“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

16, నవంబర్ 2021, మంగళవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 42 ( మీరు ఆశ్రమాన్ని ఎందుకు పెట్టాలనుకుంటున్నారు?)

ఉదయాన్నే నిద్ర లేచాం. డాబామీద కాసేపు నడుస్తూ అమెరికా శిష్యులతో ఫోన్లో మాట్లాడిన తర్వాత, క్రిందకు దిగి వచ్చాను. పల్లెటూరు, చుట్టూ మంచు దుప్పటి, పొలాలు, ఆ వాతావరణంలో చన్నీళ్ళు స్నానం చేయాలనిపించలేదు. అందుకని స్నానాన్ని వాయిదా వేసి, సరాసరి టిఫిన్ కానిచ్చి, దేవాలయానికి వెళ్లి అమ్మ దర్శనం చేసుకున్నాం. ప్రత్యేకంగా ఒకచోట కూర్చోకుండా, నడుస్తూ తిరుగుతూనే, లోలోపల మహామంత్ర జపం, ధ్యానం, ఇతర ప్రక్రియలన్నింటినీ ముగించాను.

వసుంధరక్కయ్య దగ్గర కాసేపు కూర్చున్నాము. కరోనా సమయంలో తానెలా ఇబ్బంది పడిందీ, గుంటూరులో కొన్నాళ్ళు ఉండి చికిత్స తీసుకుని ఎలా బయటపడింది, ఆ సమయంలో అమ్మ హస్తం తననెలా కాపాడిందీ, ఆ వివరమంతా చెప్పుకొచ్చింది అక్కయ్య. ఆమె దగ్గర సెలవు తీసుకుని, ఆఫీసులో దినకర్ గారిని కలిశాము. తన గదిలో ఆలోచనా ముద్రలో కూర్చుని ఉన్నాడాయన. మమ్మల్ని చూస్తూనే గుర్తుపట్టి నవ్వుతూ ఆహ్వానించారు.

'దాదాపు ఏడాది దాటినట్లుంది మిమ్మల్ని చూచి' అన్నారు నవ్వుతూ.

కుశలప్రశ్నలయ్యాక, 'కందుకూరు ప్రాంతాలలో ఆశ్రమ స్థలాల కోసం వెదుకుతూ నిన్న రాత్రి ఆశ్రమానికి వచ్చామని, ఈ రోజు రాత్రికి మళ్ళీ హైదరాబాద్ వెళ్లిపోవా'లని చెప్పాను.

ఆయన ప్రశ్నార్థకంగా చూచారు.

'రిటైర్ అయ్యాక ఆశ్రమంలో ఉండాలని ఒక ఊహ. అందుకే, స్థలం కోసం చూస్తున్నాం' అన్నాను.

'ఆశ్రమ కార్యక్రమాలేముంటాయి?' అన్నాడాయన.

'ఏమీ ఉండవు. మేముంటాం అక్కడ. అంతే' అన్నా నవ్వుతూ.

మళ్ళీ ప్రశార్ధకంగా చూచారాయన.

కొంచం వివరిద్దామని ఏదో చెప్పబోతుండగా, అక్కడ ఆఫీస్ లో పనిచేసే భాస్కర్ అనే అబ్బాయి హఠాత్తుగా లోపలకు వచ్చాడు. నన్ను దినకరన్నయ్యకు చూపిస్తూ, 'వీరిని మీకు పరిచయం చేద్దామని వచ్చాను' అన్నాడు.

'ఆయన నాకు తెలుసు. ఇప్పటినుంచీ కాదు. చాలా ఏళ్ల నుంచీ తెలుసు' అన్నారు దినకరన్నయ్య.

'ఆయన మనకందరికీ తెలిసినవారే. అయినా, ఆయన్ను నేనర్ధం చేసుకున్నట్లుగా, మీకు పరిచయం చేద్దామని వచ్చా' అన్నాడు భాస్కర్.

నేనూ, మూర్తీ మౌనంగా చూస్తున్నాం.

ఇక చెప్పడం మొదలుపెట్టాడు భాస్కర్.

'నేను వీరి బ్లాగ్ ని గత పదేళ్ల నుంచీ అనుసరిస్తూ ఉంటాను. అదొక ఎన్ సైక్లోపీడియా. గత మూడు దశాబ్దాల ప్రపంచచరిత్రకు అదొక దర్పణమని చెప్పవచ్చు. అందులో లేని విషయం లేదు.  ఆధ్యాత్మికం, జ్యోతిషం, వీరవిద్యలు, హోమియోపతి  ఇలా ఎన్నో. మెహర్ బాబా, రమణమహర్షి  వంటి మహనీయుల జాతకాలను వీరు విశ్లేషణ చేయడం నన్నాకర్షించి చదవడం మొదలుపెట్టాను.  అప్పటివరకూ జ్యోతిష్యమంటే, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, డబ్బు మొదలైనవాటి గురించే అందరూ వ్రాసేవారు. కానీ దానిని ఆధ్యాత్మిక కోణంలో ఎలా అర్ధం చేసుకోవాలి? అన్న విషయాన్నీ మొదటగా వీరి బ్లాగులో చూచాను. అప్పటినుంచీ అన్నింటినీ  చదవడం మొదలుపెట్టాను. మీరు తీసిన మార్షల్ ఆర్ట్స్ మీద షార్ట్ ఫిలిం కూడా నేను చూచాను. ఇంకా అలాంటివి రావాలని ఎదురుచూచేవాళ్లలో నేనొకడ్ని. తరువాత వీరిని జిల్లెళ్ళమూడిలో చూచి పరిచయం చేసుకున్నాను. మీకు కూడా వీరి  వ్రాతలను కొన్నింటిని ప్రింట్ తీసి చూపించాను గతంలో. అంతేకాదు, చల్లపల్లిలో ఉన్న అచలాచల మార్గపు గురువులకు కూడా వీరి బ్లాగును, వ్రాతలను చూపించాను' అన్నాడు భాస్కర్.

దినకర్ గారు కల్పించుకుని, 'భాస్కర్ ఇక్కడకు రాకముందు అచలాచల సాంప్రదాయంలో ఉన్నాడు. అందుకని వారితో సంబంధాలున్నాయి' అని చెప్పారు.

ఇలా అంటూ, 'ఆ పుస్తకాలు తెచ్చివ్వు వీరికి' అన్నారు.

ఒక పుస్తకాన్ని తెచ్చి నాకిచ్చారు.

'దీనిని అచలాచల మార్గపు రెండో గురువైన ఫలానాగారు వ్రాశారు. దీనికి 'అనసూయోపనిషత్' అని పేరు పెట్టారు.  అమ్మ మీద చాలా బాగా వ్రాశారు. అమ్మ తత్త్వం మాటలకు అతీతమైనది. దానిని వర్ణించడం చాలా కష్టం. దానిపైన , ఎంతో రీసెర్చి చేసి వ్రాయబడిన గ్రంధం ఇది. ఆయన చేసిన రీసెర్చికి నాకు ముచ్చటేసింది' అన్నారు దినకర్ అన్నయ్య.

పైపైన పేజీలను త్రిప్పుతూ ఆ పుస్తకాన్ని చూచాను. విషయం అర్ధమైంది. ఇప్పటికి కొన్ని వేల పుస్తకాలను చదివిన అనుభవంతో, ఎలాంటి పుస్తకాన్నైనా సరే, కొద్ది నిముషాలలో, పైపైన త్రిప్పుతూనే నేను చదువగలను.  నూరు పేజీల లోపు పుస్తకాలనైతే కొన్ని సెకన్లలో చదువగలను.

'విజ్ఞాన ప్రదర్శన బాగుంది' అన్నాఆ పుస్తకాన్ని టేబుల్ పైన పెడుతూ.

ప్రశ్నార్థకంగా చూచారు దినకరన్నయ్య.

'మాటలకతీతమైన అమ్మ తత్వాన్ని మాటలలోకి తేవడానికి ఎలా కుదురుతుంది? కనుక అమ్మ గురించి మనం చెప్పేదంతా మన విజ్ఞాన ప్రదర్శన కాకుంటే మరేమిటి? అందుకని అలా అన్నాను. వీరి ప్రయత్నం బాగుంది. కానీ సరళమైన అమ్మ తత్వాన్ని అర్ధం చేసుకోవడంలో ఈ రచయిత దారుణంగా విఫలమయ్యారు.' అన్నా నవ్వుతూ.

ఆ మాటను పట్టించుకోకుండా, 'ముందుముందు ఈ ప్రదేశం తపస్సాధకులకు నిలయమౌతుంది' అని 40 ఏళ్ల క్రితమే అమ్మన్నారు' అన్నారు దినకరన్నయ్య.

'అందుకే వస్తున్నాం కదా ఒక్కొక్కరుగా' అన్నా చిరునవ్వుతో.

'అవును. రకరకాల సాంప్రదాయాలకు చెందిన వారందరూ ఇప్పుడు అమ్మను గుర్తిస్తున్నారు.  అమ్మలాగా, అత్యున్నతమైన తత్వాన్ని మామూలు మాటల్లో చెప్పినవారు లేరని ఇప్పుడు అందరూ ఒప్పుకుంటున్నారు. నేను, ఎందరో స్వామీజీల బోధలను ఆకళింపు చేసుకున్నాను.  కానీ వారెవరూ అమ్మ దరిదాపులలోకి కూడా రాలేరు. వారిలో చాలామంది  గతంలో అమ్మ పాదాల దగ్గర కూర్చున్నవారే' అంటూ ఒక అరడజను మంది స్వామీజీల పేర్లను ఉటంకించారాయన.

(పాతకులను నొప్పించడం ఇష్టం లేక ఆయా స్వామీజీల పేర్లను ఇక్కడ వ్రాయడం లేదు)

ఇక సీరియస్ చర్చ మొదలుపెట్టాలని భావించిన నేను, హాస్యాన్ని ప్రక్కనపెట్టి, 'అన్నయ్యా! మీరేమనుకోకండి. మీరు చెప్పినవాళ్ళందరూ సమాజపు దృష్టిలో గొప్ప గొప్ప స్వామీజీలు కావచ్చు.  కానీ నేను మాత్రం వీళ్ళనసలు సన్యాసులుగానే గుర్తించను' అన్నాను.

సంభాషణ సీరియస్ గా మారుతోందని గ్రహించాడో ఏమో, తను చెప్పవలసింది చెప్పి,, భాస్కర్ ఆ గదినుండి నిష్క్రమించాడు.

'ఎందుకలా? అన్నట్లు దినకరన్నయ్య నావైపు కొంచం ఉత్సుకతతో కూడిన ప్రశ్నదృష్టితో చూచారు.

'ఏం చెబుతానా?' అన్న ఉత్సుకతతో మూర్తి కూడా మమ్మల్ని మౌనంగా చూస్తున్నాడు.

నేను చెప్పడం మొదలుపెట్టాను.

(ఇంకా ఉంది)