“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

21, నవంబర్ 2018, బుధవారం

నాందేడ్ యాత్ర 9 - (గురుగోవింద్ సింగ్ ఎలా మరణించాడు?)

'ఏం నేను అడగకపోతే నా మనసులో ఏముందో నీకు తెలీదా?' అడిగాను.

'ఆహా ! తెలిస్తే మాత్రం, నువ్వు అడగకుండా మేమెందుకు చెబుతాం? నీ నోటివెంట ప్రశ్న వస్తే వినాలని మాకుంటుంది. ప్రశ్నను నువ్వెలా అడుగుతావో గమనిస్తాం' అంది.

నేనూ సూటిగా పాయింట్ కొస్తూ - 'గురుగోవింద్ సింగ్ ఎలా మరణించాడు? ఎక్కడ మరణించాడు?' అనడిగాను.

ఫకాల్న నవ్వింది వటయక్షిణి.

'అందరూనేమో నిధులకు, లంకెబిందెలకు దారి చెప్పమని, నడమంత్రపు సిరి వచ్చే మార్గం చెప్పమని, ఇంకా ఏవేవో అలాంటి కోరికలు కోరుతుంటే, నువ్వేంటి చరిత్రలో ఎప్పుడో జరిగిన విషయాలు త్రవ్వి చెప్పమని అడుగుతున్నావు?' అంది.

'నీకు తెలుసు కదా నేనదో టైపని? అందుకే అలా అడుగుతున్నాను'

'అవునా? గురుగోవింద్ సింగ్ ఎలా చనిపోయాడో ఇప్పుడు నువ్వు తెలుసుకుని ఎచీవ్ చేసేది ఏముంది?' అడిగింది తను.

'అబ్బో ! ఇంగ్లీషు పదాలు మాట్లాడుతున్నావే? మీకు ఇంగ్లీషు కూడా వస్తుందా?' అడిగాను నేను.

'మాకే భాషా రాదు. కానీ అన్ని భాషలూ వస్తాయి' అంది.

'అదెలా సాధ్యం?' తెలిసినా తెలీనట్లే అడిగాను.

'నీకు తెలిసి కూడా మళ్ళీ నాచేత ఎందుకు చెప్పించడం?' అంది తను.

తన మాటనే తనకు వప్పజెబుతూ, 'నాకు తెలిసినా నువ్వెలా చెబుతావో వినడం నాకిష్టం' అన్నాను.

మళ్ళీ నవ్వింది యక్షిణి.

'చతురుడవే. కర్ణపిశాచి చెబితే ఏమో అనుకున్నాను. నిజమేనన్న మాట' అంది నవ్వుతూ.

'అది సర్లే. మీకు ఇంగ్లీషు ఎలా వచ్చిందో చెప్పు ముందు' అడిగాను నేనూ నవ్వుతూ.

'మీ భూమ్మీద భాషలు ఏవీ మాకు రావు. మేము మీ ఆలోచనలతో ట్యూన్ అవుతాం అంతే, మీరు ఆలోచించాలంటే ఏదో ఒక భాష అవసరంకదా. భాష సహాయంతోనే మీరు ఆలోచించడం గాని, మాట్లాడటం గాని చేస్తారు. ఆ ప్రాసెస్ తో మేము కనెక్ట్ అవుతాం. జవాబు చెబుతాం. అందుకే మీ భాషలోనే జవాబు చెప్పినట్లు మీకనిపిస్తుంది. నిజానికి నేనేమీ మాట్లాడటం లేదు. జస్ట్ భావతరంగాలను నీకు ప్రసారం చేస్తున్నాను. కానీ నేను నీ ఆలోచనలతో ట్యూన్ అయి ఉండటంతో, నా భావాలు నీ భాషలోకే ట్రాన్స్ లేట్ కాబడి నీకు వినిపిస్తున్నాయి. లేదా వినిపించినట్లు నువ్వు ఫీలవుతున్నావు. ఇదంతా నీకు తెలుసనీ నాకు తెలుసు. కావాలని నాతో చెప్పిస్తున్నావనీ తెలుసు.' అంది తను.

నవ్వాను నేను.

'అవునూ నువ్వు ఉండేది ఎక్కడ?' అడిగాను తమాషాగా.

నేను తమాషాగా అడిగినా తను మాత్రం యమా సీరియస్ గా ఒకవైపు చూపిస్తూ 'అదిగో అక్కడ' అంది.

అటు చూచిన నాకు చీకట్లో జడలు విరబోసుకున్నట్లు ఊడలతో ఒక మర్రిచెట్టు కనిపించింది.

'అదే నా నివాసస్థానం.' అంది యక్షిణి.

నేనింకేమీ రెట్టించలేదు. యక్షిణిలు చెట్లమీద ఉంటారని నాకు తెలుసు. వటయక్షిణి నివాసం మర్రిచెట్టనీ అందుకే ఆమెకా పేరు వచ్చిందనీ నాకు తెలుసు.

'గురుగోవింద్ సింగ్ సంగతి చెప్పు' అన్నాను.

'ఆయన ఇక్కడ చనిపోలేదు. పంజాబ్ లోనే చనిపోయాడు. డిల్లీసుల్తాన్ పంపించిన ఇద్దరు ఆఫ్ఘన్ హంతకులూ ఆయన్ను కత్తులతో పొడిచినది నిజమే. డిల్లీ సుల్తాన్ బహదూర్ షా ను గద్దెనెక్కించింది గురుగోవింద్ సింగే. గురుసహాయం లేకుండా ఉంటే అతను సింహాసనం ఎక్కేవాడే కాదు. కానీ గురువుకు అతడు నమ్మించి ద్రోహం చేశాడు.

హిందూస్తాన్ ను బహదూర్ షా ధర్మంగా పరిపాలిస్తాడని గురుగోవింద్ సింగ్ అనుకున్నాడు. సుల్తాన్ కూడా గద్దెనెక్కేదాకా మంచిగా నటించాడు. కానీ తన సైన్యాదిపతులైన ముస్లిముల చెప్పుడు మాటలు విని, గురుగోవింద్ సింగ్ ఎప్పటికైనా తనకు అడ్డేననీ, అతన్ని అంతం చెయ్యాలని ప్లానేశాడు సుల్తాన్. అందుకే మంచిగా ఉంటున్నట్లు నటిస్తూనే గురువును హత్య చేయించాలని కుట్ర చేశాడు. దానికోసం ఇద్దరు పఠాన్ హంతకులను ఆఫ్ఘనిస్తాన్ నుంచి రప్పించాడు. వాళ్ళిద్దరూ నాందేడ్ లొ ఉన్న గురువు దగ్గరకు వచ్చారు. మంచిగా వినయంగా నటిస్తూ ఆయనతోనే ఉన్నారు. ఒకరోజున గురువు తన డేరాలో నిద్రిస్తూ ఉండగా, హటాత్తుగా ఎటాక్ చేసి ఆయన్ను కత్తులతో పొడిచారు. గురువు పక్కనే తల్వార్ ఎప్పుడూ ఉంటుంది. యుద్ధవిద్యలలో ఆయన నిపుణుడు. మెలకువ వచ్చిన ఆయన వెంటనే తన పక్కన ఉన్న తల్వార్ దూసి ఒక హంతకుడి తలను అక్కడే నరికేశాడు. కానీ అప్పటికే ఆయన గుండె క్రిందుగా బలమైన కత్తిపోటు తిన్నాడు. ఈ గోలా అరుపులూ విని అక్కడకు వచ్చిన శిష్యులు ఆ రెండోవాడిని పట్టుకుని నరికేశారు. ఇదీ జరిగింది' అన్నది యక్షిణి.

'ఇక్కడిదాకా నాకూ తెలుసు. ఆ తర్వాత ఏమైందో చెప్పు' అడిగాను.

'ఆ తర్వాత ఏమైందో కూడా నీకు తెలుసు. ధ్యానంలో నువ్వు చూచావు. అయినా చెబుతా విను. గురువు గాయాలు తగ్గడానికి డ్రెస్సింగ్ చెయ్యమని తన పర్సనల్ డాక్టర్ అయిన ఒక ఇంగ్లీష్ సర్జన్ ను నాందేడ్ కు పంపించాడు సుల్తాన్ బహదూర్ షా. అతను గురువుకైన గాయాలకు డ్రెస్సింగ్ చేశాడు. అప్పుడే గురుగోవింద్ సింగ్ ఆలోచనలో పడ్డాడు.

'ఒకవైపు తన శిష్యులలో కూడా కొన్ని విభేదాలు వస్తున్నాయి. వారిలో గ్రూపు తగాదాలు తలెత్తుతున్నాయి. ఇంకోవైపు సుల్తాన్ తో నిరంతర విరోధం. ప్రతిరోజూ ముస్లిములతో గొడవలే. ఏరోజున ఏవైపు నుంచి ప్రమాదం ఎలా ముంచుకొస్తుందో తెలీదు. ఈ దేశంకోసం, ప్రజలకోసం, తన కుటుంబం అంతా సర్వనాశనం అయిపొయింది. కానీ ప్రజలు స్వార్ధపరులు. వాళ్ళలో చైతన్యం ఎప్పటికీ రాదు. ధర్మవర్తనం ఎప్పటికీ రాదు. తమలాంటి గురువులు ఎంతగా మొత్తుకుని చెప్పినా వారిలో స్వార్ధమూ, కపటమూ రోజురోజుకూ పెరుగుతున్నదే గాని తగ్గడం లేదు.

హిందూరాజులు కూడా ముస్లిం సుల్తాన్లతో చేతులు కలిపి ఒకరి గుట్లుమట్లు ఇంకొకరు సుల్తాన్లకు చేరవేస్తున్నారు. వాళ్లకు తొత్తులైపోతున్నారు. పైగా, తనతో ఈ గురుపరంపర పదిమంది గురువులదాకా వచ్చింది. ఈ పదిమందిలో ఆరుగురు హింసాత్మకంగానే చనిపోయారు. తన పిల్లలు కూడా సర్ హింద్ సుల్తాన్ చేతిలో చంపబడ్డారు. తనకు వారసులు లేరు. తన తరువాత ఇంకొక గురువు ఉంటే, అతన్నీ ఈ ముస్లిం సుల్తానులు వెంటాడి చంపడం ఖాయం. తరతరాలుగా ఈ రక్తం ఎప్పటికీ ఇలా చిందుతూనే ఉంటుంది. కనుక ఈ 'గురుచరిత్ర' కు ఇక చరమగీతం పాడాలని ఆయన నిశ్చయించుకున్నాడు. దానికోసం ఒక ప్లాన్ వేశాడు.

ఒకరోజున అల్లెత్రాడు బిగించి బాణాన్ని సంధిస్తున్నట్లుగా ఆయన నటించాడు. అప్పుడు తన ఛాతీకి ఇంగ్లీష్ సర్జన్ వేసిన కుట్లు పిగిలిపోయినట్లు నటించాడు. అందులోనుంచి కొంత రక్తం కారింది కూడా. శిష్యులు గుడ్డలతో కట్లు కట్టారు. కానీ రక్తం ఆగలేదు. రెండు రోజులు అలా బాధపడినట్లు నటించి, మూడోరోజున చుట్టూ మరుగు ఉన్న ఒక పెద్ద డేరాను కట్టమని, దాని మధ్యలో తనకు చితి పేర్చమనీ ఆయన చెప్పాడు. తన తర్వాత మానవగురువులు ఉండరనీ, 'గురు గ్రంధ సాహిబ్' మాత్రమే మీకు గురువనీ ఆయన ఆదేశించాడు.

ఆ తర్వాత తన శిష్యుల నందరినీ డేరాకు వీపు పెట్టి నిలబడమనీ, తెల్ల వారే వరకూ తిరిగి చూడద్దనీ గట్టిగా ఆదేశించిన ఆయన, తన గుర్రం 'నీల' మీద ఎక్కి, చితి పేర్చిన డేరాలోకి వెళ్లి దానిని అంటించి, అందులో తన పిడిబాకును వేసి, చితి బాగా అంటుకునే వరకూ ఉండి, ఆ తర్వాత డేరా వెనుక నున్న ద్వారం గుండా నార్త్ ఇండియా వైపు సాగిపోయాడు. శిష్యులు తెల్లవారేవరకూ అలాగే కూర్చున్నారు. తెల్లవారి చితి పూర్తిగా ఆరిపోయాక వాళ్ళు వెళ్లి చూస్తే ఆరిపోయిన చితిలో గురువు యొక్క పిడిబాకు ఒక్కటే వారికి దొరికింది. ఆయన ఎముకలూ, గుర్రం ఎముకలూ ఏవీ దొరకలేదు. తన గుర్రాన్ని ఎక్కి గురువు స్వర్గానికి వెళ్లిపోయాడని వాళ్ళు అనుకున్నారు. అప్పటికి ఆయన నార్త్ వైపు అనేక మైళ్ళు వెళ్ళిపోయాడు.

అలా వెళ్లివెళ్లి పంజాబ్ చేరుకొని మారుపేరుతో అక్కడ చాలాకాలం నివసించిన ఆయన పంజాబ్ లోనే మామూలుగా అందరూ మరణించేటట్లే మరణించాడు. ఈ విధంగా పదితరాలుగా సాగిన ఈ గురుచరిత్రకు ఆయన ఒక చక్కని ముగింపు నిచ్చాడు. సిక్కులు మాత్రం ఆయన చెప్పినట్లుగా, గురుగ్రంద్ సాహిబ్ నే వారి గురువుగా భావిస్తూ వస్తున్నారు. ఇదీ అసలు జరిగిన కధ' అంది యక్షిణి.

'ఇదంతా నేను వ్రాస్తే జనం నమ్ముతారా?' అడిగాను.

'ఏమో నాకేం తెలుసు? అయినా ఒకరిని నమ్మించవలసిన ఖర్మ నీకెందుకు? వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా, ఈ పదిమంది గురువుల తర్వాత ఇంకా నలుగురు గురువులున్నారని నమ్మే ఒక శాఖ సిక్కులలో ఉంది. వాళ్ళు కూడా గురుగోవింద్ సింగ్ నాందేడ్ లొ చనిపోలేదని నమ్ముతున్నారు. అయితే, వీళ్ళు సిక్కులలో మైనారిటీలు.' అంది యక్షిణి.

'అయితే నాకు ధ్యానంలో కనిపించినది వాస్తవమేనన్నమాట' అనుకున్నాను.

'అవును. అది నిజమే. నీ గురువులు వారి జీవితంలో ఒక్కసారి కూడా అబద్దం చెప్పలేదు. అలాంటి సత్యమూర్తులు వారు. వాళ్ళు నిన్నెప్పుడూ రక్షిస్తూనే ఉన్నారు. నిన్ను సత్యమార్గంలో నడిపిస్తూనే ఉన్నారు. వాళ్ళు చూపించినవి సత్యాలే.' అంది తను.

'అబద్దాలే నిజాలనుకుంటూ లోకం ఎంత మాయలో బ్రతుకుతున్నది?' అన్నాను నేను.

ఈ మాట అంటుండగానే, వెనుక నుంచి - 'సాబ్. ఆప్ యహా అంధేరే మే అకేలే బైట్ కే కిస్సే బాత్ కర్తే హై?' అన్న మా పాయింట్స్ మ్యాన్ స్వరం వినిపించింది.

వెనక్కు తిరిగి చూచాను.

పాయింట్స్ మ్యాన్ మనోజ్ తన చేతిలో ఫ్లాస్క్, టీ కప్పుతో కనిపించాడు.

నేను వాటివైపు చూడటం గమనించి - 'ఆప్ యహా ఆనా దేఖా హమ్ నే. డేడ్ ఘంటా హోగయా. ఇసీలియే మై చాయ్ లాయా ఆప్కే లియే' అంటూ చాయ్ కప్పులో పోసి అందించాడు.

నా ఎదురుగానే కూచుని ఉన్న యక్షిణి అతనికి కనిపించడం లేదని నాకర్ధమైంది. మౌనంగా టీ కప్పు తీసుకుని సిప్ చేస్తూ ' టీక్ హై. తుం జావో. మై తోడీ దేర్ మె నీచే ఆజావూంగా' అన్నాను సీరియస్ గా.

అనుమానంగా నావైపు చూస్తూ అతను పరిగెత్తినట్లుగా క్రిందకు వెళ్ళిపోయాడు.

అతనలా పరిగెత్తడం చూస్తున్న యక్షిణి మళ్ళీ కిసుక్కున నవ్వింది.

ఆమెకు ఆఫర్ చెయ్యకుండా నేనొక్కడినే టీ త్రాగుతున్నానే అని నాకు అనిపించింది. ఆమె నా ఆలోచనకు హిందీలో జవాబు చెప్పింది.

'పీవో. కోయీ బాత్ నహీ. హమ్ లోగ్ చాయ్ నహీ పీతే. తుం జాన్తే హో హమ్కో క్యా చాహియే. వో దేదో. బస్. మై చల్ రహా హు' అంటూ ఆమె మంచులా గాలిలో కరిగిపోయింది.

నవ్వుకుంటూ చాయ్ తాగేసి టైం చూచాను. దాదాపు రెండౌతోంది. అంటే దాదాపు గంటన్నర సేపు ఇక్కడ కూచుని ఉన్నానన్నమాట !

లేచి ఒళ్ళు విరుచుకున్నాను. మెల్లిగా టెర్రేస్ చివరకు వచ్చి దూరంగా కనిపిస్తున్న మర్రిచెట్టు వైపు చూచాను. చీకట్లో అది ఒక దయ్యం లాగే కనిపిస్తోంది. యక్షిణి అక్కడకు చేరుకుందన్న మాట. నవ్వొచ్చింది !

మెల్లిగా క్రిందకు దిగి వచ్చాను.

నేనొచ్చేసరికి, క్రింద స్టేషన్ మాష్టారూ, పాయింట్స్ మ్యానూ, ఇంకో ఇద్దరూ ఏదో భయంభయంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. నన్ను చూడగానే టక్కున మాటలు ఆపేశారు.

'మనోజ్. ఔర్ ఏక్ కప్ చాయ్ దేదో' అన్నా కుర్చీలో కూచుంటూ. మనోజ్ లోపలకి పరిగెత్తి చాయ్ తెచ్చి ఇచ్చాడు. తాపీగా దాన్ని సేవించి, నా పనిలో పడ్డాను. తెల్లవారేదాకా వాళ్ళు నాతో ఏమీ మాట్లాడలేదు. నన్ను అదోరకంగా భయంభయంగా చూస్తుండటం మాత్రం అప్పుడప్పుడూ గమనించాను. నేనూ వాళ్ళతో ఏమీ రెట్టించలేదు.

చూస్తుండగానే తెల్లవారింది. హోటల్ కి తీసికెళ్ళే కార్ వచ్చింది. అందులో కూచుని హోటల్ కు బయల్దేరాను. కారు పోతున్న దారిలోనే మర్రిచెట్టు కనిపిస్తోంది దూరంగా.

దాన్ని దాటేవరకూ దానినే చూస్తూ ఉండిపోయిన నేను సీటు వెనక్కు ఆనుకుని కళ్ళు మూసుకున్నాను.

కారు హోటల్ వైపు దూసుకు పోతోంది.

(ఇంకా ఉంది)