“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

5, ఏప్రిల్ 2022, మంగళవారం

కేరళ ప్రశ్నశాస్త్ర విధానాలు - దేహ, ప్రాణ, మృత్యుభాగలు

కేరళప్రశ్నశాస్త్రం మామూలు ప్రశ్నశాస్త్రం కంటే భిన్నమైనది. ఎన్నో వందల ఏళ్ల రీసెర్చి దీని వెనుక ఉన్నది. కళ్ళు తిరిగిపోయేటటువంటి రహస్యపద్ధతులు దీనిలో ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఒక చిన్నవిధానాన్ని ఇప్పుడు చూద్దాం.

అదే, దేహ ప్రాణ మృత్యుభాగలు.

దేహమంటే, శరీరం. ప్రాణమంటే జాతకుని ప్రాణశక్తి. మృత్యువంటే చావు. దీనిని బట్టి ఏం అర్థమౌతోంది? రోగప్రశ్నలో దీనిని ఉపయోగిస్తారని తెలుస్తున్నది. అంటే, ఒక వ్యక్తి దీర్ఘరోగంతో బాధపడుతున్నప్పుడు, అతనికి నయమౌతుందా లేదా అనే విషయాన్ని ఈ ప్రశ్న ద్వారా చూస్తారు. అంతేగాక, ఆ దీర్ఘరోగానికి కారణాలేంటి? గతంలో చేసిన ఏ కర్మ వల్ల ఇది వచ్చింది. దీనికి రెమెడీలేంటి? మొదలైనవి కూడా దీనివల్ల తెలుస్తాయి.

కేరళ జ్యోతిష్కులు ఇలాంటి విధానాల వల్లనే అద్భుతమైన జోస్యాలు చెప్పగలుగుతారు.

-------------------------------------------------

దేహస్ఫుటం = చంద్ర x 8 + గుళిక

ప్రాణస్ఫుటం = లగ్న x 5 + గుళిక

మృత్యు స్ఫుటం = గుళిక x 7 + రవి

----------------------------------------------

అసలీ సూత్రాలెలా వచ్చాయి? అని మనం ఆలోచిస్తే. మనకు అర్ధంకాదు. వీటి వెనుక ఎన్నో వందల ఏళ్ల అనుభవమూ, రీసెర్చీ, లాజిక్సూ ఉంటాయి. వాటిల్లోకి ప్రస్తుతం పోనక్కరలేదు.

ఈ మూడింటినీ కలిపితే త్రిస్ఫుటం అవుతుంది. అది రాశిచక్రంలో ఏదో ఒకచోట పడుతుంది. దానిని గుర్తించాలి. ఈ బిందువులో ఏ గ్రహం ఉన్నదో చూచి, దానినిబట్టి ఆ కుటుంబసభ్యునికి మూడిందని తెలుసుకోవాలి.

ఆ గ్రహం సూర్యుడైతే తండ్రికి, చంద్రుడైతే తల్లికి, కుజుఁడైతే సోదరసోదరీలకు, బుధుఁడైతే మేనమామకు, గురువైతే గురువులకు, శుక్రుడైతే భార్యకు, శనికి అయితే సేవకులకు మూడిందని - ఈ విధంగా గ్రహించాలి.

పాతకాలంలో, ప్రశ్న అడగడానికి వచ్చినవారు, విషయం ఏమిటో చెప్పేవారు కారు. జ్యోతిష్కుడే దానిని చెప్పాలి, దానికి పరిష్కారం కూడా చెప్పాలి. అదీ అసలైన జ్యోతిష్యమంటే ! ఆఫ్ కోర్స్ దీనికి ఉపాసనాబలం కూడా ఉండాలనుకోండి. అది లేకుండా ఉత్త గణితం ఎందుకూ పనిచేయదు.

ఉదాహరణకు, ఈ రోజు ఉదయం 11. 08 కి హైద్రాబాద్ లో వేసిన ఒక ప్రశ్నను చూడండి.

-------------------------------

లగ్నం - 69. 46

చంద్రుడు - 37. 53

సూర్యుడు - 351. 16

గుళిక - 85. 45

-----------------------------

పై సూత్రాలను బట్టి లెక్కించగా,

-------------------------------------------------

దేహస్ఫుటం = 303. 04 + 85. 45 = 388. 49 = 28. 48

ప్రాణస్ఫుటం = 348. 53 + 85. 45 = 424. 38 = 64. 38

మృత్యుస్ఫుటం = 600. 25 + 351. 16 = 951. 41 = 231. 41

------------------------------------------------

త్రిస్ఫుటం = దేహ + ప్రాణ + మృత్యుబిందువులు

= 28. 48 + 64. 38 + 231. 41

= 325. 07

= 25. 07 కుంభ

ఈ డిగ్రీకి దగ్గరగా ప్రస్తుతం గురువున్నాడు. కుంభం 28 మీద సంచరిస్తున్నాడు.

కనుక, గురువుకుగాని, గురుసమానుడైన కుటుంబపు పెద్దకు గాని గండం ఉందని చెప్పాను.

ఈ విధానాన్ని, ప్రశ్నకేగాక, వ్యక్తిగతజాతకానికి కూడా వర్తింపజేయవచ్చు. సామాన్యంగా ఒక విచిత్రాన్ని మనం కొన్ని కుటుంబాలలో గమనించవచ్చు. కొందరు పుట్టిన వెంటనే గాని, కొద్ధికాలానికి గాని, ఆ కుటుంబంలో ఎవరో ఒకరు చనిపోతారు. ఇది చాలా కుటుంబాలలో జరుగుతుంది.

పుట్టిన శిశువు జాతకం వేసి చూస్తే, త్రిస్ఫుటం ఏ రాశిలో పడుతుందో, ఆ రాశిస్ఫుటానికి దగ్గరగా ఏ గ్రహముందో చూచి, ఆ శిశుజననం వల్ల ఎవరికి మూడిందో తెలుసుకోవచ్చు. చేతనైతే రెమెడీలు చేసి ఆ గండం నుంచి తప్పుకోవచ్చు.

ఉదాహరణకు ఒక మకరలగ్నజాతకంలో త్రిస్ఫుటం, వృశ్చికం 8 డిగ్రీలలో పడింది. అక్కడ ఏ గ్రహమూ లేదు. కానీ సింహంలో యురేనస్ 9 డిగ్రీలలో ఉంది. మీనంలో గుళిక 8 డిగ్రీలలో ఉంది. కనుక, ఈ జాతకురాలికి సోదర సోదరీలు ఉండరని చెప్పడం జరిగింది. అదే విధంగా ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కతే కూతురుగా మిగిలిపోయింది. తరువాత ఎవరూ పుట్టలేదు.

సింహం అష్టమం గనుక, ఈ అమ్మాయి పుట్టిన తర్వాత ఆ కుటుంబం దురదృష్టం పాలౌతుందని చెప్పాను. అలాగే, అప్పటిదాకా బాగున్న వారి కుటుంబం ఈ అమ్మాయి పుట్టిన తర్వాత అనేక ఒడిదుడుకులకు లోనై, చిన్నాభిన్నమై పోయింది. త్రిస్ఫుటం వల్ల ఇలాంటి అద్భుతమైన విషయాలను జాతకం నుంచి తెలుసుకోవచ్చు.  

అంతేకాదు, ఇంకో వింత విషయం ఇప్పుడు చూడండి.

  • ఈ బిందువులో రాహువు ఉంటే, ఈ ప్రశ్న అడిగినవాడికే ముందుగా మూడుతుంది. ముందు వాడే  రెమెడీలు చేసుకోవాలి.
  • ఈ బిందువులో గుళిక ఒక్కడే ఉంటే, ఈ ప్రశ్నను చూస్తున్న జ్యోతిష్కుడికే ముందుగా మూడుతుంది. ముందు వాడు తనకుతాను రెమెడీ చేసుకోవాలి.  అంటే, అడిగినవారి కర్మ అంత గొప్పదన్నమాట ! వాళ్ళ జాతకాన్ని చూచినందుకే, 'నీకెందుకురా అసలు ?' అంటూ, జ్యోతిష్కుడికి వేటు పడుతుంది.
  • ఈ బిందువులో కేతువుంటే, ప్రశ్నను అడుగుతున్నవాడి వెంట తోడుగా వచ్చినవాడికి వేటు పడుతుంది. అదేంటి? వాడేం తప్పుచేశాడు? అనుకోకండి. అలాంటి చెడుఖర్మ ఉన్నవాడికి తోడుగా రావడమే వాడి తప్పు. దానినే సావాసదోషం అంటారు. దానిని కూడా గ్రహాలు చూపిస్తాయి.
జ్యోతిష్యశాస్త్రంలో ఇంత లోతులుంటాయి మరి !

ఈ గణితం అంతా గుళికతోనే చేయబడుతుంది. ఇలాంటి వినూత్నమైన విధానాలు కేరళ జ్యోతిష్యశాస్త్రంలో చాలా ఉన్నాయి.