“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

13, జులై 2021, మంగళవారం

మా సిద్ధాంత సారమైన 'మ్యూజింగ్స్' E Book విడుదలైంది

ఈ మధ్యన మా సంస్థ నుండి క్రొత్త పుస్తకాలేవీ రాలేదని అనుకుంటున్నారా? ఆగండి! మీ జీవితాన్ని సమూలంగా మార్చేసే ఉద్గ్రంథమొకటి విడుదలకు సిద్ధంగా ఉంది.

దానిపేరే - 'మ్యూజింగ్స్'. ఈ పుస్తకాన్ని E Book గా  ఈరోజున విడుదల చేస్తున్నాము. ఏమిటి ఈ రోజు ప్రత్యేకత? అంటే, తేదీలప్రకారం, నేడు నేను పుట్టినరోజు. అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం ఈరోజున నాకు 59 నిండి 60 లోకి అడుగుపెడుతున్నాను. అందుకే ఈ పుస్తకాన్ని ఈరోజున విడుదల చేస్తున్నాము.

ఈ ప్రపంచంలో  నాకు నచ్చనిదేదైనా ఉందంటే అది, ఏ పనీ చెయ్యకుండా సోమరిగా కూర్చోవడం ఒక్కటే. నిరంతర కృషీవలత్వం నా సిద్ధాంతం. నేను మౌనంగా ఉన్న ఈ సమయంలో మహా ఉద్గ్రంథమొకటి నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటోంది. ఈ ఉద్గ్రంధం నా అనుభవాల ఆలోచనల సమాహారం, నా మార్గం, సిద్ధాంతం, తత్త్వం. అసలీ పుస్తకమెలా రూపుదిద్దుకుంది? తెలియాలంటే, కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి.

2010 లో పంచవటి గూగుల్ గ్రూప్ మొదలైంది. అప్పటినుంచి  అనేకమంది మెంబర్స్ అడిగిన లెక్కలేనన్ని ఆధ్యాత్మికప్రశ్నలకు గ్రూపులో జవాబులిస్తూ వచ్చాను. నా మార్గంలో నడుస్తున్నవారికి కావలసిన ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ వచ్చాను. ఈ విధంగా ఇప్పటికి పదేళ్లు గడిచాయి. ఈ క్రమంలో దాదాపుగా వెయ్యిపేజీల విలువైన మెటీరియల్ తయారైంది. ఇవన్నీ 'ఆలోచనాతరంగాలు' బ్లాగ్ లో దొరకని లోతైన అవగాహనా విశేషాలు.

ఎందుకంటే, బ్లాగ్ లో పైపై లోకాభిరామాయణం మాత్రమే నడుస్తుంది. అసలైన విషయాలను గ్రూప్ లో మాత్రమే చర్చిస్తాను. ఇంకా లోతైన విషయాలను వ్యక్తిగతంగా ఎవరివి వారికి మాత్రమే చెప్పే అలవాటు నాది. ఇవిగాక నేను నడిచిన ఆధ్యాత్మికమార్గాన్ని స్పష్టంగా వివరిస్తూ గ్రూపు సభ్యుల కోసం నేను వ్రాసిన వ్యాసాలు ఎన్నో ఉన్నాయి.  వాటిలో 360 వ్యాసాలను ఒకచోటకు చేర్చి 'మ్యూజింగ్స్' అనే పేరుతో ఈ ఇంగిలీషు "ఈ-బుక్" ను విడుదలచేస్తున్నాము. ఇది దాదాపుగా వెయ్యిపేజీల పుస్తకం. వేయిపడగలవంటి ఉద్గ్రంధం. దీని రచనాకాలం పదేళ్లు. విలువ అమూల్యం.

ఇవన్నీ ఇంగిలీషులో వ్రాసిన వ్యాసాలు గాబట్టి, అంతర్జాతీయ పాఠకులకోసం ఇది మొదటగా ఇంగిలీషులో విడుదలౌతోంది.

విశ్వనాధ సత్యనారాయణగారు 'వేయిపడగలు' వ్రాశారు. చలంగారు 'మ్యూజింగ్స్' వ్రాశారు. అసలు, మ్యూజింగ్స్ అనే పదాన్ని మొదటగా సామ్యూల్ టేలర్ 1794 లో తన 'స్పిరిట్యువల్ మ్యూజింగ్స్' లో వాడాడు. చలంగారు ఇంగ్లీషు చదువులు చదివారు గాబట్టి ఆ పేరుతో తన జ్ఞాపకాలను, భావాలను వ్రాశారు. రెంటినీ కలిపి నేనీ ఆధ్యాత్మిక వేయిపడగలను 'మ్యూజింగ్స్' అంటూ వెయ్యిపేజీలలో వ్రాశాను.

సూర్యోపాసనలో నాకున్న అనుభవాన్ని బట్టి ఈ మ్యూజింగ్స్ సంఖ్యను 360 వ్యాసాలుగా నిర్ణయించాను. ఇవి సూర్యభగవానుని వెలుగు కిరణాలు. సావన సంవత్సరంలో ఉండే రోజులు. 'మహాసౌరం' పుస్తకంలో కూడా 360 పద్యములే వ్రాశానన్నది గమనార్హం.

ఈ పుస్తకం మా వేదం, మా భగవద్గీత, మా ఉపనిషత్తు.

వేదాంతం, యోగం, తంత్రం, జ్యోతిష్యం, సాధనామార్గంలో నా అనుభవాలు, అన్నింటినీ మించి, ఎన్నో ఆధ్యాత్మిక సాధనా రహస్యాల సమాహారమే ఈ 'మ్యూజింగ్స్'. ఇది నా లైఫ్ టైం పుస్తకమని సగర్వంగా చెబుతున్నాను. ఈ పుస్తకంలో ఉన్న 360 వ్యాసాలను మీరు చదివి అర్ధం చేసుకుంటే, భారతీయ ఆధ్యాత్మిక చింతనాశిఖరాలన్నీ మీకు అర్ధమౌతాయి.  ఇకపై మీరు చదవాల్సినవి ఏవీ ఉండవు.

'యన్నభారతే తన్నభారతే' - అని సూక్తి ఉన్నది.  అంటే, భారతంలో లేనిది  భారతదేశంలో లేదు అని. అదే విధంగా, ఈ పుస్తకంలో లేని ఆధ్యాత్మికత ప్రపంచంలో ఇంకెక్కడా లేదని సగర్వంగా చెబుతున్నాను. ఇందులోని ఒక్కొక్క వ్యాసమూ మిమ్మల్ని చాలా ఆలోచింపజేస్తుంది. కనుక, ఒక నవలను చదివినట్లుగా మీరు దీనిని గబగబా చదవలేరు. అలా చదవకూడదు కూడా. రోజుకొక్క వ్యాసాన్ని చదివి అర్ధం చేసుకుంటూ ముందుకు సాగుతుంటే మీరీ పుస్తకాన్ని పూర్తి చేసేటప్పటికే ఏడాది పడుతుంది. ఇదొక సాధన అవుతుంది. ఒక ధ్యానమౌతుంది. దాని ఫలితంగా మీ జీవితం మారిపోతుంది. అందుకే ఇది జీవితాన్ని మార్చే పుస్తకమని చెబుతున్నాను.

నేనేంటో, నా అంతరంగమేమిటో, ఈ పుస్తకం మీకు స్పష్టంగా వివరిస్తుంది. ఈ పుస్తకాన్ని చదివాక నా మిత్రశత్రువుల చిరకాలపు తపన చల్లారుతుందని ఆశిస్తున్నాను.

నా మిత్రశత్రువులు తరచుగా చేసే ఫిర్యాదొకటుంది. 'మీరస్సలు అర్ధం కారు' అనేదే అది. 'ఒకసారి ఒకమాటంటారు, ఇంకోసారి ఇంకోమాటంటారు. ఒకసారి చెప్పినది ఇంకోసారి చెప్పరు. ఎలా మిమ్మల్ని అర్ధం చేసుకోవాలి? ' అని చాలామంది నన్నడిగారు.

వారందరికీ ఒకటే జవాబు.

'సూర్యుడు పన్నెండు నెలలలోనూ ఒకే విధంగా ఉండడు. అంతమాత్రాన సూర్యుడు సూర్యుడు కాకపోడు. సూర్యుడిని సంపూర్ణంగా అర్ధం చేసుకోవాలంటే పన్నెండు నెలలలోనూ అతడిని చూడాలి. మీ కళ్ళద్దాలను తీసేసి చూడాలి. దానివల్ల మీ కళ్ళకేమీ ఇబ్బందిరాదు. సత్యదృష్టి మీకలవడుతుంది. అతడేమిటో అర్ధమౌతుంది. అప్పుడు గాని చీకటిని వదలిపెట్టి, మీరు వెలుగులోకి రాలేరు' - అనేదే ఆ జవాబు.

ఆధ్యాత్మికం, యోగం, లౌకికం, సామాజికం, వ్యక్తిగతం, రాజకీయాలు, కళలు, పాటలు, పద్యాలు,  జ్యోతిష్యం, వీరవిద్యలు, హోమియోపతి, మర్మవిద్యలు ఇలా ఎన్నో విషయాల మీద నా భావాలను గత పన్నెండేళ్లుగా వ్రాస్తూ వస్తున్నాను. అవన్నీ చదివిన బయటివారు 'ఏంటి? ఒక మనిషిలో ఇన్ని విద్యలా? ఇన్ని కోణాలా?' అంటూ గందరగోళానికి గురయ్యే అవకాశం ఉన్నది. అయితే, నా ఆత్మీయులకు మాత్రం ఆ బాధ ఉండదు. ఎందుకంటే వారికి నా బహుముఖమైన అంతరంగం  బాగా తెలుసు కాబట్టి !

నేను ఏది వ్రాసినా ఆధ్యాత్మికవాసన లేకుండా వ్రాయలేదు. ఇది నా వ్రాతలన్నింటిలో అంతర్లీనంగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నేనేమిటో నా భావజాలమేమిటో మీకు స్పష్టంగా తెలియాలంటే మీరు 'మ్యూజింగ్స్' చదవాలి. ఎందుకంటే, నా మనసు లోతులను  స్పష్టంగా ప్రతిబింబించే పుస్తకమిది.

ఈ ఇంగిలీషు పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేసే పని వెంటనే మొదలౌతున్నది. దీని అనువాదం చేస్తామని నా శిష్యులు కొందరు ముందుకొస్తున్నారు. అనుకున్నట్లు అంతా అయితే, ఈ తెలుగు పుస్తకాన్ని 'వెలుగు దారులు' అనే పేరుతో వచ్చే ఏడాది జూలైకి విడుదల చేస్తామని భావిస్తున్నాను. 

అప్పటికి మా 'పంచవటి' కార్యక్రమాలు కూడా బహుముఖాలుగా విస్తరించబోతున్నాయి. మా యూట్యూబ్ ఛానల్సన్నీ ఒక్కసారిగా క్రియాశీలమౌతాయి. మా ఆశ్రమం సాకారమౌతుంది. నిజమైన ఆధ్యాత్మికత ఏమిటో లోకానికి క్రియాత్మకంగా బహుముఖంగా వెదజల్లబడుతుంది. ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు జరుగబోతున్నాయి.

గతంలో నా శిష్యులు చాలామంది ఇలా అడిగేవారు.

'ఎవరైనా మమ్మల్ని 'మీ మార్గమేమిటి? మీ గురువుగారు ఏమి బోధిస్తారు?' అని అడిగితే మేమేమి చెప్పాలి?

ఇంతకు ముందైతే చెప్పడం కష్టమయ్యేది. ఎందుకంటే సర్వతోముఖమైన మా సాధనామార్గాన్ని కొద్ది మాటలలో చెప్పడం అసాధ్యం. చెప్పేవారికీ అది కుదరదు, వినేవారికీ అర్ధం కాదు. కానీ ఇప్పుడది సులభమయ్యింది.

క్లుప్తంగా ఇలా చెప్పండి చాలు. 

'మ్యూజింగ్స్ చదవండి, మా దారేంటో  అర్ధమౌతుంది'.

అదన్నమాట !

ఇకపోతే, ఈ పుస్తకాన్ని వ్రాయడంలో విసుగూ విరామమూ లేకుండా సహకరించిన నా శ్రీమతి సరళాదేవికి, శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలితలకు నా కృతజ్నతలు, ఆశీస్సులు. వీరి సహకారం లేనిదే ఈ పుస్తకం వెలుగు చూచేది కాదు. అదే విధంగా, చక్కటి ముఖచిత్రాన్ని చేసి ఇచ్చిన శిష్యుడు ప్రవీణ్ కు మళ్ళీ ఇంకోమారు ఆశీస్సులు.

ఈ పుస్తకానికి ముందుమాట వ్రాసిన శ్రీ ఆనంద్ కుమార్ (డెట్రాయిట్) గారికి నా ధన్యవాదములు. నన్నెంతగానో అభిమానించేవారిలో ఆయన  మొదటి వరుసలో ఉంటారు.

అదే విధంగా, ఈ  పుస్తకం రూపుదిద్దుకోవడంలో ప్రోత్సాహకులైన ఇండియా, అమెరికా శిష్యులకు, పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ సభ్యులకందరికీ నా ఆశీస్సులు.

ఈ పుస్తకం గూగుల్ బుక్స్ నుంచి ఇక్కడ లభిస్తుంది.

మా మిగతా పుస్తకాలను ఆదరించినట్లే దీనిని కూడా ఆదరిస్తారు కదూ !