“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

21, జూన్ 2023, బుధవారం

International Yoga Day 2023






రోజు అంతర్జాతీయ యోగ దినోత్సవం. నేటినుండి దక్షిణాయన పుణ్యకాలం మొదలు కావడమే ఈ కార్యక్రమానికి ఈ తేదీని మనం ఎంచుకోవడానికి గల కారణం.

ఈరోజున పంచవటి యోగాశ్రమంలో యోగా రిట్రీట్ జరపాలని అనుకున్నాం. కానీ అనుకున్న సమయానికి ఆశ్రమం పనులు పూర్తికానందున ఈ రిట్రీట్ జరుపలేకపోయాం. అయినా పరవాలేదు. ' నువ్వు పెట్టినది ముహూర్తం కాదు, జరిగినదే ముహూర్తం ' అనే జిల్లెళ్ళమూడి అమ్మగారి మాటను మేం అనుసరిస్తున్నాం.

నా శిష్యులు ఎక్కడున్నప్పటికీ, అది ఇల్లైనా, ఆశ్రమమైనా ఇంకెక్కడైనా, యోగపరమైన సాధనామయమైన జీవితాలను గడపమని నేనెప్పుడూ చెబుతాను. అదే క్రమంలో భాగంగా నేడు వారివారి ఇళ్లలో ఉన్న పంచవటి సభ్యులు మా యోగాభ్యాస క్రమాన్ని అభ్యాసం  చేశారు. ఆ ఫోటోల కొలెజ్ లను ఇక్కడ చూడవచ్చు.

యోగశాస్త్రం ఎంతో విశాలమైనది. ఎంతో లోతైనది. మహనీయులందరూ దాని సాయంతో ఉత్తీర్ణులైనవారే. దానిలో ఎన్నో మెట్లున్నప్పటికీ, ఎన్నో క్రియలు, అభ్యాసాలు, సాధనలు ఉన్నప్పటికీ, మొదటిమెట్టు మాత్రం ఆసనాల అభ్యాసమే. యోగంలోని ఉన్నతస్థాయి అభ్యాసాలను అందరూ చెయ్యలేక పోవచ్చు. చెయ్యలేరు కూడా. కానీ కొద్ది అభ్యాసంతో ఆసనాలను అందరూ చెయ్యవచ్చు,

నేడు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు న్యూయార్క్ లో 175 దేశాల సభ్యులతో ఐక్యరాజ్యసమితిలో యోగాభ్యాసం చేయిస్తున్నారు. ప్రపంచమంతా నేడు యోగా  చేస్తున్నది. ఆధ్యాత్మిక మార్గదర్శనం కోసం ఇండియా వైపు చూస్తున్నది.

కానీ మన ఇండియాలోనే యోగాను  చాలామంది చెయ్యడం లేదు. ఇక్కడే దీనిని వ్యతిరేకించే దుష్టశక్తులున్నాయి. కరుడుగట్టిన ఇస్లామిక్ వాదులు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు, నాస్తికులు, సెక్యులరిస్టులు ఈ గుంపులో ఉంటారు. ప్రపంచమంతా ఒప్పుకుంటున్న యోగాను ఒప్పుకోకపోవడం వీళ్ళ ఖర్మ.

ప్రపంచ క్రైస్తవదేశాలన్నీ యోగా చేస్తున్నాయి, ఒక్క ఇండియన్ క్రిస్టియన్స్ తప్ప. ఒక్క సౌదీని, పాకిస్తాన్, మలేషియా  దేశాలను మినహాయిస్తే మిగతా మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ యోగాకు మద్దతు పలికాయి కానీ ఇండియన్ ముస్లిములు మాత్రం యోగాను ఒప్పుకోరు. ఇదెంటో అర్ధం కావడం చాలా తేలిక. రెండూ శాంతి మతాలే కదా! అందుకే వాటికి ద్వేషం ఎక్కువ !

ఏదేమైనప్పటికీ, 'పంచవటి'లో మాత్రం యోగా అనేది మా జీవనవిధానంగా ఎప్పటినుంచో ఉంది. యోగా అనేది ప్రపంచానికి ఇండియా ఇచ్చిన వరాలలో అతి ముఖ్యమైనది. ప్రధానమంత్రి నరేంద్రమోడీగారి కృషివల్ల నేడిది అంతర్జాతీయ పండుగ కావడం చాలా సంతోషకరంగా ఉన్నది.

జూలై నెలాఖరుకు మా ఆశ్రమం ఒక కొలిక్కి రావచ్చు. ఆ తరువాత మా ఆశ్రమంలో  మొట్టమొదటి రిట్రీట్ గా మూడురోజుల యోగా రిట్రీట్ జరుగుతుంది. అప్పుడిక్కడ జరిగే మరిన్ని విశేషాలను మీరు తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఈ కొలెజ్ లను చూడండి.

మీ అదృష్టం బాగుంటేనే మీరు యోగమార్గం లోకి, అందులోనూ సరియైన యోగమార్గం లోకి అడుగుపెడతారు. 

జై భారత్ ! జై హింద్ !