“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

5, డిసెంబర్ 2014, శుక్రవారం

టీవీ జ్యోతిష్కులు -- తిక్క రెమెడీలు

జ్యోతిష్యం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గనుక,ప్రతి టీవీ చానల్ వారూ ఒక జ్యోతిష్కుని వంటి మనిషిని (?) అద్దెకు తెచ్చుకుని ప్రోగ్రాములిస్తున్నారు.టీవీ జ్యోతిష్కుల మీద నాకు పెద్దగా సదభిప్రాయం లేదు.వాళ్ళలో ఎవరికీ సరైన సబ్జెక్ట్ ఉండదని నా విశ్వాసం.కొన్ని పడికట్టు పదాలు బట్టీపట్టి,పంచాంగాలలో ఉండే రాశిఫలితాలు పుక్కిటబట్టి,కుజదోషం,కాలసర్పయోగం అనే నాలుగు మాటలను పట్టుకుని,ఎదుటివాడిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ, భయపెడుతూ,బండి నడిపేసే జ్యోతిష్కులు కోకొల్లలు.వీరికి టీవీ చానల్ పాట్రనేజ్ ఎలాగూ ఉంటుంది గనుక ఇద్దరిదీ బిజినెస్ బాగా నడుస్తూ ఉంటుంది.అమాయకులు మోసపోతూ ఉంటారు.

చాలామంది ఇలాంటి జ్యోతిష్కులు చెప్పే రెమేడీలు భలేనవ్వు పుట్టిస్తూ ఉంటాయి.అసలు నన్నడిగితే మూడ్ బాలేనప్పుడు ఇలాంటి ప్రోగ్రాం ఏదన్నా చూస్తె చాలు పొట్ట చెక్కలై మూడ్ సెట్ అయిపోతుంది అంటాను.

వీరిచ్చే కొన్ని సలహాలను చూద్దాం.

ఫలానా ఊరినుంచి ఒకాయన ఇలా అడుగుతాడు.

సార్.మా అమ్మాయికి పదమూడేళ్ళు వచ్చాయి.ఇంకా పెళ్లి కావడం లేదు.మా ఇంట్లో అందరం తెగ కంగారు పడిపోతున్నాం.అమ్మాయి జాతకాన్ని నిర్మొహమాటంగా వివరిస్తూ,ఏవైనా రెమేడీలు ఉంటె చెప్పండి.

అసలీ 'నిర్మొహమాటంగా వివరించడం' అనే పదం ఏమిటో నాకైతే ఎప్పటికీ అర్ధం కాదు.మొహమాటం ఎవరికీ? ఎందుకూ? జ్యోతిష్కునికా?అమ్మాయికా?లేక అడిగే ఆయనకా? అసలీ మొహమాటం అనే పదం ఎందుకు వాడతారో నాకు తెలీదు.

ఏదేమైనా, ఈ ప్రశ్నకు నేనైతే ఇలా జవాబు చెప్తాను.

"అయ్యా.బుద్ధిలేని పెద్దమనిషిగారు.అమ్మాయికి పాలపళ్ళు ఊడకముందే పెళ్లి చెయ్యడంగాదు నీవు చెయ్యవలసిన పని.ముందా అమ్మాయిని బాగా చదివించి ప్రయోజకురాలిని చేసి తన కాళ్ళమీద తను నిలబడే విధంగా తయారు చెయ్యి.ఆర్ధికంగా భర్తమీద ఆధారపడకుండా స్వతంత్రంగా తలెత్తుకుని జీవిస్తూ ఉండే విధంగా ముందామెను తయారుచెయ్యి. ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని ఆమె సంతరించుకునేలా తోడ్పడు.ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచించవచ్చు.నీ సమస్యకు కావలసింది జ్యోతిష్య రెమేడీలు కాదు.అసలు మీ అమ్మాయికి ఏ విధమైన రెమెడీ అవసరం లేదు.రెమెడీ కావలసింది నీకు.నీ జాతకంలో బుద్ది కారకుడైన బుధుడు వక్రించి ఉంటాడు.చూసుకొని ముందు దానికి పరిహారం నీవు చేసుకో."

కానీ టీవీ జ్యోతిష్కుడు ఇచ్చే సలహా ఇలా ఉంటుంది.

"మీ అమ్మాయికి కుజదోషం ఉన్నది.ఆ దోషం చాలా భయంకరమైనది.అది ఉన్నపుడు అమ్మాయికి ఏభైఏళ్ళ వరకూ పెళ్లికాదు.ఆ తర్వాత అయినాకూడా ఎలాగూ ఉపయోగం ఉండదనుకోండి.కనుక మీరు ఒక పని చెయ్యండి.వెంటనే కృష్ణాజిల్లా మోపిదేవితో మొదలుపెట్టి,తమిళనాడులో మారుమూల శివాలయం వరకూ అన్ని చోట్లా తడిబట్టలతో పొర్లుదణ్ణాలు పెడుతూ కుజహోమాలు చేయిస్తూ పొండి.ఇదంతా అవడానికి ఎలాగూ పదేళ్ళ పైన పడుతుంది.ఈలోపల దారిలోని ఏదో ఒక ఊరిలో మీకు అల్లుడు తప్పక దొరుకుతాడు.ఒకవేళ అమ్మాయి పెళ్లివిషయం పట్టించుకోకుండా మీరు ఇలాగే హోమాలు చేసుకుంటూ కూచుంటే మీ అమ్మాయే ఈలోపల ఎవర్నో ఒకర్ని ప్రేమవివాహం చేసేసుకుంటుంది. ఎలాగైనా మీకు మంచిదే.శుభం."

ఈలోపల ఇంకొక వ్యక్తి ఇలా ప్రశ్నిస్తాడు.

"సార్.నేను ఈ మధ్యనే అయిదంతస్తుల ఇల్లు కట్టాను.అది కట్టిన దగ్గరనుంచీ ఒకటే సమస్యలు.మొదట మా ఇంట్లో పెంపుడు పిల్లి చనిపోయింది.ఆ తర్వాత మా ఆవిడకు అనారోగ్యం పట్టుకుంది.ఇప్పుడు నాకు బీపీ సుగరూ ఒకేసారి ఎటాక్ అయ్యాయి.ఏం చెయ్యాలో తెలియడం లేదు.రెమేడీ చెప్పండి సర్."

ఆ శాస్త్రజ్ఞుడు ఇలా సలహా ఇస్తాడు.

"నీవు కట్టిన ఇంటివాస్తు,దేశవాస్తుతో సరైన ఎలైన్ మెంట్ లో లేదు.అందుకే నీకీ సమస్యలు.ఆ ఇల్లు మొత్తం పడగొట్టించి జస్ట్ రెండంగుళాలు ఉత్తరానికి జరిపి మళ్ళీ అదే ప్లాన్లో తిరిగి కట్టించు.సరిపోతుంది."

ఆ వ్యక్తి నోరెళ్ళబెట్టి కింద పడిపోతాడు.అంబులెన్స్ వచ్చి అతన్ని తీసుకుపోతుంది.

నేనైతే ఆ వ్యక్తికి ఇలా చెప్తాను.

'పిల్లి ఎన్నాళ్ళు బ్రతుకుతుంది బాబు?అదేమన్నా నిండు నూరేళ్ళు సుమంగళిగా ఉంటుందనుకున్నావా?పిల్లి చనిపోయిన తర్వాత మీ ఆవిడ దిగులుతో అనారోగ్యం పాలైంది అంటే,ఆమెకు నీమీద కంటే పిల్లిమీదే ప్రేమ ఎక్కువగా ఉందన్నమాట.అంటే నీవు మీ ఆవిడను సరిగ్గా పట్టించుకోవడం లేదన్న మాట.ముందు ప్రతిరోజూ రెండుగంటలు మీ ఆవిడ దగ్గర కూచుని మంచీ చెడూ మాట్లాడి ఆమెను ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టు.ఆ తర్వాత ఆమెకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించు.సరిపోతుంది.డబ్బు సంపాదనలో నీ గొంతెమ్మ కోరికలను తగ్గించుకుని ఆహారపు అలవాట్లు మార్చుకుని నువ్వూ ఒక మంచి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకో.నీ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అంతేగాని నువ్వు కట్టిన ఇంటికీ,నువ్వు చెప్పిన సంఘటనలకూ ఏమీ సంబంధం లేదు.ఇక వెళ్ళు.'

ఈలోపల ఇంకొక వ్యక్తి ఇలా ప్రశ్నిస్తాడు.

'సార్.నేను పెళ్లి చూపులకు వెళ్ళిన ప్రతి అమ్మాయికీ పెళ్లై పోతున్నది.నాకు మాత్రం కావడం లేదు.రెమేడీ చెప్పండి సార్."

టీవీ జ్యోతిష్కుడు ఇలా అడుగుతాడు.

'చూడు బాబు.నీవు పొద్దున్నే లేవగానే ఏం చేస్తావు?'

'టాయిలెట్ కి వెళ్తాను సర్'

'అదే నీవు చేస్తున్న పెద్దతప్పు.అందుకే నీకు పెళ్లి కావడం లేదు.ఇకనుంచీ పొద్దున్న లేవగానే ఒకపని చెయ్యి.ముందు టాయిలెట్ కు వెళ్ళకు.మీ ఇంట్లో నైర్రుతి మూలనుంచి ఈశాన్యం మూలకు కళ్ళుమూసుకుని ఒక వంద అడుగులు నడువ్.అలాగే వెనక్కు నడుస్తూ మళ్ళీ నైర్రుతి మూలకు వెళ్ళు.ఆ తర్వాత స్నానం చేసి మీ అమ్మగారి చీర నీవు కట్టుకుని బాబా గుడికి వెళ్ళు.అక్కడ మర్రిచెట్టుమీద ఒక కోతి ఉంటుంది.గతరాత్రి నానబెట్టిన కేజీ శనగలను నీ స్వహస్తాలతో దానికి తినిపించు.నీ సమస్య పరిష్కారం అవుతుంది.'

కుర్రాడికి అనుమానం వస్తుంది.

'సార్.వంద అడుగులు అలా సూటిగా నడిస్తే పక్కింటి టెర్రేస్ మీదకు వెళ్ళాల్సి వస్తుంది సార్.'

'అవసరం అయితే వెళ్ళాలయ్యా.మధ్యలో నీ చచ్చు అనుమానాలతో డిస్టర్బ్ చెయ్యకు.విను.'

కానీ ఆ కుర్రాడు వినిపించుకోడు. 

'సార్.కోతి చెట్టుమీద కదా ఉండేది.కిందున్న నేను దానికి శనగలు ఎలా తినిపించాలి సార్?నాకు చెట్లెక్కడం  రాదు సార్?' అంటూ దీనంగా మొహం పెడతాడు.

వెంటనే శాస్త్రవేత్తకు కోపం వస్తుంది.

'రాకపోతే నేర్చుకోవాలయ్యా.రెమేడీ అంటే తమాషా అనుకున్నావా? చెట్లు పుట్టలు అన్నీ ఎక్కాలి.గోడలు దూకాలి.మేడలు ఎక్కాలి.అన్నీ చెయ్యాలి. '

'అయినా ఇదేం రెమెడీ సార్? కోతికి శనగలు తినిపిస్తే అది ఊరుకుంటుందా?పైనబడి నన్ను రక్కితే నా గతేం కావాలి?'

'ఏమో అదంతా నాకు తెలీదు.మా గురువుగారు రాసిన పుస్తకంలో ఇలాగే ఉంది.ఆ తిప్పలేవో నీవు పడు.చెబుతుంటే మధ్యలో ఇలా మాటమాటకీ అడ్డురాకు.అవతల చాలామంది క్యూలో ఉన్నారు.'

పిచ్చిచూపులు చూస్తూ ఆ కుర్రాడూ నిష్క్రమిస్తాడు.

నేనైతే అతనికి ఇలా చెప్తాను.

'చూడు బాబు.అంతమంది అమ్మాయిలు ఎందుకు నిన్ను తిరస్కరిస్తున్నారో ముందు ఆత్మపరిశీలన చేసుకో.వాళ్లకు కావలసినవి నీ దగ్గర లేవు గనుక వారలా నిన్ను రిజెక్ట్ చేస్తున్నారు.ముందు అవేంటో గ్రహించి వాటిని సరిదిద్దుకో.అంతేగాని జ్యోతిష్యం అంటూ రెమెడీలంటూ  కాలక్షేపం చేస్తూ ఉంటె,ఈలోపల నీకు వయసైపోతుంది.అప్పుడసలే నీకు పెళ్లి కాదు.

ఒక సంఖ్యా శాస్త్రవేత్తతో సలహాల కార్యక్రమం టీవీలో వస్తూ ఉంటుంది.ఆయనపేరు 'ధనరాజ్' అని యాంకర్ పరిచయం చేస్తాడు.కానీ అతని ముందున్న నేం ప్లేట్ మీద 'DhahhNahRaahjjhaah' అని ఉంటుంది.

మన కళ్ళకు ఏమన్నా సైటు వచ్చిందా అని మనకే అనుమానం వస్తుంది.

ఈలోపల ఫోన్లో ఒక ఆగంతకుడు ఇలా అడుగుతాడు.

"సార్ నాపేరు సునీల్.నేను బీటెక్ సెకండ్ యియర్ చదూతున్నాను. ఈ మధ్య నాకేమీ కలసి రావడం లేదు."

"అప్పుడే నీకేం కలిసొస్తుంది నాయనా?అయినా కలసి రావడం లేదు అంటే ఏంటో కొంచం చెప్పమ్మా?"

"ఏముంది సార్.ఇంతకుముందు మా నాన్న నెలకు ఇరవైవేలు పాకెట్ మనీ ఇచ్చేవాడు.ఈ మధ్య ఆయనే అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్నాడు.నా పాకెట్ మనీకి గండి పడింది.ఇదే అదనుగా ఫస్ట్ యియర్ నుంచీ స్నేహంగా ఉన్న నా గర్ల్ ఫ్రెండ్ నాతో మాట్లాడడం మానేసి,డబ్బున్న ఇంకొకడితో స్నేహం మొదలెట్టింది.ఇవీ సార్ నా బాధలు.ఈ బాధలు భరించలేక సూయిసైడ్ చేసుకుందామనిపిస్తోంది సార్. ఏవైనా రెమెడీలు చెప్పండి సార్."

ఈ కుర్రాడికి నేనైతే ఇలా చెప్తాను.

"నాయనా నువ్వు చదూతున్నది.బీటెక్ సెకండ్ యియర్.అప్పుడే నీకు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు నాయనా?పైగా నెలకు ఇరవైవేలు పాకెట్ మనీనా?అదికూడా మీ నాన్న అక్రమార్జనతోనా? నీకు రెమేడీలు కావాలా? లేకపోతే సూయిసైడ్ చేసుకుంటావా? మా నాయనే? నోర్మూసుకుని బుద్ధిగా చదువుకుని ముందు జీవితంలో బాగా స్థిరపడు.ఎక్కువ మాట్లాడావంటే ఇదే స్టేజీ మీద నీ మక్కెలు ఇప్పుడే విరగ్గొట్టి చూపిస్తాను.ఈ వయసులోనే గర్ల్ ఫ్రెండ్స్ అంటూ తిరిగితే బీటెక్ పదేళ్ళు చదువుతూ అదే హాస్టల్లో పర్మనెంట్ గెస్ట్ గా ఉండిపోతావు.ఇప్పుడే గర్ల్ ఫ్రెండ్స్ తో ఇలా తిరిగితే పెళ్లి తర్వాత సంసారానికి పనికిరాక సన్యాసం తీసుకోవలసి వస్తుంది.అసలు రెమెడీ కావలసింది నీక్కాదు నాకు.ఇలాంటి బుద్ధిలేని ప్రోగ్రాములో నన్ను కూచోబెట్టినందుకు ఈ టీవీవారినీ,వీరిని నమ్మి వచ్చినందుకు నన్నూ ముందు అనుకోవాలి. బుద్ధుంటే ఇలాంటి ప్రోగ్రాంకి ఇంకోసారి చస్తే రాను.వెళ్లి బుద్ధిగా చదువుకో నాయనా.నేనూ వెళ్ళొస్తా".

కాని పేరుగాంచిన ఆ న్యూమరాలజిస్ట్ అలా చెప్పడు.

"చూడు బాబు.అసలు దోషం అంతా నీ పేరులోనే ఉంది.తప్పు నీది కాదు.ఇలాంటి పేరు నీకు పెట్టిన మీ అమ్మానాన్నల్ని అనాలి.నీ పేరు Suneel కదా.అర్జెంట్ గా దానిని SuhhNneellhh అని మార్చుకో.నీ జాతకంలోని గ్రహాలన్నీ వెంటనే చెల్లాచెదురై మంచి స్థానాలలోకి వచ్చేస్తాయి."

పుట్టిన బిడ్డకు పేరు పెట్టడం అమ్మా నాన్నలది తప్పెలా అవుతుందో మనకు అర్ధంకాదు. 

ఆ కుర్రాడు తెలివిగా ఇలా అడుగుతాడు.

'అప్పుడు ఆ పేరును ఎలా పలకాలి సార్?'

"పిచ్చివాడా.సౌండ్ వైబ్రేషన్ లోనే అంతా ఉంది.అప్పుడా పేరును "సుహ్ న్నీల్ హ్హహ" అని పలకాలి.రేపటినుంచీ అందరిచేతా అలాగే పిలిపించుకో.ఎల్లుండి నుంచీ నీ అదృష్టం పండిపోతుంది"

ఆ కుర్రాడు అనుమానంగా చూస్తూ నిష్క్రమిస్తాడు.

ఈలోపల ఇంకొకాయన ఇలా అడుగుతాడు.

"సార్.మా అబ్బాయి అమెరికాలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు.కానీ ఎన్ని సంబంధాలు చూసినా కుదరడం లేదు.ఏదన్నా రెమెడీ చెప్పండి సార్"

వెంటనే టీవీ జ్యోతిష్కుడు తన లాప్టాప్ ఓపన్ చేసి దీర్ఘంగా దానిలోకి కాసేపు చూస్తాడు.అది అటువైపు తిరిగి ఉంటుంది గనుక అందులో అసలు జాతకచక్రం ఉందొ లేదో కూడా మనకు కనపడదు.తలవంచుకుని ఉన్న జ్యోతిష్కుడు ఎంతసేపటికీ తలెత్తక పోయేసరికి అతనొక చిన్న కునుకు తియ్యడం లేదుకదా అని మనకు అనుమానం కూడా వస్తుంది.

చివరకు మెలకువ వచ్చాక తలపైకెత్తి ఒక గాఢమైన నిట్టూర్పు వదులుతాడు.

"చూడండి సార్.మీ అబ్బాయి పూర్వజన్మలో ఒక అమెరికన్.అక్కడ ఆ జన్మలో చాలామంది అమ్మాయిలను పెళ్ళిచేసుకుని వాళ్ళను అర్ధాంతరంగా వదిలేశాడు.వారందరికీ "ఏలిమోనీ" కట్టకుండా పారిపోయి ఇండియా వచ్చేసి హైదరాబాద్లో ఇరానీ చాయ్ అమ్ముకుంటూ శేషజీవితం వెళ్లదీశాడు.అందుకని వాళ్ళ ఉసురు తగిలి ఈజన్మలో అతనికి పెళ్లికావడం లేదు.ఒక పని చెయ్యండి.మీ అబ్బాయి బరువుతో సరితూగే ఒక బంగారు అమ్మాయి విగ్రహం చేయించి దానిని నాకు దానం ఇవ్వండి.అన్ని దోషాలూ పటాపంచలై పోతాయి.

ఆ తండ్రి కూడా అనుమానంగా చూస్తూ నిష్క్రమిస్తాడు.

నేనైతే ఆ తండ్రిని ఇలా అడుగుతాను.

"ఎన్ని సంబంధాలు చూసినా మీ అబ్బాయికెందుకు పెళ్లికావడం లేదు?అమ్మాయి తరఫువారు వప్పుకోవడం లేదా?లేక మీ అబ్బాయికి ఎవరూ నచ్చడం లేదా?"

అప్పుడు ఆ తండ్రి ఇలా చెప్తాడు.

"మావాడి ఐడియాస్ చాలా డిఫరెంటండి.వాడు నల్లగా ఉన్నాసరే, చేసుకోబోయే అమ్మాయి మిల్క్ బ్యూటీలా తెల్లగా ధగధగా మెరిసిపోతూ ఉండాలి. మావాడు నాలుగడుగులు.అమ్మాయి అయిదూ ఎనిమిదిగాని ఐదూ తొమ్మిదిగాని ఉండాలి.దేవకన్యలా మిరుమిట్లు గొలుపుతూ చూడగానే కళ్ళు బైర్లు కమ్మేలా ఉండాలి.బాగా చదువుకుని ఉండాలి.మంచి ఉద్యోగం చేస్తూ నెలకు అయిదులక్షలు సంపాదిస్తూ ఉండాలి.ఆ అమ్మాయికి అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళూ ఎవరూ ఉండకూడదు.వాళ్ళ నాన్నగారికి తుళ్ళూరు చుట్టుపక్కల వందెకరాల పొలమో లేదా ఏదన్నా పెద్ద ఇండస్ట్రీనో ఉండాలి.ఇలాంటి అమ్మాయి కోసం వెదుకుతూ ఉన్నామండి."

అప్పుడు నేను ఇలా చెప్తాను.

"అదా అసలు సంగతి? రెమేడీలు మీవాడికి ఒక్కడికే కాదు.ముందుగా మీకు అవి అవసరం.అలాంటి కొడుకును కన్నందుకూ వాడి గొంతెమ్మ కోరికలను సపోర్ట్ చేస్తున్నందుకూ ముందు మీకు యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి. అప్పుడు జైల్లో కూచుని రోజూ మీ రెమెడీలు చక్కగా చేసుకోవచ్చు.ప్రపంచంలో ఉన్న జ్యోతిష్య రెమేడీలు అన్నీ చేసినా ఈ జన్మకు మీవాడికి పెళ్లి కాదు. అసలంటూ మార్చవలసింది గ్రహాలను కాదు.మీ వాడిదీ నీదీ మైండ్ సెట్లు ముందుగా మారాలి.అదే మీకు సరియైన రెమెడీ."

ఈలోపల యాంకరమ్మ తానేమీ తక్కువ తినలేదన్నట్లూ,అసలు తాను తెలుగమ్మాయే కానట్లూ,వచ్చీరాని ముద్దుముద్దు తెలుగు మాట్లాడుతూ కులుకుతూ- 'ఛుడండి షర్.ఈ మధ్య అందరూ ఛ్యోతిష్యం ఛ్యోతిష్యం అంటూ ఎగ్ బడుఛున్నారు.ఈ ఎగ్ బడఛాన్ని ఎలా అర్ధం ఛేస్కోవాలి?'అని అడుగుతుంది.

దానికి ఆ జ్యోతిష్కుడు కూడా అంతే లెవల్లో ముసిముసిగా నవ్వుకుంటూ మెలికలు తిరుగుతూ ఒక తలా తోకా లేని సమాధానం ఇస్తాడు.

నేనైతే ఆ అమ్మాయికి ఇలా చెప్తాను.

'చూడమ్మా.ఎందుకలా కులుకుతూ మాట్లాడతావు?అలా కులకకుండా సరిగ్గా తెలుగును మాట్లాడలేవా?ముందు చక్కని తెలుగును స్పష్టంగా మాట్లాడటం నేర్చుకో.ఆ తర్వాత ప్రశ్నను ఎలా అడగాలో నేర్చుకో.అడిగిన ప్రశ్నలో కొంత సరుకు ఉండేలా అడుగు.అసలు నీవడిగిన ప్రశ్నే అసందర్భంగా ఉన్నది.ఎగబడటం ఏమిటి?ఎవరు ఎవరిమీద ఎగబడుతున్నారు?ఈ ఎగబడటానికీ జ్యోతిష్యశాస్త్రానికీ సంబంధం ఏమిటి? ముందు ఈ ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు.ఆ తర్వాత నీ ప్రశ్నకు నేను జవాబిస్తాను.'  

ఇలాంటి పిచ్చి ప్రశ్నలూ పిచ్చి జవాబులతో ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి.

జ్యోతిష్య శాస్త్రపు ప్రయోజనాన్ని లోకులు ముందు సరిగ్గా అర్ధం చేసుకోవాలి.

మన గొంతెమ్మ కోరికలు తీరడానికో,అన్యాయపు అక్రమపు కోరికలు తీర్చుకోడానికో జ్యోతిష్యాన్ని ఒక ఉపాయంగా వాడుకోవాలని ఎప్పుడూ చూడకూడదు.అది ఒక మహాదోషం అవుతుంది.అలా చెప్పే జ్యోతిష్కులకూ, అడిగి ఆయా రేమేడీ(?)లను పాటించే మనుషులకూ జ్యోతిష్యశాస్త్రపు శాపం తగులుతుంది.అందుకే మనం గనుక గమనిస్తే,అలా చెప్పే జ్యోతిష్కుల కుటుంబాలలో వారికే తీరని భయంకరమైన సమస్యలుంటాయి.గొంతెమ్మ కోరికలతో అడ్డదిడ్డమైన రెమెడీలు చేసేవారికీ అలాంటి సమస్యలు వదలకుండా వేధిస్తూ ఉంటాయి.

ఇలాంటి పిచ్చి రెమెడీల ఫలితాలే అవి.

మనం పూర్వం చేసిన చెడుఖర్మను ప్రక్షాళన చేసుకోడానికీ,ధర్మబద్ధమైన కోరికలు త్వరగా సిద్ధింప చేసుకోడానికీ మాత్రమే జ్యోతిష్యాన్ని వాడుకోవాలి. దీనికి భిన్నంగా మన ఇష్టానుసారం ఈ శాస్త్రాన్ని వాడితే అలా వాడిన జ్యోతిష్కులకూ,పృచ్చకులకూ కూడా శాపాలు తప్పవు.

ఎదుటి వ్యక్తి భయాన్ని ఆసరాగా తీసుకుని అతడి డబ్బులు కాజేసేది అసలైన జ్యోతిష్యం కాదు.డబ్బుతో సంబంధం లేకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్లు చెప్పి అతడి భయాన్ని నిజంగా పోగొట్టి,ఆ సమస్యను నిజంగా తీరుస్తూ,ఆ వ్యక్తిని ధర్మమార్గంలో నడిపింప చేసేదే అసలైన జ్యోతిష్యం.

ఈ సంగతిని సోకాల్డ్ టీవీ జ్యోతిష్కులూ ఆ కార్యక్రమ నిర్వాహకులూ ఎంత త్వరగా అర్ధం చేసుకుంటే అంత మంచిది.