నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

10, జనవరి 2019, గురువారం

దయ్యాలు - భూతాలు

మొన్న మధ్యాన్నం ఒక ఫోనొచ్చింది.

'హలో' అన్నా.

'నేను ఫలానాని మాట్లాడుతున్నా' అన్నాడు అవతల్నించి పెద్దగా అరుస్తూ.

'అబ్బా !  ఫోన్ మేనర్స్ కూడా లేవు వెధవలకి'  అని ఫోన్ని చెవికి దూరంగా పెట్టుకుంటూ, 'చెప్పండి' అన్నాను.

'సిద్ధాంతిగారేగా?' అన్నాడు మళ్ళీ అరుస్తూ.

'ఏం చెప్పాలా?'  అని ఒక్క క్షణం ఆలోచించా. 'సర్లే మనది కూడా ఒక టైపు సిద్ధాంతమేగా?' అనుకొని 'అవును' అన్నా.

'అదేనండి. నిన్న ఫోన్ చేశానుకదా అమెరికా నుంచి? దయ్యాల గురించి మాట్లాడుకున్నాం కదా?' అంది స్వరం.

ఈ మాట్లాడేది మనిషా లేక దయ్యమా అని మాచెడ్డ అనుమానం వచ్చింది నాకు.

ఎందుకైనా మంచిదని 'హలో' అన్నా మళ్ళీ.

'అదేనండి.  నిన్న దయ్యాల గురించి మాట్లాడుకున్నాం కదా ! మర్చిపోయారా?' అన్నాడు.

'అబ్బే ఎలా మర్చిపోతాను? అందులోనూ అమెరికా దయ్యాన్ని? పోనీ, ఇవాళ భూతాల గురించి మాట్లాడుకుందామా?' అడిగాను కూల్ గా.

అతనికి డౌటోచ్చింది.

'మీరు ఫలానా సిద్ధాంతి గారేనా?' అరిచాడు మళ్ళీ.

'కాదు! వాడి ప్రేతాత్మని !  హిహిహి' అన్నా  వికృతంగా నవ్వుతూ.

ఫోన్ టక్కున కట్ అయిపొయింది. కాసేపు చూశా మళ్ళీ ఫోనొస్తుందేమో అని. కానీ అమెరికా దయ్యానికి ధైర్యం చాలలేదులా ఉంది. ఫోన్ రాలేదు.

సిద్ధాంతికి  దయ్యాల ఊసులెంటో నాకైతే అర్ధం కాలేదు. చాలామంది కుహనా జ్యోతిష్కులు ఇలాగే అసలు సబ్జక్ట్ రాక, దయ్యాలని భూతాలని ఏవేవో మాయమాటలు చెప్పి, తాయత్తులు నిమ్మకాయలు కడుతూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు.

నిమ్మకాయలంటే  గుర్తొచ్చింది. ఈ మధ్యనే నా శిష్యురాలు ఒకామె నాకే నిమ్మకాయను మంత్రించి ఇవ్వబోయింది. ఇవ్వాలనుకుంది, ఇచ్చినంత పని చేసింది కూడా !

'నాకెందుకమ్మా ఈ నిమ్మకాయ?' అడిగాను.

'మీ ప్రియశిష్యురాలు మీకు మందు పెట్టింది. చేతబడి కూడా చేసే ఉంటుంది. అందుకే మీకు రక్షణగా ఈ నిమ్మకాయను మంత్రించి ఇస్తున్నాను. ఉంచుకోండి' చెప్పింది.

'ఏం చెయ్యమంటావు దీన్ని?' అడిగాను అనుమానంగా.

'దిండు క్రింద పెట్టుకుని పడుకోండి. తను చేసిన ప్రయోగం రివర్స్ అవుతుంది' అంది.

'నేను దిండు వాడను' అన్నా.

'పోనీ పరుపు కింద పెట్టుకోండి' అంది.

'నేను పరుపు కూడా వాడను. నేలమీద చాపేసుకుని పడుకుంటా' అన్నాను.

'చాపమీద మీ పక్కనే ఉంచుకోండి' అంది పట్టువదలని విక్రమూర్కురాలి లాగా.

'ఇది రెమెడీనా?' అడిగాను.

'అవును' అంది.

నా జన్మ ధన్యమైనంత ఫీల్ కలిగింది.

'నేను ఇంకొక రెమెడీ చెప్తాను చేస్తావా?'  అడిగాను.

'చెప్పండి' అంది.

'ఇదే నిమ్మకాయను కోసి, రసం పిండి, బాగా గ్లూకోజ్ కలిపి షర్బత్ చేసుకుని త్రాగు. నీకు వెంటనే మంచి జరుగుతుంది.' అన్నాను.

ఆమె కోపంగా చూచి వెళ్ళిపోయింది. కానీ మర్నాడే రెండు అగర్బత్తి కట్టలను తెచ్చి నాముందు పెట్టి 'ఇది మీకు గిఫ్ట్ ఇవ్వమని చెట్టుమీద ఉన్న భేతాళుడు నాకు చెప్పాడు' అంది.

'ఈ  ధూపాన్ని నువ్వూ నీ భేతాళుడూ కలిసి వేసుకోండి. ఇద్దరికీ ఒకేసారి వస్తుంది - మోక్షం ' అన్నాను.

ఆమె మళ్ళీ కోపంగా వెళ్ళిపోయింది.

ఈ విధంగా లోకుల అజ్ఞానం కొంత, అమాయకత్వం కొంత, పిచ్చి కొంత, ఇవి చాలవన్నట్టు దొంగ జ్యోతిష్కుల దోపిడీ కొంత, మంత్రగాళ్ళ మాయలు  కొంత - వెరసి దయ్యాలూ భూతాలూ మన మధ్యనే చక్కగా బ్రతికేస్తున్నాయి.

అయితే దయ్యాలు భూతాలూ లేవా? అంటే ఉన్నాయనే నేనంటాను. అవి ఉన్నాయని నాకు తెలుసు. అయితే, వాటి జోలికి మనం పోకూడదు. మనజోలికి అవి రావు. వాటి ఖర్మను అనుభవిస్తూ వాటి ప్రపంచంలో అవి ఉంటాయి. మనం అనవసరంగా వాటిని కదిలించకూడదు. వాటి ప్రపంచంలోకి మనం అడుగు పెట్టకూడదు.

సాధనామార్గంలో నడిచేవారికి  అప్పుడప్పుడూ అవి కనిపిస్తూ ఉంటాయి. హెల్ప్ కోరుతూ ఉంటాయి. రోడ్డుమీద మనం పోతూ ఉంటే ఎవరో బిచ్చగాడు ఎదురై సాయం చెయ్యమని కోరినట్లుగా ఇది ఉంటుంది. మనకు చేతనైతే సాయం చేస్తాం. లేదంటే ఊరుకుంటాం. అంతేగాని కొంతమంది క్షుద్ర మంత్రగాళ్ళు చేసినట్లు, వాటిని బంధించి ఏవేవో పనులు చేయించుకోవాలని చూడకూడదు. అది చాలా నీచమైన కర్మను సృష్టిస్తుంది. దాని ఫలితాలు కూడా మంచిగా  ఏమీ ఉండవు.

జననమరణ చక్రంలోకి సహజంగా వెళ్ళిపోకుండా ఇక్కడిక్కడే ఊగులాడుతుండే జీవులే ఈ దయ్యాలు భూతాలు. వాటి ఖర్మ చాలక అవి అలా ఊగులాడుతూ ఉంటాయి. మనకు ఇప్పటికే ఉన్న మన ఖర్మ చాలక, ఇంకా వాటి ఖర్మను కూడా ఎక్కడ నెత్తిన వేసుకుంటాం? తెలివైనవాడు ఎన్నటికీ అలాంటి పనిని చెయ్యకూడదు.కానీ తెలివితక్కువ జ్యోతిష్కులూ, మంత్రగాళ్ళూ అలా చెయ్యబోయి చేతులు కాల్చుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో దెబ్బతింటూ ఉంటారు. వారిని నమ్మిన అమాయకులు మోసపోతూ ఉంటారు.

మనకున్న సమస్యలు చాలకనా వాటి సమస్యలు కూడా మనం తగిలించుకోడానికి?