“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

3, మే 2013, శుక్రవారం

ఎక్కడో వెతుకుతావెందుకు?

రాయీ రప్పల్లో 
వెతుకుతావెందుకు నన్ను 
ఇంకెక్కడా నేను లేనట్లు 

లోహ పాషాణాలలో 
చూస్తావెందుకు నన్ను 
సజీవ ప్రతిమలలో లేనట్లు 

తన రక్తాన్ని పాలుగా మార్చి 
బిడ్డకు స్తన్యమిచ్చి 
తన ఊపిరి దానికి నింపే
తల్లి ప్రేమలో లేనా నేను 

లోకాన్నే ధిక్కరించి 
ప్రాణాలకే తెగించి 
ఏకమయ్యే ప్రేమికుల 
మోహంలో లేనా నేను 

లోకపు విలాసాల  
నట్టనడిమధ్యలో 
ఆకలితో అల్లాడే 
అభాగ్యుని వేదనలో 
లేనా నేను 

చెయ్యని పాపానికి 
తల్లి ఒడికి దూరమై 
చెత్త కుప్పలో పడిఉన్న 
శిశువు అమాయకపు
నవ్వులో లేనా నేను 

తాను తినక దాచి ఉంచి 
పిల్లలకన్నం పెట్టి 
నీళ్ళుతాగి నిద్రించే 
పిచ్చి తల్లి 
ఆకలిలో లేనా నేను

పుత్రుల దయకు దూరమై 
వృద్ధాశ్రమాల్లో మగ్గే  
పండుటాకుల దీనత్వపు 
చూపుల్లో లేనా నేను 

లోకుల కోరికల వేడికి  
తన ఒంటిని అర్పించే 
అభాగ్యురాలి కన్నీటి  
ఘోషలో లేనా నేను

చదువుకొనే మదుపు లేక 
కాయకష్టంలోన మగ్గి 
కమిలి కాయగాస్తున్న  
లేతబాల్యంలో లేనా నేను

నాగరికుల నడిమధ్యన 
గొంతెండి ప్రాణం పోయి 
దిక్కులేక పడిఉన్న  
శవంలో లేనా నేను 

సుందర ప్రకృతి ఒడిలో 
మధుర భావలహరిలో 
విహరించిన నీ స్వాప్నిక 
నేత్రాల్లో లేనా నేను 

ప్రేమ లోలుడవౌతూ   
తనకోసం తపియించిన 
నీదు భావతీవ్రతలో లేనా నేను 

ఆరాధనా  విహ్వలతలో 
విప్పారిన కళ్ళతో 
నిను చూచే నీ నెచ్చెలి  
చూపులలో లేనా నేను 

యోగ రహస్యాలను తెలిపి  
తమను మించి నీవెదగాలని 
ఆశించిన నీ గురువుల 
ఆరాటంలో లేనా నేను 

నిశ్చల ధ్యాన నిమగ్నుడవై  
లోకాన్నే దాటినపుడు   
ఎగసిన నీ ఏకాగ్ర
చిత్తంలో లేనా నేను 

వెలలేని వజ్రాలను 
తెలియక చేజార్చుకుని
విలపించే నీ వెర్రి 
వ్యధలో లేనా నేను

నీకోసం తాను బ్రతికి 
నీకోసం మరణించిన 
నీ తల్లి అమాయక 
ప్రేమలో లేనా నేను

అలసి సొలసి నిద్రలోకి 
నీవు జారుకున్నప్పుడు 
ఏమారక నినునిత్యం 
కాపాడే ఎరుకలో లేనా నేను 

అనుక్షణం వెంట ఉండి 

నిన్నెపుడూ కాపాడిన 
నువు కొలిచే దేదీప్యపు 
కాంతుల్లో లేనా నేను 

విలాసాల మెరుపులో లేనా నేను
దారిద్ర్యపు ఘోషలో లేనా నేను

నవనందన వనంలో లేనా నేను
ఎడారి మోడుల్లో లేనా నేను 

నింగి నీలిరంగుల్లో లేనా నేను
తేలియాడు మబ్బుల్లో లేనా నేను

నినుతాకే గాలిలో లేనా నేను
నీకై కురిసే వానలో లేనా నేను 

కలగాంచే కళ్ళలో లేనా నేను 
తెగిపోయిన కలల్లో లేనా నేను 

ఎగిరొచ్చే ఊహల్లో లేనా నేను 
నేలరాలిన ఆశల్లో లేనా నేను 

నీ హృదయపు వేదనలో లేనా నేను
నీ ఊపిరిలో ఊపిరిగా లేనా నేను

నీ ప్రాణ స్పందనలో లేనా నేను
నిత్యం నీ తోడుగా లేనా నేను 

నిత్యం నిను పోషించే 
ప్రకృతిలో లేనా నేను  

గుళ్ళూ గోపురాలంటూ 
ఎక్కడో తిరుగుతావెందుకు 

చూడలేకపోతే  వీటిలో 
ఇంకెక్కడ చూడగలవు నన్ను 
రాతి విగ్రహాలలోనా 
నిర్జీవ పూజల్లోనా

రాయీ రప్పల్లో 
వెతుకుతావెందుకు నన్ను 
ఇంకెక్కడా నేను లేనట్లు

లోహ పాషాణాలలో 
చూస్తావెందుకు నన్ను 
సజీవ ప్రతిమలలో లేనట్లు

ఎక్కడో ఆశిస్తావెందుకు నన్ను
నిత్యం నిన్ను వెన్నంటి 
నీలో  నే  లేనట్లు....