“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

26, ఆగస్టు 2012, ఆదివారం

జిల్లెళ్ళమూడి స్మృతులు -4

'వింటుంటే ఆనందం గానే ఉన్నది గాని జిజ్ఞాస మాత్రం పోవడం లేదక్కయ్యా? అడిగాడు చరణ్.

'ఎందుకు నాయనా నీకు జిజ్ఞాస?' అడిగింది అక్కయ్య.

'తెలీదక్కయ్యా. ఏవేవో అనుమానాలు వస్తుంటాయి. నేను సరైన దారిలో నడుస్తున్నానా లేదా అని చాలాసార్లు అనిపిస్తుంటుంది. ఒక్కొక్కసారి అన్నగార్ని అడుగుతుంటాను. కాని ఆయన అన్నిసార్లు అందుబాటులో ఉండరు కదా.' అన్నాడు చరణ్.

'నీవు సరియైనదారిలోనే ఉన్నావు. భయపడకు. అయినా ఇంకా నీకేందుకు నాయనా జిజ్ఞాస? నీవు అమ్మను చూడక ముందు ఆ మాట అంటే ఒక అర్ధం ఉండేది. చూడకముందు జిజ్ఞాస ఉండాలి. అమ్మను చూచావు. అమ్మతో కొన్నాళ్ళు ఇక్కడే ఉన్నావు. అమ్మే నీకు బ్రహ్మోపదేశం చేసింది. ఇంకా నీకు జిజ్ఞాస ఏమిటి? నీకు ప్రస్తుతం ఉండాల్సింది శరణాగతిగాని జిజ్ఞాస కాదు.' తేల్చి చెప్పింది అక్కయ్య.

నేను మౌనంగా ఇదంతా వింటున్నాను.

చరణ్ కళ్ళవెంట నీళ్ళు కారిపోతున్నాయి. నమస్కార ముద్రలో అక్కయ్య పాదాల దగ్గర కూచుని ఆమె ముఖంలోకే చూస్తున్నాడు.

నా మనస్సు ఉపనిషదృషుల కాలంలోకి వెళ్ళిపోయింది. అదొక అడవి. మేమందరం ఒక ఆశ్రమంలో ఉన్నాం. బ్రహ్మజ్ఞాన సంపన్నురాలైన ఒక బ్రహ్మవాదిని సమక్షంలో కూచుని ఉన్నాం. వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. జిజ్ఞాసువైన శిష్యుడు అడిగే ప్రశ్నలకు జ్ఞానమూర్తిగా ఆమె జవాబులిస్తున్నది. ఎవరన్నారు మన దేశంలో మహనీయులు లేరని? ఎవరన్నారు ఆధ్యాత్మికత అడుగంటి పోయిందని? జీవితాన్ని ఆధ్యాత్మికమార్గంలో పునీతం చేసుకున్నవారు ఇప్పటికీ మన దేశంలో ఎందఱో ఉన్నారు. వారు మన మధ్యనే ఉన్నారు. మన చుట్టూనే ఉన్నారు. మన కళ్ళకు కట్టుకున్న గంతలు తొలగించి చూస్తే కనిపిస్తారు. అహంకారంతో మనం చూడలేకపోతే ఆ తప్పు మనదే గాని వారిది కాదు. ఏవేవో భావాలు మన మనసులో అడ్డు తగులుతుంటే వారిని మనం గమనించలేకపోతే ఆ తప్పు వారిదేలా అవుతుంది? మనం ఊహల్లో విహరించడం ఆపి కళ్ళు తెరిచి చూస్తే వారు ఇక్కడే కనిపిస్తారు.

రామకృష్ణుల భక్తురాలైన 'గోపాలేర్ మా' పవిత్ర జీవితం నాకు హటాత్తుగా గుర్తొచ్చింది.  అతి నిరాడంబర జీవితాన్ని ఆమె గంగానది ఒడ్డున గల ఒక చిన్న గదిలో గడిపింది. ఆమె గతించిన రోజున ఆమెగదిలో దొరికిన ఆమె ఆస్తి రెండో మూడో వస్తువులు మాత్రమే. జపమాల,చాప,ఒక రాగిచెంబు,ఒక పుస్తకం ఇవీ ఆమె ఆస్తి. నిరంతర సాధనతో ఆమె చిన్నకృష్ణుని నిరంతరమూ తన కళ్ళెదుట చూచేది. బాలకృష్ణుడు ఆమెతో ఆడుకునేవాడు. ఆమెను విసిగించేవాడు. అల్లరి చేసేవాడు. అతనికి బువ్వ పెట్టి నిద్రపుచ్చేది. కనపడకుండా ఎక్కడో దాక్కుని విసిగిస్తుంటే బెత్తం తీసుకుని ఎక్కడున్నాడా అని వెదికేది. ఒక్కొక్కసారి కృష్ణుని అల్లరి భరించలేక బెత్తంతో ఆ పిల్లవాని వీపుమీద రెండు దెబ్బలు వేసేది. అలా చేసినందుకు మళ్ళీ ఏడుస్తూ చిన్నికృష్ణుని దగ్గరకు తీసుకుని లాలించేది. ఇవన్నీ ఆమెకు జాగ్రదావస్థలోనే కళ్ళముందే జరిగేవి. ధ్యానంలో కాదు. వారుకదా నిజమైన మహనీయులు? అటువంటి వారు నడయాడినందువల్లనే ఈ దేశానికి ధన్యత కలిగింది? ఈమట్టి పవిత్రతను సంతరించుకున్నది అలాంటివారి పాదస్పర్శతోనే కదా? ఎందరు రాజులు చక్రవర్తులు పుట్టి నిరర్ధకజీవితాలు గడిపి,ఎందరి కర్మనో మూటగట్టుకుని పోలేదు? సాధువుల నిరాడంబర పవిత్రజీవనం ముందు వారి విలాసపూరిత జీవితాలు ఎందుకు పనికొస్తాయి? అక్కయ్య జీవితాన్ని చూస్తే నాకు 'గోపాలేర్ మా' గుర్తొచ్చింది.  

మౌనంగా వింటున్న నావైపు తిరిగింది అక్కయ్య.

'నాకు మాత్రం,ఇప్పుడేదో లేదని,ఇంకేదో కావాలని ఏమీ అనిపించదు నాయనా. అనుక్షణం అమ్మ గుర్తొస్తూనే  ఉంటుంది. ఏ మాట విన్నా ఏ సంఘటన జరిగినా, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు 'అమ్మ ఇలా అన్నది కదా' అని అమ్మ మాటలూ అప్పటి సంఘటనలే నిత్యమూ గుర్తొస్తూ ఉంటాయి. ఆ విధంగా అమ్మ ధ్యానమే నిరంతరమూ సాగుతూ ఉంటుంది. మనసెప్పుడూ అమ్మతోనే ఉంటుంది. ఒకటి లేదనీ అనిపించదు. ఇంకోటి కావాలనీ అనిపించదు. అమ్మ ఉంది తను చూచుకుంటుంది. ఇక మనకెందుకు చింత అనిపిస్తుంది.' అన్నది.

ఆమె స్థాయిని చూస్తే, నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఆ మారుమూల కుగ్రామంలో, రెండుగదుల ఇంట్లో, అతి నిరాడంబర స్తితిలో, నిరంతర ధ్యానమగ్నతలో, ఏ పటాటోపమూ  లేని జీవితాన్ని గడుపుతూ, పండిన పండులా, నిండుగా కనిపిస్తున్న ఆ స్త్రీమూర్తి ఎంతటి ఉన్నతమైన జీవితాన్ని గడుపుతున్నదో కదా అనిపించింది. అంతటి నిరాడంబరతలో కూడా నిశ్చింత అనేది ఆమె ముఖంలో ప్రతిఫలిస్తున్నది. నిరంతరం పరుగులూ, ఆశలూ, అసూయలూ, కల్మషపు కుళ్ళుతో కూడిన మన డోల్లబారిన జీవితాలు ఆమె నిర్మలమైన భక్తిపూరిత జీవితం ముందు వెలవెలా బోతున్నాయనిపించింది. 

అద్భుతం ! ఇదే కదా నిజమైన భారతదేశం ! ఇదేకదా మన మహోన్నత సంస్కృతి ! అనిపించింది. మనిషిని ఈ స్తితికి చేర్చేదే నిజమైన హిందూమతం. ఇదే నిజమైన ఆధ్యాత్మికత. పరిపూర్ణ శరణాగతి అంటే ఇదేకదా. జీవితానికి ధన్యత్వం అంటే ఇదే కదా అనిపించింది. మనస్సు ఎంతో ఎత్తుకు లేచి ఈ ప్రపంచానికి అతీతం అయినట్లు అనిపించింది. మనస్సులోనే మౌనంగా ఆమెకు ప్రణామం చేశాను.

సంభాషణ ముగించి ఇక బయలుదేరుదామని లేచాం. అక్కయ్యకు నమస్కరించి, ఆఫీసుకు వచ్చి, అక్కడున్న దినకర్ గారు ఇంకా ఇతరులవద్ద సెలవు తీసుకొని,మనస్సులో అమ్మకు నమస్కరించి, తిరుగు ప్రయాణాన్ని మొదలుపెట్టాం.

దారిలో బాపట్ల దాటేవరకూ ఎవరూ ఏమీ మాట్లాడలేదు. మాట్లాడే స్తితిలో మనసులు లేవు. ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లుగా ఉంది పరిస్తితి.

మౌనాన్ని చెదరగొడుతూ 'మీరన్నది నిజమే అన్నగారు. నాకివాళ అన్ని సందేహాలూ తీరిపోయాయి' అన్నాడు చరణ్.

నేను తలపంకించి చిరునవ్వు నవ్వాను.

'మన మనస్సే మనకు పెద్ద అడ్డంకి తమ్ముడూ. వేరే అడ్డంకులు ఏమీ లేవు. మన ఆలోచనా ధోరణే మనకు ప్రతిబంధకం. చాలాసార్లు దానివల్లే మనం మహనీయులను గుర్తించలేం. గుర్తించినా వారు చెప్పినది సరిగ్గా అర్ధం చేసుకోలేం.ఒకవేళ అర్ధం చేసుకున్నా ఆచరించలేం. వీటన్నిటికీ కారణం, ఎన్నో ఏళ్లనుంచీ మనం ఏర్పరచుకున్న మన భావజాలం. మనం ఒకవిధంగా ఆలోచించడానికి అలవాటు పడిఉంటాం. ఆ అలవాటే మనకు సత్యాన్ని దూరం చేస్తుంది. మన కళ్ళకు గంతల్లా ఆవరిస్తుంది. అది తొలగించుకుంటే చాలు. అంతా చక్కగా కనిపిస్తుంది. అదే శరణాగతి. 

కాని దానిని ఎందరు చెయ్యగలరు? తన మనస్సే తనకు ప్రధమశత్రువని ఎవరు ఒప్పుకుంటారు?తన ఆలోచనాధోరణే తనకు అడ్డు అని ఎవరు గుర్తిస్తారు? అలా ఒప్పుకోవాలంటే అహం అడ్డు వస్తుంది. తనను తాను మార్చుకోవడానికి ఎవరు సాహసిస్తారు? ఎవరూ ఆ పనికి ముందుకు రారు. పెద్దమాటలు మాత్రం అందరూ చెబుతారు. మనం మాటల్లో హీరోలం. కాని ఆచరణలో జీరోలం. సముద్రాన్ని లంఘిస్తామని బీరాలు పలుకుతాం. కాని లేచి ఒక్కడుగు వెయ్యలేం. ఇదే మనతో వచ్చిన పెద్ద చిక్కు. ఇక్కడే అందరమూ ఫెయిల్ అవుతాం.' అన్నాను.

చరణ్ నవ్వాడు.'నిజమే అన్నగారు. ఈరోజు అక్కయ్య చెప్పిన మాటలతో నాకు కళ్ళకు పట్టిన పొరలు ఊడిపోయినట్లు అయింది. నిజమే. అమ్మను నేను చూచాను ఆమె అనుగ్రహాన్ని పొందాను. ఇంకా నాకెందుకు సందేహాలు? జిజ్ఞాసలు?' అన్నాడు.

'తమ్ముడూ ఒకమాట చెప్పనా? ఆద్యాత్మిక జీవితాన్ని చాలా తేలికగా చెప్పవచ్చు. మూడే మెట్లలో దాన్ని దాటవచ్చు.మూడు అడుగుల్లోనే దానిని పూర్తి చెయ్యవచ్చు.' అన్నాను.

'చెప్పండి అన్నగారు' ఉత్సుకత చరణ్ లో తొంగిచూచింది.

'మొదటి మెట్టు అజ్ఞానం. రెండవది జిజ్ఞాస. మూడవది శరణాగతి. ఆధ్యాత్మికత అంటే ఇంతే తమ్ముడూ. ఎవరి జీవితమైనా ఈ మూడు మెట్లే. ఇంకేమీ లేదు.' అన్నాను.

చరణ్ ముఖం వెలిగిపోయింది.'ఎంత బాగా చెప్పారన్నగారు?' అన్నాడు.

'నే చెప్పలేదు తమ్ముడూ.అమ్మ చెప్పించింది' అంటూ నవ్వాను. 'ఎవరైనా మనం ఏ మెట్టులో ఉన్నామో చూచుకోవాలి. పై మెట్ట్టుకు ఎదగాలి. ఆ ఎదుగుదల సహజంగా మనస్పూర్తిగా జరగాలి. ఒకరిమెప్పుకోసమో, అహంతృప్తి కోసమో కాకుండా నిజమైన తపనతో అది జరగాలి.సరళమైన హృదయం ఉంటే ఇది చాలా సులభం. అలా కాకుండా లోపల నానా కల్మషం ఉంటే ఇదే చాలా కష్టం. అంతే తమ్ముడూ' అన్నాను.

చరణ్ ఏమీ మాట్లాడలేదు. మాట్లాడటానికి ఇంకేమీ లేదన్నట్లు అతని ముఖం చెబుతోంది. అందరమూ మౌనంగా ఉన్నాం.

కారు మెత్తగా ముందుకు సాగుతోంది. గుంటూరు దగ్గర పడుతోంది. అందరి హృదయాలూ ఆనందభారంతో బరువెక్కి తేలిపోతున్నాయి.