“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

20, ఆగస్టు 2011, శనివారం

బ్రూస్ లీ జాతకం - 2

బ్రూస్ లీ జాతకం మొదటిభాగం ఇక్కడ చూడవచ్చు. ఇతను ఒక రకమైన కారణ జన్ముడే అని చెప్పాలి. ఎందుకంటే చైనీస్ కుంగ్ ఫూ విద్యను పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసి తద్వారా ప్రపంచం మొత్తం మీదా మార్షల్ ఆర్ట్స్ రివైవల్ తీసుకు రావడం అనే సంఘటన ఇతని ద్వారా జరిగింది. ఆ పని చెయ్యడానికి విధి ద్వారా ఎన్నుకోబడ్డాడు కనుక ఇతను కారణజన్ముడే.

కానీ, విచిత్రం ఏంటంటే ఇతనికి చైనీస్ కుంగ్ ఫూ పూర్తిగా రాదు. కుంగ్ ఫూ లోని అనేక స్టైల్స్ లో ఒకటైన వింగ్ చున్ స్టైల్ ను మాత్రం కొంత కాలం నేర్చుకుని మధ్యలోనే వదలిపెట్టాడు. అందుకే దానిలోని లోతైన రహస్యాలు ఇతనికి తెలీవు. ఆ రహస్యాలు నేర్చుకునేటంత కాలంవరకూ గురుశుశ్రూష ఇతను చెయ్యలేదు. పూర్తిగా నమ్మిన శిష్యునికి కాని గురువులు ఈ రహస్యాలు చెప్పరు. అదికూడా కొన్నేళ్ళ నమ్మకమైన సేవ తర్వాతనే ఆ ఉన్నత స్థాయి రహస్యాలు నేర్పిస్తారు. బ్రూస్ లీ అన్నేళ్ల పాటు గురు శుశ్రూష చెయ్యలేదు. అందుకే యిప్ మాన్ నుంచి వింగ్ చున్ విద్యలోని అన్ని రహస్యాలనూ ఇతను నేర్చుకోలేక పోయాడు. 

దానికి కారణం లగ్నారూడం లో ఉన్న రాహువు ప్రభావం. రాహువు దేన్నీ పూర్తిగా నేర్చుకోనివ్వడు. దేన్నీ పూర్తిగా సాధించనివ్వడు  అతని దృష్టి ఎప్పుడూ ఉన్నదాని మీద కాక ఇంకా దేనిమీదో ఉంటుంది. ఎప్పుడూ కొత్తవాటి వెంట పరిగెత్తేటట్లు చేస్తాడు. అన్నీ మధ్యలోనే ఆగిపోతాయి. ఇంకొక అధ్యాయం మొదలౌతుంది. కనుక రాహు ఆధిపత్యం లో ఉన్నవారి జీవితాలు అర్ధాంతరంగానే ముగుస్తాయి. రాహువు కూడా అర్ధాంతరంగా విష్ణు చక్రానికి బలి అయ్యాడన్న విషయం మనం అర్ధం చేసుకోవాలి. 

రాహువు అమృతం తాగీతాగక ముందే విష్ణుచక్రం చేత ఖండింపబడ్డాడు. అలాగే కొందరు జీవితంలో సక్సెస్ సాధించీ సాధించక ముందే హటాత్తుగా  చనిపోతుంటారు. అలాటివాళ్ళ మీద రాహువు యొక్క ప్రభావం అమితంగా ఉంటుంది. వాళ్ళ జీవితాలు చూస్తె ఈ విషయం క్లియర్ గా కనిపిస్తుంది. బ్రూస్ లీ కూడా అటువంటి వాడే. అందుకే అతని జీవితం అర్ధాంతరంగా ముగిసింది. కాని, లోకానికి తెలియకుండా  మరుగున పడిపోయిన వీరవిద్యల పునరుజ్జీవనానికి ఒక ఉపకరణంగా విధిచేత ఎంచుకోబడ్డాడు.

నిజమైన వీరవిద్యలో ఫిలాసఫీ మిళితమై ఉంటుంది. యోగానికీ నిజమైన వీరవిద్యలకూ భేదం లేదు. అందులోనూ చైనీస్, జపనీస్ వీరవిద్యలలో జెన్ సిద్ధాంతాలు కలిసిమెలసి ఉంటాయి. అందుకే ధ్యానాభ్యాసం వీరులకు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే, ధ్యానం అనేది పిరికివాళ్ళ కోసం ఉద్దేశించబడినది కాదు. పిరికివాళ్ళు భక్తులు అవుతారు. కాని  జ్ఞానులు కాలేరు. 

వీరుడైనవాడు మాత్రమె ధ్యానాన్ని చెయ్యగలడు. వీరుడే జ్ఞాని కాగలడు. కారణం? వీరుడికి తెగింపు ఉంటుంది. ప్రాణాన్ని లెక్క చెయ్యని ధైర్యం ఉంటుంది. ఈ లక్షణం ధ్యానంలో చాలా ముఖ్యమైనది. ఇది లేకపోతె ఉన్నతస్తాయికి చెందిన నిజమైన ధ్యానం సాధ్యం కాదు. 

ఉన్నత స్థాయికి చెందిన ధ్యానం అంటే మాటలు కాదు. ప్రపంచంలో అతి కష్టమైన పని ఇదొక్కటే అని నేనంటాను. కారణం ఏమంటే, ఈ స్థాయిలో తనదైన  సర్వస్వాన్నీ అర్పణం చెయ్యవలసి ఉంటుంది. తనకంటూ ఒక ఆధారం లేకుండా నిరాధారంగా శూన్యంలో నిలబడవలసి ఉంటుంది. తన భావాలనూ, అలవాట్లనూ, ఆలోచనలనూ, పద్ధతులనూ, పాము కుబుసం వదిలినట్లు వదిలి, కొత్త శరీరంతో నిలబడవలసి  ఉంటుంది. చివరకు తన అయిదుశరీరాలనూ వదిలి తాను శూన్యంలో కలవవలసి ఉంటుంది. తానే లేకుండా అదృశ్యం కావలసి ఉంటుంది. కనుక, తన ప్రాణాలను పణంగా పెట్టగలిగినవాడే నిజమైన ధ్యాని కాగలడు. ఈ పని అందరూ చెయ్యలేరు. అందుకనే నిజమైన ధ్యానం కూడా అందరూ చెయ్యలేరు.

ఉజ్జయిని కాళికాలయంలో ఒక శాసనం ఉంటుంది. అందులో ఇలా వ్రాసి ఉంటుంది. "తన తలను నరికి కాళికి సమర్పించగలవానికే మాత కటాక్షం లభిస్తుంది." ఇదే ధ్యానంలోకూడా విధించబడిన షరతు. తాను లేకుండా మాయం కాగలిగినవానికే ధ్యానపు లోతులు అందుతాయి. అటువంటి వానికే దైవశక్తి అనుభవం లోకి వస్తుంది.  ఇదే అసలైన ధ్యానం. అంతేకాని, మన అలవాట్లు, మన పద్దతులు మార్చుకోకుండా "నేను ధ్యానమార్గంలో ఉన్నాను" అనుకోటం భ్రమ మాత్రమే. అందుకే నేటి యోగా స్కూల్స్ లో నేర్పిస్తున్న ధ్యానాలు అన్నీ పిల్లచేష్టలని నేనంటాను.నేటి యోగాగురువులకు ఎవరికీ నిజమైన ధ్యానం తెలియదు.ఒకవేళ తెలిసినా దానిని ఎవరికీ నేర్పరు. నేర్పినా అందరూ దానిని చెయ్యలేరు.కనుక, నేటి ధ్యానాలు అన్నీ వ్యాపార కిటుకులు మాత్రమే.అందుకే ఎవరైనా - 'నేను మెడిటేషన్ చేస్తున్నాను' - అని చెబితే నేను లోలోపల నవ్వుకుంటాను. 

ఇంకొక ముఖ్య లక్షణం ఏమంటే వీరుడైనవాడు ప్రపంచంలో తన స్వశక్తిని తప్ప ఇక దేనినీ నమ్మడు. జ్ఞాని కూడా అంతే. కాని భక్తుడైనవాడు ఇంకొక శక్తి పైన ఆధారపడతాడు. భక్తుడు సెంటిమెంటల్ గా తయారౌతాడు. చిన్న కష్టాన్ని కూడా భరించలేడు. చలించిపోతాడు. కనుక భక్తుడు ఎప్పటికీ వీరుడు కాలేడు. జ్ఞాని దేనికీ చలించని కొండలా ఉండగలడు. కనుక వీరుడే జ్ఞాని కాగలడు. కనుకనే నిజమైన మార్షల్ ఆర్టిస్ట్ యోగిగా, జ్ఞానిగా మారవలసి ఉంటుంది. లేకుంటే అతని విద్యకు పరిపూర్ణత ఎప్పటికీ రాదు. ఏ వీరవిద్య అయినా అంతిమంగా యోగవిద్యగా రూపాంతరం చెందవలసి ఉంటుంది. మార్షల్ ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పటికైనా ప్రాణవిద్యా రహస్యాలను అవగతం చేసుకోవాలి. దీనినే కలారిపాయత్ లో మర్మ విద్య అంటారు. ఇతర వీర విద్యలలో  "డిం మాక్" అనీ "డెత్ టచ్" అనే పేరుతోనూ పిలుస్తారు.

వీరవిద్యలకున్న ఫిలాసఫీ పునాదిని అలా ఉంచితే, తరతరాలుగా వెంటాడుతున్న శాప ప్రభావం వల్ల బ్రూస్ లీ అటు వీరవిద్యనూ పూర్తిగా నేర్చుకోకుండా ఇటు ధ్యానాన్నీ అందుకోలేకుండా రెంటికీ చెడ్డ రేవడిగా తయారయ్యాడు.  ఈ శాపం వల్లనే ఇతని కుమారుడు బ్రాండన్ లీ కూడా పాతికేళ్ళ వయసులో అకస్మాత్తుగా మరణించాడు. " ద క్రో" అన్న సినిమా షూటింగ్ సమయంలో ఇది జరిగింది. కాకి శనీశ్వరుని వాహనం అన్న విషయమూ, ఇతని జాతకంలో శని గురువుల వక్రీకరణ షష్ఠస్థానంలో ఉందన్న విషయమూ గమనిస్తే ఈ శాపానికి మూలం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి వీరి వంశంలో ఉన్న శాపం విషయం అలా ఉంచితే, వీరవిద్యా ప్రపంచంలో తనపేరు మాత్రం చిరస్థాయిగా నిలిచే అదృష్టం బ్రూస్ లీకి దక్కింది. హాన్షి యమగుచి, మాసుతత్సు ఒయామా, గిచిన్ ఫునకోషి, కార్యో హిగాషియోనా, చోజన్ మియాగి, జు బాంగ్ లీ, చోటోకు క్యాన్, యసుహిరో కోనిషి, యిప్ మాన్, మొదలైన గ్రాండ్ మాస్టర్ల పేర్లు తెలియని వారికి కూడా బ్రూస్  లీ పేరు తెలుసు. అదే అతని అదృష్టం.

రహస్యంగా చైనీస్ కుటుంబాలలో తరతరాలుగా వారసత్వంగా నేర్పించబడుతున్న కుంగ్ ఫూ విద్యను, ఇతర వీరవిద్యలనూ ప్రపంచ వ్యాప్తంగా నేడు కోట్లాదిమంది అభ్యాసం చేస్తున్నారంటే దానిలో బ్రూస్ లీ పాత్ర ఎంతో ఉంది. బ్రూస్ లీ ని మించిన మాస్టర్లు ఎందఱో ఉన్నప్పటికీ ఆ ఖ్యాతి అతనికే దక్కడానికి కారణాలు, అతని జాతక విశ్లేషణ వచ్చే పోస్ట్ లో చూద్దాం.