“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

14, నవంబర్ 2016, సోమవారం

స్వామి యదునాధానందతో సంభాషణ - 5 (Create your own life)

స్వామీజీ తన మాటలను కొనసాగించాడు.

మన జీవితం మనిష్టం వచ్చినట్లు నడవాలి గాని దానిష్టం వచ్చినట్లు మనం నడవకూడదు.నీ జీవితాన్ని నువ్వు సాధించాలి. చాలామంది అనుకుంటారు.నేను మంచి ఉద్యోగం సాధించాలి.మంచి వ్యాపారం చెయ్యాలి.ఎక్కువ డబ్బు సాధించాలి. ఇలా ఎన్నో అనుకుంటారు. ఇవొక్కటి చేస్తే సరిపోదు.ఇవన్నీ చేసినా నీ జీవితంలో ఇంకా చాలా వెలుతులు ఉంటూనే ఉంటాయి.అవన్నీ పూడిపోయి నీ జీవితం పూర్తిగా ఆనందమయంగా ఉండాలంటే నువ్వు నీ జీవితాన్నే సాధించాలి.నీ జీవితాన్నే నువ్వు జయించాలి.అంటే ముందుగా నీ మనస్సును నువ్వు జయించాలి. అదే జీవితంలో అతి ముఖ్యమైన పని.

'చంద్రపాల్ కధ మీకు చెబుతాను.' అంటూ ఆయన చెప్పసాగాడు.

ఆయనలా చెబుతుంటే - చిన్నప్పుడు చందమామ కధల్లో చదివిన - 'నీకు మార్గాయాసం రాకుండా ఉంటానికి ఫలానా కధ చెబుతాను విను' అంటూ బేతాళుడు విక్రమార్కుడికి చెప్పిన కధల సీన్ గుర్తొచ్చి లోలోపల చాలా నవ్వొచ్చింది.అలా నవ్వు రావడానికి ఇంకో కారణం కూడా ఉంది.

నేను రెండేళ్ళ క్రితం చెన్నై రామకృష్ణా మిషన్ బాయిస్ హాస్టల్ లో ఈయన్ను కలిశాను.అప్పుడు మా 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ - USA" ప్రెసిడెంట్ అయిన ఆనంద్ కూడా నాతో ఉన్నారు. మాకిద్దరికీ స్వామీజీ ఈ కధను అప్పుడే వినిపించారు. నాకది గుర్తుంది.ఈ బోధకులతో ఇదే చిన్న చిక్కు.ఒకే సబ్జెక్ట్ చాలా మందికి వారు చెబుతూ ఉంటారు.ఆ క్రమంలో ఎవరికి ఎప్పుడు చెప్పారో మర్చిపోతారు.మళ్ళీ మళ్ళీ వారికే చెబుతూ ఉంటారు.

'సర్లే పాపం ఇంట్రెస్ట్ గా చెబుతున్నాడు కదా, ఇంకోసారి విందాంలే తప్పేముంది?' అని నేను తెలియనట్లుగా మౌనంగా వింటూ ఉన్నాను.

స్వామీజీ చెప్పసాగాడు.

'అది 1995 ప్రాంతం. లాతూర్ భూకంపం వచ్చిన రోజులు. నేను రామకృష్ణా మిషన్ లో బ్రహ్మచారిగా ఉన్నాను. రిలీఫ్ వర్క్ కోసం నన్ను అక్కడకు పోస్ట్ చేశారు. మూడేళ్ళ పాటు నేనూ ఇంకొందరూ అక్కడే ఉండి అన్నీ కోల్పోయిన వారికి ఇళ్ళు కట్టించి ఇచ్చాము. ఆ సమయంలో ఈ సంఘటన జరిగింది.

ఒకరోజున నేను పూనా నుంచి బాంబే కు రైల్లో వెళుతూ ఉన్నాను. నా ముందు సీట్లో ఒకాయన కూచుని నాతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు.గడ్డం పెరిగి ఉంది.మాసిన బట్టలు. జీవితంలో అంతా కోల్పోయిన వాడిలా నిస్తేజంగా ఉంది ఆయన ముఖం. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక బెగ్గర్ లాగా ఉన్నాడు.

ఆయనే మాటలు కదిపాడు.

'మీ పేరేంటి? ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటారు?' అన్నాడు.

'నాపేరు త్యాగరాజన్. నేను రామకృష్ణా మిషన్ లో బ్రహ్మచారిని.ప్రస్తుతం లాతూర్ భూకంప రిలీఫ్ వర్క్ లో ఉన్నాను.మిషన్ అక్కడ కొన్ని ఇళ్ళు కట్టిస్తున్నది. కావాల్సిన వస్తువులు కొన్ని కొనడం కోసం బాంబే వెళుతున్నాను.' అని నేను చెప్పాను.

'మీరు చదువుతున్నది ఏం పుస్తకం?' అని ఆయన అడిగాడు.

'నేను వివేకానందస్వామి అనుచరుడిని.Talks with Swami Vivekananda' అనే పుస్తకం ఇది.' అని చెప్పాను.

అప్పుడాయన తన కధను ఇలా చెప్పుకొచ్చాడు.

'నా పేరు చంద్ర పాల్.ఏడాది క్రితంవరకూ నేను బాంబేలో ఒక పెద్ద కోటీశ్వరున్ని. నాకు ఎన్నో బిజినెస్ లు ఉన్నాయి. కానీ నా స్నేహితులను నమ్మి ఘోరంగా మోసపోయాను. నా పార్టనర్స్ నన్ను మోసం చేశారు.నా ఆస్తులన్నీ పోయాయి.ప్రస్తుతం బికారిగా మారాను. నా వాళ్లకు ముఖం చూపలేక, నా దగ్గరున్న కొద్ది డబ్బుతో ఇలా రైళ్ళలో తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నాను. బాంబే నుంచి మద్రాస్ వెళతాను. అక్కడ దిగి ఒక రోజు ఉంటాను.మళ్ళీ రైలెక్కి బాంబే వెళతాను.అక్కడ ఇంకో రైలెక్కి కలకత్తా వెళతాను.అక్కడనుంచి డిల్లీకి వెళతాను.మళ్ళీ డిల్లీ నుంచి ఇంకో ఊరికి వెళతాను.ఈ విధంగా గత ఆర్నెల్ల నుంచీ రైళ్ళలో తిరుగుతూ ఉన్నాను. రెండుసార్లు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాను.కానీ లాస్ట్ మినిట్ లో ఎవరో రక్షించారు.ఇక ఆ ప్రయత్నం చెయ్యలేదు.వెనక్కు పోలేను. నావారికి ముఖం చూపించలేను.లగ్జరీ కార్లలో తిరిగిన రోడ్లమీద కాలినడకన తిరగలేను.అందుకే ఇలా బ్రతుకుతున్నాను.' అన్నాడు.

ఆయన వైపు సానుభూతిగా చూచాను.

అప్పుడాయన ఒక మాట అడిగాడు.

'స్వామీజీ మిమ్మల్ని ఒకమాట అడగాలని ఉంది. మీరు కోరుకున్నది మీ జీవితం మీకివ్వకపోతే మీరేం చేస్తారు? చెప్పండి' అన్నాడు.

నేను చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి ఇలా అన్నాను. 

'ఆ జీవితాన్ని వదిలేసి మరో కొత్త జీవితాన్ని నిర్మించుకుంటాను.జీవితం ముఖ్యం కాదు. నేను ముఖ్యం. నా జీవితం నేను అనుకున్న విధంగా లేకపోతే దాన్ని వదిలేసి నేను అనుకున్న జీవితాన్ని నిర్మిస్తాను.జీవితం కోసం నన్ను నేను త్యాగం చేసుకోను.అలా బ్రతకవలసిన అవసరం లేదు.నా జీవితం నేను  చెప్పినట్లు వినాలి. అంతేగాని అది చెప్పినట్లు నేను వినను.నేను ఉంటేనే కదా నా జీవితం ఉన్నది? ముందు నేను. ఆ తర్వాత నా జీవితం. కనుక జీవితం నేను చెప్పినట్లు నడవాలి. అందుకే నాకిష్టమైన జీవితాన్ని నిర్మించుకుంటాను. I will not take orders from my life. Instead, I will create my own life.వివేకానంద స్వామి ఇదే చెప్పారు.మొదట్లో కొంచం కష్టం ఉండవచ్చు.కష్టం లేకుండా జీవితంలో ఏదీ దక్కదు.కొన్నాళ్ళు కష్టపడితే ఆ తర్వాత నాకు నచ్చిన రీతిలో నా జీవితాన్ని గడుపుతాను.' అన్నాను.

ఆయన ఏమీ మాట్లాడకుండా నావైపు చూస్తూ ఉండిపోయాడు. బాంబే వచ్ఛేదాకా మళ్ళీ ఆయన నాతో మాట్లాడలేదు. బాంబే స్టేషన్లో ఇద్దరం గుడ్ బై చెప్పుకుని విడిపోయాం. ఆ తర్వాత ఆయన్ను నేను మరచిపోయాను. ప్రయాణాలలో ఎందరినో ఈ విధంగా కలుస్తూ ఉంటాం. వారిని మనం గుర్తుంచుకోము కదా ??

సరిగ్గా ఆరునెలలు గడిచాయి. నేనింకా లాతూర్ రిలీఫ్ వర్క్ లోనే ఉన్నాను. ఒకరోజున నాకొక ఫోన్ కాల్ వచ్చింది.

'స్వామీజీ ! నన్ను గుర్తు పట్టారా? నేను చంద్రపాల్ ను' అవతలనుంచి ఒక స్వరం వినిపించింది.

ఆయన గొంతు వింటూనే నాకు గుర్తొచ్చాడు. 'అవును. మీరు నాకు గుర్తున్నారు. మనం ట్రైన్ లో కలిసాం కదా !' అన్నాను.

'అవును స్వామీజీ. మీకు థ్యాంక్స్ చెప్పాలని ఫోన్ చేస్తున్నాను. మీరు ఆరోజున చెప్పిన మాట నా జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడు నేను మళ్ళీ కోటీశ్వరుణ్ణి అయ్యాను. నేను పాత చంద్రపాల్ ను అయ్యాను.' అన్నాడు ఉత్సాహంగా. 

'అవునా?' అడిగాను.

'అవును.మనం ఆరోజున బాంబేలో విడిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళలేదు.ఇంకో రైలెక్కి ఇంకోవైపుకు ప్రయాణం సాగించాను. కానీ మీరు చెప్పిన మాటల గురించే ఆలోచించాను.అంతకు మునుపైతే నన్ను నేను మరచిపోవడానికి ఏవేవో మేగజైన్స్ చదివేవాడిని.కానీ అప్పటినుంచీ ఏ పత్రికలూ చదవలేదు.ప్రతిక్షణమూ మీరు చెప్పిన మాటలే ఆలోచించాను.

'అవి నా మాటలు కావు. నా గురువైన వివేకానంద స్వామి మాటలు.' అన్నాను.

'ఎవరివైనా కానివ్వండి. వాటిల్లో చాలా శక్తి ఉంది. అవి నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి.నా  గత వైభవాన్ని మళ్ళీ నాకు కట్టబెట్టాయి.అలా కొన్నాళ్ళు రైళ్లలో తిరిగాక నేను చేస్తున్న పని తప్పని నాకు అనిపించింది. ఇలా పిరికివాడిలా బ్రతకడం చాలా హీనం అని అనిపించింది.తాడో పేడో తేల్చుకోవాలని అనుకున్నాను.జీవితాన్ని ఎదుర్కోవాలని నిశ్చయించు కున్నాను.

బాంబేలో దిగి మా ఇంటికి వెళ్లాను. నేను చనిపోయాననే అందరూ అనుకున్నారు. దాదాపు ఆర్నెల్ల తర్వాత నేను ఇంటికి తిరిగి వెళ్లాను.నా కుటుంబ సభ్యులంతా నన్ను చూచి ఎంతో సంతోషించారు.నాకున్న కొద్దిమంది మంచి మిత్రులను కలిశాను. మళ్ళీ నా బిజినెస్ చిన్నగా మొదలు పెట్టాను. వాళ్ళూ నాకు హెల్ప్ చేశారు.బిజినెస్ కిటుకులు అన్నీ నాకు బాగా తెలుసు. నా ప్రాడక్ట్స్ మళ్ళీ మార్కెటింగ్ చేశాను. ఆరే ఆరు నెలల్లో మళ్ళీ కోటీశ్వరుడిని అయ్యాను. నేను పోగొట్టుకున్నదంతా మళ్ళీ సంపాదించాను. మీకు ధన్యవాదాలు చెబుదామని ఫోన్ చేస్తున్నాను.ఇదంతా మీ చలవే.కృతజ్ఞతగా మీకు కొంత డబ్బు ఇద్దామని అనుకుంటున్నాను.మీరు యాక్సెప్ట్ చెయ్యాలి.' అన్నాడు.

'డబ్బా? నాకెందుకు? నేను సన్యాసిని. మీరు ఇవ్వాలని అనుకుంటే మా రిలీఫ్ వర్క్ కు ఇవ్వండి. ఇక్కడ భూకంపంలో మొత్తం కోల్పోయిన వారికి మీ డబ్బుతో కొన్ని ఇళ్ళు కట్టిస్తామని' నేనన్నాను.లాతూర్లో వర్క్ సైట్ కి వచ్చి,మేమేం చేస్తున్నామో చూడమని ఆయన్ను ఆహ్వానించాను.

చంద్రపాల్ లాతూర్ కు వచ్చాడు. ఒక మీటింగ్ పెట్టి ఆయన చేత మాట్లాడించాను. స్టేజి మీద నుంచి ఈ కధ అంతా ఆయనే చెప్పాడు. వివేకానంద స్వామి చెప్పిన కొన్ని మాటలు ఆయనలోని నైరాశ్యాన్ని ఎలా పారద్రోలాయో, ఆత్మవిశ్వాసాన్ని ఎలా నింపాయో, మళ్ళీ తనను పాత చంద్రపాల్ ను ఎలా చేశాయో మొత్తం వివరించాడు.

అప్పటికప్పుడు  20  లక్షల రూపాయలను మిషన్ కు డొనేట్ చేశాడు చంద్రపాల్. 1995 లో 20 లక్షలంటే చాలా పెద్ద మొత్తం. ఆ డబ్బును వాడి లాతూర్ లో రామకృష్ణా మిషన్ తరఫున కొన్ని ఇళ్ళు కట్టించి పేదవారికి ఇచ్చాము.

నేను ఈ సంఘటనను చాలా చోట్ల చెబుతూ ఉంటాను. కాలం కలసి రావడం లేదని మనం నిరాశతో క్రుంగి పోకూడదు.ఒక్క అపజయంతో డీలా పడిపోకూడదు.మళ్ళీమళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటే విజయం ఒకనాటికి మనల్ని తప్పకుండా వరిస్తుంది.ఇది నిజం. ఎంతోమంది జీవితాలలో ఇది రుజువైంది.

ఈ క్రింది కొటేషన్స్ ను నేను చాలామంది స్టూడెంట్స్ కు చెబుతూ ఉంటాను.

'ఊపిరి ఆగిపోవడం చావు కాదు. ప్రయత్నం మానుకోవడమే నిజమైన చావు.

'ధైర్యాన్ని నీ తోడుగా తీసికెళ్ళు. భయమే నిన్ను చూచి భయపడుతుంది.'

'ఆత్మవిశ్వాసాన్ని నీ తోడుగా తీసికెళ్ళు. అపజయమే నీ ముందర ఓడిపోతుంది'

'ముందు నువ్వు. తర్వాత నీ జీవితం. ఇది ఎప్పుడూ గుర్తుంచుకో'

'నువ్వు చెప్పినట్లు నీ జీవితం నడవాలి. అది చెప్పినట్లు నువ్వు నడవకూడదు'

'Don't surrender to your life. Instead, create your own.'

'చంద్రపాల్ కధ అది' - అన్నాడు స్వామీజీ.

మేము మౌనంగా ఇదంతా వింటున్నాము.

(ఇంకా ఉంది)