“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

14, జులై 2013, ఆదివారం

కల్యాణానంద భారతీస్వామి స్మృతులు-7 (శ్రీవిద్యా చర్చ)

ఇప్పటిదాకా సరదాగా తేలికమాటలు నడిచాయి.ఇక సీరియస్ గా అసలైన చర్చ మొదలు పెట్టక తప్పదని,సబ్జెక్ట్ లోకి దిగాలని అనుకున్నాను.

'సరే చెబుతాను వినండి.ఆమ్నాయములు ఊర్ధ్వ అధోమార్గములతో కూడిన చతుర్విధదిశల పేర్లతో షడామ్నాయములుగా ఉన్నవని మీకు తెలుసనుకుంటాను.తంత్రమూ,అందులో మళ్ళీ శ్రీవిద్యాతంత్రమూ వామాచారం,దక్షిణాచారం అని రెండు స్థూలమార్గాలుగా ఉన్నదని కూడా మీకు తెలుసును కదా?' అడిగాను.

'అవును.కొంత తెలుసు.మాది దక్షిణాచారం ' అన్నాడాయన.

సరే కానివ్వండి.'శ్రీవిద్యాస్త్రపరంపర' అనే పుస్తకంలోనూ ఇంకా అనేక వ్యాసాలలో మీ గురువుగారు వామాచారాన్ని తీవ్రంగా విమర్శించారు. బహుశా వామాచారం అంటే నింద్యములైన దూషితములైన ద్రవ్యములతో దురాచారపూరితముగా ఆచరింపబడే విధానమనీ,దక్షిణాచారం అంటే వేదోక్తమైన సదాచార విహితమైన ద్రవ్యములతోనూ పద్దతులతోనూ ఆచరింపబడే విధానం అనీ ఆయన ఉద్దేశ్యం అయి ఉండవచ్చు.అంతేనా?' అడిగాను.

'అంతే' అన్నాడాయన.

'తంత్రశాస్త్రములన్నీ పరమశివుని యొక్క సద్యోజాతాది పంచముఖముల నుండి పుట్టినవే కదా?మరి వామం నింద్యమైన మార్గం అయితే,అసలు ఆ మార్గం పరమేశ్వరుని ముఖత: ఎందుకు ఉద్భవించింది? పరమేశ్వరుని ముఖ స్పర్శ కలిగినది నింద్యం ఎలా అవుతుంది? 'వామదేవాయ నమో జ్యేష్టాయ...' అనే మంత్రముతో ఆయన్ని ఎందుకు పూజిస్తున్నాం?' అడిగాను.  

'సృష్టిలో అన్నీ ఉంటాయి.మంచి ఉన్నట్లే చెడు కూడా ఉంటుంది.కాని అది మనం ఎందుకు అనుసరించాలి?' అన్నాడాయన.

'మంచీ చెడూ అన్నది చాలావరకూ మన దృక్కోణాన్ని బట్టి ఉంటుందని ఇందాకటి నుంచి చెబుతూనే ఉన్నా కదా?పైగా మనం మాట్లాడుకుంటున్నది మామూలు మంచీచెడూ గురించి కాదు.సాధనా మార్గాల గురించి.వాటిలో అధికార భేదాలేగాని మంచీచెడూ ఎలా ఉంటాయి?' ప్రశ్నించాను.

'కావచ్చు.కాని వాటిని మనం అనుసరించవలసిన పని లేదుకదా?' అన్నాడు.

'మనం అనుసరించక పోయినంత మాత్రాన అది చెడనీ,మనం అనుసరించి నంత మాత్రాన అదే మంచి అనీ ఎలా చెప్పగలం?' మళ్ళీ ప్రశ్నించాను.

జవాబు లేదు.

'ఇంకొక విషయం వినండి.వామాచారం దుష్టమార్గం అని నేననుకోవడం లేదు.అర్ధనారీశ్వరతత్వంలో శక్తి వామభాగస్థ.శక్తిఉపాసకులైన శ్రీవిద్యా అనుష్టానపరులు శక్తికి ప్రతిరూపం అయిన వామమార్గాన్ని ఎలా ద్వేషించ గలరు? చెప్పండి.' అడిగాను.

జవాబు లేదు.

ఆయన ముఖం చూస్తే నా ప్రశ్నలవల్ల ఆయనలో కొంత ఆలోచన మొదలైందని అనిపించింది.

'వామాచారం యొక్క అసలైన అర్ధం శక్తిసాధన.అది శక్తిమార్గం.శక్తికి మంచీ చెడూ విచక్షణ ఉండదు.ఉదాహరణకి కరెంట్ ని తీసుకోండి.మీరనుకునే మంచీ చెడూ దానికి తెలియవు. అలాగే ప్రకృతిలోని ఏ శక్తినైనా తీసుకోండి.దానికి కూడా మంచీ చెడూ తెలియవు.ఆ స్పృహే దానికి ఉండదు.అది ప్యూర్ ఎనెర్జీగా ఉంటుంది.

ప్రపంచాన్ని శక్తి నడుపుతున్నది.శక్తిని ఉపాసించేవాడు వామాచారి అయి ఉండాలి.వేరు మార్గం లేదు.ఈ స్తితి నుంచి కొంచం కిందికి వస్తే అప్పుడు మీరన్న మంచీ చెడూ పోలరైజేషన్ జరుగుతుంది.కరెంట్ లో కూడా పాజిటివ్ నెగటివ్ ఉన్నట్లుగా అన్నమాట.వీటిలో మీరు పాజిటివ్ కరెంట్ ఒక్కటే కరెంట్ అంటున్నారు.నేను అది తప్పు అంటున్నాను.నెగటివ్ కూడా కరెంటే.అంతే కాదు.నెగటివ్ కరెంటే నిజానికి అసలైన కరెంట్ అని కూడా అంటున్నాను.అదే వామాచారం.

పంచపూజలలో 'వం' అమృతబీజం కదా.అంటే చనిపోయినవానిని బ్రతికించగల శక్తి.సమాధినిష్టుడైన పరమశివుని మనస్సులో కామాన్ని రగల్చాలని ప్రయత్నించి ఆయన మూడవకంటి చూపులో భస్మమైన కామునికి జాలితో తిరిగి జన్మనిచ్చినది ఈ శక్తియే.కనుకనే అమ్మవారిని 'హరనేత్రాగ్ని సందగ్ధ కామసంజీవనౌషధి:' అని కీర్తిస్తుంది లలితాసహస్ర నామం.అవునా?' అడిగాను.

'అవును'

అలాంటప్పుడు శక్తిని ఉపాసించే సాధకులు'వం'బీజాత్మకమైన వామాచారాన్ని ద్వేషించడం సమంజసమేనా?' అడిగాను.

'దీనికి ఏదైనా ప్రమాణం ఉన్నదా?' అడిగాడు.

'ఉన్నది.మీరు ప్రమాణాలు అడుగుతున్నారు.అవి విన్న తర్వాత వాటిని దాటవేసి మళ్ళీ మీ ధోరణిలోకి మీరు పోతున్నారు.ఇందాక భగవద్గీత లోనుంచి ప్రమాణం చెప్పాను.మీరు నమ్మలేదు.ఇలా అయితే నన్ను ప్రమాణాలు అడగడం ఎందుకు? పోనీ మీరడిగారు కనుక ఇప్పటికి చెబుతాను.ఇకమీదట ప్రమాణాలు అడగకండి.నాకిష్టంవస్తే చెప్తాను.కాని మీరడిగితే మాత్రం చెప్పను.' అన్నాను సీరియస్ గా.

'సరే అలాగే' అన్నాడాయన.

'ఉపాసనాక్రమౌ ద్వౌ మార్గౌ దృశ్యతే 
వామమార్గౌ దక్షిణ మార్గశ్చేతి'

అని ఉన్నదికదా.ఇది చెప్పినది 'సౌభాగ్య భాస్కరం' అనే లలితాభాష్యం వ్రాసిన భాస్కరరాయలు.కాని ఆయనను మీ స్వాములవారు పరమ చండాలమైన భాషలో తిట్టిపెట్టారు.ఆయన ఒక ఛండాలపు వామాచారి అని మీ స్వాములవారి నిరాధార నమ్మకం.ఆ విషయానికి తర్వాత వస్తాను. అలాగే "సామం పాడగలవాడే వైదికుడు.వామం తెలిసినవాడే తాంత్రికుడు." అనీ సామెత ఉన్నది. 

'శాక్తతంత్రాలలో కౌలాచారము,మిశ్రాచారము,సమయాచారము అని మూడు ఆచారాలున్నవి కదా.' అడిగాను. 

'అవును'

వీటిలో సమయాచారం ఒక్కటే మంచిదనీ మిగిలిన రెండూ పనికి రానివనీ మీ గురువుగారి అభిప్రాయం లాగా తోస్తున్నది.అలాగైతే అసలు ఆ రెండూ ఎందుకు పుట్టాయి? గీతలో గుణత్రయ విభాగయోగం మీరు చదివే ఉంటారు.అందులో,అధికారభేదాన్ని బట్టి సాత్విక రాజసిక తామసిక గుణాలు జీవిని దేహానికి ముడివేస్తాయని ఉన్నది.వాటి ప్రకారం ఆయా దేవతలను ఆయా మనుషులు పూజిస్తారని ఉన్నదికదా.ఈ మూడు ఆచారాలు కూడా అవే అని మీకు ఎప్పుడూ తోచలేదా?' అడిగాను.

జవాబు లేదు.

'అసలు విషయం వినండి.ప్రతి మనిషీ తానున్న స్తితినుంచే పైకి ఎదగగలడు.తామసిక స్తితిలో ఉన్న వ్యక్తి సాత్విక ఉపాసన చెయ్యలేడు.అతని స్వభావం దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.అందులో ఇమడలేడు.నానా యాతనా పడతాడు.కనుక అతనికి అనువైన ఉపాసనను అతనికి ఇచ్చాయి మన శాస్త్రాలు.అతని స్వభావానికి సరిపడే ఉపాసన అతను మొదలు పెట్టాలి.క్రమేనా ఒక్కొక్క మెట్టుగా పైకేక్కుతూ సాత్విక ఉపాసనను చేరుకోవాలి.అదే ఆచరణాత్మకమైన మతం.' అన్నాను.

'ఆ విధంగా కౌలాచారంతో మొదలుపెట్టి మెట్టుమెట్టుగా ఎదిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పంచమకార సాధనలో తాగుడుకీ మాంసం తినడానికీ సెక్స్ కీ అలవాటుపడి ఆ మెట్టుమీదే అందరూ ఆగిపోయేవారే గాని పైకి ఎదిగినవారు లేరుకదా?' అడిగాడు.

'లేదండి.చాలామంది ఉన్నారు.తంత్రసాధకులు బయటకు కనిపించరు. అక్కడిదాకా ఎందుకు?ఇన్నేళ్ళ సాధన కలిగిన మీరే,నేను చెప్పేవరకూ నన్ను గుర్తించలేకపోయారు.ఇలాగే ఉంటుంది.

వామాచారంలో కూడా పంచమకారాలను విధివిధాన సహితంగా కొద్ది కొద్దిగా మాత్రమె స్వీకరించాలనీ దానిని ఒక సాధనగా ఉపాసనగా గురువుయొక్క పర్యవేక్షణలో మాత్రమె ఆచరించాలనీ, తద్భిన్నంగా ఆశతో ఇంద్రియతృప్తి కోసం ఆబగా వాటిని స్వీకరిస్తే అది మహాపాతకమనీ సిద్ధిని ఇవ్వకపోగా మనిషిని పతితుడిని చేస్తుందనీ స్పష్టంగా చెప్పబడి ఉన్నది.

మీరన్న సాత్విక సమయాచారంలో కూడా, దాని పరమ ప్రయోజనం అయిన బ్రహ్మైక్యసిద్ధిని పొందినవారు ఎందరున్నారు?ఇంతవరకూ నాకు ఒక్కరు కూడా కనిపించలేదు.దక్షిణాచారపరులు నాకు చాలామంది తెలుసు.వారిలో అందరూకూడా-'అమ్మదయవల్ల మా అమ్మాయికి పెళ్లయింది,మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది,ఫలానా ఆవిడకి దయ్యం పడితే నేను మంత్రించి నీళ్ళు చల్లితే వదిలిపోయింది,ఫలానా ఆయనకీ నేను తీర్ధం ఇస్తే ఆయనకున్న కేన్సర్ రోగం తగ్గింది.ఫలానా వ్యక్తి కోర్టు కేసులో చిక్కుకుంటే నేను మహావిద్య పారాయణ చేస్తే అతను కేసు గెలిచాడు.ఇంకొకడికి చేతబడి జరిగితే నేను ఇంకేదో మంత్రం చదివి బూడిద పూస్తే అ చేతబడి చేసినవాడే చచ్చాడు.'-ఇలాంటి సోదిమాటలు చెప్పేవారే గాని, 'శ్రీవిద్యాసాధనవల్ల నాకు బ్రహ్మజ్ఞానం కలిగింది.నేను ద్వంద్వాలను అతిక్రమించి అనిర్వచనీయమైన అద్వితీయమైన పరబ్రహ్మానుభవాన్ని పొందాను.నేను జననమరణ చక్రాన్ని దాటాను.నాజన్మ ధన్యం అయింది'-అని చెప్పినవారుగాని,కనీసం ఆ స్థాయికి చేరినవారుగాని ఒక్కరూ నాకు కనిపించలేదు' చెప్పాను.

'అలాంటివారు కూడా బయటకు కనిపించరేమో మీరన్నట్లు.' అన్నాడు.

'కావచ్చు.కాని అలాంటివారిని నేను గుర్తు పట్టగలను.'చెప్పాను.

'ఎలా గురుతు పడతారు?' అడిగాడు.

'దానికి కొన్ని కిటుకులున్నాయి.దొంగని ఇంకో దొంగ వెంటనే గుర్తు పట్టగలడు.మాఫియాని ఇంకొక మాఫియావాడు వెంటనే పట్టేస్తాడు.అలాగే పోలీసుని పోలీసు వెంటనే గుర్తు పడతాడు.వాళ్లకు కొన్ని సంకేతాలుంటాయి. బయటవాళ్లకు అది అర్ధం కాదు.' అనిమాత్రం చెప్పాను.

'సరే మీరన్న దారిలోకే వస్తాను.ప్రయత్నం చెయ్యడం తప్పులేదు కదా? చేస్తూ ఉంటే ఎప్పటికో చేరుతాము' అన్నాడు.

'ఆ ప్రయత్నమే సక్రమమైన రీతిలో చెయ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎవరికి వీలైన ఉపాసన వారు చెయ్యడమే సక్రమం. మీకు సరిపోయే ఉపాసన నేను చెయ్యడం అక్రమం.నా స్వభావానికి తగిన ఉపాసన నాకు సక్రమం.one man's meat is another man's poison' కదా.కనుక వామాచారం తప్పు కాదు.కౌలాచారం అంతకంటే తప్పు కాదు.ఆయా విధానాలు సరిపోయే వారికి అవి మంచివే.కనుక మీ గురువుగారు కౌలాచారాన్ని విమర్శించడం కరెక్ట్ కాదు.అంటే నేనింతకు ముందు చెప్పినట్లుగా ఆయనకు శ్రీవిద్యపైన పూర్తి అవగాహన లేదు.' చెప్పాను.

'చండాలమైన ఉపాసన ఎందుకు? మంచిదే చెయ్యవచ్చు కదా?' మళ్ళీ మొదటికి వచ్చాడాయన.

'అయ్యా.మంచి అంటే 'ఇది' అని మీరు ఒక నిశ్చితమైన అభిప్రాయాన్ని మీ మనసులో ఏర్పరచుకుని ఉన్నారు.కనుక మీరు దానిని దాటి చూడలేకపోతున్నారు.మీ మంచి నాకు మంచి కాకపోవచ్చు.' అన్నాను.

'పంచ మకారాలు ఉపయోగించే కౌలాచారం కరెక్ట్ ఎలా అవుతుంది?' మళ్ళీ అడిగాడు.

ఇక ఇలా లాభం లేదని అనిపించింది.

'సరే.శ్రీవిద్యోపాసకులుగా మీరు లలితా సహస్రనామాలు ప్రతిరోజూ జపిస్తారు కదా?' అడిగాను.

'అవును' అన్నాడాయన. 

'సరే.అందులోని కొన్ని నామాలకు అర్ధాలు నాకు తెలియడం లేదు.కొంచం వివరించండి' అంటూ ఈ క్రింది నామాలు వల్లించాను.

'కురుకుళ్ళా కులేశ్వరీ కుల కుండాలయా కౌలమార్గ తత్పర సేవితా'

'కులోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ'

'కార్య కారణ నిర్ముక్తా కామకేళీ తరంగితా'

'యోనినిలయా కూటస్థా కులరూపిణీ'

'కౌళినీ కేవలానర్ఘ కైవల్య పదదాయినీ'

'కులామృతైక రసికా కులసంకేత పాలినీ'  

'మహాశక్తి ర్మహారతి:'

'రతిరూపా రతిప్రియా'

'మేధోనిష్టా మధుప్రీతా'

'కౌలినీ కులయోగినీ'

'సవ్యాపసవ్య మార్గస్థా'

ఆయన కొంచం సేపు ఆలోచించాడు.

'మా స్వాములవారు లలితా నామాలకు 'శ్రీకళ' అనే భాష్యం వ్రాశారు.అది చూడాలి.' అన్నాడు.

'తీరికగా దానిని తర్వాత చదువుకోండి.ప్రస్తుతానికి నేనడిగినది చెప్పండి.ఈ నామాలన్నీ శాక్తతంత్రం లోని కౌలమార్గానికి చెందినవే కదా?' అడిగాను.

'అవును'

'మరి లలితా సహస్రనామాలు కూడా కౌలమార్గాన్ని సమర్దిస్తున్నట్లా లేనట్లా?' అడిగాను.

'అంటే ఆయా నామాలకు గూడార్ధాలు ఉంటాయి.వాటినే మా స్వాములవారు తన భాష్యంలో వివరించారు' అన్నాడు.

'ఇదే మనతో వచ్చిన అసలైన చిక్కు.సంస్కృత భాషలో ఉన్న వెసులుబాటు కూడా అదే.అందులో ఒక్కొక్క పదానికి ఏభై అర్దాలుంటాయి.కనుక ఎవరి ఇష్టం వచ్చిన అర్ధాన్ని వారు స్వీకరించవచ్చు.వేదాలకు ఉపనిషత్తులకు భాష్యాలు కూడా ఇలాగే ఎవరిష్టం వచ్చినట్లు వారు వ్రాసుకున్నారు.లేకుంటే త్రిమతాచార్యులకు అవే ఉపనిషత్తులలో అవే మంత్రాలలో వారివారికి కావలసిన అర్ధాలే ఎలా కనిపించాయి?

చాదస్తులతో వచ్చిన చిక్కే ఇది.వారికి కొన్ని కొన్ని ఊహలు మనసులో స్థిరంగా ఉంటాయి.ఇక వాటికి అనుగుణంగా ప్రతిదాన్నీ దిద్దబోతారు. ఉన్నదాన్ని ఉన్నట్లు చూడలేరు.ఉదాహరణకు 'రతిప్రియా' అన్న నామాన్నే తీసుకుందాం.'మైధునమును ఇష్టపడేదానా' అని ఆ పదం యొక్క అర్ధం. అతిసంస్కారం ఎక్కువగా నిండిపోయిన మన కుళ్ళుమనస్సులకు ఈ అర్ధం పరమబూతుగా తోస్తుంది.కనుక దానిని వక్రీకరించి "జీవాత్మ పరమాత్మతో సంయోగం చెందటమే రతి అన్న పదానికి అసలైన అర్ధం.కనుక ఆ విధమైన సంయోగం అంటే ఇష్టం కలిగినదానా" అన్న అర్ధాన్ని మాత్రమె మనం చెబుతాం.లేదా 'రతీదేవికి ఇష్టమైనదానా' అన్న అర్ధం చెబుతాం. శరీరస్తాయిలో బూతు అయినది ఆత్మస్థాయిలో కాకుండా ఎలా పోతుంది? నేను మీ స్వాములవారి భాష్యం ఇంకా చదవలేదు.కాని అందులో ఈ పదాలకు ఇలాంటి అర్ధాలే చెప్పి ఉంటారని ఊహించగలను.' అన్నాను.

ఆయనేమీ మాట్లాడలేదు.

ఒక పదాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఎందుకు మనం చూడలేక పోతున్నాం? 'రతిప్రియా'అన్న పదంలో మనకు బూతు ఎందుకు కనిపించాలి?దాన్ని దాటవేయ్యడానికి ఏదో గూడార్ధం ఎందుకు కల్పించి చెప్పాలి?ఆ పదం యొక్క అసలైన అర్ధాన్ని ఒప్పుకోలేనంత హిపోక్రసీ మనకెందుకు? రాసినవాళ్ళకు లేని బాధ చదివే మనకెందుకు?ఆడపిల్లలకు హరిప్రియ అనో శివప్రియ అనో విష్ణుప్రియ అనో పేర్లు పెడతారు.కాని రతిప్రియ అని ఎందుకు పెట్టరు? అదికూడా అమ్మవారి నామమే కదా.పైగా రోజూ మీరు పారాయణం చేస్తున్న నామమే.' అడిగాను.

జవాబు లేదు.

'ప్రాచీనుల మనస్సులు మనంత కుళ్ళిపోయినవి కావు.ఆరోజులలో ఉన్నదానిని ఉన్నట్లుగా చూచేవారు స్వీకరించేవారు.అందుకే మన దేవాలయాల మీద ఉండే సంభోగచిత్రాలు ఇప్పుడు మనకు బూతుగా కనిపిస్తాయి.కాని అప్పటివారికి మనకున్నంత ఛండాలపు దృష్టి లేదు.వారి దృష్టిలో అది తప్పుకాదు.ఖజురాహో శిల్పాలలోని కళాత్మకతను చూడలేని వారికే అవి బూతుగా కనిపిస్తాయి.సరియైన దృష్టితో చూడగలిగితే అవి అద్భుతమైన కళాఖండాలు.ఇంకా చెప్పాలంటే కామాన్ని ఒక శాస్త్రంగా మలచి యోగసూత్రాల వలె కామసూత్రాలు రచించిన ఘనత మన సొంతం.

'ఏమైనా బూతు బూతే గదండీ' అంటూ దీర్ఘం తీశాడాయన.

నాకు తిక్క రేగింది.

'అవునండీ.మనం చాలా మర్యాదస్తులమండీ.నక్కవినయాలు మన సొంతం కదండీ.రోజూ మీరు చూస్తున్న టీవీ ప్రోగ్రాములలో కనిపిస్తున్న పాటలూ, డాన్సులూ,యాంకర్ల కులుకులూ,బ్రోతల్ వేషాలూ ఏమిటండీ?ప్రతిరోజూ పొద్దుటినుంచీ అర్ధరాత్రి వరకూ ముసలయ్యలూ ముసలమ్మలతో సహా అందరూ చొంగకార్చుకుంటూ చూస్తున్న ప్రోగ్రాములలో ఉన్నది ఏమిటండీ?సినిమాలలోనూ,పత్రికలలోనూ,ఎఫ్ఫెం రేడియో పోసుకోలు మాటల్లోనూ ఎక్కడ చూచినా ఉన్నది ఏమిటండీ?అందులో మీకు బూతు కనిపించ లేదాండీ?ఒక్క దేవాలయాల మీదే కనిపించిందాండీ?బూతు బూతే అయితే పైన చెప్పిన నామాలలో ఉన్నది బూతు గాక నీతాండీ?వాటిని మీరు రోజూ భక్తిగా చదూతున్నారు కదండీ?అది బూతు కాదాండీ?' నేనూ ప్రతి పదానికీ దీర్ఘం తీశాను. 

ఆయన పకపకా నవ్వేశాడు.

'మీతో కష్టమేనండీ శర్మగారు' అని మాత్రం అన్నాడు.

'వినండి.నేను ఎన్నోసార్లు గమనించాను.ఆడవాళ్ళు అందరూ పధ్ధతిగా కూచుని లలితాసహస్ర నామాలు పెద్ద గొంతుతో అరుస్తూ పారాయణం చేస్తూ ఉంటారు.ఇలాంటి నామాలు వచ్చినప్పుడు మాత్రం చాలామంది అసంకల్పితంగా సౌండు తగ్గిస్తారు.లేదా చదివినట్లు ఊరకే పెదవులు ఆడిస్తారు, లేదా ఆ సమయానికి ఏదో దగ్గు వచ్చినట్లు నటించి ఆ నామం స్కిప్ చేసి తర్వాత నామాన్ని అందరితో కలిసి అందుకుంటారు.అందుకే అలాంటి నామాలు వచ్చినప్పుడు ఉన్నట్టుండి పారాయణం హోరు తగ్గిపోతుంది.నిజమా కాదా?' అడిగాను.

'అందరూ సౌండు తగ్గించరు.కొందరే తగ్గిస్తారు'నవ్వుతూ ఒప్పుకున్నా డాయన.

'ఆ కొందరూ ఎవరంటే ఆయా పదాలకు ప్రతిపదార్ధాలు తెలిసినవారు.అర్ధాల గోల లేనివారు గబగబా చదువుకుంటూ వెళ్ళిపోతారు.వారితో సమస్య లేదు. మిడిమిడి జ్ఞానం ఉన్నవారూ,హిపోక్రసీతో నిండినవారూ మాత్రం ఆ సమయానికి అలా గొంతులు తగ్గిస్తారు.దొంగచూపులు కూడా చూస్తారు.' చెప్పాను.

'నిజమే.' నవ్వుతూ అన్నాడాయన.

లలితాసహస్రనామాలు తంత్రశాస్త్రానికి చెందినవి.అష్టపాశాలైన కామం,క్రోధం, అసూయ,అజ్ఞానం,ఆశ,సిగ్గు,భయం,జుగుప్సవంటి వాటిని మన మనస్సుల లోనుంచి పెకలించి అవతల పారవేయ్యడమే తంత్రం యొక్క ప్రధానసూత్రం.

వీటినే జాతి,కుల,శీల,ఘ్రుణ,లజ్జా,భయ,జుగుప్సా,క్రోదాలని కూడా అంటారు. ప్రతివాడినీ ఈ అష్టపాశాలు పట్టుకుని పీడిస్తూ ఉంటాయి.వీటిని వదిలించు కోవడమే వామాచారంలో ప్రధానం.అలాంటి తాంత్రికస్తోత్రాలు చదువుతూ అవి 'వద్దు' అని చెబుతున్న వాటినే మనస్సులో గట్టిగా అంటి పెట్టుకుంటే ఆయాస్తోత్రాల ఫలితం ఎలా వస్తుంది?' అడిగాను.

'మీ భావాలు చాలా విప్లవాత్మకంగా ఉన్నాయండి' అన్నాడాయన.

'కాదు సార్.సత్యాత్మకంగా ఉన్నాయని చెప్పండి.ఎందుకంటే నా పేరులోనే సత్యం ఉన్నది' నేనూ నవ్వుతూ చెప్పాను.

(మిగతాది తరువాతి భాగంలో)