“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

3, జూన్ 2021, గురువారం

న్యూజిలాండ్ వరదలు - బుధశుక్రుల ప్రభావం

గత నాలుగు రోజులనుంచీ న్యూజిలాండ్ వరదలతో సతమతమౌతోంది. మే 29 న మొదలైన ఈ వరదలు నేటికీ కొనసాగుతున్నాయి. 30 వ తేదీ ఆదివారం నాడు దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఊళ్లకు ఊళ్లు జలమయమయ్యాయి, కరెంట్ లేదు, ఆహారపు కొరత, రవాణా కష్టాలు, కమ్యూనికేషన్ కష్టాలు కొనసాగుతున్నాయి. వందలాది ఇళ్లు వరదలలో మునిగాయి. మరొపక్కన వేలాదిమంది నీళ్లలో చిక్కుకున్నారు. ఇలాంటి వరదలను గత నూరేళ్లలో చూడలేదని అక్కడివారు అంటున్నారు. ముఖ్యంగా కెంటర్భరీ, సౌత్ ఐలాండ్ లు తీవ్రవర్షాలకు, వరదలకు గురౌతున్నాయి.
న్యూజిలాండ్లో గతంలో జరిగిన ప్రమాదాలు, వరదలు, ప్రకృతిపరమైన భీభత్సాలను జ్యోతిశ్శాస్త్రపు కోణం నుంచి, నేను పరిశీలించాను.  నా ఉద్దేశ్యం ప్రకారం న్యూజిలాండ్ లగ్నం, మీనం లేదా కన్య అవ్వాలి. ఈ రెంటిలో మీనమే ఎక్కువగా కావచ్చు. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి -  అది జలతత్వ రాశి. రెండు - చేపలను సూచిస్తుంది. ఈ రెండూ న్యూజిలాండ్ను గట్టిగా సూచిస్తున్నాయి. మ్యాప్ లో చూస్తే, న్యూజిలాండ్ దేశం, సముద్రంలో ఉన్న చేపలాగా ఉంటుంది. ఒకటే తేడా ఏంటంటే - మీనరాశిలో రెండు చేపలుంటాయి, న్యూజిలాండ్ ఒకటే ముక్కగా ఉంటుంది.నా ఉద్దేశ్యంలో, మీనరాశి అనేక ద్వీపాల సమూహాన్ని, ఉదాహరణకు జపాన్ లాంటి దేశాన్ని సూచిస్తుందిగాని, ఒకటే ముక్కగా ఉన్న దీవిని సూచించదు.  పైగా, మేషమంటే బ్రిటన్ గనుక, ఇప్పటికీ దాని అదుపులోనే ఉన్న న్యూజిలాండ్ మీనం కావడం తార్కికంగా ఉంటుంది.కానీ న్యూజిలాండ్ లో జరిగిన జరుగుతున్న అనేక భూకంపాలు గమనిస్తే, కన్యకు ఎక్కువ మార్కులు పడతాయి. ప్రస్తుతానికి మీనమే అనుకుని చూద్దాం.

29-5-2021 న బుధుడు శుక్రుడు మిధునరాశిలో ఒకే సున్నాడిగ్రీ మీదున్నారు. ఈ యుతి చతుర్దంలో జరిగింది. మీనం జలతత్వరాశి, మిధునం వాయుతత్వం గనుక, ఈ యోగం వల్ల భయంకర వర్షాలు, వరదలు ఆ దేశంలో వచ్చే సూచనుంది. అదీగాక, ఇంకొక జలగ్రహమైన చంద్రుడు ధనుస్సునుంచి వీరిని చూస్తున్నాడు. మూడు రోజుల క్రితమే 26 న చంద్రగ్రహణం వచ్చింది. కనుక చతుర్దంలో బుధశుక్రులు రాశిసంధిలోను దశమంలో చంద్రుడు ఉంటూ మీనానికి అర్గలదోషాన్ని పట్టిస్తున్నారు. కనుక జలం ఆ దేశాన్ని ముంచెత్తింది. 

చతుర్ధమంటే ఇల్లు, వసతులు, సుఖాలని  మనకు తెలుసు. ఆ దేశంలో ఇవన్నీ 29 నుంచి దారుణంగా దెబ్బతింటున్నాయి. న్యూజిలాండ్ ప్రజలు నరకాన్ని చవిచూస్తున్నారు.

పోనీ, లగ్నం కన్య అనుకున్నా కూడా, బుధశుక్రుల దృష్టి చతుర్దంలోని చంద్రునిమీద పడుతుంది. మళ్ళీ అదే ఫలితం వస్తుంది. అర్గలదోషం రెంటికీ సమానమే.

బుధశుక్రులు చండనాడి అయిన మృగశిరలో ఉన్నారు. చంద్రుడున్న పూర్వాషాఢ నక్షత్రం కూడా అదే. సంస్కృతంలో 'చండ' అంటే మహాతీవ్రమైన, కోపగ్రస్తమైన అని అర్ధం. జలగ్రహాలైన శుక్ర, బుధ, చంద్రులను చండనాడిని కలుపుకుని చూడండి. భయంకరమైన వర్షాలు, వరదలు గోచరించాయా లేదా? అదే మరి జ్యోతిశ్శాస్త్రమంటే ! ఇదర్ధం కావాలంటే కొంచెం బుర్రుండాలి మరి !

గర్గమహర్షి, వరాహమిహిరుడు మొదలైన ప్రాచీనులు చెప్పిన ప్రకారం వరదలు తుఫాన్లలో బుధశుక్రుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యచంద్రులెలాగూ ఉంటారు. బీవీ రామన్ గారు కూడా తన రీసెర్చిలో ఇదే గమనించారు, చెప్పారు కూడా !

కనుక జ్యోతిష్యం మళ్ళీ నిజమైంది !