Spiritual ignorance is harder to break than ordinary ignorance

17, జనవరి 2014, శుక్రవారం

కుళ్ళు భారతం

డెన్మార్క్ టూరిస్ట్ డిల్లీలో రేప్ కు గురికావడం,అక్కడి పరిస్తితి ఎంత దారుణంగా ఉన్నదో కళ్ళకు కడుతోంది.నిర్భయ సంఘటన జరిగాక పార్టీలూ ప్రభుత్వాలూ దానిని ముక్తకంఠంతో ఖండించాయి.ఆ తర్వాత యధావిధిగా మరిచిపోయాయి.సరియైన చర్యలు తీసుకుని ఉంటే అలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ ఎందుకు జరుగుతాయి?

రేప్ కు గురైన స్త్రీ చాలా మానసిక క్షోభను అనుభవిస్తుంది.అందులో గ్యాంగ్ రేప్ అయితే ఆమెకు బ్రతకాలన్న ఇచ్ఛ సమూలంగా నశిస్తుంది.ఆ క్షోభ నుంచి తట్టుకుని బ్రతికి బట్టకడితే గొప్ప విషయమే అని చెప్పాలి.ఒకవేళ ఆ అమ్మాయి బ్రతకాలని నిశ్చయించుకున్నా చాలాసార్లు చుట్టూ ఉన్న సమాజం అనే సూటీపోటీ మాటలు భరించలేక ఆత్మహత్య చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి.ఈమధ్యనే అలాంటి సంఘటన ఒకటి జరిగిందికూడా.మనదొక sexually repressed and perverted society అని రజనీష్ చెప్పిన మాట అక్షరాలా యదార్ధం అని ప్రతిరోజూ రుజువౌతూనే ఉన్నది.

అసలు మనదేశంలో నీతి అనేది ఉన్నదా అని నాకెప్పటినుంచో పెద్ద సందేహం. మనదేశం అంటే ఏదో పెద్ద ఆధ్యాత్మికనిధి అని భావించి చూద్దామని వచ్చిన విదేశీమహిళలు చాలాసార్లు రేప్ కు గురౌతూ ఉంటారు.లేదా నిత్యానంద వంటి కుహనాగురువుల చేతిలో పడుతూ ఉంటారు.ఇదెంత అవమానకరమైన పరిస్తితో ఊహించలేము.పుట్టపర్తిలో అలాంటి పరిస్థితులు అనుభవించిన ఒకరిద్దరు విదేశీవనితలు నాకు పర్సనల్ గా తెలుసు.

మనదేశంలో ఇలాంటి సంఘటలు జరిగినప్పుడల్లా బాధితమహిళకు చెందిన దేశంలో ఉన్న భారతీయులు వాళ్ళు ఉద్యోగులు గానీ విద్యార్దులుగానీ చాలా అసహ్యకరమైన పరిస్తితిని ఆయా దేశాలలో ఎదుర్కొంటారు.చాలాసార్లు వాళ్ళు అక్కడ స్నేహితులకూ సాటి ఉద్యోగులకూ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్తితి కలుగుతూ ఉంటుంది(వాళ్ళు భారతీయులైన పాపానికి).

ఒకసారి నేను తిరుపతిలో ఉన్నపుడు రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఒక రష్యా అమ్మాయి హడావుడిగా నా వద్దకు వచ్చింది.రైల్వే స్టేషన్ లో రిటైరింగ్ రూమ్స్ బయట నేను నిలబడి ఉన్నాను.రూం రేట్స్ ఎంక్వైరీ చెయ్యడానికి ఆ అమ్మాయి వచ్చింది.ఆ సమయానికి అక్కడ ఎవరూ లేకపోతే ఆ బోర్డ్ చూపించి నేనే వివరించి చెప్పాను.ఆ సమయంలో ఆమె ఒంటరిగా ఒక్కతే ఉండటం నాకు ఆందోళన కలిగించింది.

ఇంకోమాట కూడా చెప్పాను.

'మీరు త్వరగా మంచి హోటల్ చూచుకుని చెక్ ఇన్ అవండి.అర్ధరాత్రి వరకూ రోడ్లమీద తిరగవద్దు' అని చెప్పాను.

ఆమె నవ్వి 'ఇది హోలీ టౌన్ కదా' అన్నది.

ఎక్కువగా వివరించడం ఎందుకని 'డోంట్ టేక్ రిస్క్ ఈవెన్ విత్ హోలినెస్' అని మాత్రం చెప్పాను.

ఆమె నవ్వేసి వెళ్ళిపోయింది.నేను చెప్పిన మాటలు ఆమె సీరియస్ గా తీసుకున్నట్లు అనిపించలేదు.అప్పుడు నా మనస్సులో మన దేశప్రతిష్ట ఒక్కటే మెదిలింది.ఆమెకు ఏమీ జరుగకుండా చూడమని వెంకన్నను ప్రార్ధించాను.

ఎదురుగా కనిపిస్తున్న వ్యభిచార గృహం మీద దాడి చెయ్యమని లా మినిస్టర్ ఆదేశిస్తే తిరస్కరించిన పోలీసులున్న దేశం మనది.ఎంత గొప్ప దేశమో?ఉద్యోగులు కూడా కుళ్ళిపోయారనడానికి ఇంతకంటే ఇంకొక ఉదాహరణ అవసరం లేదు.నాయకులూ ఉద్యోగులూ చీకటి వ్యాపారులూ కలసి ఒక భయంకరమైన మాఫియా ఏర్పడితే ఇక ఆ సమాజాన్ని ఎవడూ రక్షించలేడు.

చదువరులకు అనుమానం రావచ్చు.ఎక్కడో జరిగిన ఒక stray incident ను పట్టుకుని అందర్నీ generalize చెయ్యడం తప్పు కదా.ఎవరో ఏదో చేస్తే దేశంలో మొత్తం అందరూ అలాంటివాళ్ళే అని మీరెలా అనగలరు? అనవచ్చు.నిజమే.ఈ దేశంలో అందరూ రేపిస్టులే లేరు.అర్ధరాత్రి దారితప్పి అడ్రస్ అడిగిన స్త్రీని ఆమె ఇంటిదగ్గర భద్రంగా దించిన వ్యక్తులూ నాకు తెలుసు.ఎవరో కాదు నా మిత్రుడే ఆపని చేశాడు.

అసలు డిల్లీ పోలీసులు డిల్లీ ముఖ్యమంత్రి చేతుల్లో లేకపోవడం భలే పెద్ద వింత.ఇక జవాబుదారీ తనం ఎలా వస్తుంది.ఏదైనా జరిగితే గవర్నర్ ను కలసి సీఎం అడుక్కోవాలి.కేంద్ర ప్రభుత్వానికీ డిల్లీ ప్రభుత్వానికీ పడకపోతే ఈ లోసుగును చక్కగా ఉపయోగించుకోవచ్చు.వైరివర్గం మీద బురద చల్లవచ్చు.ఇలాంటి సంఘటనలను కూడా చక్కగా ప్లాన్ చెయ్యవచ్చు.ఒకళ్ళు గట్టిగా ఏదైనా చెయ్యాలి అనుకుంటే(అందులోనూ డబ్బూ అధికారమూ చేతిలో ఉన్నవాళ్ళు)మన దేశంలో సాధ్యం కానిదేముంది?

అర్ధరాత్రి ఆడది నిర్భయంగా తిరిగినప్పుడే మన దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్లు అని గాంధీ అనేవాడు.ప్రస్తుతం ఏ ఆడదైనా అలా తిరిగితే ఆమె 'నిర్భయ'గా మారిపోవడం ఖాయం.అర్ధరాత్రి దాకా అక్కర్లేదు దేశరాజధానిలో సాయంత్రం నాలుగుకే ఆడదానికి రోడ్డుమీద భద్రత కరువైంది. మనకు సొతంత్రం వచ్చి 66 ఏళ్ళు దాటింది కదా. ఆమాత్రం పురోగతి లేకుంటే ఎలా?కనీసం దేశరాజధానిలో వీధి దీపాలు సరిగ్గా లేని మన దేశం ఎంత గొప్పదో కదా?

రాజకీయ నాయకులూ అధికారులూ కలసి ఇన్నేళ్ళలో సృష్టించిన lawlessness పండిస్తున్న విషఫలాలు ఇలా ఉండక ఇంకెలా ఉంటాయి?అమెరికాలో ఉన్నట్లు మన దేశంలో కూడా 'రూల్ ఆఫ్ లా' ఉండే పరిస్తితి ఇంకెప్పుడొస్తుందో కదా?నాయకులూ అధికారులూ ప్రజలకు జవాబుదారీ ఎప్పుడు అవుతారో కదా?