“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

1, జనవరి 2019, మంగళవారం

What is life? - 3

Part 1 & Part 2 చదివిన తర్వాత ఒకరు ఇలా అడిగారు.

మీరు చెప్పింది అక్షరసత్యం. కళ్లెదురుగా ఉన్నవాటి విలువను గుర్తించకుండా ఎండమావులవైపు పరుగులు తియ్యడమే జీవితమైపోయింది. కానీ కళ్లెదురుగా ఉన్నది నిజంగా విలువైనది కానప్పుడు దానితో మనం ఎలా సంతృప్తి పడాలి?

దీనికి జవాబు ఒకటే. అది విలువైనది కాదని నీకు అర్ధమైనప్పుడు దాన్ని వదిలెయ్యాలి. ఆ విలువైన దానికోసం వెదకాలి. దొరికేవరకూ వెదకాలి. ఒక్కోసారి అది ఒక జీవితకాలంలో దొరకక పోవచ్చు. కానీ వెదుకుతూనే ఉండాలి. ఎందుకంటే అంతకు మించి వేరే వెసులుబాటు ఏమీ మనకు లేదు గనుక.

లేదా - మీ వెదుకులాటను ఆపి, ఉన్నదానితో సంతృప్తిపడటం నేర్చుకోవాలి. చాలామంది అదే చేస్తూ, సంతృప్తిగా ఉన్నామని భ్రమిస్తూ, అసంతృప్తితో కూడిన జీవితాలను గడుపుతూ ఉంటారు. ఆ అసంతృప్తి పోవడానికి వేరే మార్గాలు వెదుక్కుంటూ ఉంటారు. కానీ అది పోదు. అందుకనే, ఎవరి జీవితాలూ సంతోషంగా ఉండవు.

చేతనైతే, వెదకాలి. లేదా వెదుకులాట ఆపి ఉన్నదానితో ఉండిపోవడం నేర్చుకోవాలి. రెండో చాయిస్ ఎలా ఉంటుంది?

చాలామంది జీవితాలలో ఏమౌతుందంటే, ఉన్నది వదలదు. లేనిదానిమీద కోరిక చావదు. ఈ రెంటి మధ్యన సంఘర్షణ మాత్రం చివరిదాకా ఉండిపోతుంది. ఈ సంఘర్షణను దాటాలంటే కూడా అదే చెయ్యాలి. చేతనైతే ఉన్నదాన్ని వదల్చుకోవాలి. మనం కోరేదాన్ని ధైర్యంగా స్వీకరించాలి - అది దొరికితే. దొరక్కపోతే చేసేదేమీ లేదు. దొరికేవరకూ వెదుకుతూ ఉండటమే.

నిరంతర సంఘర్షణ కావాలా, లేదా, మనం కోరుకుంటున్నదే మనకు కావాలా, లేదా, మన గతి ఇంతేలే అని నోర్మూసుకుని ఊరుకోవాలా అన్నదే అసలైన ప్రశ్న. చాయిస్ మనదే. కానీ దేనికైనా ధైర్యం ముఖ్యం.

ఈ కోరుకునేది వ్యక్తులనైతే, పరిష్కారం చాలా సులువు. ఇష్టం లేనివారిని ఒదిలేసి, ఇష్టపడేవారికి దగ్గర కావడమే పరిష్కారం. ఇది చెప్పినంత తేలిక కాదని నాకు తెలుసు. దీనిలో చాలా మానసికమైన కోణాలూ, ఒత్తిళ్ళూ, ఇతరుల ప్రమేయాలూ, బాధ్యతలూ ఉంటాయనీ నాకు తెలుసు. కానీ లోపలున్న సంఘర్షణను భరించలేనప్పుడు ఏదో ఒక సాహసోపేతమైన పనిని చెయ్యడమే మంచిది. జీవితం చివర్లో రిగ్రెట్ అవడం కంటే మొదట్లోనే అయ్యి, మనక్కావాల్సిన జీవితాన్ని మనం నిర్మించుకోవడమే మంచిది.

ఈ కోరుకునేది ఆకారం లేని విలువలనైతే - ఉదాహరణకు సమాజం అంతా నిజాయితీగా ఉండాలి, క్లీన్ సొసైటీ ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి - ఇలాంటి యుటోపియన్ ఆలోచనలు కొందరికి ఉంటాయి - అలాంటివాటి కోసం మీ ప్రయత్నమైతే, ముందుగా మీ జీవితం అలా ఉండేలా ప్రయత్నం చెయ్యాలి. అంతేగాని మనం మనలాగే ఉంటూ, లోకం మొత్తం మంచిగా మారాలని ఆశిస్తే అది జరగని పని. లోకం ఎప్పటికీ మంచిగా మారదు. మనం మారాలంతే !

చేతనైతే మనం కోరుకుంటున్నదానికోసం ప్రయత్నం చెయ్యడం, లేదా ఉన్నదానితో సంతృప్తిపడి నోర్మూసుకుని ఊరుకోవడం, ఈ రెండూ చేతకాకపోతే, జీవితమంతా సంఘర్షణను భరిస్తూ ఉండటం - ఈ సమస్య మొత్తానికీ పరిష్కారం వీటిల్లోనే ఉంది.

ఇదిగాక ఇంకేం చెయ్యగలం చెప్పండి?