“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

1, నవంబర్ 2021, సోమవారం

జాతకంలో జీన్ కోడ్ ఎలా దాగి ఉంటుంది? రాజ్ కుమార్, పునీత్ ల జాతకాలు

21 సంవత్సరాల క్రితం జ్యోతిష్య శాస్త్రంలో నేను MA చేశాను. తెలుగు యూనివర్సిటీ నుండి మాది మొదటి బ్యాచ్. అప్పట్లో నా అభిమాన అంశం - జాతకచక్రంలో జీన్ కోడ్ ఎలా దాగి ఉంటుంది? తల్లిదం డ్రులనుండి వారసత్వ లక్షణాలు పిల్లలకెలా సంక్రమిస్తాయి? కర్మలు, శాపాలు ఎలా ఒక తరం నుంచి మరొక తరానికి సరఫరా అవుతాయి? అనే అంశమే. గుంటూరుకు చెందిన ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త BJ రావుగారు కూడా, ఇదే అంశం మీద రీసెర్చి చెయ్యమని తాను చనిపోయేముందు నాతో చెప్పారు. ఆ తరువాత ఈ విషయం మీద చాలా రీసెర్చి చేశాను. ఎన్నో సూత్రాలను కనుక్కున్నాను.

"మెడికల్ ఆస్ట్రాలజీ - పార్టీ 2" లో ఆ అంశాలను అనేక జాతకాల ఆధారంగా విశ్లేషించి లోకానికి అందించబోతున్నాను. ఈ పుస్తకం 2022 లో విడుదలౌతుంది.

ప్రస్తుతానికి ఇదే అంశాన్ని 29  చనిపోయిన పునీత్ రాజ్ కుమార్, అతని తండ్రి రాజ్ కుమార్ ల జాతకాల పరంగా వివరిస్తున్నాను. అయితే, ఒకే ఒక్క సంఘటనను మాత్రమే ఇప్పుడు చెబుతాను. మొత్తం జాతకాలను వివరించను.

వీళ్ళిద్దరూ ఒకే విధంగా చనిపోయారు. ఇద్దరి మరణాలకూ, వ్యాయామం చేసిన తర్వాత వచ్చిన కార్డియాక్ అరెస్ట్ మాత్రమే కారణం అయింది. ఇప్పుడు వీళ్ళ జాతకాలను పరిశీలిద్దాం.

ముందుగా, ఒక చిన్న విచిత్రాన్ని గమనించండి. రాజ్ కుమార్ 46 వ ఏట పునీత్ రాజ్ కుమార్ పుట్టాడు.  మళ్ళీ తన 46 వ ఏట పునీత్ చనిపోయాడు. కనుక 46 అంకెకు వీళ్ళ జాతకాలతో సంబంధం ఉందా లేదా? నా విధానం ప్రకారం 4 కేతువు, 6 కుజుడు, 1 సూర్యుడు. కనుక వీళ్ళ జాతకాలలో ఈ గ్రహాలు ప్రధానపాత్రలు పోషిస్తాయి. మరి ముందుకు పదండి !

రాజ్ కుమార్ జాతకం (24 ఏప్రిల్ 1929)

మేషంలో రవిరాహుయోగం ఉంది చూడండి. ఇది, ఆ జాతకుడు హార్ట్ ఎటాక్ తో పోవడాన్ని సూచిస్తున్నది  అంతిమయాత్రకు శని సూచిస్తాడు. ఈ జాతకంలో, కుజశనుల షష్టాష్టకస్థితి అమితశ్రమయే ఈ జాతకుని అంతిమయాత్రకు కారణమౌతుందన్న సత్యాన్ని చెబుతున్నది. కేతు చంద్రులు కలసి ఉండటం వల్ల గుండెకు రక్తప్రసరణ ఆగడం ఈ మొత్తానికీ దోహదమౌతుందని సూచన ఉన్నది. కేతువు శుక్రుడిని సూచిస్తున్నాడని గమనించండి.

పునీత్ రాజ్ కుమార్ జాతకం (17 మార్చ్ 1975)

ఈ జాతకంలో చంద్రుడు శుక్రుడితో కలసి ఉండటం, ఇద్దరూ కేతువుతో మ్రింగబడటం చూడవచ్చు. ఇదే జెనెటిక్ ఆస్ట్రాలజీ మహాత్యం. మరొక్క విచిత్రం - శని కుజులిద్దరూ ఈ చార్ట్ లో కూడా షష్టాష్టక స్థితిలోనే ఉన్నారు. అంటే, అతిశ్రమ వల్లనే అంతిమయాత్రకు దారి ఏర్పడుతుందని సూచన ఈ జాతకంలో కూడా ఉంది. సూర్యుడు పాపార్గళంలో బందీ అయ్యాడు. రాహుశనులచేత చూడబడుతున్నాడు. కనుక కార్డియాక్ అరెస్ట్ జరిగింది.

ఈ విధంగా 46 ఏళ్ల తేడాతో పుట్టిన తండ్రీ కొడుకుల జాతకాలలో ఒకే విధమైన గ్రహస్థితులుండటం వింతగా లేదూ? అయితే, ఇందులో వింతేమీ లేదు. జీన్ కోడ్ ఇలాగే ఒక తరం నుంచి మరొక తరానికి సరఫరా అవుతుంది.  కర్మ కూడా ఇదే విధంగా సరఫరా అవుతుంది. ఒక వంశంలో ఒక విధమైన కర్మ ప్లాన్ నడుస్తూ ఉంటుంది. దానిని ఆ కుటుంబసభ్యుల జాతకాలు పరిశీలించడం ద్వారా  స్పష్టంగా తెలుసుకోవచ్చు.

అయితే, దీనిని ఎలా మార్చాలన్నదే అసలైన ప్రశ్న. చెప్పమంటారా? అబ్బా ! అదే రహస్యం మరి ! అవన్నీ తెలిస్తే ఇంకేం? అందరూ అన్నీ మార్చేసుకోరూ? కనుక దానిని మాత్రం చెప్పను. జెనెటిక్ ఆస్ట్రాలజీ నిజమే  అన్నది  అర్ధమైంది కదా? అంతవరకూ అర్ధమైతే చాల్లే ప్రస్తుతానికి !