“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

16, ఫిబ్రవరి 2021, మంగళవారం

ఎదవలైరిగారె ఎర్రిజనులు

ఆ || స్వీటుషాపు దెఱచె చిలువూరు దొరసామి  

కల్లుపాక దెఱచె కదిరిసామి

బూదిషాపు దెఱచె బుక్కపట్నపు సామి

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || కులపు షాపు దీసె కుందుర్తి యాసామి

నిమ్మరసము బోసె నీటుసామి

చించి పాతరేసె  చిత్తూరు బూసామి

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ ||  పెద్దప్లాను వేసె పెనుగొండ పిలసామి 

పాత బొంతదెచ్చె  నేతసామి

గడ్డివాము బేర్చె గడ్డాల యాసామి

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || గురువు షాపు దెఱచె గుంటూరు గురుసామి

మందుమాకులిచ్చె మాయసామి 

చీపుషాపు బెట్టె సిగరెట్ల తమసామి 

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || నమ్మబలుకు కొట్టు నామాల యాసామి

ముంచుకొచ్చె ననియె ముంపుసామి

ముద్రసామి లేచి ముచ్చట్లు జెప్పెరా

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || మంత్రషాపు దెఱచె మతిలేని మోసామి

మాయబుక్కువ్రాసె మాపసామి

ఆడసామి జేరి యల్లర్లు జేయించె

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || గోషసామి జేరి గోండ్రించె బీచిలో

తెల్లసామి వచ్చి  కొల్లగొట్టె

నిత్యస్వాములొచ్చి  నీల్గెరా గోరిలో

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || తోకచుక్కసామి తొంభైలకే బెంచె

రాత్రికొండసామి రాజ్యమేలె

మదనపల్లిసామి మంటలే బుట్టించె

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || కలరు బొమ్మ దీసె ఖర్జూర గురిసామి

ఉత్తబిత్త సామి ఉట్టికెక్కె

ముక్కుపుడకసామి ముంచేసె యందర్ని 

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || తాచుపాముసామి తందానలేయించె

నాపరాళ్లసామి నమ్మబలికె

మాటసామి వాగి మతులుబోగొట్టెరా

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || అమ్మసామి లేచి యప్పడమ్ములు బంచె

బొమ్మసాములొచ్చి  బొందబెట్రి

పిల్లసామి జూచి పిచ్చిదై పోయెరా

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || మంటసామి జేరి మర్యాద హెచ్చించె

తంటసామి లేచి తంతునేర్పె

తురకసామి వచ్చి  తుక్కు రేగ్గొట్టెరా 

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || గోచిసామి యొకడు గొప్పగా వెలిగించె 

తిరుగుబోతు సామి తిన్నగుండె

పుర్రెసామి జూచి పుట్టి ముంచేసెరా 

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || ఆడగొంతుసామి అడ్డవేషములేసె 

పేడిమేను సామి పెనుగులాడె 

నెత్తిచెయ్యి సామి బొత్తిగా ముంచెరా

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || నాపసాని సామి నయముగా వంచించె 

మంత్రసాని సామి మతులు గూల్చె

మత్తుమందు సామి చిత్తుగా బడవేసె 

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || పూనకముల సామి పుణ్యాలు వల్లించె 

నిలువుగుడ్ల సామి నిప్పుబెట్టె 

ఒంచుసామి వచ్చి  ఒళ్ళంత దంచెరా

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || ఊకసామి లేచి ఆకులన్ దినిపించె

పోకసామి జూచి కేకబెట్టె

నూనెసామి దూరి నూకలన్ దొర్లించె

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || కండసామి జేరి కల్లోలమే రేపె 

బండసామి దూకి బలిసిపోయె 

ముండమోపి సామి మూన్నాళ్ల జచ్చెరా 

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || బట్టలేని సామి బందర్ల బడిపోయె 

గౌనుసామి లేచి గౌగిలించె 

అడ్డపంచె సామి అన్యాయమై పోయె 

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || రంగుగుడ్డ సామి రాజ్యాలనేలించె

పొంగు మనసు సామి కొంగుబట్టె 

భంగు బీల్చు సామి బాదుషా తానాయె 

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || బిడ్డసామి యొకడు అడ్డంబుగా నీల్గె

దుడ్డుసామి దుక్కి దున్నసాగె

దున్నపోతు సామి దుర్భాష లాడెరా 

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || విర్రవీగుసామి విన్యాసముల్ జేసె 

కుర్రసామి యొకడు కూరవండె 

బొర్రసామి లేచి భోంచేయ బట్టెరా

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || చచ్చుసామి లేచి సాంబారు పొంగించె 

పుచ్చుసామి దూరి పులుసుబోసె

ముచ్చుసామి వచ్చి ముప్పొద్దు మ్రింగెరా

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || ఆకుపచ్చసామి  అతిచేష్టలే జేసె

చీలమండసామి చిందులేసె

నల్లమందు సామి నాట్యాలు సాగించె 

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ ||  జీహుజూరు సామి జిల్లేబి వండించె 

సొంతమేను సామి వంతపాడె 

బజ్జిసామి జూడ భజనసంఘము బెట్టె 

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || మందుసామి త్రాగి మత్తులో బడిపోయె 

విందుసామి బలిసి విర్రవీగె

చిందుసామి ఇంట చిచ్చు రేకెత్తెరా

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ |\ డప్పుసామి డోలు ఢమడమా మ్రోగించె 

పప్పుసామి కేమొ తుప్పు వదిలె 

లిప్పుసామి పెద్ద లీలల్లు తాజేసె 

ఎదవలైరి గారెఎర్రిజనులు


ఆ || త్రాగుబోతుసామి తందానలాడించె

మాయముండసామి మంటబెట్టె 

చాపకిందసామి చల్లంగ బారెరా

ఎదవలైరి గారెఎర్రిజనులు


ఆ || గొర్రెపిల్లసామి గొంగళ్ళు గప్పేసె 

కుర్రపిల్లసామి కుట్రజేసె

మర్రిచెట్టుసామి మతిపోయి జచ్చెరా

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || బొట్టుబెట్టు సామి చెట్టునే మింగేసె 

కట్టుగట్టు సామి  కల్లుదాగె

పొట్టనింపు సామి పొద్దెక్కి లేచెరా 

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || పూటకూళ్ళ సామి పుత్తూరు గొనివేసె 

నాటుకళ్ళ సామి నాట్యమాడె

వేటగాళ్ల సామి వేయిళ్ళు గట్టెరా 

ఎదవలైరి గారె ఎర్రిజనులు


ఆ || ప్రేమపిచ్చిసామి ప్రేతభూముల దేలె

నోరునొచ్చుసామి నోట్లుబంచె

కొండముచ్చుసామి కోయంచు గూసెరా

ఎదవలైరి గారె ఎర్రిజనులు