“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

26, మార్చి 2015, గురువారం

అతిసాహసం-అందం పైన మక్కువ-గ్రహాలు మానవ మనస్సుపై ఎలా పనిచేస్తాయి?

సూక్ష్మ జ్యోతిష్య ఫలితాలు నిజమే అని ప్రతిరోజూ రుజువులు వస్తున్నాయి.ఈ పదిహేను రోజులూ ప్రత్యేకమైనవి గనుకనే-నూతన సంవత్సర ఫలితాలు కూడా వ్రాయకుండా-ఇవి వ్రాశాను.

మచ్చుకి రెండు సంఘటనలు చూద్దాం.సరిగ్గా మొన్న రెండు సంఘటనలు జరిగాయి.

1.అతి సాహసం-80 ఏళ్ళ వయసులో

మా ఇన్స్పెక్టర్ ఒకాయన తండ్రికి 80 ఏళ్ళు.మొదట్నించీ పొలం పనులు చేసిన ఒళ్ళు కావడం ఏమో,మనిషి ఇప్పటికీ గట్టిగానే ఉంటాడు.కానీ సరిగ్గా మొన్న మధ్యాహ్నం పూట-ఏదో పూనినట్టు-మోటార్ సైకిల్ తీసుకుని డ్రైవింగ్ చేసుకుంటూ బయల్దేరాడు.ఒక్కడివే మోటార్ సైకిల్ ఒద్దని ఇంట్లోవాళ్ళు ఎంత చెప్పినా వినలేదు.స్పీడుగా పోతుంటే,ఆపుకోలేక క్రిందపడి,యాక్సిడెంట్ అయింది.తుంటి ఎముక, తొడ ఎముకలు మూడు చోట్ల విరిగిపోయాయి.ఈ యాక్సిడెంట్ ఒంగోలులో జరిగింది.

ఆయన్ను హుటాహుటిన గుంటూరుకు తెచ్చి ఆపరేషన్ చేసి,ఇంకా వెన్నెముకకు సంబంధించిన పరీక్షలు ఏవో చెయ్యాలంటే విజయవాడకు తీసుకెళ్ళి ఆ పరీక్షలు కానిచ్చి,అక్కడనుంచి మళ్ళీ ఒంగోలుకు చేర్చారు.ఆపరేషన్ సక్సెస్ అయింది.కానీ కనీసం మూడునెలలు మంచం మీద ఉండాలి.

మనం ఎన్నోసార్లు ఒక పని చేసి ఉంటాం.ఇంకోసారి కూడా చేస్తే ఏమీ కాదులే అని అనుకుంటాం.కానీ అప్పుడే జరగాల్సినది జరుగుతుంది.ఆ విధంగా-ఆ సమయంలో -ఆ పని చెయ్యమని- గ్రహాలు మనిషిని తీవ్రంగా ప్రేరేపిస్తాయి.

అందుకే పాతకాలంలో అనేవారు- "ఎంతమంది చెప్పినా వినకుండా -ఏదో గ్రహం పూనినట్లు చేశాడు-ఇలా జరిగింది."--అని.

పెద్ద వయసులో సాహసాలు పనికిరావు- అందులోనూ గ్రహస్థితులు బాలేనప్పుడు అస్సలు పనికిరావు- అనేది ఈ సంఘటన నేర్పే గుణపాఠం.

2.అందం మీద అతి శ్రద్ధ-ప్రాణం తీసిన 6 కేజీలు

మా దగ్గర పనిచేసే ఒక గార్డుగారి అమ్మాయి మంచి తెలివైనది.మెరిట్లో MBBS సీటు తెచ్చుకుంది.కోర్స్ అయిపోయింది.PG ఎంట్రెన్స్ వ్రాసింది. అందులో కూడా స్టేట్ ర్యాంక్-3 వచ్చింది.ప్రస్తుతం PG లో చేరాలి.ఈలోపల అందం మీద శ్రద్ధ ఎక్కువైంది.తను ఉండవలసిన బరువు కంటే ఒక్క 6 కేజీలు మాత్రం ఎక్కువ ఉన్నదట.ఆ 6 కేజీలు మాత్రం ఎందుకుండాలి? అన్న బాధతో ఒక జిమ్ లో చేరింది.యూనివర్సిటీ క్లాసులు మొదలయ్యే లోపు ఈ 6 కేజీలు ఎలాగైనా తగ్గాలన్న పట్టుతో జిమ్ తీవ్రంగా చేస్తున్నది.

సరిగ్గా మొన్న సాయంత్రం - గుంటూరులో జిమ్ లో ట్రెడ్ మిల్ మీద పరిగెత్తుతూ పరిగెత్తుతూ హటాత్తుగా కుప్పకూలిపోయింది.ఆసుపత్రికి తీసుకెళ్ళేలోపు చనిపోయింది.

ఆమె వయసు 22 ఏళ్ళు.

ఇప్పుడేం చేస్తే, ఆ తల్లిదండ్రుల గుండెకోత తీరుతుంది? వారి శేషజీవితం అంతా కుమిలిపోతూ శాపగ్రస్తులలాగా జీవచ్చవాల లాగా బ్రతకాల్సిందేగా?

ఆ మధ్య ఒక మోడల్ - జీరోసైజు కోసం తిండి మానేసి,ఉపవాసాలుండి,ఎక్సర్ సైజులు చేసి,చివరకు ర్యాంప్ మీదే కుప్పకూలిపోయి చనిపోయిందని వార్తల్లో చదివాం.ఇప్పుడు 6 కేజీల కోసం ప్రాణం పోగొట్టుకున్న మెడికో మన కళ్ళ ఎదురుగా ఉన్నది.

6 కేజీల బరువుకోసం ప్రాణం మీదకు తెచ్చుకోవడం ఏం తెలివైన పని?

ఈ మధ్యన అమ్మాయిలకు అందంమీద అనవసరమైన అతిశ్రద్ధ ఎక్కువౌతున్నది.దానికోసం తిండి మానుకొని అతిగా వ్యాయామాలు చేస్తున్నారు.ఇది చాలా పొరపాటు.ఎవరి అందం వారికుంటుంది.ఒకరిని చూచి ఇంకొకరు వాత పెట్టుకోవడం మహా తెలివితక్కువపని.

భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని జంక్ ఫుడ్ తిని చెడగొట్టుకుంటారు. సరియైన రోజువారీ వ్యాయామం లేకుండా పిచ్చి పిచ్చిగా ఒళ్ళు పెంచేస్తారు.ఆ తర్వాత TV లో యాడ్స్ చూచో,లేకపోతే స్నేహితులు చెప్పిన సలహాలు వినో--తీవ్రమైన వ్యాయామాలు మొదలు పెడతారు.తెలిసీ తెలియకుండా చేస్తే అవి ప్రాణం మీదకు తెస్తాయన్న విషయం గ్రహించలేరు.

వీటికి తోడు పనికిమాలిన సినిమా కబుర్లు తోడౌతాయి.

'ఫలానా సినిమా కోసం ఫలానా హీరో ఒక్క నెలలో 20 కేజీలు బరువు పెరిగాడట.మళ్ళీ ఒక్క నెలలో 30 కేజీలు తగ్గిపోయాడట.' అని స్నేహితులు కలసి చెప్పుకుంటూ ఉంటారు.

ఇంతలో పేపర్లో వస్తుంది.ఫలానా సినిమా కోసం జీరో సైజుకు మారిపోయిన హీరోయిన్ అంటూ ఆమె ఫుల్ పేజీ ముప్పాతిక నగ్నచిత్రాన్ని ఆ పేపర్ వేస్తుంది.అది చూచి మన కాలేజీ అమ్మాయిలకు వెర్రి పుట్టుకొస్తుంది.మనం కూడా ఆ హీరోయిన్లా బక్కపలచగా తయారుకావాలి.పొట్ట అనేది వెన్నుకు అంటుకుపోవాలి.అదికూడా ఒక్కనెలలోనే-కాలేజీలు తెరిచేలోపే- జరిగిపోవాలి. తనే కాలేజీ బ్యూటీ అనిపించుకోవాలి.

ఇంకేముంది? తిండి మానేసి జిమ్ ల మీద పడతారు.అదృష్టం బాగుంటే చివరకు ఆస్పత్రిలో తేలతారు.లేకపోతే మార్చురీలో తేలతారు.

జిమ్ లో చేరి వ్యాయామాలు చెయ్యనక్కరలేదు.జంక్ ఫుడ్ తినకుండా,టీవీ ముందూ,కంప్యూటర్ ముందూ కూచునే సమయాన్ని తగ్గించి,రాత్రులు ఎక్కువ మేలుకోకుండా ఉండి,రోజువారీ పనులను ఒళ్ళొంచి చెయ్యడం నేర్చుకుంటే,ఏ ప్రత్యెక వ్యాయామాలూ అవసరం లేదు.మహా కావాలంటే రోజూ ఒక ఇరవై నిముషాలు సింపుల్ యోగా చేస్తే చాలు.

ప్రతి వ్యాయామానికి ఒక ప్రత్యేకమైన డైట్ తీసుకోవాలి.ఒక అనుభవజ్ఞుడైన శిక్షకుని సలహా తీసుకోవాలి.తమంతట తాము నిర్ణయించుకుని తిండి మానేసి ఇష్టం వచ్చిన వ్యాయామాలు అతిగా చేస్తే ఇలాగే అవుతుంది.వ్యాయామాలు ఎవరికీ వారు నిర్ణయించుకుని అతిగా చెయ్యరాదు.చేస్తే ఇలాగే మంచికి బదులు చెడు జరుగుతుంది.

ప్రతి శరీరానికీ ఒక ప్రత్యేకమైన భాష ఉంటుంది.ఆ భాషను అర్ధం చేసుకుని దానికి తగిన వ్యాయామాలు మాత్రమే చెయ్యాలి.అంతేగాని ఎవరో ఏదో చేస్తున్నారని మనమూ అదే చెయ్యబోతే అది మనకు సరిపడక వికటించి ఇలాగే జరుగుతుంది.

మన ఒళ్ళు మనకు చెబుతూనే ఉంటుంది.నువ్వు లిమిట్స్ దాటుతున్నావు.జాగ్రత్త అని.దాని మాట వినడం ముందుగా నేర్చుకోవాలి.అప్పుడు అంతా బాగుంటుంది.

మా అబ్బాయి స్నేహితుడొకడు నాలుగేళ్ల క్రితం ఇలాగే- తన అభిమాన హీరోను చూచి- తనూ 6 ప్యాక్ పెంచాలనుకుని- రైస్ పూర్తిగా మానేసి- ఫ్రూట్ జ్యూసులు మాత్రమె త్రాగుతూ వ్యాయామాలు తీవ్రంగా చేశాడు.ఒకరోజున జిమ్ లో కళ్ళు తిరిగి పడిపోతే,ఆస్పత్రిలో చేర్చారు.కోలుకోడానికి ఆర్నెల్లు పట్టింది.సిక్స్ ప్యాక్ సంగతేమో గాని సిక్స్ మంత్స్ ఆస్పత్రి బెడ్లో ఉండవలసి వచ్చింది.అప్పటి దుష్ప్రభావాలు ఇప్పటికీ ఆ అబ్బాయి ఒంట్లోనుంచి పూర్తిగా పోలేదు.కొన్ని ఇర్రివర్సిబుల్ మార్పులు వస్తే ఇంక అవి తగ్గడం కష్టం.

సరే మీరు చెప్పేది అంతా బానే ఉంది -- గ్రహాలకూ ఆ సంఘటనలకూ సంబంధం ఏమిటి? అని అనుమానం రావచ్చు.

ఉంది.

గ్రహాలు మనిషి మనస్సుమీద పనిచేస్తాయి.లేనిపోని ఆలోచనలు పుట్టిస్తాయి. పిచ్చిపిచ్చి పనులు చెయ్యమని ప్రేరేపిస్తాయి.ఆ క్రమంలో ప్రమాదాలు ఎదురౌతాయి.ఇదంతా మనిషి పూర్వకర్మానుసారమే జరుగుతుంది.ఇలా అందరికీ ప్రేరేపణ కలగదు.గ్రహస్థితులు బాగాలేనప్పుడు- ఎవరెవరి పూర్వకర్మ బాగులేదో - వారికి మాత్రమె ఇలాంటి పెడబుద్ధులు పుడతాయి. అందరికీ పుట్టవు.

ఇదంతా ఒక సీక్రెట్ సైన్స్.

అందుకే మనవాళ్ళు పాతకాలంలో ఒక మాట అనేవారు.

'పోగాలం వచ్చినపుడు పిదప బుద్ధులు పుడతాయి' అని.

అది అక్షరాలా నిజం. అది ఎంతో అనుభవం మీద చెప్పబడిన మాట.

ఆ ముసలాయన కూడా ఎంతమంది చెప్పినా వినకుండా ఆ రోజున మోటార్ సైకిల్ తీసుకుని బయలుదేరాడు.అలా జరిగింది."మూర్ఖత్వం" అనే దారిగుండా గ్రహాలు ఇక్కడ పనిచేశాయి.

ఆ అమ్మాయికి కూడా ఇప్పటివరకూ అందంమీద అంత శ్రద్ధలేదు.అందం మీద చిన్నప్పటినుంచీ అంత శ్రద్ధ ఉంటె ర్యాంకర్ ఎలా అవుతుంది? కానీ ఇప్పుడు ఆయుస్సు అయిపోవస్తున్నది.యముడు పిలుస్తున్నాడు.కనుక ఇప్పుడు హటాత్తుగా అందంమీద అతిశ్రద్ధ పుట్టుకొచ్చింది.అదే ప్రాణం మీదకు తెచ్చింది."అతి" అనే దారిగుండా గ్రహాలు ఇక్కడ పనిచేశాయి.

జీవితంలో జరిగే విచిత్రాలు ఇలాగే ఉంటాయి.మనిషి మీద గ్రహప్రభావాలు ఇలాగే సూక్ష్మంగా ఉంటాయి.వాటిలోని తారతమ్యాలను గ్రహించాలంటే యోగశక్తీ సూక్ష్మదృష్టీ  ఉండాలి.

గ్రహస్థితులు బాగాలేనప్పుడు సాహసాలు చెయ్యకూడదు.ఆ సమయాలలో అనేక జాగ్రత్తలు పాటించాలి.ఈ సూత్రం మళ్ళీమళ్ళీ అనేకసార్లు ఎందరి జీవితాలలోనో రుజువౌతూనే ఉన్నది.

నాకు మొన్న వచ్చిన యాస్ట్రల్ సూచన నిజమే అని ఈ సంఘటనలూ ఇంకా రోజూ జరుగుతున్న ఎన్నో సంఘటనలూ రుజువు చేస్తున్నాయి.