“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

24, డిసెంబర్ 2020, గురువారం

సంవత్సరాంత వేడుకలు

పొద్దున్న రవి మళ్ళీ ఫోన్ చేశాడు. తను రోజూ ఫోన్ చేస్తూనే ఉంటాడు. కానీ నేను ఎత్తను. ఆ టైంకి  నేనేదో పనిలో ఉంటాను.  ఎన్నిసార్లు ఎత్తకపోయినా పాపం విసుక్కోకుండా రోజూ ఒకే టైం కి చేస్తూనే ఉంటాడు.

అలాగే పొద్దున్న కూడా ఫోన్ మ్రోగింది. అప్పుడుకూడా ఏదో పనిలో ఉన్నాను. ఇక బాగోదని ఫోనెత్తాను. మనలని తలచుకునేవాళ్ళని మనం నిర్లక్ష్యం చెయ్యకూడదనేది మొదట్నుంచీ నా సిద్ధాంతం. అందులోనూ మా స్నేహం ఇప్పటిది కాదు. దీనికి ముప్పై ఏళ్ల చరిత్ర ఉంది.

'ఇవాళకూడా అమితాబ్ బచ్చన్ని వినేసి ఫోన్ పెట్టెయ్యాలేమో అనుకున్నా. మొత్తమ్మీద ఫోనెత్తావు' అన్నాడు కించిత్ నిష్టూరంగా.

'లేదులే. రోజూ నిన్ను డిజప్పాయింట్ చేయడం నాకూ బాలేదు. అందుకే కాసేపు' అన్నా.

అలా కాసేపు  అవీఇవీ మాట్లాడాక ' సంవత్సరాంత  వేడుకలు ఏం ప్లాను చేస్తున్నావ్ ?' అడిగాడు.

'ఏ ప్లానూ లేకుండా ఎలా ఉండాలా అని ప్లాన్ చేస్తున్నా' అన్నా. 

'అంటే?' అన్నాడు

'ఎవరికీ తెలీని, ఎవరూ రాలేని ప్రాంతానికి వెళదామనుకుంటున్నా' అన్నా.

'ఏదైనా ఐలెండ్ కి పోతున్నావా?' అన్నాడు.

'అవును. నా మనసే ఆ ఐలెండ్' అన్నా.

నవ్వేసి 'మన జోసెఫ్ పాండిచ్చేరి వెళుతున్నాడు జనవరి ఫస్ట్ దాకా రాడు.' అన్నాడు.

'అదేంటి? అరబిందో తీర్ధం పుచ్చుకున్నాడా?' అడిగా.    

'కాదు. అక్కడేదో పురాతన చర్చిలున్నాయిట. వాటిలో ప్రార్ధనలు చేసి ఆ బీచుల్లో తిరిగి వస్తానని పేమిలీతో కలసి వెళుతున్నాడు' అన్నాడు.

'మంచిదే. పొమ్మను. అక్కడే చర్చిలో శేషజీవితం గడపమని చెప్పు. వెనక్కి రావద్దను' అన్నా.

'చర్చిలో ఒక్కరోజే. మిగతా రోజులు బీచ్లో తిరుగుతాట్ట. అంటే ప్లెజర్ ట్రిప్పన్నమాట' అన్నాడు.

'ఓహో. ప్రభుత్వం సొమ్ముతో ప్రభువు దర్శనం చేసుకుని చివర్లో ప్రజలవద్దకు పాలన అన్నమాట' అన్నా.

'అలాటిందేలే. ఎవడి టేస్ట్ వాడిది. నువ్వూ వెళ్లచ్చుగా. ఎప్పుడో ఫిబ్రవరిలో వెళ్ళొచ్చావ్. కావాలంటే చెప్పు మన మూర్తితో చెప్పి ఏర్పాట్లు చేస్తా' అడిగాడు.

'అనుకున్నా. కానీ వద్దన్నాడు' అన్నా.

'ఎవరూ?' అడిగాడు అనుమానంగా.

'ప్రభువు' అన్నా.

'ఛా..' అన్నాడు నవ్వుతూ.

'అవును. మొన్నరాత్రి ఫోన్ చేశాడు. ముందు నువ్వనుకుని ఎత్తలా. తర్వాత చూస్తే ప్రభువు. 'పోయినసారి పాండిచ్చేరి వచ్చి చాలా డిజప్పాయింట్ అయ్యావు. ఈసారి అలా ఎవరితో పడితే వారితో రాకు.' అని తనే చెప్పాడు. సర్లే ఆయనమాట కాదనడం ఎందుకులే అని కాన్సిల్ చేశా ట్రిప్' అన్నా సీరియస్ గా.

'సర్లే నీ గోల నాకర్ధం కాదులే గాని, మన ఇంకో ఫ్రెండ్ ప్రసాద్ చూడు హాయిగా తిరుమల వెళ్లి చక్కగా మూడురోజులు కొండమీద ఉండేలా ప్లాన్ చేసుకుని వెళ్ళాడు. అదన్నా చెయ్యి కనీసం' అన్నాడు కోపంగా.

'అడుసు త్రొక్కనేల కాలు కడుగనేల?' అన్నా.

'అదేంటి/' అన్నాడు.

'పాపాలు చేసినవాడికే దేవుడి అవసరం. నాకు తెలిసి నేనే పాపమూ చెయ్యలేదు. కాబట్టి నాకు ప్రభువూ అవసరం లేదు. ఎవరూ అవసరం లేదు. నేనే అడుసూ  తొక్కలేదు. కాబట్టి కాళ్ళు కడుక్కునే పని లేదు' అన్నా.

'పోనీ డిసెంబర్ 31 రాత్రి మన ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఉంటుంది. అక్కడికైనా రా' అన్నాడు.

'నేన్రాను. ఏముందక్కడ? తాగుడు, వాగుడు, తినుడు, ఎగురుడు అంతేగా. పనికిమాలిన చెత్త ! అదీగాక, అదే సమయంలో నాకోసం చాలామంది ఫ్రెండ్స్ వస్తారు నన్ను కలవడానికి' అన్నా. 

'ఎవరు వాళ్ళు?' అడిగాడు.

'వాళ్లంతా గతించి చాలా కాలమైందిలే. నా బ్లెస్సింగ్స్ కోసం ఆరోజు రాత్రికి వచ్చిపోతారు. నీక్కనిపించరు' అన్నా.

'ఓహో ! వాళ్ళక్కూడా న్యూ ఇయర్ ఉంటుందా?' అడిగాడు.

'ఎందుకుండదు? వాళ్ళు బ్రతికున్నపుడు మనలాంటివాళ్లే కదా ! అందుకే మన అలవాట్లు వాళ్లకూ ఉంటాయి. కావాలంటే నువ్వే మా ఇంటికి రా ఆరోజు రాత్రికి . పరిచయం చేస్తా' అన్నా.

'బాబోయ్ వద్దులే. మా పార్టీలేవో మేం చేసుకుంటాం. ఏదైనా నీ దారి వేరులే. 'అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా' అంతేగా?' అడిగాడు ఈసారి సీరియస్ గా.

ముప్పై ఏళ్ల క్రితం మేము ట్రెయినింగ్ లో రెండేళ్లపాటు కలసి ఉన్నపుడు, నా పరధ్యానపు ఎపిసోడ్స్ ని దగ్గరనుంచి తను చాలాసార్లు గమనించాడు.  అందుకే అలా అడిగాడని నాకర్షమైంది.

'అంతే. చెప్పడం చాలా తేలిక. చెయ్యడం బహు కష్టం' అన్నా.

'అదేంటి' అన్నాడు.

'బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే' అన్నా.

'ఏంటో నీ గోల! సరే ఉంటామరి. ఆ టైంకి కనీసం ఫోన్ చేసి విషెస్ చెప్పచ్ఛా నీకు?' అడిగాడు.

'నీ అదృష్టం ! పరీక్షించుకో. ఆ టైంకి నేనేదో పనిలో ఉన్నాననుకో, వాళ్లలో ఎవరైనా ఫోనెత్తితే ఆ స్వరం విని కంగారుపడకు' అన్నా నవ్వుతూ.

'ఎందుకు పడతాను? ముందే చెప్పి రక్షించావ్ కదా?' అన్నాడు

'అదికాదు. నాతోలాగా వాళ్ళతో కూడా ముచ్చట్లు పెట్టుకున్నావనుకో. ఆ తర్వాత వాళ్ళు మీ ఇంటికి కూడా వస్తే అప్పుడుంటుంది నీకు' అన్నా నవ్వుతూ.

'బాబోయ్ ! అంతపని చెయ్యకు. ఉంటా మరి" అని ఫోన్ పెట్టేశాడు రవి.

నేనూ నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశా.

ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్ ట ! మతిలేకపోతే సరి ! పిచ్చిలోకమూ పిచ్చి పనులూనూ ! తాగడానికి తందనాలాడటానికి ఏదో ఒక సాకు !

మన సెలబ్రేషన్ అలా ఉంటుంది !