది.

ఈయన మఖా నక్షత్రం రెండవ పాదంలో, కేతు - చంద్ర - శని దశలో జన్మించాడు. ఇది పూర్తి అంతర్ముఖత్వాన్ని, యోగసాధనను ఇచ్చే దశ. కనుకనే, దైవసాక్షాత్కారాన్ని పొందటం, లోకానికి గురుత్వం వహించడం అనే రెండు విషయాలపైనే ఈయన జీవితమంతా నడిచింది గాని వేరే వైపు ఈయన ధ్యాస మళ్ళలేదు. అయితే, ఈ దశలో పుట్టిన వ్యక్తికి అతీతలోకాలు, ఆత్మలు, శక్తులు మొదలైన నమ్మకాలు విపరీతంగా ఉంటాయి. ఎంతగా ఉంటాయంటే, కళ్ళకు కనిపించే వాస్తవిక ప్రపంచానికంటే వాటికే వీళ్ళు ఎక్కువ విలువనిస్తారు. యోగానందలో ఇది నూటికి నూరుపాళ్లు ఉంది. ఆయన వ్రాసిన పుస్తకం చదివితే ఎవరికైనా ఈ విషయం అర్ధమైపోతుంది.

ఈయన తండ్రి  అప్పటి బెంగాల్ నాగపూర్ రైల్వేలో ఉన్నతాధికారి గనుక, 1915 లోనే ఈయన కలకత్తా యూనివర్సిటీ పట్టభద్రుడు గనుక, అనుకుంటే తనుకూడా సంపన్నమైన జీవితాన్ని గడిపి ఉండేవాడు. కానీ, వైరాగ్యపూరితమైన జీవితాన్ని గడిపాడు. సన్యాసి అయ్యాడు. 

ఆయన చిన్నతనం మిగతా పిల్లలమాదిరే గడిచింది. కనుక చెప్పుకోదగిన సంఘటనలు లేవు. కాకపోతే ఆధ్యాత్మిక చింతనాపరుడుగా ఉండేవాడు. తనకు 11 ఏళ్ల వయసులో తల్లి మరణంతో ఇది బాగా తీవ్రంగా మారింది.

జననకాల కేతుదశ 4 సం. 9 నెలల 15 రోజులు మిగిలి ఉంది. అంటే 1897 లో కేతుదశ అయిపోయింది.

శుక్ర దశ (1897 - 1917)

యోగానందగారి తల్లి మరణించినపుడు (1904 కావచ్చు) ఆయనకు శుక్ర - కుజ దశ జరిగింది. ఈయన జాతకంలో శుక్రుడు చతుర్దంలోను, కుజుడు అష్టమంలోను ఉండటాన్ని చూడవచ్చు. ఇది తల్లి మరణాన్ని స్పష్టంగా చూపిస్తుంది. కనుక ఆ సమయంలో ఆమె మరణించింది.

1908, 09 మధ్యలో, గురువుకోసం తన అన్వేషణలో భాగంగా, స్వామి ప్రణవానంద, శ్రీరామకృష్ణుల భక్తుడైన మాస్టర్ మహాశయ, టైగర్ స్వామి, భాదురి మహాశయ మొదలైన మహనీయులను పరిచయం చేసుకుని వారి సాంగత్యభాగ్యాన్ని పొందాడు. ఆ సంఘటనలను Autobiography of a Yogi లో వ్రాశాడు. కానీ అందులో వ్రాయని సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో చెప్తాను.

ఆ సమయంలో బేలూర్ మఠానికి, దక్షిణేశ్వర్ కాళీ ఆలయానికి ఈయన తరచుగా వెళ్ళేవాడు. శ్రీ రామకృష్ణుల గదిలో కూర్చుని ధ్యానం చేసేవాడు. ఆ సమయంలో కొంతమంది స్నేహితులు ఈయనతో కలసి ఉండేవారు. అప్పట్లో, రామకృష్ణ మఠాధ్యక్షులుగా స్వామి బ్రహ్మానంద ఉండేవారు. ఆయన శ్రీరామకృష్ణుల ప్రత్యక్షభక్తుడే గాక, సాక్షాత్తు శ్రీరామకృష్ణుల మానసపుత్రునిగా పరిగణింపబడిన మహనీయుడు. ముకుంద లాల్ (చిన్నతనంలో స్వామి యోగానంద పేరు) ను స్వామి బ్రహ్మానంద ఎంతో ఇష్టపడేవారు. ముకుందను చూస్తూనే ఆయన ఇలా అనేవారు ' రావోయ్ ! నువ్వూ మాలో ఒకడివే '. తనను శిష్యునిగా స్వీకరించమని స్వామి బ్రహ్మానందను, మాస్టర్ మహాశయను ముకుందలాల్ చాలాసార్లు ప్రార్ధించాడు. కానీ వారు తిరస్కరించారు. వారిద్దరూ ఇదేమాటను ముకుంద లాల్ తో అన్నారు, ' నేను నీ గురువును కాను.  కొంచం ఆగు. నీ గురువు వస్తున్నాడు. త్వరలో ఆయన్ను కలుసుకుంటావు'. ఆ తరువాత కొంతకాలానికి స్వామి యుక్తేశ్వర్ గారిని కాశీలో కలుసుకున్నాడు.

శ్రీ రామకృష్ణుల ప్రత్యక్ష భక్తుడు, 'గాస్పెల్ ఆఫ్ శ్రీ రామకృష్ణ' గ్రంధకర్త అయిన మాస్టర్ మహాశయ (మహేంద్రనాధ్ గుప్త) ను యోగానంద గారు కలుసుకోవడానికి ఒక కారణం ఉంది.  మాస్టర్ మహాశయగారు అద్దెకున్న ఇంట్లోనే యోగానంద గారి తల్లి చనిపోయింది. అందుకని అక్కడకు  తరచుగా వెళుతూ ఉండేవాడాయన. తల్లి అంటే ఈయనకు అమితమైన ప్రేమ ఉండేది. లగ్నంలో చంద్రుని ప్రభావం ఇది. అందుకే తానొక యోగి అయినా కూడా, తన జీవితాంతం కాళీమాతను అమితమైన భక్తితో ప్రార్ధించేవాడు. 

గతించిన తన తల్లిని చూడాలని ఉందని మాస్టర్ మహాశయను ప్రార్ధిస్తాడు ముకుంద లాల్. ఎంతో బ్రతిమిలాడిన మీదట మాస్టర్ మహాశయ ఒప్పుకుంటాడు. కానీ కొన్ని షరతులు పెడతాడు. 'ఆమెను తాకడానికి ముందుకు వెళ్ళకూడదు. ఉన్నచోటనే కూర్చుని ఆమె ఆత్మను చూడాలి' అనేది ఆ షరతులలో ముఖ్యమైనది. ముకుంద లాల్ ఒప్పుకుంటాడు.

మాస్టర్ మహాశయ మౌనంగా ఉండిపోతాడు. లోలోపల ఆయన ఏం చేశాడో తెలియదుగానీ, తరువాత కొన్ని క్షణాలకు వారున్న గది నుంచి ఇంకొక గదికి వెళ్లే తలుపు ప్రక్కగా తన తల్లి ఆత్మ నిలుచుని తనవైపే చూస్తూ యోగానంద గారికి దర్శనమిస్తుంది. కొద్దీసేపు అలా చూచి, ఆమె మాయమై పోతుంది. తన తల్లిని చివరిక్షణాలలో చూడలేకపోయానన్న యోగానంద గారి కోరిక అలా తీరింది.

'నిరాడంబరుడైన ఆ వృద్ధుని సంకల్పానికి ఎంత శక్తి ఉందో? దానికి తల ఒగ్గి, ఏవో లోకాలలో ఉన్న తన తల్లి ఆత్మ దిగి వచ్చి తన కళ్ళెదురుగా నిలిచింది' అని నిర్ఘాంతపోతాడు యోగానందగారు. తన తల్లి ఆత్మను చూచిన సంతోషంలో మాస్టర్ మహాశయుల పాదాలు పట్టుకుని ఏడుస్తాడు. ఇలాంటి చాలా నివ్వెరపరచే అనుభవాలను యోగానందగారు శ్రీ రామకృష్ణుల ప్రత్యక్ష భక్తులతో పొందాడు.

ఇక, మన సబ్జెక్ట్ లోకి వద్దాం.

ఈయన పుట్టినపుడు కేతుదశ 4 సం. మిగిలి ఉంది. ఆ తరువాత, 20 ఏళ్ల శుక్ర మహర్దశ మొదలైంది. సింహలగ్న, సింహరాశి జాతకులకు శుక్రదశ లౌకికంగా మంచిది కాదు. కాకపోతే, శుక్రుడు విద్యాస్థానంలో ఉండటం, అదికూడా మార్మిక స్థానమైన వృశ్చికంలో ఉండటంతో, లౌకికవిద్య తూతూమంత్రంగా జరిగి, ఆధ్యాత్మికవిద్యపైన మనస్సు లగ్నమైంది. తృతీయంలో ఉన్న కేతువు శుక్రుడిని సూచిస్తూ ఎన్నో జన్మల సంస్కారాల ఫలితంగా యోగసాధనవైపు ఈయన మనస్సును నడిపించాడు.

ఈయనకు హిప్నాటిజం బాగా వచ్చు. తన స్నేహితులపైనా, తమ్ముడిపైనా హిప్నాటిజం చేసి ప్రేతాత్మలను వారిమీదకు రప్పించి పనులు చేయించేవాడు. నాన్నగారు తనకు బహుమతిగా ఇచ్చిన వజ్రాల కోట్ బటన్ పోయినప్పుడు, ఒక ప్రేతాత్మ సాయంతోనే దానిని తిరిగి కనుగొన్నాడు. లాహిరీ మహాశయ గారి ఫొటో చూపించి ఆ ఆత్మను భయపెట్టాడు.

1910 లో శుక్ర - గురుదశలో తన గురువైన స్వామి యుక్తేశ్వర్ గారిని కలుసుకున్నాడు. యోగకారకుడూ నవమాధిపతీ, దశనాధుడైన శుక్రుడున్న స్థానాధిపతీ అయిన కుజునితో కలసిన గురువు ఆధ్యాత్మిక క్షేత్రమైన మీనంలో కొలువై ఉండటం చూడవచ్చు.

నవమస్థానం గురువును సూచిస్తుంది. అక్కడున్న రాహువు స్వక్షేత్రకుజుని సూచిస్తున్నాడు. రాహువు జ్యోతిష్యశాస్త్రంలో పరిశోధనను, సాంప్రదాయ విరుద్ధధోరణులను అనుగ్రహిస్తాడు. అందుకే హిందూమతాన్ని క్రైస్తవాన్ని సమన్వయము చేస్తూ పుస్తకాలు వ్రాయాలని ఆయన ప్రయత్నించాడు. కానీ, ఇది హిందువులను తప్పుదారి పట్టించడమే. ఈయన వ్రాసిన The Holy Science అనే పుస్తకంలో ఈ ధోరణులు గోచరిస్తాయి. ఇదంతా రాహువు ప్రభావం.

ప్రియనాధ్ కరార్ గా పూర్వాశ్రమంలో పిలువబడిన స్వామి యుక్తేశ్వర్ గిరి, జ్యోతిష్యశాస్త్రంలో లోతైన ప్రజ్ఞను కలిగినవాడు. బ్రహ్మాండ జ్యోతిష్యం (కాస్మిక్ ఆస్ట్రాలజీ) అనే ప్రాచీన విధానాన్ని ఈయన తన పరిశోధన ద్వారా కనుగొన్నాడు. ఇది యోగసాధనకూ, గ్రహచలనానికీ, పిండాండానికీ, బ్రహ్మాండానికీ గల సంబంధాన్ని స్పష్టంగా వివరిస్తుంది. ఇది ప్రాచీన జ్యోతిష విధానం.  తురకల దండయాత్రలలో అనేక జ్యోతిష గ్రంధాలు నాశనం కాగా, ఈ విధానం మరుగునపడి పోయింది. మరలా యుక్తేశ్వర్ గిరిగారి స్ఫురణకు అందివచ్చింది. ప్రపంచానికి తెలియవచ్చింది. అయితే, క్రైస్తవాన్ని, హిందుత్వాన్ని కలపాలని ప్రయత్నించడం ఈయన చేసిన తప్పు. అవి కలిసేవి కావు. ఎంతటివారైనా పొరపాట్లకు అతీతులు కారనే దానికి ఇదొక ఉదాహరణ.

జూలై 1915 లో స్వామి యుక్తేశ్వర్ గిరి గారి నుండి సన్యాసం తీసుకున్నాడు. అప్పటివరకూ ముకుందలాల్ ఘోష్ అయిన ఈయన, స్వామి యోగానందగిరి అనే పేరును స్వీకరించాడు. అప్పుడు శుక్ర - బుధ - రాహుదశ నడిచింది. బుధుడు పంచమస్థానంలో లగ్నాధిపతి సూర్యునితో కలసి ఉన్నాడు. అక్కడికి కోణస్థానంలో రాహువున్నాడు. లగ్న, పంచమ, నవమ త్రికోణ ప్రభావం ఈయనను స్వామిని చేసింది. 

1917 యోగదా సత్సంగ్ సొసైటీని మొదలుపెట్టాడు. ఇది శుక్రదశ చివరలో కేతు అంతర్దశలో జరిగింది. ఏదో ఒక పెద్ద సంస్థను స్థాపించి లోకాన్ని ఉద్ధరించాలనే తపన ఈయనలో చిన్నప్పటి నుంచే ఉండేది. అది జనన కాల దశా ప్రభావం. ఈ క్రమంలో తనతో అమెరికా తీసికెళ్ళిన తన సహచరులు ఇద్దరు తనకు ఎదురు తిరిగి ఈయనమీద కోర్టు కేసులు పెట్టి, విడిపోయారు. వాళ్ళ సంగతి వేరే పోస్ట్ లో వ్రాస్తాను.

సూర్య దశ (1917-1923)

జూలై 25, 1920 న బాబాజీ దర్శనం.  విదేశాలలో యోగప్రచారానికి అనుజ్ఞ లభించిందని ఆయన వ్రాసుకున్నాడు. ఆ సమయంలో సూర్య - గురు - రాహుదశ నడిచింది. సూర్యుడు, రాహువు పంచమ నవమ కోణస్థితులలో ఉన్నారు. గురువు, నవమస్థానాధిపతి కుజునితో కలసి ఉన్నాడు. గురువుకు చంద్ర, కేతువుల అర్గళం ఉన్నట్లు  గమనించవచ్చు. కనుక ఆ రోజున ఆ మహత్తరమైన సంఘటన జరిగిందని అనుకుందాం.

నేడు సినిమా నటులతో సహా ఎంతోమంది ' మాకు బాబాజీ దర్శనం లభించింది' అని చెబుతున్నారు. ప్రతివారు గురువులై పోయి క్రియాయోగా దీక్షలిస్తున్నారు. బాబాజీ పరువు తీస్తున్నారు. కనుక ఇది ఎంతవరకు జరిగిందో అనుమానమే. నేనిలా అనడానికి గల కారణాలను వచ్చే పోస్ట్ లో వ్రాస్తాను. 

19 సెప్టెంబర్ 1920 న సూర్య - శని - శని దశలో బోస్టన్ లో అడుగుపెట్టాడు. శని ఈ లగ్న రాశులకు మంచివాడు కాదు. సప్తమాధిపతిగా దూరదేశ సంచారాన్నిచ్చాడు. అప్పటినుంచి 15 ఏళ్లపాటు యోగానందగారు నానాకష్టాలు పడ్డాడు. అమెరికాలో ఆయనకు మొదట్లో ఘనస్వాగతం లభించినప్పటికీ, కాలక్రమేణా క్రియాయోగా పైన అమెరికన్ల కొత్తమోజు సన్నగిల్లింది. అమెరికాలో ఇది మామూలే. ఎప్పటికప్పుడు వారికి కొత్తవి కావాలి. యోగమైనా, గురువులైనా, గర్ల్ ఫ్రెండ్ అయినా, ఏదైనా అంతే. 

1920-23 మధ్యలో  బోస్టన్ లోనే నివసిస్తూ అమెరికన్లకు క్రియాయోగాన్ని బోధించాడు  ఆ సమయంలో సూర్యదశలో బుధ, కేతు, శుక్ర అంతర్దశలు నడిచాయి. ఎత్తుపల్లాలతో జీవితం సాగింది. అంతకు ముందు జపాన్ యాత్ర చేసిన సందర్భంలో పరిచయమైన కెప్టెన్ రషీద్  ఇచ్చిన ఫైనాన్షియల్ ప్లానింగ్ తో డబ్బులు మిగలడం మొదలైంది.

చంద్ర దశ (1923-1933)

1923 అమెరికాలో సంచారం చేస్తూ తన ఉపన్యాసాలను మొదలుపెట్టాడు. 1924-25 ఉపన్యాసాలను కొనసాగించాడు. ప్రధాన శిష్యులను కలుసుకున్నాడు. సూర్యదశ అయిపోయి, చంద్రదశ మొదలైంది. ద్వాదశాధిపతిగా, సంచారాధిపతిగా చంద్రుడు, విదేశాలలో పర్యటనలను, ఎంతోమందిని కలుసుకోవడాన్ని, బోధనను ఇచ్చాడు.

25 అక్టోబర్ 1925 మౌంట్ వాషింగ్ టన్, లాస్ ఏంజిల్స్ లో SRF ప్రధానకార్యాలయం మొదలుపెట్టాడు. అప్పుడు చంద్ర - రాహు - శనిదశ జరిగింది. శనీశ్వరుడు, నవమంనుంచి దశమాధిపతిగా ఉంటూ, ఆధ్యాత్మిక కార్యాలయాన్ని సూచిస్తున్నాడు. సరిగ్గా ఆయన విదశలోనే SRF మెయిన్ సెంటర్ మొదలైంది. 

1925-33 ఉపన్యాసాలు కొనసాగింపు. పేరు ప్రతిష్టలు పెరిగాయి. 1923 నుండి 1933 వరకూ నడిచిన చంద్రదశ ఈయనకు బాగా యోగించింది. ఉన్నతపదవులలో ఉన్న వ్యక్తుల పరిచయం, స్నేహం, వారికీ గురువవ్వడం జరిగాయి.

24 జనవరి 1927 న, చంద్ర - గురు - శనిదశలో, ప్రెసిడెంట్ కూలిడ్జ్ అతిధిగా వైట్ హౌస్ లో ఉన్నాడు. ఈ మూడు గ్రహాల ప్రభావాన్ని ఇప్పటికే వివరించి ఉన్నాను. అందుకే అమెరికా ప్రెసిడెంట్ ఈయనను ఆహ్వానించి, ఆతిధ్యాన్నిచ్చాడు.

1929 మెక్సికో లో ఉపన్యాసాలిచ్చాడు. అప్పుడు చంద్ర - శని దశ జరిగింది. ఇది అంతర్ముఖత్వాన్ని, లోతైన ధ్యానసాధనను ఇస్తుంది. మెక్సికో కూడా ఇండియాలాగా చాలా ప్రాచీనమైన చరిత్ర ఉన్న దేశమే. కానీ క్రైస్తవం ఆ దేశసంస్కృతిని, ప్రాచీనమతాన్ని సర్వనాశనం చేసేసింది. అలాంటి ప్రాచీనదేశానికి ఆ దశలో మళ్ళీ  మనదైన యోగశాస్త్రాన్ని అందించాడు యోగానందస్వామి.

1929 లోనే స్వామి ధీరానంద అనే  ఇండియన్ అమెరికన్ శిష్యుడు యోగానందతో విభేదించి కోర్టుకెక్కాడు. అప్పుడు చంద్ర - బుధ దశ నడిచింది. ఈ దశలో ఇంటిలో గొడవలు జరగడం కొన్ని వేల జాతకాలలో గమనించాను. సంసారి కాదు గనుక, యోగానంద గారికి అటువంటి తలనొప్పి లేకపోయినప్పటికీ, ఆయన సంస్థే ఆయనకు సంసారమై కూచుంది. తన శిష్యుడితోనే గొడవలు తలెత్తి, ఆ శిష్యుడు కోర్టుకెక్కే పరిస్థితి వచ్చింది. కోర్టులో ధీరానందను అనుకూలంగా తీర్పు వచ్చింది. యోగానంద గారు ఓడిపోయారు. ఎలాంటివారినీ గ్రహస్థితులు తేలికగా వదలవని దీనినిబట్టి అర్థమౌతోంది. ఈయన చరిత్ర వచ్చే పోస్ట్ లో చూద్దాం.

1931 లో తన ప్రధానశిష్యులలో కొందరైన దయామాతను, ఆలివర్ బ్లాక్ ను కలుసుకున్నాడు.  ఆ సమయంలో చంద్ర - కేతు దశ జరిగింది. ఉటా రాష్ట్రంలో సాల్ట్ లేక్ సిటీలో పుట్టిన దయామాత అసలు పేరు రేచల్ ఫై రైట్. యోగానందగారిని కలుసుకునే ఈ సమయంలో ఆమె ముఖానికి చర్మరోగం ఉండేది. అందుకని ఆమె బయటకు రాకుండా, ముఖానికి ఒక గుడ్డను కప్పుకుని ఉండేది. యోగానందగారు తన చేతిని ఆమె ముఖానికి కొంచం దూరంలో కాసేపు ఉంచి, 'ఇక జన్మలో ఈ రోగం నీ జోలికి రాదు' అన్నారని ఆమె చెబుతున్నది. ఒక్క వారంలో ఆ  చర్మవ్యాధి మాయమైపోయి తిరిగి తలెత్తలేదు. ఆ తర్వాత ఆమె 79 ఏళ్ళు  బ్రతికింది. మరి జీవితాంతం ఏ  మందులూ వాడకుండానే ఆమె ఉందా? అంటే నేనైతే నమ్మను. ఆ రోజులలో, యోగశక్తితో రోగాలు నయం చెయ్యడం వంటి పనులను యోగానందగారు చేసేవారు. నా అభిప్రాయం ప్రకారం ఇవన్నీ జనాన్ని ఆకర్షించడం కోసం చేసే చిల్లర పనులు.

జనవరి 10 1932 న, SRF కు తన తర్వాతి అధ్యక్షుడైన జేమ్స్ జె లిన్ (రాజర్షి జనకానంద) ను కలుసుకున్నాడు. అమెరికాలో పెద్ద వ్యాపారవేత్త అయిన ఈయనను యోగానందగారు చాలా అభిమానించేవారు. పెద్ద కంపెనీని నడుపుతూ కూడా, యోగసాధనను పట్టుదలతో చేసి సమాధిస్థితిని అందుకున్న వ్యక్తిగా చెబుతూ, తన తర్వాత తన స్థానాన్ని ఈయనకిచ్చారు. ఆ సమయంలో చంద్ర - శుక్ర - చంద్ర దశ నడిచింది. శుక్రుడు దశమాన్ని చూస్తున్న విషయం గమనించాలి.

1932 నుండి ఉపన్యాసాలు యాత్రలు అన్నీ బంద్ అయ్యాయి. అమెరికా చరిత్రలో నిలిచిపోయిన చీకటికాలంగా వర్ణించబడే గ్రేట్ డిప్రెషన్ 1929 లో మొదలై 1939 దాకా పదేళ్ళపాటు నడిచింది. తినడానికే తిండిలేదు. ఇక అమెరికా, యోగాభ్యాసాన్ని అందులోను ప్రాణాయామ, ధ్యానప్రధానమైన క్రియాయోగా వంటి శాఖను ఎలా సపోర్ట్ చేస్తుంది? డిప్రెషన్ దెబ్బకు ఎక్కడ శిష్యులక్కడ కూలబడ్డారు. బిల్లులు  కట్టడానికి డబ్బుల్లేవు. తినడానికి తిండి కూడా లేదు. చివరకు, తమ తోటలో పండిన టమాటాలు మాత్రమే తింటూ ఈయన, ఈయన శిష్యులు కొన్నేళ్లు బ్రతికారు.

1929 లో ఈయన జాతకంలో చంద్ర - శని దశ నడిచింది. ఇది ఆధ్యాత్మికపరంగా యోగవంతమైన కాలమేగాని, లౌకికంగా మాత్రం నరకాన్ని చూపిస్తుంది. అలాగే ఈయనకూ చూపించింది. ఆ తరువాత జరిగిన బుధ, కేతు, శుక్ర, రవి దశలు కూడా లౌకికంగా ఈయన్ను చాలా బాధలు పెట్టాయి. తరువాత 1933 లో మొదలై 1940 లో కుజదశ అయిపోయేవరకూ ఈయన ఆర్థికంగా చాలా బాధలు పడ్డాడు. ఈయన ప్రధాన శిష్యుడైన జేమ్స్ జె లిన్ ఇచ్చిన ఆర్ధిక అండతోనే ఈ గడ్డుకాలాన్ని ఈయన గట్టెక్కాడు. కుజుడు అష్టమంలో ఉండటాన్ని మనం చూడవచ్చు. అయితే, భాగ్యాధిపతిగా అష్టమంలో ఉంటూ ఆర్థికబాధలను ఇచ్చినప్పటికీ, ధర్మస్థానాధిపతిగా మార్మిక అష్టమంలో ఉండటం వల్ల సాధనను కూడా ఇచ్చాడు.

కుజ దశ (1933-1940)

9 జూన్ 1935 ఇండియాకు బయలుదేరాడు. ఈ ట్రిప్ ను జేమ్స్ జె లిన్ స్పాన్సర్ చేశాడు. అనేకదేశాల మీదుగా ఆగస్టు 22 న ఇండియా రాక. 15 ఏళ్ల తర్వాత స్వామి యుక్తేశ్వర్ గారిని కలుసుకున్నాడు. ఆ సమయంలో కుజ - గురు దశ నడిచింది. గురువు, గురువును సూచిస్తాడు. నవమాధిపతిగా కుజుడు కూడా గురువును సూచిస్తాడు. సరిగ్గా వీరిద్దరి దశలోనే తిరిగి ఇండియా వచ్చి తన గురువును దర్శించాడు. అయితే, అష్టమరాశి ప్రభావంవల్ల, అదికూడా మోక్షరాశి అయిన మీనం కావడం వల్ల త్వరలోనే స్వామి యుక్తేశ్వర్ గిరి మరణించారు.

అక్టోబర్ నవంబర్ లలో తిరువణ్ణామలై వెళ్లి రమణమహర్షిని దర్శించాడు. కుజ - గురు - సూర్యదశలో ఇది జరిగింది. ఆత్మసూర్యుడైన రమణమహర్షిని సూర్య విదశలో యోగానందగారు దర్శించడం సరిగ్గా సరిపోవడం లేదూ? 

డిసెంబర్ లో ఆనందమయి మాను దర్శించాడు. ఈ సమయంలో కుజ - గురు - చంద్ర దశ జరిగింది. చంద్రప్రభావం వల్ల ప్రేమస్వరూపిణి, మృదుస్వభావి అయిన ఆనందమయి మాను ఆ సమయంలో కలుసుకోవడం జరిగింది.

డిసెంబర్ 1935 లో పరమహంస అనే బిరుదును పొందాడు. అయితే, లోకానికి తెలియని కథ ఒకటి దీని వెనుక ఉంది. అదేంటో వచ్చే పోస్ట్ లో వ్రాస్తాను.  అప్పుడే, అనేక క్షేత్రాలు కూడా తిరిగాడు. ఇది కూడా సంచార కారకుడైన చంద్ర విదశలోనే జరిగింది. కుజ చంద్రులిచ్చే చంద్రమంగళ యోగమూ, గురు చంద్రులిచ్చే గజకేసరీయోగమూ కలసి ఈయనకు పరమహంస బిరుదును ఈ సమయంలో ప్రదానం చేయించాయి.

మార్చ్ 9 1936 - కుజ - గురు - రాహు దశలో స్వామి యుక్తేశ్వర్ గారి మహాసమాధి. కుజ గురువులు అష్టమంలో ఉండటాన్ని, రాహువు నవమంలో ఉండటాన్ని గమనించండి. ఇది గురు అంతర్దశలో దశాచిద్రసమయం. గురుఛండాలయోగం ఈ విధంగా గురువు యొక్క దేహత్యాగాన్ని ఈయనకు ఎదురు చేసింది.

జూన్ - 1936 లో ముంబాయి లోని ఒక హోటల్లో యుక్తేశ్వర్ గారి సూక్ష్మశరీరాన్ని దర్శించి ఆయనతో మాట్లాడానని చెప్పాడు. అప్పుడు కుజ - శని - బుధ దశ జరిగింది. కుజ శని దశ యాక్సిడెంట్స్ ను ఇస్తుంది. శని బుధ దశ తీవ్రమైన మనోవేదననూ డిప్రెషన్ నూ ఇస్తుంది. ఈ సమయంలో గురువియోగం వల్ల యోగానందగారు ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. పైగా గురువు మాట వినలేదన్న బాధ యోగానందగారిలో ఉంది. అయితే పంచమంలో ఉన్న సూర్య బుధుల యోగం నవమంలోని రాహువుచేత చూడబడుతూ ఇలాంటి  అతీతమైన అనుభవాన్నిచ్చింది. ఈ అనుభవాన్ని తన పుస్తకంలోని The resurrection of Sri Yukteswar అనే అధ్యాయంలో అద్భుతంగా వర్ణించాడు. అయితే, ఇందులో నిజమెంతో కల్పన ఎంతో ఆయనకూ, ఆ పుస్తకాన్ని వ్రాసి ఎడిట్ చేసిన ఆయన శిష్యురాలు తారామాతకే తెలియాలి. యుక్తేశ్వర్ గారి ఆత్మను ఆయన చూసి ఉండవచ్చు. కానీ ఆ దర్శనం రెండు గంటలపాటు కొనసాగడం, సూక్ష్మలోక వివరాలను కలర్ సినిమా చూసినట్లు యుక్తేశ్వర్ గారు అంత విపులంగా వివరించడం ఇదంతా యోగానంద + తారామాతల కల్పనగా అనిపిస్తుంది.

సెప్టెంబర్ 1936 ఇంగ్లాండ్ మీదుగా అమెరికాకు తిరుగు ప్రయాణం. 

1938 లో కుజ - కేతుదశలో golden temple of all religions అనే ఆలయాన్ని అమెరికాలోని Encinitas లో కట్టించాడు. 1942 లో రాహు - రాహు - కేతుదశలో అది సముద్రంలో మునిగిపోయింది.

రాహుదశ (1940-1958)

1940 లో ఈయనకు రాహుదశ మొదలైంది. ఇదే ఈయన  జీవితంలో ఆఖరుదశ. అప్పటినుంచి తన ఆశ్రమ ఎస్టేట్ లో అనేక మైళ్ళ లోపలగా ఒక కేబిన్ ను కట్టించుకుని అందులోనే ఒంటరిగా ఉండేవాడు. నిరంతరం ధ్యానంలో గడిపేవాడు.

1940 నుండి 45 మధ్యలోజరిగిన రాహు - రాహు, రాహు - గురు దశలలో ఈయన అనేక క్రొత్త క్రొత్త పనులకు శ్రీకారాలు చుట్టాడు, కానీ అవన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయి. గ్రహస్తితులకు మహనీయులు కూడా అతీతులు కారని నేనెప్పుడూ చెప్పేమాట ఇలా రుజువవ్వడం చూడవచ్చు.

1941 లో yoga univarsity of Washington అనే సంస్థను హడావుడిగా మొదలుపెట్టి మూసేశాడు.

1942 లో world brotherhood colony మొదలుపెట్టాడు. పేట్రనేజ్ లేక మూసేశాడు.

Jan 1, 1946 న Autobiography of a yogi మొదటి ఎడిషన్ విడుదలైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యద్భుతమైన సక్సెస్ ను అందుకున్న గ్రంధరాజంగా నేటికీ నిలిచి ఉంది. ఇది, రాహు - శని - శని - బుధ దశలో విడుదలైంది. చంద్ర కేతువులచేత ఆర్గళానికి గురైన శనిదశలో, పంచమంలో ఉన్న బుధదశలో, నవమరాహు మహాదశలో ఇది విడుదల కావడంతో, నమ్మడానికి శక్యం కాని అనేక కాకమ్మకధలతో నిండియున్న గ్రంధంగా విమర్శకుల దాడికి గురైనప్పటికీ, యోగసాధకులు అమితంగా చదివిన గ్రంధంగా అవతరించింది. ఈనాటికీ ఎంతోమందిని ఉత్తేజ పరుస్తున్నది. ఇంకెంతో మందిని తప్పుదారి పట్టిస్తున్నది. ఎంతోమంది ఆన్లైన్ ఆఫ్ లైన్ దొంగ గురువులను తయారు చేస్తున్నది.

1948 లో ' నిత్య సమాధి ' అనే స్థితిని  తను పొందినట్టు చెప్పాడు. ఇదే సమయంలో స్వామి క్రియానంద ఈయన శిష్యుడయ్యాడు. ఈ సమయంలో రాహువుతో శని అంతర్దశ అంతమై, బుధదశ మొదలైంది. యధావిధిగా పంచమస్థానం పనిచేసింది. అత్యున్నత సమాధిస్థితిని అందుకున్నానని చెప్పాడు. బుధుడు పంచమంలో ఉండటం వల్ల క్రియానంద అనే అమెరికన్  శిష్యుడు దగ్గరయ్యాడు. కానీ రాహువు ప్రభావం వల్ల తర్వాత కాలంలో 1962 లో ఈయన SRF తో విడిపోయి కోర్టుకెక్కి, Ananda అనే సంస్థను స్థాపించుకున్నాడు. SRF కు క్రియానందకు మధ్య కోర్టు కేసులు దాదాపు 40 ఏళ్ళు నడిచాయి. నిత్యవమాధిని అందుకున్న యోగానంద గారికి, తన శిష్యుడు భవిష్యత్తులో తన సంస్థతోనే గొడవపడి కోర్టు కెక్కుతాడని తెలుసా తెలీదా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.

1949 లో స్వామి యుక్తేశ్వర్ గిరి గారు వ్రాసిన The Holy Science అనే పుస్తకాన్ని ప్రచురించాడు. దీని స్క్రిప్ట్ ను ఓడనెక్కే సమయంలో యోగానందగారికి ఇచ్చారు యుక్తేశ్వర్ గిరిగారు. తనకు అర్ధమైన రీతిలో యుక్తేశ్వర్  గారు జ్యోతిష్యశాస్త్రాన్ని ఇందులో వివరించినప్పటికీ, అందులో ఇవ్వబడిన లెక్కలలో కొన్ని తప్పులున్నాయి. ఈ లెక్కలప్రకారం ప్రస్తుతం ఆరోహణా ద్వాపరయుగంలో మనం ఉన్నామని వీరి అనుచరులు నమ్ముతున్నారు. నా అభిప్రాయం ప్రకారం ఇది వాస్తవం కాదు.

1950-52 లో రాహు - బుధ, రాహు - కేతు దశలలో ఏకాంతవాసంలో ఉంటూ భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాశాడు. ఇదే సమయంలో ఈయన ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. పక్షవాతం వచ్చిందని కొన్నిచోట్ల వ్రాయబడి ఉన్నది. కానీ ఈ విషయాన్ని ఆయన అనుచరులు ప్రచారంలోకి రానివ్వలేదు. బహుశా ఈయన ఇమేజి దెబ్బ తింటుందనిన భయంతో కావచ్చు. నిజానికి 1940 లో రాహుదశ ప్రారంభం కావడం తోనే ఈయన ఏకాంతం లోకి వెళ్లడం మొదలు పెట్టాడు. తన శిష్యుల వెన్నుపోట్లతోను, అమెరికాలో తాను చేసిన ప్రచార కార్యక్రమం అనుకున్నంత సక్సెస్ కాకపోవడం తోను, తన సంస్థ తను ఆశించినట్లు ఎదగకపోవడంతోను, తనకు సరియైన వారసుడు లభించకపోవడం తోను ఆయన పూర్తిగా నిరాశ చెందాడు. అందుకని తనను తను ఒక కాటేజీలో బంధించుకుని ఎవరినీ కలవకుండా ఏకాంతంలో ఉండేవాడు. 

క్రమేణా ఈయన ఆరోగ్యం చెడిపోతూ వచ్చింది. 7 మార్చ్ 1952 న ఒక మీటింగ్ లో మాట్లాడుతూ, హఠాత్తుగా పడిపోయి చనిపోయాడు. శిష్యులేమో, గుండెను స్వచ్ఛందంగా ఆపేసి ఆయన మహాసమాధిని ఆహ్వానించాడని ప్రచారం చేస్తున్నారు. కానీ, అంతకు ముందు కొన్నేళ్ల క్రితం ఇండియా యాత్ర చేసిన సమయంలో చాలామంది ధనికుల సమక్షంలో గుండెను ఆపేసి శ్వాసరహిత స్థితిలో ఉండటాన్ని ప్రదర్శించబోయి విఫలుడయ్యాడు. ఆహ్వానితులందరూ చాలా నిరాశ చెందారు. ఇది రికార్డ్ కాబడిన సంఘటన. ఇది జరిగినపుడు, యోగానంద గారి చిన్ననాటి మిత్రుడైన స్వామి సత్యానంద గారు ప్రక్కనే ఉన్నారు. ఆయన వ్రాసిన పుస్తకంలో ఈ సంఘటన వర్ణించబడింది. కనుక, యోగక్రియద్వారా గుండెను ఆపేసి స్వచ్చందంగా మహాసమాధిని ఆయన పొందాడన్నది వాస్తవం కాకపోవచ్చు. మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని ఉన్నది. ఈయన అంతకు ముందు అమెరికాలో చాలాసార్లు ప్రదర్శించిన ' పల్స్ ట్రిక్ ' అనేది చాలామంది మోసగాళ్లైన బాబాలు, దొంగ గురువులు చేసే చీప్ ట్రిక్ అని డా. ప్రేమానంద్, అబ్రహాం కోవూర్ మొదలైన హేతువాదులు నిరూపించారు.

ఆ రోజున, రాహు - కేతు - శనిదశ నడిచింది. రాహు - కేతుదశ ఎవరి జాతకంలోనైనా ఒక ప్రధానమైన మార్పును సూచిస్తుంది. ఆ జాతకంలో రాహుకేతువులున్న స్థితిని బట్టి ఇది రకరకాలుగా ఉంటుంది. యోగానందగారి జీవనయాత్రకు ఈ దశ తెరను దించింది. రాహుశనుల శపితయోగం దశాపరంగా ఈ విధంగా పనిచేసింది.

'మా గురువుగారి మీద గ్రహాలు పనిచేయవు' అని చాలామంది గ్రుడ్డినమ్మక శిష్య పరమాణువులు బడాయి మాటలు మాట్లాడటం మనం చూస్తుంటాం. అది శుద్ధ తప్పు. భూలోకంలో జన్మ తీసుకున్న ఎవరైనా సరే, వారు అవతార పురుషులైనా సరే, గ్రహప్రభావం వారిపైన ఖచ్చితంగా ఉంటుంది. ఇది నేను ఇరవై ఏళ్ళనుంచి చెబుతున్నాను. నేను చూసిన కొన్ని వేల జాతకాలలో ఇది స్పష్టంగా రుజువైంది.

చివరకు యోగానందగారు కూడా తన పుస్తకంలోని 16 వ అధ్యాయం Outwitting the stars అనే దానిలో గ్రహప్రభావం తనపైన లేదని వ్రాశారు.  ఒక కోణంలో ఇది సత్యమే అయినప్పటికీ పూర్తి సత్యం మాత్రం కాదు. గ్రహప్రభావాన్ని ఒక కోణంలో మనం తప్పించుకోవచ్చు. కానీ అదే ఇంకొక కోణంలో వచ్చి ఏం చెయ్యాలో దానిని ఖచ్చితంగా చేస్తుంది. ఇది అంతిమసత్యం. దీనిని ఎవరూ తప్పుకోలేరు, చివరకు వారు మహాయోగులైనా సరే !

నా మాటలోని సత్యాన్ని వచ్చే పోస్టులో  మరిన్ని విశేషాలతో నిరూపిస్తాను.

నవమస్థానం దూరదేశ ప్రయాణానికి సూచిక. పరలోకం కంటే దూరదేశం ఇంకేముంటుంది? నవమంలో ఉన్న రాహు దశలోనే మరణం ఈయనను వరించింది.

(ఇంకా ఉంది)