“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

19, మే 2013, ఆదివారం

ఎండా చలీ లేని చోటు

వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి ఆహ్వానించడానికి చరణ్ పొద్దున్నే వచ్చాడు.

మాటామంతీ అయ్యాక 'అబ్బ ఒకటే ఉక్కగా ఉన్నది అన్నగారు చెమటలు కారిపోతున్నాయి. నలభై అయిదు డిగ్రీలు దాటినట్లుంది.' అన్నాడు.

'రోహిణీ కార్తె దగ్గరకు వస్తుంటే గుంటూరులో చెమటలు కారక ఇంకేం కారతాయి' అన్నాను నవ్వి.

'హైదరాబాద్ లో అయితే చల్లగా ఉంటుందేమో కాస్త' అన్నాడు.

'లేదు నాయనా పేపర్ చూచావా? అక్కడ కూడా వాతావరణం బాగా చెడిపోయిందిట.మొన్న బెంగుళూర్ నుంచి వచ్చిన ఒక ఫ్రెండ్ చెప్పాడు.అక్కడ కూడా మునుపటిలా చల్లదనం లేదట.మనమే ప్రకృతిని పాడుచేసుకుంటున్నాం.మళ్ళీ మనమే మొత్తుకుంటున్నాం.' అన్నాను.

'అవునన్నగారు.ఇంతకుముందు ఎప్పుడైనా ఒకరోజు హైదరాబాద్ వెళితే ఎప్పుడేపుడు అక్కణ్ణించి బయటపడి మనూరికి పారిపోదామా అనిపించేది.ఈ మధ్య గుంటూరులో కూడా టూ వీలర్ మీద వెళుతుంటే కళ్ళు మండుతున్నాయి.అంటే ఇక్కడకూడా పొల్యూషన్ బాగా పెరుగుతున్నదన్నమాట.' అన్నాడు.

నేను నవ్వి ఊరుకున్నాను.

'సరేగాని అన్నగారు.కరెంటు పోయి ఇంత దారుణంగా ఉంటె మీకేం బాధగా లేదా? కనీసం ఇన్వర్టర్ పెట్టుకోవచ్చు కదా?' అడిగాడు.

'శరీరానికి మరీ అంత సుఖం అలవాటు చెయ్యకూడదు.అలా చేస్తే తర్వాత చాలా బాధపడవలసి వస్తుంది.'అన్నాను.

'అవును. నాకైతే ఏసీ బాగా అలవాటయ్యి ఇప్పుడు గదిలోనుంచి బయటకి రావాలంటే ప్రాణం పోతున్నట్లు ఉంది.' అన్నాడు.

'చరణ్.ఒకమాట చెప్పనా.పాతరోజుల్లో కరెంట్ లేనప్పుడు మానవ సంబంధాలు బాగుండేవి. అందరూ ఒకచోట కూచుని చక్కగా ఏవో మాటలు చెప్పుకుంటూ ఉండేవారు.ఇప్పుడో?  కరెంట్ ఉన్నంతవరకూ ఎవరూ ఎవరితోనూ పలకరు. కరెంట్ పోయినప్పుడు మాత్రమే అందరూ వాళ్ళవాళ్ళ రూముల్లోంచి లాప్టాప్ లు వదలి హాల్లోకొచ్చి కూచుని ఏమీతోచక మాటామాటా అనుకోని గొడవలయ్యి మళ్ళీ కరెంట్ రాగానే వాళ్ళవాళ్ళ కంప్యూటర్ల దగ్గరికి రయ్యిమని పారిపోతున్నారు.గమనించావా?' విసనకర్రతో విసురుతూ అడిగాను.

'నిజమే అన్నగారు.గాడ్జెట్స్ అనేవి మానవ సంబంధాలను బాగా చెడగొడు తున్నాయి.ప్రపంచంతో కమ్యూనికేషన్ బాగా పెరిగింది.కాని పక్కనే ఉన్న మనుషుల మధ్యన దూరాలు కూడా బాగా పెరిగాయి.ఇంటర్ నెట్ కు జనం బాగా అతుక్కుపోతున్నారు.మనిషి యంత్రాలమీద బాగా ఆధారపడుతూ చివరికి తానె ఒక యంత్రంలా మారిపోతున్నాడు.'అన్నాడు.

'నిజమే.కాని మనిషి ఇంటర్ నెట్ వల్ల సాలెగూటిలో చిక్కుకుంటున్నాడు.దీనికి ఎవరు పేరుపెట్టారో గాని వెబ్ అని బాగా చక్కగా పేరు పెట్టారు.ఈ సాలెగూటిలో చిక్కుకుంటే ఇక బయటపడటం అసాధ్యం.బోలెడంత సమయం వృధా కావడం తప్ప ఇక్కడ నిజంగా ఒరిగే ఉపయోగం అంటూ ఏమీ ఉండదు.అందుకే మనిషికి నిజంగా కావలసింది ఇంటర్ నెట్ కాదు.సూపర్ నెట్ కావాలి.అంటే ఈ రొచ్చుకి అతీతమైన దానితో అనుసంధానం కావాలి.అది లేనంతవరకూ నువ్వెంతమందితో చాటింగ్ చేసినా ఈ సాలెగూట్లో చిక్కుకుని చివరికి చావక తప్పదు.ఎందుకంటే ఇక్కడ కూడా నీ స్థాయి మనుషులే నీ చుట్టూ చేరతారు.కనుక జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్లు ఉంటుంది'అన్నాను.

పరిస్తితి దారితప్పుతోందని అనుకున్నాడో ఏమో చరణ్ మాట మార్చి 'ఈ మధ్యన ఏం సినిమాలు చూచారు అన్నగారు?' అడిగాడు.

నేను నవ్వి ఊరుకున్నాను.

'తడాఖా' చూచారా? అడిగాడు.

'తమ్ముడూ.తెలుగు సినిమాలగురించి నన్ను అడిగావంటే నా తడాఖా చూపాల్సి వస్తుంది.వాటి పేర్లు వింటేనే కంపరం ఎత్తుతోంది.సంస్కారహీనులు మాత్రమే నేటి తెలుగుసినిమాలు చూస్తారని నా అభిప్రాయం.దయచేసి ఇటువంటి చెత్త కబుర్లు నాదగ్గర తేవద్దు.' చెప్పాను.

'మరి మీకు శనివారం ఆదివారాలలో ఎలా తోస్తుంది?' అడిగాడు.

'తోచడం తోచకపోవడం అనే పదాలకు అర్దాలు నాకు తెలీదు' చెప్పాను.

'సరే ఉంటాను అన్నగారు'.అని సెలవు తీసుకుంటూ 'ఏదైనా ఒక మంచిమాట చెప్పండి.' అడిగాడు.

ఆ మాట వింటూనే ఒక జెన్ కథ గుర్తుకొచ్చింది.

'వేడీ చల్లదనమూ బాధించని చోటికి వెళ్లి చూడు' చెప్పాను.

'అలాంటి ప్లేస్ ఎక్కడుంది' అడిగాడు. 

'ఉంది.వెతుకు దొరుకుతుంది.' అన్నాను.

'మీకీమధ్యన మార్మికభాష బాగా ఎక్కువైంది అన్నగారు' అన్నాడు.

'గుంటూరులో ఎండలు చాలినంతగా లేవు తమ్ముడూ.' అన్నాను నవ్వుతూ.

'ఉంటాను అన్నగారు.ఇంకా ఎక్కువ మీతో మాట్లాడితే నా మతిపోయేటట్లున్నది' అంటూ సెలవు తీసుకున్నాడు.

'ఆ శుభ ఘడియ కోసం ఎదురుచూస్తుంటా' అంటూ నేనూ బై చెప్పాను.