“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

11, డిసెంబర్ 2015, శుక్రవారం

కల్తీ ఆంద్రప్రదేశ్

మనం గప్పాలు కొట్టుకుంటున్నట్లు మనది స్వర్ణాంధ్రప్రదేశ్ కాదు కల్తీ ఆంద్రప్రదేశ్ అని నేను గత పదేళ్ళ నుంచే నా స్నేహితులతో అంటూ వస్తున్నాను.అది ఈనాడు నిజం అని అందరికీ తెలుస్తున్నది.

తెలంగాణా ఆంధ్రా జాతకాలు పరిశీలించినప్పుడు కూడా ఆంధ్రాకంటే తెలంగాణా జాతకం బలంగా ఉన్నదని కూడా చెప్పాను.దానికి కూడా రుజువులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రాలో ఉత్తమాటలు మాత్రమే కనిపిస్తుంటే,తెలంగాణలో చేతలు కనిపిస్తున్నాయి.

దీనికి కారణాలున్నాయి.నిజాం నవాబు పెట్టిన బాధలనుంచి పుట్టిన తిరుగుబాటు వాళ్ళలో ఉన్నది.పోరాటం వాళ్లకు తెలుసు.మనకు సుఖం తప్ప ఎటువంటి పోరాటమూ తెలియదు.అవసరమైతే పక్కవాడి నోరుకొట్టి మనం సుఖంగా బ్రతకడం మాత్రమె మనకు తెలుసు.అందుకే తెలంగాణాతో పోల్చుకుంటే మనలో మోసమూ ఎక్కువే.కుళ్ళూ ఎక్కువే. అతితెలివీ ఎక్కువే.అవినీతీ ఎక్కువే.

మనం ఏదైనా ఉన్నదున్నట్లు మాట్లాడుకోవాలి.

మన ఆంధ్రాలో అన్నీ కల్తీనే.

ఇక్కడ పాలు కల్తీ,పెరుగు కల్తీ,నూనె కల్తీ,నెయ్యి కల్తీ,కూరగాయలు కల్తీ,పండ్లు కల్తీ,పప్పుదినుసులు కల్తీ,ఉప్పూ కారాలు కల్తీ,మసాలా పొడులు కల్తీ,పిండి కల్తీ,బియ్యం కల్తీ. ఇంతేనా? చివరకు సారాయి కూడా కల్తీనే.

అసలిక్కడ మనుషులే పెద్దకల్తీ అని నా అభిప్రాయం.ఇక పైవన్నీ కల్తీ అవడంలో ఆశ్చర్యం ఏముంది.వాటన్నిటినీ కల్తీ చేస్తున్నది మనుషులేగా? వాళ్ళు స్వచ్చమైన వాళ్ళు ఎలా అవుతారు? వాళ్ళు స్వచ్చమైన మనుషులే అయితే ఇవన్నీ కల్తీ ఎందుకౌతాయి?ఎలా ఔతాయి?

మొన్నీ మధ్య ఒక రైతు నాతో ఇలా అన్నాడు.

'పాతకాలంలో పురుగుమందులు కొడితే చేనుకు పట్టిన పురుగులు చచ్చిపోయేవి.ఈరోజు అలా చావడం లేదు.అంటే పురుగు మందులు కూడా కల్తీ అయ్యాయన్నమాట.'

పురుగు మందులే కల్తీ అవుతున్నాయో లేక పురుగులకే నిరోధకశక్తి పెరిగిందో మనకు తెలియదుగాని, నేడు రోడ్డు మీద అడుగుపెడితే ఏం తినాలో ఏం తినకూడదో తెలియని పరిస్థితి ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నది.చిన్నచిన్న హోటళ్ళే కాదు పెద్దపెద్ద హోటళ్ళలో కూడా జంతువుల కొవ్వునుంచి తీసిన కల్తీనూనెనే వాడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో ఊహించవచ్చు.ఆయా డబ్బాలమీద ఏ లేబిల్ కావాలంటే ఆ లేబిల్ తయారు చేసి ఇచ్చే కుటీర పరిశ్రమలు నేడు ఎక్కడ చూస్తే అక్కడే ఉంటున్నాయి.Agmark, ISI లేబిల్స్ ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతున్నాయి.

ఈ కల్తీనూనెకు,కల్తీ నెయ్యికి,కల్తీ పిండికీ,మసాలా పొడులకూ తయారీకేంద్రాలు ఎక్కడో మారుమూల ప్రాంతాలలో లేవు. ఘనత వహించిన మన రాజధాని ప్రాంతాలైన విజయవాడ, మంగళగిరి, తెనాలి,నరసరావుపేట తదితర ప్రాంతాలలోనే ఈ కల్తీ వ్యాపారాలు మహాజోరుగా గత ఇరవై ఏళ్లనుంచీ సాగుతున్నాయి.హోటళ్లలో తినడానికి భయపడి పండ్లతో సహా ఇంక దేనిని తిన్నాకూడా ఏదో ఒకరకమైన విషం మన ఒంటిలోకి చేరిపోతున్నది.ప్రతి పండుకూ కాయకూ కూడా రంగురావడానికీ, పొడుగూ లావూ పెరగడానికీ నేడు ఇంజక్షన్లు చేస్తున్నారు.ఇదీ నేడు ఆంధ్రాలో పరిస్థితి.

మనకు ఆహార నియంత్రణ చట్టాలున్నాయి.క్రింది స్థాయినుంచీ అత్యున్నత స్థాయివరకూ అధికారులున్నారు.ఏదో మార్పు వస్తుందని ఆశించి మనమందరం ఓట్లేసి గెలిపించిన నాయకులున్నారు.అందరూ ఉన్నప్పటికీ ఈ 'కల్తీ' అనేది భగవంతునిలా సర్వాంతర్యామిలా వెలుగుతోంది.వీళ్లెవరికీ తెలియకుండా ఇదంతా జరుగుతోందంటే నమ్మేంత పిచ్చివాళ్ళు కారు ప్రజలు.

మనకు నీతి అనేది మాటలవరకే.నిజాయితీ అనేది ఉపన్యాసాల వరకే.అసలు నిజం ఏమంటే,ఆంధ్రాలో ఉన్నంత కల్తీ దేశంలో ఎక్కడా లేదు.ఇక్కడ అందరికీ కావలసింది డబ్బు మాత్రమే.అది ఎలాగైనా కావచ్చు.పక్క మనిషి ప్రాణం తీసైనా కావచ్చు.డబ్బు సంపాదించాలి.అంతే. ధనదాహం అనేది ఆంధ్రాలో ఉన్నంతగా మరెక్కడా మనకు కన్పించదు.అందుకే భక్తికూడా ఇక్కడ ఎక్కువే.ఎక్కడైతే మోసమూ అవినీతీ ఉంటాయో అక్కడే భక్తీ ఉంటుంది.అందుకే ఇక్కడ కదిలిస్తేచాలు అందరూ నీతులు ఆధ్యాత్మికకబుర్లు చెబుతారు. ప్రతివాడూ ఏదో ఒక రంగుదుస్తులు ధరించి ఏదో ఒక దీక్ష స్వీకరిస్తూనే ఉంటాడు.మళ్ళీ చూస్తే ఎక్కడ చూచినా మోసమూ అవినీతీ విచ్చలవిడిగా ఉంటూనే ఉంటాయి.దీనర్ధం ఏమిటి? ఆధ్యాత్మికతతో సహా అంతా కల్తీమయంగా మారింది.వెరసి ఆంద్రప్రదేశ్ అనేది అన్నిరకాలుగా కుళ్ళిపోయిందని ఘంటాపధంగా చెప్పవచ్చు.

ఎప్పుడైతే నాయకులలోనూ ప్రజలలోనూ 'చెప్పేదొకటి చేసేదొకటి' అనే తీరు వస్తుందో అప్పుడే ఆ దేశపు పతనం ప్రారంభమౌతుంది.చెడు కర్మ పోగు కావడం ఆక్షణమే మొదలౌతుంది.కొన్నాళ్ళ పాటో,కొన్నేళ్ళపాటో అంతా బాగానే ఉన్నట్లు కనిపించవచ్చు.బ్రహ్మాండమైన పురోగతి వస్తున్నట్లు భ్రమ కలగవచ్చు.కానీ కర్మ పరిపక్వానికి వచ్చిన సమయంలో తగిలే ఎదురుదెబ్బ మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. ప్రస్తుతం తమిళనాడుకు జరిగింది అదే.రేపు ఆంధ్రాకు జరగబోతున్నది కూడా అదే. దీనిని ఎవరూ తప్పించలేరు.

నా శిష్యుడొకరు ఈ మధ్యన నాకు మెయిల్ ఇచ్చాడు.

'చెన్నైలో అంతా భీభత్సంగా ఉన్నది కదా.అందరూ సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు.మన ట్రస్ట్ తరఫున మనంకూడా ఎంతో కొంత సాయం చేద్దాం.మనం అందరం ఒక వారంపాటు చెన్నైలో ఉండి వాళ్లకు సహాయం చేద్దాం' అన్నాడు.

'అవసరం లేదు.వాళ్ళ ఖర్మను వాళ్ళు అనుభవించనీ.' అని క్లుప్తంగా జవాబిచ్చాను.

మంచిమాటలు వినకుండా మూర్ఖంగా ముందుకు పోయేవాళ్ళు ఊబిలో పడక తప్పదు.వాళ్ళ ఖర్మ వాళ్ళు అనుభవించక తప్పదు.వాళ్లకు సాయం చేసేవాళ్ళు కూడా ముందే నిర్దేశింపబడి ఉంటారు.సాధారణంగా వాళ్ళు ఎవరై ఉంటారంటే, ఆ చెడుఖర్మకు ఎవరు పరోక్షంగా దోహదం చేసి ఉంటారో వాళ్ళే సహాయం కూడా చేస్తారు.అంటే ఒక చేత్తో పాడుచేసి ఇంకో చేత్తో సాయం చేస్తారన్నమాట.

మందుల కంపెనీలు మనచేత నానా అడ్డమైన మందులూ వాడించి, అప్పుడొచ్చిన రోగాలకు ఇంకొన్ని కొత్త మందులు రిలీజ్ చేసినట్లు ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఆన్లైన్ వైరస్ లను సృష్టించి వదిలిన కంపెనీలే యాంటీ వైరస్ ప్రోగ్రాములు సృష్టించి సొమ్ము చేసుకున్నట్లుగా ఇది జరుగుతుంది. ఇదంతా ఒక విషవలయం.ఈ కర్మవలయం ఎలా ఉంటుందో తెలియనివాళ్ళు 'అయ్యోపాపం' అనుకుంటారు.రేపు అదే ఖర్మ మనల్నికూడా కాటు వెయ్యడానికి సిద్ధంగా ఉన్నదని మనకు తెలియదు.అప్పుడు మనల్ని చూచి 'అయ్యోపాపం' అనుకునేవాళ్ళు ఎవరూ ఉండరు.

తమిళనాడులో కొన్నేళ్లుగా పోగుపడుతూ వస్తున్న చెడుఖర్మ నేడు ఈ తుఫాన్ల రూపంలో దానిని కాటేస్తున్నది.అయ్యోపాపం అని మనం జాలిపడనక్కరలేదు.మన ఆంధ్రాలో నేడు పోగుపడుతున్న అవినీతీ,పాపమూ ఏ స్థాయిలో ఉన్నాయో గమనిస్తే,ముందు ముందు మన ఆంధ్రాకు పట్టబోతున్న గతి ఏమిటో తెలిస్తే,తమిళనాడు సంగతి వదలిపెట్టి,ముందు మనమీద మనం జాలిపడవలసి వస్తుంది.నడుస్తున్న మనుషులు నడుస్తున్నట్లే పిట్టల్లా రాలిపోయే రోజులు ముందు రాబోతున్నాయి. బ్రహ్మంగారు చెప్పినట్లు అంతుబట్టని రోగాలు ప్రబలి జనం గుట్టలుగా రాలిపోయే రోజులు ముందున్నాయి.

దీనికి కారణం మనలోని కల్తీ మనస్తత్వాలే.డబ్బుమీద మనకున్న తప్పుడుభ్రాంతే సమస్త అనర్దాలకూ మూలం. విలువలనూ,నీతినీ గాలికి ఒదిలేసి,సంపాదన ఒక్కటే ముఖ్యం అన్న ఏకసూత్రపధకంతో ముందుకు పోవడమే ఈ పాపఖర్మానికి కారణం.Live and let live అన్న మంచిసూత్రాన్ని మర్చిపోయి Live and let die అనే దౌర్భాగ్య సూత్రాన్ని సమాజంలో అందరూ ఏకమొత్తంగా పాటించడమే నేటి సర్వ అనర్దాలకూ కారణం. మనలోని ఈ పోకడ పోనంతవరకూ ఈ సామూహిక చెడుఖర్మ తగ్గదు.దీని ఫలితాన్ని ఏదోనాడు మనమందరం ఖచ్చితంగా అనుభవించక తప్పదు.

ఈనాడు తమిళనాడుకు జరిగిందిలే మనం హాయిగా ఉన్నాం.మనకేమీ కాదు అని భ్రమపడకండి.మన పద్దతులు మార్చుకోకపోతే రేపు మనకూ ఇదే గతి తప్పదు.అయితే మనకు కూడా 'తుఫాన్' రూపంలోనే ఈ ప్రమాదం రాకపోవచ్చు. సామూహిక రోగాల రూపంలోనో,భూకంపాల రూపంలోనో,ఇంకొక తెగులు రూపంలోనో అది రావచ్చు.ప్రకృతి గనుక మనిషిని శిక్షించాలనుకుంటే ఎన్నో మార్గాలు దానికున్నాయి.

మంచి చెప్పేవాళ్ళు చాలామంది చెబుతున్నారు.వినినవాళ్ళు బాగుపడతారు.విననివాళ్ళు ఖర్మ అనుభవిస్తారు.ఇది ప్రకృతి నియమం.ప్రస్తుతం మన ఆంధ్రా తీరు చూస్తుంటే మంచి చెబితే వినే పరిస్థితిలో ఎవరూ ఎక్కడా కన్పించడం లేదు. ఎక్కడ చూచినా 'హిపోక్రసీ', 'అవినీతి', 'ధనవ్యామోహం', 'అహంకారం', 'మోసం' ఇవే కనిపిస్తున్నాయి.వీటి ఫలితంగా ముందుముందు దారుణమైన పరిస్థితులను,ప్రకృతి వైపరీత్యాలను మనం ఖచ్చితంగా ఎదుర్కోవలసి వస్తుంది.

మనమీద ఏ పాకిస్తానో ఏ చైనానో బాంబులు వేసి మనల్ని చంపనక్కరలేదు.మనం తింటున్న ఆహారాన్ని కల్తీ చేసుకోవడం ద్వారా మనల్ని మనమే చంపుకునే రోజు అతి దగ్గరలో ఉన్నది.

నకు జాతీయమృగం,జాతీయపక్షి ఇలా ఉన్నాయి కదా. అలాగే మన రాష్ట్ర సింబల్ గా "మేడిపండు" ను పెట్టుకుంటే చాలా సరిగ్గా ఉంటుందని నా సలహా. కనీసం దీన్నైనా పాటించండి మరి !!