“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

11, ఫిబ్రవరి 2015, బుధవారం

కార్లు - బార్లు

మొన్నొకసారి గుంటూరు నుంచి విజయవాడకు కారులో వెళ్ళడానికి రెండు గంటలు పట్టింది.మామూలుగా 35 లేదా 40 నిముషాలలో గుంటూరు నుంచి విజయవాడకు చేరుకోవచ్చు.కానీ ఆరోజున రెండు గంటలు పట్టింది.ప్రతి సిగ్నల్ దగ్గరా కనీసం 15 నుంచి 20 నిముషాలు ఆగడంతో ఇలా జరిగింది. ఇలా ఎందుకు జరిగిందా అని ఆరా తియ్యగా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి.

గత మూడు నెలలలో గుంటూరు విజయవాడలలో కార్ల అమ్మకాలు 30% పెరిగాయిట.రోడ్లమీద ఉన్నట్టుండి కార్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అందుకని ప్రతి సిగ్నల్ దగ్గరా వేచిచూచే సమయం ఇప్పుడు ఉన్నట్టుండి ఎక్కువైపోయింది.టౌన్ల సంగతి ఎందుకు?ఇప్పుడు ఏ పల్లెలో చూచినా ఉన్నట్టుండి మంచిమంచి కార్లు దర్శనమిస్తున్నాయి.దీనికి కారణం ఉన్నట్టుండి విపరీతంగా పెరిగిన భూముల రేట్లు.తద్వారా ప్రజల చేతుల్లో ఆడుతున్న పిచ్చి డబ్బు.

గుంటూరు విజయవాడ పరిధిలో కొద్దోగొప్పో భూమి ఉన్న ప్రతివారూ రాజధాని పుణ్యమాని తెల్లవారేసరికి కోటీశ్వరులై కూచున్నారు.కోట్లు చేతిలో కనిపిస్తుంటే ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి.ఈలోపల కార్ల ఏజెంట్లు వచ్చి వాలిపోతారు.ఒక కారును కొనిపించేస్తారు.దానిలో విహారం మొదలౌతుంది.ఆ విధంగా గత మూడు నెలలలో కొన్ని వందల కార్లు రోడ్లమీదకు వచ్చేశాయి. రోడ్లు మాత్రం అవే గతుకులతో ఏడుస్తున్నాయి.ఇకపోతే ట్రాఫిక్ సిగ్నల్స్ ఎవరూ పాటించరు గదా? ఇక చెప్పవలసిన పనేముంది?

ఇకపోతే కార్ల తర్వాత ఉన్నట్టుండి ఎక్కువైనవి బార్లు.

ఉన్నట్టుండి కొత్తగా పుట్టుకొచ్చిన బార్లు కొన్నైతే,ఏ పాతబారు చూచినా ఒక సమయం సందర్భం లేకుండా కిటకిటలాడి పోతూ వాటి దగ్గర ట్రాఫిక్ జాం అయ్యే పరిస్థితి,ముఖ్యంగా సాయంత్రం సమయాలలో కనిపిస్తూ ఉన్నది.నడమంత్రపు సిరి వల్ల చేతిలో ఆడుతున్న డబ్బు సాయంత్రానికి బారుకు దారితీయిస్తున్నది.

'కార్' అనేది మనిషిలోని లిబిడో కి ఒక సంకేతం అన్నాడు ఫ్రాయిడ్.ఆ కోణంలో చూస్తే,మనిషి దగ్గర డబ్బు ఉన్నట్టుండి ఎక్కువైపోతే, పెరిగేవి తిండీ తాగుడూ లిబిడో మాత్రమె అని అనుకోవలసి వస్తుంది.అది నిజం కూడా.

పాతకాలంలో పంటలు బాగా పండిన సీజన్లలో పల్లెలకు దగ్గరలో ఉన్న టౌన్స్ లో బార్లు,బంగారు షాపులు,బట్టల షాపులు కళకళలాడుతూ ఉండేవి. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ఎక్కడ చూచినా కనిపిస్తున్నది.బార్లతో సమానంగా బంగారం షాపులు కిటకిటలాడుతున్నాయి.అయితే బార్లలో మగవారు కనిపిస్తుంటే బంగారు షాపులలో ఆడవారు దర్శనమిస్తున్నారు. పురుషులు మదిరాపానంతో సేదతీరుతుంటే కాంతలు కనకంతో తృప్తి పడుతున్నారు.

అప్పనంగా వచ్చిపడిన డబ్బులతో ఎడాపెడా బంగారం కొనడమే కాబోలు "స్వర్ణాంధ్రప్రదేశ్" అంటే? అని సర్దిచెప్పుకోవలసి వస్తోంది.ఆ రకంగా చూస్తే ఇంకా రాజధాని కూడా కట్టకముందే మన "స్వర్ణాంధ్రప్రదేశ్" స్వప్నం సాకారం అయిపోయినట్లే !!

ఇంకో రెండునెలల్లో ఆంధ్రా రాజధాని గుంటూరు విజయవాడల నుంచి ఆపరేట్ కాబోతున్నది.ఇక అప్పుడు ఉంటుంది అసలు పండగ !! ఇప్పటికే ఇంతకు ముందు కంటే కనీసం 20 % ఎక్కువ జనం గుంటూరు విజయవాడ రోడ్లమీద కనిపిస్తున్నారు.వీరంతా హైదరాబాద్ నుంచి తరలి వచ్చేసినవారే అన్నది వాస్తవం.ఇక ప్రభుత్వ ఆఫీసులు కూడా తరలి వచ్చేస్తే కొన్ని వేలమంది ఉద్యోగులూ వారి కుటుంబ సభ్యులూ అందరూ ఇక్కడకు వలస వస్తారు.వారితో బాటు అనుబంధ ప్రైవేట్ సంస్థలూ వాటి ఉద్యోగులూ అందరూ కూడా వలస వస్తున్నారు.ఇప్పుడు ఉన్న కరెంటు,నీరు,రోడ్లు ఇంకా ఇతర వసతులను వారూ పంచుకోవలసి వస్తుంది.ఈ సందర్భంగా గుంటూరు విజయవాడలలో జనజీవనం మహా చిరాకుగా తయారయ్యే సూచనలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇప్పటికే మాటమాటకీ ఎవరో మంత్రిగారు వస్తున్నారంటూ ఎక్కడికక్కడ రోడ్డు బ్లాకులు,ట్రాఫిక్ డైవర్షన్లు ఎక్కువౌతున్నాయి.ముఖ్యమంత్రిగారు సందర్శనకు వచ్చిన ప్రతిసారీ ట్రాఫిక్ కష్టాలు తీవ్రంగా ఎదురౌతున్నాయి.ఇక రెండు నెలల తర్వాత మంత్రివర్యులందరూ ఇక్కడే కాపురం ఉండటం మొదలు పెడితే అప్పుడు ఉంటుంది సామాన్య పౌరుడి పరిస్థితి !!

జనజీవనం ప్రభుత్వ ప్రోటోకాల్ కోరల్లో ఇరుక్కుని విలవిలలాడక తప్పని పరిస్థితి త్వరలో ఎదురయ్యేటట్లే కనిపిస్తున్నది.

నడమంత్రపు సిరి ఎక్కువైన ప్రతిసారీ ప్రజాజీవనంలో విలువలు మృగ్యమౌతాయన్నదీ,అహంకార ధోరణులు పెరిగిపోతాయన్నదీ చరిత్రలో ఎన్నోసార్లు రుజువైన వాస్తవం.ఆ పరిస్థితి ఆంధ్రాలో మళ్ళీ అతి త్వరలో కనిపించబోతున్నది.పేదా గొప్పల మధ్యన తారతమ్యం ఎక్కువైపోయిన ప్రతిసారీ సమాజంలో నేరాలు పెరిగే మాటా వాస్తవమే.ఇదికూడా అతిత్వరలో మళ్ళీ మనం చూడబోతున్నాం.

అసలే సర్కారు జిల్లాలలో డబ్బూ కులమే ప్రధానమైన విషయాలు.నేను సర్కారు జిల్లాలలో పుట్టి పెరిగినవాడినే.కానీ రాయలసీమ తెలంగాణాలలో తిరిగి చూచిన అనుభవంతో ఒక మాట చెప్పగలను.రాయలసీమ తెలంగాణాలలో మనిషికి విలువ ఇస్తారు.స్నేహానికి విలువ ఇస్తారు. మంచితనానికి ఇంకా కొద్దో గొప్పో అక్కడ విలువ ఉన్నది.మానవత్వం ఇంకా అక్కడ బ్రతికి ఉన్నది.కానీ ప్రస్తుత ఆంద్రప్రదేశ్ కు పట్టుకొమ్మలైన సర్కార్ జిల్లాలలో మాత్రం మనిషిని పూర్తిగా డబ్బుతోనే కొలుస్తారు.ఇక్కడ కులమూ,డబ్బూ మాత్రమే ప్రధానమైన విషయాలు.ఈ ప్రాంతంలో ఒక మనిషిని అంచనా వేసేది ఈ రెంటితోనే.

సర్కారు జిల్లాలలో ఇదొక దౌర్భాగ్యకరమైన అలవాటు.నేను ఇక్కడివాడినే అయినప్పటికీ నిష్పక్షపాతంగా ఈ మాటను చెబుతున్నాను.కులమూ డబ్బూ ఎక్కడైతే ప్రధానమైన విషయాలు అవుతాయో అక్కడ మానవత్వం మంటగలసి పోతుంది.మోసమూ స్వార్ధమే అక్కడ రాజ్యమేలుతుంది.వెరసి జనజీవనం చాలా కృత్రిమంగా తయారౌతుంది.ప్రస్తుతం గుంటూరు విజయవాడలలో అదే పరిస్థితి కన్పిస్తున్నది.ముందు ముందు ఇది ఇంకా ఎక్కువయ్యే సూచనలూ కనిపిస్తున్నాయి.

ఆంద్రప్రదేశ్ లో ప్రస్తుతం పొంగి పొర్లుతున్న నడమంత్రపు సిరితో ఉన్నట్టుండి ఎక్కువైన కార్లూ,కిటకిటలాడుతున్న బార్లూ,బంగారం షాపులూ, రెస్టారెంట్లూ, ట్రాఫిక్ కష్టాలూ,పార్కింగ్ కష్టాలూ,ఎక్కడ చూచినా జనాలతో కిక్కిరిస్తున్న నగరాలూ ప్రస్తుతం దర్శనమిస్తున్నాయి.

దీనికి విభిన్నంగా హైదరాబాద్ లో కొన్ని విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇంతకు ముందు పండగలు వస్తే,హైదరాబాద్ నుంచి విజయవాడ విశాఖపట్నాల వైపు కొన్ని వందల బస్సులు నడిచేవి.ఇప్పుడు వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది.జనం ఇటువైపు వలస వచ్చేస్తూ ఉండడంతో సెలవలు ఇస్తే హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చేవారి సంఖ్య బాగా తగ్గింది.రైళ్ళలో ప్రయాణీకుల సంఖ్య కూడా తగ్గింది.కనుక ఆయా సంబంధిత వ్యాపారాలు కూడా మూతబడుతున్నాయి.

ఇకపోతే హైదరాబాద్ లో ఇంతకుముందు ఆటోలు అంత వెంటనే దొరికేవి కావు.కొంచం సేపు వేచి చూడవలసి వచ్చేది.కానీ ఇప్పుడు ఏ సెంటర్ లో చూచినా ఒక ఇరవై ఆటోలు ఖాళీగా కనిపిస్తున్నాయి.మొన్నొకసారి హైదరాబాద్ వెళ్ళినపుడు ఒక ఆటో డ్రైవర్ని అడిగాను.

అతనిలా చెప్పాడు.

'సార్.మీ ఆంధ్రా వాళ్ళు చాలామంది మీవైపు వెళ్ళిపోతున్నారు.ఇక్కడ ప్రజలు సామాన్యంగా ఆటోలు ఎక్కరు.ఎక్కువగా బస్సులమీదే ఆధారపడతారు.లేదా సొంత కార్లో,ద్విచక్ర వాహనాలో ఉంటాయి.ఇప్పుడు మాకు గిరాకీలు బాగా తగ్గిపోయాయి.మావాళ్ళు ఆటోలు తిప్పడం మానేసి వేరే పనులలోని మారిపోతున్నారు.'

దానికి నేనిలా చెప్పాను.

'ఇదీ ఒకందుకు మంచిదే.జనం ఎక్కువై పోయి హైదరాబాద్ నగరం దుర్భరంగా తయారైంది.ఇప్పుడు సర్కారు ప్రజలు ఖాళీ చెయ్యడం వల్ల మళ్ళీ పాత హైదరాబాద్ లాగా విశాలంగా,కాలుష్య రహితంగా తయారౌతుందేమో? అప్పుడు సిటీ అన్నా బాగుపడుతుంది.అంతకంటే కావలసింది ఏముంది?'

జనం తగ్గడం వల్ల హైదరాబాద్ బాగుపడవచ్చు.నివాసానికి మంచి నగరంగా మారవచ్చు.కానీ అదే జనం పెరగడంవల్ల గుంటూరు విజయవాడలు దుర్భరంగా మారబోతున్నాయి.

'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' అంటే ఇదేనేమో?

రాష్ట్రం విడిపోవడం వల్ల ఎన్నెన్ని మార్పులు ఈ విధంగా మన కళ్ళముందే కనిపిస్తున్నాయో?రాజకీయ నిర్ణయాల వల్ల జనజీవితాలు ఎన్ని రకాలుగా ప్రభావితాలు అవుతున్నాయో?

ఏదేమైనా గుంటూరు విజయవాడ చుట్టుపక్కల 'నడమంత్రపు సిరి' ఎన్నెన్ని వినాశనకరమైన మార్పులు తెస్తున్నదో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నది. 

ముందు ముందు ఇంకెన్ని చూడవలసి వస్తుందో ఆ దేవుడికే ఎరుక.