“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

21, జులై 2018, శనివారం

NRI+ABCDxH1B=0

సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్న సామెత మనకు తెలుసు. కాలక్రమంలో కొత్త సామెతలు పుట్టుకోస్తాయనీ తెలుసు. అలా వచ్చిందే ఈ సామెత. అదేంటంటే - "ఇండియా కష్టాలు ఇండియావి అమెరికా కష్టాలు అమెరికావి." పై ఈక్వేషన్ కూడా అలా వచ్చిందే !

అదేంటీ? అమెరికాలో కూడా కష్టాలుంటాయా? - అని అనుమానం వస్తోందా? అయితే చదవండి.

రాజారాం దంపతులు ఇరవై ఐదేళ్ళ క్రితం అమెరికాకు వలస వెళ్ళారు. అప్పటినుంచీ అక్కడే ఉంటున్నారు. బాగా సంపాదించుకున్నారు. అక్కడే స్థిరపడ్డారు. కాలక్రమంలో వాళ్ళకు ఇద్దరు పిల్లలు పుట్టారు. మొదట్లో వాళ్లకు అర్ధం కాలేదు కానీ అప్పటినుంచే వాళ్లకు కష్టాలు మొదలయ్యాయి.

మొదట్లో ప్లాన్ ప్రకారం, ఒక పదేళ్లో ఇరవై ఏళ్ళో అక్కడ పనిచేసి డబ్బులు సంపాదించి ఇండియా వచ్చేద్దామనేది వీళ్ళ ప్లాన్. కానీ ఏళ్ళు గడిచే కొద్దీ అది సాధ్యమయ్యేది కాదని వాళ్లకు అర్ధమైపోయింది.

రాజారాం దంపతులకు ఇండియా పద్ధతులంటే ఇష్టం. మన కుటుంబ వ్యవస్థ అన్నా, విలువలతో కూడిన జీవితమన్నా వాళ్లకు ఇష్టం. కానీ డబ్బుకోసం అమెరికా వెళ్లి అక్కడే ఉండవలసి వచ్చింది. కానీ మన పద్ధతులు సాధ్యమైనంతవరకూ పాటించాలనే చూస్తారు. అక్కడున్నా, మన ముఖ్యమైన పండుగలన్నీ చేసుకుంటారు. ఇండియన్ అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్నారు. అందరూ కలసి అక్కడ గుడి ఒకటి కట్టించారు. అందులో కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. మన తెలుగుదనాన్ని మర్చిపోకుండా ఉన్నారు. ప్రతి ఏడాదీ ఒక స్వామీజీని ఆహ్వానించి ఏవో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంతా బాగానే ఉంది.

అప్పుడప్పుడూ చిన్నపిల్లల్ని తీసుకుని ఇండియా వెళ్లి వస్తూ ఉండేవారు. ఆ చిన్నపిల్లల ఇంగ్లీషు యాసా అదీ చూచి అమ్మమ్మా తాతయ్యా అందరూ మురిసిపోతూ ఉండేవాళ్ళు. కానీ ఆ నీళ్ళూ అవీ పడక పిల్లలు సిక్ అయ్యేవాళ్ళు. అయినా సరే, మాతృభూమి మీద మమకారం చావక అలా ఏడాది కొకసారి వెళ్లి వస్తూ ఉండేవాళ్ళు.

కానీ, పిల్లలు పెరిగే కొద్దీ సమస్యలు ఎక్కువౌతూ వచ్చాయి. తల్లిదండ్రులేమో NRIలు. పిల్లలేమో ABCD లు, అంటే అందరికీ తెలుసు కదా America born confused desi అన్నమాట. వయసు పెరిగే కొద్దీ పిల్లలు అయోమయంలో పడిపోవడం మొదలైంది.

ఇంట్లోనేమో తెలుగు మాట్లాడాలి. స్కూల్లోనూ, బయటా అమెరికన్ యాసతో ఇంగ్లీషు మాట్లాడాలి. అదొక నరకం. ఇంట్లో మన కట్టూ బొట్టూ పాటించాలి. బయటేమో అమెరికన్ పద్ధతులు పాటించాలి. పండుగలు వచ్చినపుడు అబ్బాయిలేమో పంచెలు కట్టుకుని అమ్మయిలేమో చీరలు కట్టుకుని కనిపించాలి. అన్నమయ్య కీర్తనలూ త్యాగరాజ కీర్తనలూ కష్టపడి బట్టీపట్టి పాటలు పాడాలి. స్కూల్లోనేమో ఇంగ్లీష్ గీతాలు ఆలపించాలి. బయటేమో అమెరికన్ డ్రస్సులు వేసుకుని వాళ్ళలా మాట్లాడుతూ వాళ్ళతో కలసి బ్రతకాలి. ప్రతిక్షణం ఈ సాంస్కృతిక సంఘర్షణ ఇంకో నరకం. ఇది చాలదన్నట్లు అడుగడుగునా సొసైటీలో కనిపించే రేసిజం ని తట్టుకోవాలి. అది ఇంకొక నరకం !

మొదట్లో అందరూ ఏడాదికొకసారి ఇండియా వెళ్ళేవాళ్ళు. అది మెల్లిగా రెండేళ్ళకొకసారిగా మారింది. ఆ తర్వాత అయిదేళ్ళ కొకసారి అయింది. పిల్లలు పెద్దయ్యే కొద్దీ ఇండియా వెళ్ళినా మునుపటి ప్రేమలు ఉండటం లేదు. పిల్లలు కూడా బంధువులతో కలవడం లేదు. దూరదూరంగా రిజర్వుడుగా ఉంటున్నారు. ఇదంతా ఎందుకులే అని మెల్లిగా ఇండియా వెళ్ళడం మానేశారు రాజారాం దంపతులు.

మొదట్లో అమ్మమ్మా తాతయ్యలతో వీడియో కాల్స్ లో బాగానే మాట్లాడిన పిల్లలు పెద్దయ్యేకొద్దీ మాటలు తగ్గించారు. కొన్నేళ్ళ తర్వాత ఇండియా వీడియో కాల్ అంటేనే దగ్గరకు రాకుండా ఎవాయిడ్ చెయ్యడం మొదలు పెట్టారు. ఈ లోపల ఇండియాలోని అమ్మమ్మా తాతయ్యా చనిపోయారు. మిగతా బంధువులతో సంబంధాలు కాలక్రమేణా తగ్గిపోయాయి.

ఇదిలా ఉండగా, పిల్లలకు పెళ్ళీడొచ్చింది. ఈ తల్లిదండ్రులకు అసలైన సమస్యలు అప్పుడర్ధమయ్యాయి.

ఇండియా సంబంధాలు ససేమిరా చేసుకోమని పిల్లలిద్దరూ చెప్పేశారు. ఇంకా గట్టిగా మాట్లాడితే, "అసలు మీరు మాకు సంబంధాలు చూడటం ఏమిటి? Arranged marriages ఏమిటి? నాన్సెన్స్?" అంటూ తల్లిదండ్రులనిద్దరినీ అడివి మనుషులలాగా చూడటం మొదలు పెట్టారు. అంతేగాక, ఇండియా వాళ్ళను అస్సలు చేసుకోమని చెప్పేశారు. ఇక మిగిలింది H1B సంబంధాలేగనుక అవే చూడటం మొదలు పెట్టారు పేరెంట్స్.

ఆ క్రమంలో ఇద్దరూ తమతమ అమెరికన్ ఫ్రెండ్స్ తో డేటింగ్ లో ఉన్నారని వీళ్ళకు తెలిసి బిత్తరపోయారు. అయినా సరే ఆ విషయం బయటకు చెప్పకుండా, మేట్రీమోనీ సైట్లలో రిజిస్టర్ అయ్యి, "మా పిల్లలిద్దరూ ఆణిముత్యాలు. అమెరికాలో పెరిగినా అంతా భారతీయ సంస్కృతిలోనే ఉన్నారు. ఇంట్లో అయితే పూజ చెయ్యందే మంచినీళ్ళు ముట్టరు. పార్టీలూ, త్రాగుడూ ఇలాంటివి అస్సలు పడవు." అని అబద్దాలను దాంట్లో వ్రాసుకుని సంతృప్తి పడుతూ సంబంధాలు చూస్తున్నారు.

వీళ్ళు సంతృప్తి పడినా, మేట్రీమోనీ  చూసేవాళ్ళు ఇదంతా నమ్మరు కదా? పిల్లల ఫేస్ బుక్ పేజీలు  వాళ్ళు చెక్ చేసేవాళ్ళు. మేట్రిమోనీలొ పేరెంట్స్ రాసినదానికీ, పిల్లల ఫేస్ బుక్ పేజీలలో వాళ్ళు పెడుతున్న ఫోటోలకీ, వ్రాసే వ్రాతలకీ ఎక్కడా సంబంధం ఉండటం లేదు. మెట్రిమోనీలో నేమో చక్కగా పట్టుచీరలో ఉండేది అమ్మాయి. ఫేస్ బుక్ పేజీలోనేమో చెడ్డీతో కన్పించేది. అబ్బాయేమో, అటొక తెల్లదాన్నీ ఇటొక నల్లదాన్నీ వేసుకుని ఇకిలిస్తూ ఫోటోలు పెట్టేవాడు. ముగ్గురి చేతుల్లోనూ గ్లాసులుండేవి. ఇలాంటి ఫోటోలు చూస్తే ఎవరు ముందుకొస్తారు? అందుకని ఎంతకూ వీళ్ళకు సంబంధాలు వచ్చేవి కావు.

ఎందుకని ఇలా సంబంధాలు రావడం లేదు? అని అనుమానం వచ్చి, రీసెర్చి చేసి, అసలు విషయం కనిపెట్టిన పేరెంట్స్, తమ స్ట్రాటజీ మార్చి, అమ్మాయి కూచిపూడి డ్రస్సులో డాన్సు చేస్తున్నట్లు, గుళ్ళో భక్తిగా ప్రదక్షిణలు చేస్తున్నట్లు, ఏదో గుళ్ళో కీర్తనలు పాడుతున్నట్లు పొటోలు ఆ సైట్ లొ పెట్టారు. ఆ ట్రిక్ సక్సెస్ అయ్యి ఒకటీ అరా H1B సంబంధాలు వచ్చాయి. అవీ ఇవీ మాట్లాడుకున్నాక, అమ్మాయీ అబ్బాయీ వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు.

అయిదు నిముషాల కాన్ఫరెన్స్ కే అమ్మాయి పనుందని లాగ్ ఆఫ్ అయిపోయింది.

"ఏంటే? అలా వచ్చేశావ్? మంచి సంబంధం. అబ్బాయి మైక్రోసాఫ్ట్ లొ మంచి పొజిషన్లొ ఉన్నాడు. అలా చేస్తే వాళ్ళు నొచ్చుకోరా?" అని భయం భయంగానే అడిగింది తల్లి.

"ఏంటమ్మా నాన్సెన్స్? డర్టీ ఇండియన్ మెంటాలిటీ నువ్వూనూ? మైక్రో సాఫ్ట్ అయితే ఏంటి? తొక్క? వాడూ వాడి రంగూ చూశావా? కోతిలా ఉన్నాడు. వాడి కంటే మా బ్లాక్ ఫ్రెండ్ ఎడ్వర్డ్ నయం. అలాంటి నల్లటివాడిని చేసుకుంటే మా ఫ్రెండ్స్ అంతా నన్నెలా ఎగతాళి చేస్తారో తెలుసా నీకు? నేను చేసుకోను." అని ఖరాఖండిగా చెప్పేసింది అమ్మాయి.

"మరెవరు కావాలే నీకు? అయినా, ఇండియా వాళ్ళకు తెల్లతోలు ఎలా వస్తుందే?" అడిగింది తల్లి.

"ఎలా వస్తుందో నాకెందుకు? అయినా నాకిప్పుడే పెళ్ళేంటి? నాకెంత వయసు? జస్ట్ ట్వెంటీ నైనే కదా? మా ఫ్రెండ్స్ ఎవరూ థర్టీ ఫోర్ కి ముందు పెళ్ళే చేసుకోలేదు. అసలు ఈ సంబంధాలు చెడగొట్టాలనే నా ఫేస్ బుక్ లో అలాంటి చెడ్డీ ఫోటోలు పెడుతున్నా" అంటూ అసలు రహస్యాన్ని మెల్లిగా చెప్పింది అమ్మాయి.

" అప్పటిదాకా ఏం చేస్తావే?" అడిగింది బిత్తరపోయిన పాత చింతకాయ.

"ఏదో ఒకటి చేస్తాలే. మేం మీ తరం కాదు. మీరంటే బావిలో కప్పల్లా బ్రతికారు. మేమలా కాదు. ప్రపంచం ఎంతో ఉంది. ఎంతో తిరగాలి. ఎన్నో చూడాలి. లైఫ్ ఎంజాయి చెయ్యాలి. అవన్నీ అయ్యాక పెళ్లి. నీలాగా ఇరవైకే పెళ్లి చేసుకుని ముప్పైకే ముసలమ్మనై అఘోరించమంటావా? నాన్సెన్స్. నేనీ డర్టీ ఇండియన్ సంబంధాలు చేసుకోను. చేసుకుంటే గీసుకుంటే ఇక్కడ అమెరికన్స్ నే చేసుకుంటా. అదంతా తర్వాత. ముందు నేను లాస్ వెగాస్ ట్రిప్ వెళ్లి రావాలి. మా ఫ్రెండ్స్ వెకేషన్ కి వెళుతున్నారు. సరదాగా ఎంజాయ్ చేసి వస్తాం." అని ఖచ్చితంగా చెప్పేసింది వెల్లుల్లి ఆవకాయ.

తల్లి నిర్ఘాంతపోయింది.

అప్పటినించీ ఎన్ని సంబంధాలను తెచ్చినా ఏదో ఒక వంక చెప్పి అన్నింటినీ "నో" అనేస్తోంది అమ్మాయి. ఇక అబ్బాయికైతే సంబంధాలే రావడం లేదు. అమెరికాలో పుట్టి పెరిగిన వాడికి, అందులోనూ ఫేస్ బుక్ లొ అలాంటి ఫోటోలు పెట్టేవాడికి, ఇండియానుంచి చూస్తూ చూస్తూ ఎవరు పిల్లనిస్తారు?

చూసీ చూసీ తల్లికి భయం మొదలైంది.

"ఏంటండి మాట్లాడరు? అలా బెల్లం కొట్టిన రాయిలా కూచుంటే ఎలాగండి? పిల్లలు ఇలా తయారౌతుంటే?" అడిగింది ఏడుపు గొంతుతో.

విస్కీ సిప్ చేస్తూ టీవీలో ఏదో ప్రోగ్రాం చూస్తున్న రాజారాం, తాపీ ధర్మారావులా మెల్లిగా తలెత్తి - " ఏంటే నువ్వూ నీ గోలా? వాళ్ళేం చిన్నపిల్లలు కారు. వాళ్ళ లైఫ్ వాళ్లకు తెలుసు. వాళ్లకన్ని జాగ్రత్తలూ తెలుసు. మనమేమీ నేర్పక్కర్లేదు. వాళ్ళకిష్ట మొచ్చిన వాళ్ళను చేసుకుంటార్లే. నువ్వేమీ కంగారు పడకు." అన్నాడు.

"ఏంటండి వాళ్లకు తెలిసేది? వీళ్ళిద్దరూ తెల్లవాళ్ళతో డేటింగ్ చేస్తున్నారు.  తెలుసా మీకు? మొన్నొకరోజు మన సుపుత్రుడు ఒక నల్లమ్మాయిని ఏకంగా ఇంటికే తీసుకొచ్చాడు. అదేంట్రా అంటే ఫ్రెండ్ అంటాడు. అమ్మాయికైతే కొన్ని డ్రగ్స్ కూడా అలవాటయ్యాయని నాకు అనుమానంగా ఉంది. మొన్న దాని హ్యాండ్ బ్యాగ్ లో చూశాను. దాంట్లో కనిపించినవి చూస్తే నా గుండాగి పోయింది." అంది ఏడుస్తూ.

"చూడు కమలా ! మనం వేరు మన పిల్లలు వేరు. మనమైతే హైస్కూలూ కాలేజీ ఇండియాలోనే చదువుకున్నాం. ఆ తర్వాత ఇక్కడకు వచ్చాం. ఇక్కడకు వచ్చినా మనం ఇండియన్స్ మే. ఎందుకంటే, మన చిన్నతనంలో పునాదులు అలా పడ్డాయి. వీళ్ళలా కాదు. వీళ్ళు అమెరికన్స్. అమెరికన్స్ గానే పుట్టారు, అలాగే పెరిగారు. వీళ్ళ పద్ధతులు ఇలాగే ఉంటాయి. ఇంకో తరం తర్వాత వీళ్ళు ఇక్కడ సొసైటీలో కలసిపోతారు. మా పూర్వీకులు ఇండియాలో ఉండేవారట అని చెప్పుకుంటారు. అంతే ! మూడో తరం మారాక, ఎవరు ఎవర్ని చేసుకుంటారో, మన రక్తం ఏ జాతిరక్తంతో కలసి ఎలా మారుతుందో ఎవరికీ తెలీదు. మిక్స్డ్  బ్రీడ్ గా మారిపోతారు. దీనికి సిద్ధమైతేనే మనం ఇక్కడికి రావాలి. ఇది రియాలిటీ" అన్నాడు సీరియస్ గా.

"ఒద్దండి. మనమిక్కడ ఉండొద్దు. ఇండియాకి వెళ్లిపోదాం. పదండి. ఇప్పటిదాకా సంపాదించింది మనకు చాలు. డబ్బుకోసం జీవితాలు నాశనం చేసుకోలేం కదా?" అంది కమల వెక్కుతూ.

"ఇప్పుడు కొత్తగా నాశనం చేసుకునేది ఏమీ లేదు. జరగాల్సిందంతా ఎప్పుడో జరిగిపోయింది. అయినా నువ్వింతగా అడుగుతున్నావ్ గనుక చెప్తా. ఒకసారి ఇదేమాట పిల్లలతో చెప్పి చూడు. ఏమంటారో తెలుస్తుంది" అన్నాడు రాజారాం.

"ఇండియాకు వెళ్లిపోదాం" అన్న తల్లిమాట విని ఒక పిచ్చిదాన్ని చూసినట్లు చూశారిద్దరూ.

'ఏంటి మమ్మీ నీ గోల? ఆ డర్టీ కంట్రీలో ఏం చెయ్యాలి మేము? ఆ రిజర్వేషన్ వ్యవస్థలో, ఆ కరప్ట్ సొసైటీలో, ఆ మురికిలో, ఆ పొల్యూషన్ లో, కల్చర్ లెస్ ఇడియట్స్ మధ్యన,  మేం కూడా మీలా జీవచ్చవాలలా బ్రతకాలా? అదొక బ్రతుకా అసలు? పొద్దున్నే లేచి స్నానం చేసి గుడికెళ్తే సరిపోయిందా? కల్చర్ ఉండొద్దూ? క్లాస్ ఉండొద్దూ? అదెక్కడుంది వాళ్లకు? చిన్న చిన్న ఇళ్ళల్లో, ఆ దుమ్ములో, ఏ ఫెసిలిటీస్ లేకుండా, కుక్కల్లా పందుల్లా బ్రతుకుతున్నారు. నువ్వు పోరుతుంటే నీ గోల పడలేక పోయినేడాది మూన్నెల్లు అమ్మమ్మా వాళ్ళింట్లో ఉండొచ్చా కదా? ఆ మూడు నెలలూ నరకంలా ఉంది నాకు. ఛీ ఛీ ! మేం ఇండియాకు రాము. మీరు పోతే పొండి. మేమిద్దరమూ సిటిజెన్స్ ఇక్కడ. మా బ్రతుకు మేం బ్రతుకుతాంగాని ఆ డర్టీ కంట్రీకి మేం రాము." అని ఖచ్చితంగా చెప్పేసింది అమ్మాయి.

"నువ్వేమంటావురా?" అన్న తల్లివంక అసహ్యంగా చూశాడు కొడుకు.

"చూడు మమ్మీ. చెల్లి చాలా సున్నితంగా చెప్పింది. నేను చెప్తే మీరు తట్టుకోలేరు. ఆ డర్టీ కంట్రీకి రావలసిన ఖర్మ మాకేంటి? చెల్లి మాటే నా మాట కూడా. కాదూ కూడదని నువ్వూ డాడీ ఇండియాకి వెళ్ళిపోతే పొండి. అక్కడ ఏ ఓల్దేజి హోమ్ లో ఉన్నారో చెబితే ఏ రెండేళ్ళకో మూడేళ్ళకో వీలైతే వచ్చి చూస్తాం అంతే." అన్నాడు వాడు.

"మరి నీ పెళ్లి సంగతేంట్రా?" అడిగింది తల్లి.

"మమ్మీ. మీరిక మారరు. మీ ఇండియన్ మూలాలు పోవు. మీరింతే ! జీవితంలో పెళ్ళొక్కటే ముఖ్యం మీకు. కానీ మాకలా కాదు. అసలు పెళ్ళెందుకు? ఏం? పెళ్లి చేసుకోకుండా ఒక ఆడా మగా కలసి బ్రతక్కూడదా? అలా చెయ్యకూడదని ఎక్కడైనా రాసుందా ఏంటి? నాన్సెన్స్ !" అన్నాడు.

"దేవుడా? ఏంటి మాకీ ఖర్మ?" అని తలబాదుకుంది కమల.

"ఛీ ఛీ ! అందుకే ఇంటికి రావాలంటేనే నాకు చీదరగా ఉంది. మీరూ మీ గోలా ?మీ చావు మీరు చావండి. నాకు హోటల్లో పార్టీకి టైమౌతోంది. వస్తా! " అంటూ కారేసుకుని తుర్రుమన్నాడు అబ్బాయి.

అంతలో వచ్చిన ఫోన్లో మాట్లాడుతూ, తల్లివైపు విసుగ్గా చూస్తూ, ఏమీ జరగనట్లుగా తన రూమ్ లోకి వెళ్ళిపోయింది కూతురు. మొగుడి వైపు చూస్తే, ఆయన విస్కీ తాగుతూ టీవీలో లీనమై ప్రపంచం పట్టనట్లుగా ఉన్నాడు.

ఏం చెయ్యాలో తోచక కూలబడిపోయింది కమల !