“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

11, మార్చి 2015, బుధవారం

శ్రీవిద్యారహస్యం లో 'రహస్యం' ఏమీ కనపడటం లేదు

'శ్రీవిద్యారహస్యం' పుస్తకం చదివిన చదువుతున్న వారినుంచి నాకు చాలా మెయిల్స్,ఫోన్ కాల్స్ వస్తున్నాయి.వాటిలో పరస్పర విభిన్నమైన భావాలెన్నో సహజంగానే వెలిబుచ్చబడుతున్నాయి.ఎక్కువభాగం అభినందనలతో ఇవి వస్తున్నాయి.కొన్ని మాత్రం చాలా సరదాగా అనిపిస్తున్నాయి.

మొన్న ఒకాయన మెయిల్ ఇస్తూ ఇలా అభిప్రాయపడ్డాడు.

'మీ పుస్తకం చదివాను.దానికి 'శ్రీవిద్యారహస్యం' అని పేరు పెట్టారు.కానీ అందులో 'రహస్యం' ఎక్కడుందో,మీరు ఏ రహస్యాన్ని చెప్పాలనుకున్నారో నాకేమీ అర్ధం కావడం లేదు.'

చాలా నిక్కచ్చిగా ఉన్న ఈ అభిప్రాయం నాకు నచ్చింది.కానీ అతనికి విషయం అర్ధం కానందుకు బాధ కూడా కలిగింది.ఇతనికి ఎలా జవాబు చెబితే బాగుంటుందా అని ఆలోచనలో ఉండగా ఇంకొకాయన దగ్గరనుంచి ఇంకో మెయిల్ వచ్చింది.

'మీ పుస్తకం చదువుతున్నాను.ఇంకా పూర్తిగా చదవకుండానే మీకు మెయిల్ ఇవ్వడానికి నాకు కలుగుతున్న భావోద్రేకమే కారణం.ఆనందాన్ని తట్టుకోలేక మీకు మధ్యలోనే మెయిల్ ఇస్తున్నాను.క్షమించండి.ఇలాంటి మంచి పుస్తకాన్ని నేను ఇప్పటిదాకా చదవలేదు.ప్రతిపద్యం ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని అవగతం చేస్తున్నది.ఒక్కొక్క పేజీని దాటి ముందుకు పోలేకపోతున్నాను.పుస్తకం పూర్తిగా చదివిన తర్వాత మీరనుమతిస్తే మీతో కలిసి మాట్లాడాలని అనుకుంటున్నాను.'

వెదుకబోతున్న తీగ కాలికి తగిలినట్లు అనిపించింది.వెంటనే ఈ జవాబును మొదటి వ్యక్తికి మెయిల్ చేస్తూ ఇలా వ్రాశాను.

'మీరేమో ఈ పుస్తకంలో ఏ రహస్యమూ కనిపించలేదని అంటున్నారు.మరి ఈయనేమో ప్రతిపేజీ లోనూ ఎన్నో రహస్యాలు ఉన్నాయని అంటున్నారు.ఏది నిజమై ఉంటుందో మీరే ఆలోచించండి.'

ఆయన దగ్గరనుంచి ఇంకా జవాబు రాలేదు.

అసలు విషయం ఏమిటంటే--ఇలాంటి పుస్తకాలు చదివినప్పుడు ఎవరి మన:స్థితిని బట్టి వారికి విషయం అర్ధమౌతుంది.భగవద్గీతకు ప్రపంచంలో ఎన్నెన్ని వ్యాఖ్యానాలున్నాయో అందరికీ తెలుసు.ఎవరెవరి మన:స్థితిని బట్టి వారివారికి అది ఆయా విధాలుగా అర్ధమైంది.అందుకే అన్నన్ని భాష్యాలు దానికి వచ్చాయి.ఏ నిగూఢమైన విషయాన్ని గురించిన పుస్తకం అయినా అంతే.

మనం పెట్టుకున్న కళ్ళజోడు రంగులోనే ప్రపంచం మనకు కనిపించినట్లుగా, మన మానసిక పరిస్థితిని బట్టే ఇలాంటి పుస్తకాలు మనకు అర్ధమౌతాయి. ఓపెన్ మైండ్ తో చదివితే అంతా సక్రమంగానే ఎక్కుతుంది.మనస్సులో ఏవేవో పూర్వభావాలు ఉంచుకుని ఆ కోణాలలో దీనిని చదవబోతే సరిగ్గా అర్ధం కాకపోగా విపరీతార్ధాలు కనిపిస్తాయి.

'ఇందులో ఏ రహస్యమూ కనిపించలేదు' అని మొదటాయన అనడంలోనే ఆయన ఏదో ఒక నిగూఢమైన రహస్యాన్ని తెలుసుకోవాలని ఆశిస్తున్నాడని అర్ధమౌతున్నది.ఈ పుస్తకంలో నిగూఢమైన రహస్యాలున్నమాట నిజమే.కానీ అవికూడా నిగూఢమ్ గానే-,కానీ సరళమైన భాషలోనే చెప్పబడ్డాయి.కనుకనే పైపైన చదివితే అవి రహస్యాలని అనిపించవు.సరళంగా ఉన్నవేవీ ప్రత్యేకంగా కనిపించవు.ఇది సహజమే కదా.

పాండిత్యధోరణిలో చదివేవారికి ఇందులో ఏ రహస్యాలూ కనిపించవు.వారేమి ఆశిస్తారంటే-'ఇందులో ఏదో కొత్త మహామంత్రాన్ని ఇచ్చి ఉంటారు.దాని ఉపాసనా విధానాన్ని తెలిపి ఉంటారు.దానిని చూచి మనం జపం మొదలు పెడదాం.ఆ ఫలితాన్ని త్వరగా పొందుదాం.'-ఈ ధోరణిలో వెదుకుతారు. అలాంటివారికి తీవ్రమైన ఆశాభంగం కలుగుతుంది.ఇలాంటి చవకబారు విషయాలు వ్రాయడం ఈ పుస్తకపు ఉద్దేశ్యం కాదు.

సాధనాపరమైన మౌలికవిషయాలను స్పర్శిస్తూ,అసలైన ఉపాసనను సరళమైన రీతిలో విశదీకరించడమే ఈ పుస్తకపు ఉద్దేశ్యం.అంతేగాని --'ఈ మంత్రాన్ని ఇన్నిసార్లు జపిస్తే ఈ పనౌతుంది' వంటి చవకబారు విషయాలు వ్రాయడం కాదు.చాలాసార్లు ఆయా విధాలుగా ప్రయత్నిస్తే ఆయా పనులు జరగవు కూడా.

ఉదాహరణకు-'ఒకే ఆసనం మీద కూచుని 108 సార్లు హనుమాన్ చాలీసా జపిస్తే ఏ పనైనా అయిపోతుంది.' అని ఒక భావం లోకంలో ప్రచారంలో ఉంది.ఈ భావానికి కారణం హనుమాన్ చాలీసా ఫలశ్రుతిలోనే తులసీదాస్ చెప్పాడని చెప్పబడుతున్న ఒక మాట.

దీనిని పట్టుకుని-ఈ విధంగా 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసిన ప్రబుద్ధులు చాలామంది నాకు తెలుసు.అందువల్ల వారు అనుకున్న పనులు ఏమాత్రం కాకపోగా, ఆసనసిద్ధి లేకపోవడంతో,మోకాళ్ళ నెప్పులొచ్చి వారం రోజులు బాధపడవలసి వచ్చింది.

'అయితే తులసీ దాస్ అబద్దం చెప్పాడా'? అని ఇలా మోకాళ్ళ నెప్పులు తెచ్చుకున్న ఒకాయన నన్ను అడిగాడు.

'నాకు తెలీదు.నేను తులసీదాసును కాను.ఆయన ఏ ఉద్దేశ్యంతో ఆమాట వ్రాశాడో నేనెలా చెప్పగలను?ఆయనెక్కడైనా కనిపిస్తే నువ్వే డైరెక్ట్ గా ఆయన్నే అడుగు. ' అని జవాబు చెప్పాను.అంతకంటే ఇలాంటి వారికి ఇంకేం చెప్పాలి?

నిజానికి,అలాంటి కోరికలు పెట్టుకుని ఉపాసనను చెయ్యవద్దని నా పుస్తకంలో మాటమాటకీ చెప్పడం జరిగింది.అలాంటి కోరికలు తీరే మార్గాలకోసం,ఆయా రహస్యాలకోసం,ఎదురుచూస్తూ ఈ పుస్తకం చదివితే ఇటువంటి అసహనమే కలుగుతుంది.

అలాంటి రహస్యాలు కావలసినవారు -ఫుట్ పాత్ మీద దొరికే 'మళయాళ మంత్రరహస్యాలు' వంటి పుస్తకాలు చదివితే సరిపోతుంది.మహా మంత్రాలనుంచి క్షుద్రమంత్రాల దాకా అందులో కావలసినన్ని మంత్రాలు లభిస్తాయి.

ఇంకొందరు ఏమాశిస్తారంటే-- పంచదశో షోడశో లాంటి ఒక మహామంత్రాన్ని తీసుకుని,దానిని వ్యాకరణపరంగా,శబ్దపరంగా చీల్చిచెండాడి,ఆయా బీజాక్షరాలకు నానార్ధాలు చెప్పి,వీలైతే కొత్తకొత్త అర్ధాలు చెప్పి,పేజీలకు పేజీలు  వివరిస్తారేమో-- అన్న ఉద్దేశ్యంతో వారీ పుస్తకాన్ని చదువుతారు. ఎందుకంటే సాంప్రదాయగ్రంధాలన్నీ ఇదే వరుసలో ఉంటాయి.వారా పుస్తకాలను బాగా చదివి ఉంటారు.అలాంటి వారికి కూడా ఈ పుస్తకం నచ్చదు.కారణమేమంటే--'ఒక మంత్రం గొప్ప ఇంకొక మంత్రం తక్కువ'- అని నేను నా పుస్తకంలో ఎక్కడా చెప్పలేదు."ఏ మంత్రంలోనూ ఏమీ మహత్యం లేదు,చేసే నీలోనే అంతా ఉంది"- అని చెప్పాను.ఈ భావనకూడా,కొత్త కొత్త మంత్రాలకోసం వెదికే సాంప్రదాయవాదులకు నచ్చదు.

ఇంకొంతమంది--"శ్రీచక్రం గీయడంలో రకరకాలైన సాంప్రదాయాలున్నాయి. కొందరేమో ఇలా గీస్తారు.ఇంకొందరు అలా గీస్తారు.ఏది అసలైన విధానం?కొందరు,చక్రమధ్యంలో త్రికోణాన్ని ఉంచుతారు. ఇంకొందరు చతురస్రాన్ని ఉంచుతారు.ఏది కరెక్ట్?కొందరు మేఖలాత్రయాన్ని లెక్కిస్తారు.ఇంకొందరు లెక్కించరు.ఏది కరెక్ట్? ఉపాసనా విధానాలు కూడా అనేక ప్రాంతీయ భేదాలతో నిండి ఉన్నాయి.వీటిల్లో ఏది కరెక్ట్?"-ఇలాంటి చర్చోపచర్చలలో కాలం గడుపుతూ ఉంటారు.

నేనేమి చెబుతానంటే--"శ్రీచక్రాన్ని ఎలా గీశాం? ఏ లోహంతో దానిని చేయించాం? అన్నది ప్రధానం కాదు.దానిని తల్లక్రిందుగా వేలాడదీశామా లేక నిలబెట్టామా లేక పడుకోబెట్టామా అన్నది ప్రధానం కాదు.నువ్వు నీ నిత్యజీవితంలో సక్రమంగా ఉన్నావా లేదా,ఉంటూ ఉపాసనను చేస్తున్నావా లేదా? అన్నదే ప్రధానం"- అని చెబుతాను.

ఎందుకంటే--"ఉపాసనను చేస్తున్నది నువ్వు.అలాంటి నువ్వే సరిగ్గా లేకుంటే,ఆ చక్రానికి ఎన్ని కోణాలుంటే ఏమిటి? లేకపోతే ఏమిటి?మధ్యలో త్రికోణం ఉంటె ఏమిటి?చతురస్రం ఉంటె ఏమిటి? మోక్షం కావలసింది నీకా? చక్రానికా?సిద్ధి కలగవలసింది నీకా? యంత్రానికా?" --అని నేనంటాను.

కనుక అనవసరమైన విషయాలలో కాలం గడిపేవారికి నా పుస్తకంలో ఏమీ రహస్యాలు కనిపించనిమాట వాస్తవమే.కానీ ఎవరైతే సత్యాన్ని తెలుసుకోవాలనీ,దానిని ఈ జన్మలోనే చేరుకోవాలనీ తపిస్తూ ఉంటారో, అలాంటివారికి మాత్రం ఈ పుస్తకం ప్రతిపేజీలోనూ అద్భుతమైన రహస్యాలు గోచరం అవుతాయి.

ప్రపంచంలోని ప్రతిదానిలోనూ ఒక సూత్రం ఉన్నది.మనం దేనికోసం వెదుకుతామో అదే మనకు కన్పిస్తుంది.మనం గనుక "చూడకూడదు" అనుకుంటే, మన ఎదురుగా ఉన్నా సరే అది మనకు కనిపించదు.ఇది జీవితంలో ప్రతివిషయానికీ వర్తిస్తుంది.నా పుస్తకం కూడా దీనికి మినహాయింపేమీ కాదు.

మన మస్తకం సరిగ్గా లేకపోతే పుస్తకంలో మాత్రం ఏమి కనిపిస్తుంది?