Spiritual ignorance is harder to break than ordinary ignorance

20, జులై 2013, శనివారం

కల్యాణానంద భారతీస్వామి స్మృతులు- 9 (అసలైన శ్రీవిద్య)

'అసలైన శ్రీవిద్య అంటే శివశక్తి తత్వాలను ఆమూలాగ్రం అర్ధం చేసుకుని వాటిలో అనుభవ పూర్వకమైన సిద్ధిని పొందటమే అని మీరు చెప్పిన భావన బాగుంది. దీనిమీద ఇంకొంచం చెప్పగలరా?' అడిగాడాయన.

ఇందాక ప్రతిదానికీ ప్రమాణాలు అడగవద్దని అన్నందుకు ఇలా మార్చి అడుగుతున్నాడని నాకర్ధమైంది.

సరే వినండి.శ్రీచక్రంలో శివునీ శక్తినీ సూచించే త్రికోణాలు ఉన్నాయికదా. అందు శక్తికోణాలు అయిదు,శివకోణాలు నాలుగు.వెరసి నవ త్రికోణాత్మకమైనదే శ్రీచక్రం.లలితాత్రిశతి ఉత్తరపీఠికలో ఈవివరం అంతా ఉంటుంది.మీరు చాలాసార్లు దానిని చదివే ఉంటారు. ఆదిశంకరులు త్రిశతీభాష్యం వ్రాశారు.అంటే ఆ స్తోత్రానికి ఆయన ఎంతటి విలువను ఇచ్చారో గ్రహించవచ్చు.ఆ స్తోత్రానికి అంతటి మహత్యం ఎందుకు వచ్చిందంటే అందులో పంచదశీ మంత్రం ఇమిడి ఉన్నది.దానిని పారాయణ చేస్తే పంచదశీ మంత్రాన్ని జపించినట్లే.దాదాపుగా ఈ స్తోత్రం చెప్పిన భావాలనే భైరవయామళతంత్రం కూడా వివరించింది.

చతుర్భిశ్శివ చక్రైశ్చ శక్తిచక్రైశ్చ పంచభి:
నవచక్రైస్తు సంసిద్ధం శ్రీచక్రం శివయోర్వపు:

అనేది అందరికీ తెలిసిన ప్రసిద్ధశ్లోకం.శక్తిచక్రాన్ని సృష్టిచక్రం అంటారు. శివచక్రాన్ని సంహారచక్రం అంటారు.సంహారచక్రాన్ని అందరూ ఉపాసించలేరు. శుద్ధ జ్ఞానాభిలాషులు మాత్రమె దానిని ఉపాసించగలరు.భోగాన్నీ మోక్షాన్నీ కూడా కోరుకునేవారు సృష్టిచక్రాన్ని ఉపాసిస్తారు.ఇదిగాక స్తితిచక్రమని ఇంకొక విధానం కూడా ఉన్నప్పటికీ అది ఆచరణలో పెద్దగా కనిపించదు.

బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ 
మన్వస్రనాగదళ సంయుత షోడశారం 
వృత్త త్రయం చ ధరణీసదన త్రయం చ 
శ్రీచక్రమేత దుదితం పరదేవతాయా:

అన్న ఇంకొక ప్రసిద్ధశ్లోకం మీకు తెలిసినదే కదా?

బిందువునుంచి భూపురత్రయం వరకూ శ్రీచక్రంలో తొమ్మిదిభాగము లున్నాయి. వీటికి మళ్ళీ శివశక్త్యాత్మకములుగా విభజన ఉన్నది ఆ సంగతి కూడా మీకు తెలిసే ఉంటుంది.

త్రిశతి నుంచి దీనికి ప్రమాణం వినండి.

త్రికోణ మష్టకోణం చ దశకోణ ద్వయం తధా
చతుర్దశారం చైతాని శక్తిచక్రాణి పంచవై
బిందుశ్చాష్టదళ పద్మం పద్మం షోడశ పత్రకం
చతురశ్రం చ చత్వారి శివచక్రాన్యనుక్రమాత్

త్రికోణం-1,అష్టకోణం-1,దశకోణములు-2,చతుర్దశారం-1ఈఅయిదూ కలసి శక్తి చక్రములు.బిందువు-1,అష్టదళపద్మము-1,షోడశదళపద్మము-1, చతురశ్రము-1ఈనాలుగూ శైవచక్రములు.

ఇక్కడ ఒక ముఖ్యమైన రహస్యం కూడా చెప్పబడింది.శివశక్తి చక్రముల పరస్పర అవినాభావసంబంధాన్ని ఎవడైతే బాగుగా గ్రహించాడో వాడే చక్రవిదుడు.అనగా శ్రీచక్రరహస్యమును తెలిసికొన్నవాడు.ఇందాక నేను చెప్పిన విషయం ఇదే.దీనికి ప్రమాణం తంత్రములలో చాలాచోట్ల ఉన్నది.కాని అందరికీ తెలిసిన లలితాత్రిశతినుంచే మీకు నిదర్శనం చూపిస్తున్నాను.ఆ శ్లోకం వినండి.

శైవానామపి శాక్తానాం చక్రాణాం చ పరస్పరం 
అవినాభావ సంబంధం యో జానాతి స చక్రవిత్ 

ఈ నవవిధచక్రములకు మానవశరీరంలోని నవధాతువులకు సామ్యం ఉన్నది. రక్తము,మాంసము,ఎముకలు,చర్మము,మెదడు అనే ఐదుధాతువులు శక్తి స్వరూపాలు.మజ్జ,వీర్యము,ప్రాణము,జీవము అనేవి శివస్వరూపములు.

అలాగే నవగ్రహాలకూ నవత్రికోణాలకూ సంబంధమున్నది.చంద్ర,కుజ, బుధ,శుక్ర,రాహువులు అయిదూ శక్తిగ్రహాలు.రవి,గురు,శని,కేతువులు నాలుగూ శివగ్రహాలు.చాలామంది నవావరణ పూజలో ఉద్దండులమని చెప్పు కుంటూ ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు.వారికి ఒక పరీక్ష ఉన్నది. నిజమైన శ్రీచక్రార్చనపరులు ఆజ్ఞాపిస్తే నవగ్రహాలు ఒక జాతకంలో ఆ జాతకుని కర్మానుసారం ఇవ్వవలసిన తమతమ ఫలితాలు మార్చుకుని వారు చెప్పిన ఫలితాన్ని ఆ జాతకునికి ఇవ్వాలి.సంకల్పమాత్రాన ఇతరుల జాతకాన్ని మార్చగల శక్తి వారిలో ఉండాలి.అదీ అసలైన నవావరణ పూజాఫలం.దీనిని ప్రాక్టికల్గా నిరూపించగలవారూ ఈ పరీక్షలో పాసయ్యే వారూ ఎందరున్నారో మీరే ఆలోచించుకోండి.

శ్రీచక్రంలోని నవావరణలనూ అందులోని దేవతలనూ శక్తులనూ వరుసగా అర్చించే స్తోత్రమే దేవీఖడ్గమాలా స్తోత్రం.ఈ స్తోత్రాన్ని పారాయణం చేసేవారు వారికి తెలియకుండానే శ్రీచక్రార్చన చేస్తున్నట్లుగా లెక్కకు వస్తుంది. త్రైలోక్యమోహన చక్రంనుంచి మొదలుబెట్టి సర్వాశా పరిపూరకచక్రం మొదలైన చక్రాలను దాటుతూ సర్వానందమయ చక్రం వరకూ ఈ నవావరణలూ వరుసగా ఉంటాయి.
  
ఇలా శ్రీచక్రంలోని ప్రతీ ఆవరణా ప్రతి త్రికోణమూ ప్రతి పద్మమూ దాని దళాలూ మూలలూ అన్నీ ఒక్కొక్కటీ ఒక్కొక్క శక్తినీ స్థాయినీ సూచిస్తాయి. Sri Chakra is the symbolic representation of both macrocosmic and microcosmic forces set in their proper places in a most logical and schematic diagram.అందుకే శ్రీచక్రం అంటే విశ్వానికి ప్రతీక అంటారు. అంతేకాదు అది మానవ శరీరానికీ అందులోని నిగూఢశక్తులకూ ప్రతీక కూడా.విశ్వంలో ఉన్న ప్రతిశక్తీ శ్రీచక్రంలో సూచనాత్మకంగా ఇమిడి ఉన్నది.

'బైందవం బ్రహ్మరంద్రంచ మస్తకం చ త్రికోణకం' అనే ప్రసిద్ధశ్లోకం కూడా సాధకుని శరీరానికీ శ్రీచక్రానికీ అభేదాన్ని సూచిస్తుంది. షట్చక్రాలూ, బ్రహ్మ, విష్ణు,రుద్రగ్రంధులనే మూడుగ్రంధులూ కలిసి శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరణలలో ఇమిడి ఉంటాయి.  

ఇదేవిధంగా పదిహేను నిత్యలకూ,నవయోగినులకూ,పంచభూతాలకూ, మాతృకావర్ణాలకూ ఇంకా ఎన్నెన్నో వాటికి శ్రీచక్రంలో సంకేతాలున్నాయి. కుండలినీ యోగానికి శ్రీచక్రం ప్రతిరూపం.ప్రపంచంలోని ఏ విధమైన తాత్విక చింతననైనా శ్రీచక్ర సహాయంతో వివరించవచ్చు.ఇది అంతటి సమగ్రమైన యంత్రం.అందుకే దీనిని శ్రీచక్రరాజం అంటారు.ఒక సీనియర్ ఉపాసకునిగా మీకు ఈ విషయాలన్నీ తెలిసే ఉంటాయి. ఇకపోతే ఇంకొక విషయాన్ని వినండి.

త్రికోణరూపిణీ శక్తిర్బిందురూపశ్శివస్స్మృతః
అవినాభావసంబంధస్తస్మాద్బిందుత్రికోణయోః
ఏవం విభాగమజ్ఞాత్వా శ్రీచక్రం యస్సమర్చయేత్
న తత్ఫలమవాప్నోతి లలితాంబా న తుష్యతి

'శక్తి త్రికోణరూపిణి.బిందువు శివుడు.బిందుత్రికోణముల పరస్పర అవినాభావ సంబంధం తెలియకుండా ఎవడైతే శ్రీచక్రార్చన గావిస్తాడో అతనికి ఏ విధమైన ఫలమూ రాదు.అతని అర్చనతో లలితాంబ ఎంతమాత్రమూ తృప్తి చెందదు.' అని లలితాత్రిశతిలో హయగ్రీవుడే అగస్త్యునికి ఉపదేశించాడు.

యే చ జానంతి లోకేస్మిన్ శ్రీవిద్యాం చక్రవేదినః
సామాన్యవేదినస్తే వై విశేషజ్ఞో అతిదుర్లభః
స్వయం విద్యావిశేషజ్ఞో విశేషజ్ఞం సమర్చయేత్

శ్రీవిద్యలో సామాన్యజ్ఞానం కలిగినవారు చాలామంది ఉంటారు.కాని విశేషప్రజ్ఞ కలవారు అతిదుర్లభులు.విశేషమైన ప్రజ్ఞ కలవారే అటువంటి విశేషజ్ఞులను గుర్తించగలరు మరియు గౌరవించగలరు.ఏమిటా విశేషప్రజ్ఞ?అంటే, సాధారణమైన శ్రీచక్రార్చనను దానియొక్క మంత్రోచ్చారణా విధానాన్ని తత్సంబంధమైన బాహ్యపూజావిధానాన్ని  ఉపదేశించేవారు సామాన్యమైన జ్ఞానం కల్గినవారు.

శ్రీవిద్యయొక్క అంతరార్ధాలను చక్కగా వివరించగలిగి అంతర్యాగక్రమ సాధనామార్గంలో వాటిని ఎలా అన్వయించుకోవాలి,నిత్య జీవితంలో ఆయా సులువులనూ మెలకువలనూ ఎలా ఆచరించాలి అనేటటువంటి సమన్వయ పూర్వక రహస్యాలను తెలిసినవారు విశేషజ్ఞులు.అలాంటివారు దొరకడం చాలాకష్టం.అందుకనే 'అతిదుర్లభ:' అనేమాట స్వయానా హయగ్రీవస్వామి చేత వాడబడింది.

శ్రీవిద్యలో సామాన్యప్రజ్ఞ కలిగినవారు విశేషప్రజ్ఞ కలిగినవారు వేర్వేరని హయగ్రీవుడే స్వయంగా చెప్పాడుకదా.దీనికి ప్రమాణం ఈ త్రిశతీ శ్లోకమే.

అసలు శ్రీవిద్యయే అనేక సాంప్రదాయములుగా విస్తరించి ఉన్నది. మనువు,చంద్రుడు,కుబేరుడు మొదలైన పన్నెండుమంది ఘనులు ఈవిద్యను ప్రాచీనకాలంలో ఉపాసించారని తంత్రములు చెబుతున్నాయి. అంటే పన్నెండురకములైన ఉపాసనా విధానాలు ప్రాచీనకాలంలో మనకు ఉండేవి.అవన్నీ ఇప్పుడు లుప్తమై పోయి ప్రస్తుతం మనకు మన్మధోపాసిత మైన కాదివిద్య,లోపాముద్రోపాసితమైన హాదివిద్య మాత్రమె లభిస్తున్నాయి.

శ్రీవిద్యలో బహిర్యాగము అంతర్యాగము అని ఉన్నవి.'అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా' అని లలితాసహస్రం అంటుంది.ఇందులో బహిర్యాగం అనేది బాహ్యమైన పూజావిదానంతో కూడినటువంటి తంతు.అంతర్యాగం అనేది పూర్తిగా భావనామాత్రమైన ధ్యానం.దీనినే సమయాచారం అని కూడా అంటారు.విచిత్రమేమంటే మీ స్వాములవారు క్షుద్రవామాచారం అని కొట్టివేసిన విధానాన్ని వివరించే వామకేశ్వరతంత్రము,రుద్రయామళ తంత్రము,కులార్ణవ తంత్రము మొదలైన తంత్రాలు అంతర్యాగాన్ని చాలా విశదంగా వివరించాయి.

ఇకపోతే వీటన్నిటికంటే ఇంకా చక్కగా అంతర్యాగాన్ని సమగ్రంగా వివరించిన ముఖ్యగ్రంధం భావనోపనిషత్తు.ఈ ఉపనిషత్తుకూ తంత్రరాజతంత్రానికీ చాలా దగ్గర పోలికలున్నాయి.ఈ రెండూ కూడా కాదివిద్యా సాంప్రదాయానికి చెందినవే. కాముడు లేదా మన్మధుడు ఉపాసించిన విద్యను కాదివిద్య అంటారనీ లోపాముద్రాదేవి ఉపాసించిన విద్యను హాదివిద్య అంటారనీ మీకు తెలుసుకదా.

శ్రీవిద్యలో అతిముఖ్య అంశం 'సామరస్యం' అనే కాన్సెప్ట్.బాహ్యంగా ప్రపంచంలో ఉన్నవాటికీ అంతరికంగా సాధకుని శరీరంలో ఉన్నవాటికీ సామరస్యాన్ని గ్రహించడం చాలా ముఖ్యం.దీనినే 'synchronicity' అనుకోవచ్చు.తంత్రం అంతా ఈ సామరస్యమనే సూత్రం మీదే ఆధారపడి ఉన్నది.విశ్వంలో ఉన్న సర్వమూ మనశరీరంలో కూడా ఉన్నది అనేది ఇక్కడ మూలసూత్రం.

ఈ సూత్రాన్ని సమయాచారపరులు భావనామాత్రంగా అనుసరిస్తే కౌళులు యధాతధంగా స్వీకరించి బాహ్యంగా కూడా అర్చిస్తారు.సమయాచారపరులు తమయొక్క సూక్ష్మశరీరంలోని త్రికోణాన్ని,దక్షిణాచారులు బాహ్యయంత్రం లోని త్రికోణాన్ని అర్చిస్తే,కౌళులు యోనిపూజను ఆచరిస్తారు.తప్పేముంది?ఆ సమయంలో వారిలో కామభావన ఏమాత్రం ఉండదు. కళ్ళుమూసుకుని ధ్యానాన్ని నటిస్తూ కామచింతనను దాటలేని డాంబికుని కంటే కామస్పర్శ లేకుండా కల్మషరహితమైన మనస్సుతో యోనిపూజ చేసే కౌళుడు నిజంగా ఉన్నతుడే.

కనుక నిజమైన కౌళులూ వామాచారపరులూ నకిలీ సమయాచారులకంటే సత్యానికి చాలా దగ్గరగా ఉన్నారని చెప్పాలి.ఎందుకంటే వారికి భయం ఉండదు.అసహ్యం ఉండదు.వారు భౌతికంలో కూడా దైవాన్ని చూస్తున్నారు. అందువల్లనే వారు అష్టపాశాలను తేలికగా దాటగలుగుతారు.డాంబికపు మాటలు చెప్పే కుహనా దక్షిణాచారులూ సమయాచారులూ వాటిని త్వరగా దాటలేరు.వారు మాటలలో కోటలు దాటిస్తారు.కాని ఆచరణలో అడుగడుక్కీ అష్టపాశాలకు బద్ధులై ఉంటారు.శ్రీవిద్యాసాధకులమని చెప్పుకునేవారిని సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ సత్యాన్ని మీరు గ్రహించగలరు.

కౌళులూ వామాచారులూ బాహ్యపూజను చేస్తారని అందరూ వారిని విమర్శిస్తారు.ఈ ప్రపంచంలో బాహ్యపూజను చెయ్యనివారు ఎవరున్నారో నాకు కొంచం చూపించండి.శరీరభావాన్ని కలిగిఉన్న ప్రతివాడూ బాహ్య పూజకుడే. రాగిరేకులో దేవిని దర్శించేవాడు గోప్పవాడైతే సాక్షాత్తు ఒక సజీవస్త్రీలో దేవిని దర్శించి ఆమెను ఒక దేవతగా పూజించేవాడు ఆరాధించే వాడూ ఇంకెంత మహనీయుడై ఉంటాడు? మీరు చెబుతున్న చాలామంది దక్షిణాచారపరులు ఇళ్ళలో తమ భార్యలను ఎలా ట్రీట్ చేస్తారో నాకు బాగా తెలుసు.వాళ్ళను వంటింటికీ పడకటింటికీ పరిమితం చేస్తూ బానిసలకంటే హీనంగా చూస్తూ, తిడుతూ,కొడుతూ,హింసపెడుతూ,అమ్మవారి తత్వాన్ని గురించి స్టేజీలెక్కి గొప్పగొప్ప ఉపన్యాసాలు ఇచ్చే దౌర్భాగ్యులు చాలామంది ఉన్నారు.నా దృష్టిలో ఇలాంటివారు శ్రీవిద్యోపాసనకు ఎంతమాత్రమూ తగరు.

అడుగడుగునా డబ్బుకూ అహంకారానికి పేరుప్రతిష్టలకూ దాసులై,స్వార్ద్జ పూరితమైన ఇంద్రియలాలసా జీవితాలు గడిపే మనుష్యులు తాము గొప్ప శ్రీవిద్యాపరులమని గప్పాలు చెప్పుకుంటూ వామాచారాన్ని విమర్శిస్తూ ఉపన్యాసాలిస్తే నాకు అరికాలిమంట తల కెక్కుతుంది.అసలైన వామాచారం ఎంత ఉన్నతమైనదో వీళ్ళు కలలో కూడా ఊహించలేరు.ఎంత చెప్పినా వీరికి అర్ధంకూడా కాదు.

అయితే అసలైన నిజాయితీపరులైన సాధకశ్రేష్టులు సమయాచార దక్షిణాచారా లలో లేరా అంటే ఉన్నారు అనే నేను చెబుతాను.కానీ,వారితో మనకు ఎటువంటి బాధాలేదు.మనం మాట్లాడుకుంటున్నది నకిలీల గురించి గాని అసలైన మహనీయుల గురించి కాదు.

కౌళులూ వామాచారులూ ఇంద్రియభోగ పరాయణులని సామాన్యంగా అందరూ అనుకుంటూ వారిని విమర్శిస్తూ ఉంటారు.నేను దీనినే త్రిప్పి చెబుతాను.ఇంద్రియభోగపరాయణుడైన ప్రతివాడూ క్షుద్రవామాచారుడే అని నేనంటాను.మనలో ఇంద్రియాల పరిధిని దాటినవారు ఎందరున్నారో మీరే ఆలోచించుకోండి.దక్షిణాచారపరులమనీ సమయాచారపరులమనీ పూర్ణదీక్షా పరులమనీ చెప్పుకోవడానికి అసలు మనకు అర్హత ఉన్నదా లేదా అన్న విషయం అప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది.

వారి పూజ అంతా ఆధారచక్రంలోనే అనీ వారి పరిధి మూలాధార స్వాదిష్టాన చక్రాలే అనీ ఇంకొందరు కౌళులను విమర్శిస్తారు.అసలు ఈ రెండుచక్రాలను పూర్ణంగా దాటినవారు ఎందరున్నారని తాంత్రిక సెన్సస్ తీయిస్తే మనదేశంలో చేతివేళ్ళమీద లెక్కపెట్టదగినంతమంది మాత్రమే తేలతారు.గొప్పగొప్ప స్వామీజీలతో సహా ప్రతివాడూ అఘోరిస్తున్నది మొదటి మూడుచక్రాల పరిధిలోనే.మళ్ళీ ప్రతివారూ కౌలాన్నీ వామాచారాన్నీ విమర్శించేవారే.

సత్యమేమిటంటే,తమను తాము గొప్ప జీవన్ముక్తులవలె,శుద్ధ సమయాచార పరులవలె భావించుకున్నంత మాత్రాన సరిపోదు.ఆచరణలోనూ అనుభవంలోనూ ఆవిషయం నిగ్గు తేలాలి.అది మాత్రం ఎక్కడా కనబడదు. ఊరకే విమర్శించడం తేలిక కదా.పైగా నిజమైన కౌళులూ వామాచారులూ ఈ కుళ్ళు సమాజంలో ఉండరు.ఒకవేళ ఉన్నాకూడా వారిని చూచి సమాజం అసహ్యించుకోవడమో లేక భయపడి దూరంగా పారిపోవడమో జరిగే రీతిలోనే వారు ప్రవర్తిస్తారు.

ఇన్నిమాటలెందుకు?మామూలు మాటల్లో చెబుతా వినండి.మంత్రానికీ, యంత్రానికీ,దేవతకూ,ఉపాసకునికీ మధ్య తారతమ్యరహితమైనట్టి అభేదస్థితిని సాధించడమే ఏ సాధనకైనా కీలకం.ఏ ఆచారపరుడైనా ఈస్తితిని పొందినవాడు మాత్రమె మహనీయుడు.ఆస్తితిని పొందకుంటే ఏఆచారాన్ని పాటించేవాడై నప్పటికీ అతడు గమ్యానికి ఇంకా చాలా దూరంగా ఉన్నట్లే లెక్క. నాలుగు, అయిదు,ఆరువిధముల ఐక్యానుసంధానమే దీనికిగల ఏకైకమార్గం.బాలా, పంచదశీ,షోడశీ మంత్రముల యొక్క సజీవరూపమే శ్రీచక్రం.

స్వాములవారి ఆవేదనను ఆలోచనను నేను సరిగానే అర్ధం చేసుకున్నాను. పెద్దవాడైన ఆయనను విమర్శించే సాహసం చేసినందుకు నామాటలను తప్పుగా అర్ధం చేసుకోకండి.'మోక్షైకహేతుకీ విద్యా శ్రీవిద్యైవ నసంశయ:(మోక్షమును ప్రసాదించగలవిద్య శ్రీవిద్యయే సంశయము లేదు)' అన్నట్లుగా, సామాన్యుడికి గూడా అందుబాటులో ఉన్న ఇటువంటి మహోన్నత విద్య అనర్హుల చేతులలో బడి వక్రీకరింపబడిన స్తితిలో ఉన్నదని ఆయన ఆవేదన చెందాడు.ఆ ఆవేదనా రూపములే ఆయన వ్రాసిన విమర్శనాత్మక గ్రంధములు.కాని ఈ క్రమంలో భాస్కరరాయలనూ వారి సంప్రదాయాన్నీ ఆయన అతి తీవ్రంగా విమర్శించడమూ వారిని బ్రాహ్మణాధములనీ దుష్ట బ్రాహ్మణులనీ,మపంచకలోలురనీ తిట్టిపోయ్యడం ఎంతమాత్రం సబబు కాదు.

నా భావాలను విని మీ స్వాములవారంటే నాకు గౌరవం లేదని తప్పుగా భావించకండి.పరాయి మతాల మహానీయులనే గౌరవించే నేను మన సాంప్రదాయపు మహనీయులను ఎందుకు ద్వేషిస్తాను.అది ఎన్నటికీ జరుగదు.శ్రీవిద్యా సాంప్రదాయమును ఉద్ధరించి ఎంతోమందికి మహోపకారం చేసినవాడని ఆయనను నేను ఎంతో గౌరవిస్తాను.అయితే కౌళమును వామమును ఆయన ఇంకా బాగా అర్ధం చేసుకుని ఉంటే బాగుండేదని మాత్రమే నా అభిప్రాయం.ఒకవేళ ఆయనకు ఈ మార్గాలు తెలిసి ఉన్నప్పటికీ వాటిని బాహాటంగా సమర్ధిస్తే సమాజంలో దురాచారాలు ప్రబలుతాయని ఆయన భయపడి ఉండవచ్చు.కనుక వీటిని విమర్శిస్తూ శుద్ధ దక్షిణాచారాన్ని ఆయన ప్రచారంలోకి తెచ్చి ఉండవచ్చు.ఈ నా అభిప్రాయం వల్ల ఆయనంటే నాకున్న గౌరవం ఏమాత్రం తగ్గదు.ఈ విషయం స్పష్టంగా అర్ధం చేసుకోండి.

అనర్గళంగా సాగుతున్న వాక్ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ సమయం ఎంతైందో అని గోడవైపు చూచాను.గడియారం రాత్రి పదిగంటలు సూచించింది.ఇప్పుడు బయలుదేరితే కనీసం అర్ధరాత్రి పన్నెండు గంటలకైనా గుంటూరు చేరవచ్చు అనుకుంటూ 'చాలా సమయం అయింది.ఇక ఉంటానండి' అన్నాను.

(మిగతాది తర్వాత భాగంలో)