“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

1, ఫిబ్రవరి 2021, సోమవారం

సాయమ్మ - చాయమ్మ (పైత్యానికి పరాకాష్ఠ)

మొన్నొకాయన నాకొక ఫోటో వాట్సాప్ లో పంపించి Let Sai amma bless us all ! అని ఒక బ్లెస్సింగ్ పంపించాడు. ఇలాంటి గొర్రెలు దొరికితే ఆడుకోకుండా మనం అస్సలు ఊరుకోము కదా ! ఆయనకు ఈ మెసేజి పంపాను. 

'ఎవరీ వికృతాకారం?'

'ఛీ అలా అనకండి సార్. ఈమె సాయమ్మ. ఈ అవతారం అంటే నాకు చాలా ఇష్టం, భక్తీను. మీరూ ఈ అవతారాన్ని నమ్మండి. మీకంతా మంచి జరుగుతుంది'.

'ఈమె భర్త ఎవరు?' అడిగాను.

'ఏంటండీ ఆ మాటలు?' అన్నాడు.

'మరా వేషమేంటి? దీనికెన్ని సార్లు చేస్తావ్ పూజ?' అడిగాను.

'రెండుసార్లు ఉదయం సాయంత్రం' అన్నాడు.

'ఒద్దులే. నాకిష్టమైన అవతారం వేరే ఉంది' అన్నాను.

'ఏంటది? నాకా అవతారం ఫొటో పంపించండి ప్లీజ్. నేనూ ఫాలో అవుతాను'.

అతనికీ ఫోటో పంపించాను.

'దీనిపేరు చాయమ్మ. నేనూ రెండుసార్లు వీరిని సేవిస్తాను. ఉదయం, సాయంత్రం. ఆకలైతే మధ్యలో కూడా సేవిస్తాను'

అతనికి భలే కోపమొచ్చింది.

'ఏంటి సార్ ! మీరేదో పెద్దవారని, భక్తిపరులని, ఆధ్యాత్మికం మీద రాస్తారని మంచిగా సాయమ్మ ఫోటో పంపిస్తే ఆటలాడుతున్నారు? సాయమ్మతో జోకులేయకండి.  మంచిది కాదు' అంటూ రెలిజియస్ బ్లాక్ మెయిల్ చేయబోయాడు.

'ఛాయమ్మ కూడా చాలా మంచిది. తిన్నదేదైనా సరే వెంటనే అరిగిపోతుంది. నిన్ను ఉల్లాసంగా ఉంచుతుంది. నమ్ము ! మారు ! ఫలితం నువ్వే చూడు !' అన్నా.

'మీరెన్నో పుస్తకాలు రాశారని గొప్ప భక్తిపరులనుకున్నా ఇలా నాస్తికులనుకోలేదు' అంటూ నాలో గిల్టీ ఫీలింగ్ ఇంజెక్ట్ చేద్దామని ట్రై చేశాడు ప్రబుద్ధుడు.

వీడికి విశ్వరూప సందర్శనయోగం కలిగించక తప్పదనుకున్నాను.

'ఆపరా నీ సోది వేస్ట్ ఫెలో ! మీ తాతనుకుంటా వినాయకుడికి ఆడవేషం వేసి వినాయకి అన్నాడు. మీ  నాన్నేమో నరసింహస్వామికి ఆడవేషం వేసి నారసింహి అన్నాడు. నువ్వు మోడరన్ చింపాంజీవి కదా అందుకే ఏకంగా సాయిబాబాకు జడవేసి పూలుపెట్టి చీర కట్టావ్ ! ఏమన్నావ్ ! సాయమ్మతో జోకులేయొద్దా? ఎవడ్రా జోకులేసింది? అలాంటి వేషం ఆయనకేసి ఆయన్నొక కార్టూన్ చేసింది నువ్వు. నేనేమీ సాయమ్మతో జోకులేయలేదు స్టెప్పులేయలేదు.  అంత ఖర్మ నాకేం లేదు. అలాంటి పనులు చెయ్యాలంటే చాలామంది అమ్మలు క్యూలో ఉన్నారవతల. ఇంకోసారి ఇలాంటి జోకులు నాతో వేశావంటే గుంటూరుజిల్లా నాటుభాష నానుంచి వింటావ్ ఖబడ్దార్!' అని గట్టి వార్నింగిచ్చా.

అంతటితో అతన్ని బ్లాక్ చేసి పారేశా.

నా బ్లాగ్ చూసి, నేనేదో చాదస్తపు జగన్నాధం అనుకుని, కొంతమంది అర్భకులు ఇలాంటి మెసేజిలు నాకు పంపిస్తూ ఉంటారు. ముఖం వాచేలా చీవాట్లు పెట్టించుకుంటూ ఉంటారు. 

కొన్ని విషయాలలో నాకు మహమ్మద్ ప్రవక్త అంటే చాలా ఇష్టం. ఆయన దూరదృష్టి చాలా గొప్పది. మతమనేది ఎన్ని రకాలుగా దిగజారే అవకాశముందో  ఆయన అప్పుడే కనిపెట్టి ఇస్లాం మతంలో చాలా గట్టివైన రూల్స్  పెట్టేశాడు. దేవుడికి ఏదో పేరు ఉండాలిగనుక అల్లా అని పేరు పెట్టినప్పటికీ, 'దేవుడు' అంటూ పుంలింగపరంగా పిలుస్తున్నప్పటికీ ఆయనకు రూపమనేది ఉండకూడదని చెప్పాడు. అంతేకాదు, ముస్లిం అనేవాడు ఏ విధమైన ఫోటోనీ చిత్రపటాన్ని తన ఇంట్లో గోడలకు తగిలించకూడదని, ఏ ఆకారాన్ని పూజించకూడదని ఖచ్చితమైన రూల్ పెట్టాడు. ఈ రూల్స్ నాకు చాలా నచ్చుతాయి.  ఎందుకంటే, కొంత వదులిచ్చామంటే, ఈ చౌకబారు మనుషులు చివరకు ఏ స్థాయికి దిగజారుతారో ఆయన అప్పుడే కనిపెట్టాడు. అందుకే అంత ఖచ్చితమైన రూల్స్ ఇస్లాం లో ఉన్నాయి.

అఫ్కోర్స్ ! దిగజారుడుతనమనేది మనుషుల్లో ఇన్ బిల్ట్ క్వాలిటీ కాబట్టి వాళ్లు పిడివాదులుగా, టెర్రరిస్టులుగా దిగజారారు. అంటే, ఆ ఎక్స్ ట్రీమ్ కి వెళ్లారు. హిందువులేమో రకరకాలైన కొత్తకొత్త దేవతలను సృష్టించుకుంటూ ఇలా దిగజారారు. వీళ్ళు ఇంకో ఎక్స్ ట్రీమ్ కి వెళ్లారు.

ఒకరకంగా చెప్పాలంటే, అన్ని విధాలైన భ్రష్టత్వాలూ హిందువులలోనే ఉన్నాయి. దానికి కారణం - పోన్లే పాపమని వారికివ్వబడిన అతిచనువు. దేవుడిని ఎలాగైనా పూజించండి తప్పులేదు అనిన చనువు వారికివ్వబడింది. దానిని మిస్యూజ్ చేస్తూ ఈ విధంగా నానారకాలైన దేవీదేవతలను, ఆయుధాలను, వాహనాలను ఎవడిష్టం వచ్చినట్లు వాడు సృష్టించి పారేసి, వారికి అష్టోత్తరాలు, సహస్రనామాలు రాసేసి, పూజావిధానాలు సృష్టించేసి నానా భ్రష్టు పట్టిస్తున్నారు. చనువిస్తే నెత్తికెక్కుతారన్న సామెత ఉండనే ఉందికదా !

వేదాలను, ఉపనిషత్తులను, వాటిలోని చిక్కటి సంస్కృతభాషను అర్ధం చేసుకునే తాహతు లేని సామాన్యుడికి వెసులుబాటు నివ్వడం కోసం వ్యాసమహర్షి పురాణాలు వ్రాసి, దేవతారాధన ఏర్పాటు చేస్తే, ఆ సామాన్యుడి బుద్ది వెర్రితలలేసి కొత్తకొత్త దేవుళ్ళని సృష్టించి, గుళ్లుకట్టి వ్యాపారంగా దానిని మార్చాడు.

మొన్న గుంటూరు నుంచి నర్సరావుపేట మీదుగా త్రిపురాంతకం వెళ్లాం ఏదో పనుండి. గుంటూరువైపునుండి నర్సరావుపేటలోకి వెళుతున్నప్పుడు నర్సరావుపేట మొదట్లోనే ఒక సాయిబాబా గుడి ఉంటుంది. దానికి ద్వారపాలకులుగా ఆంజనేయస్వామి, గరుత్మంతులను పెట్టారు ఆ గుడిని కట్టించిన ప్రబుద్ధులు. వీళ్ళిద్దరూ రోడ్డుమీద వాచ్ మెన్ లాగా ఉన్నారు గర్భగుడిలో సాయిబాబా విగ్రహం ఉంది. ఎంత దగుల్బాజీ పనో అది ! చూచి చాలా బాధేసింది. వారికి తెలియకపోతే ఈ స్వామీజీలైనా చెప్పరా అది తప్పని ! ఏంటో ఈ ఖర్మ !

హిందూమతపు ఈ వెర్రితలలు చూచి వేదమంత్రాలను దర్శించిన మహర్షులు ఎంత బాధపడుతున్నారో కాస్తైనా ఆలోచించండిరా ప్రబుద్ధుల్లారా. మీమీ పైత్యప్రకోపాలను తగ్గించుకుని సరియైన హిందూమతం ఏమిటో అర్ధం చేసుకోండిరా. ఈ భరతభూమిలో పుట్టి, మీరు చెడిపోయినదేగాక, గొప్పదైన మీ మతాన్ని కూడా ఈ విధంగా భ్రష్టుపట్టించకండిరా !

ఛీ! ఛీ! ఎప్పుడు బుద్ధొస్తుందో ఇలాంటి వాళ్లకి?