“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

22, సెప్టెంబర్ 2009, మంగళవారం

ఖేచరీ ముద్ర

కుండలినీ యోగం లో ఖేచరీ ముద్రకు అత్యంత ప్రాధాన్యత ఉంది. వ్యుత్పత్తి అర్థాన్ని బట్టి "ఖే" అనగా ఆకాశమున "చరి" అనగా చరించునది, ఆనగా ఆకాశమున చరించునది ఖేచరి.

హటయోగ ప్రదీపిక ప్రకారం ఖేచరీ ముద్రావిధానం ఎట్లనగా,

శ్లో కపాల కుహరే జిహ్వా ప్రవృష్టా విపరీతగా
భ్రువోరంతర్గతా దృష్టి ర్ముద్రా భవతి ఖేచరీ

కపాల కుహరమున , అనగా పుర్రె లోనికి నాలుక వెనుకకు తిరిగి ప్రవేశించగా, భ్రూ మధ్యమున దృష్టి ఎకాగ్రముగా నిలిపినచో అది ఖేచరీ ముద్ర అనబడును.

అనగా నాలుకను వెనుకకు మడచి కొండనాలుకకు వెనుక భాగమున కల రంధ్రము గుండా తలలోకి పోనిచ్చి దృష్టి ని నొసటి యందు రెండు కను బొమల మధ్యన నిలిపి యుంచి తదేక దృష్టి తో నిలిచి యుండుటే ఖేచరీ ముద్ర.

దీనినే లంబికా యోగము అని కూడా యోగ గ్రంధములలో చెప్పారు. వేమనకు ఉపదేశము చేసిన గురువు పేరు లంబికా శివ యోగి అని ఒక గాధ కలదు. బహుశా ఆయన ఇటువంటి ఒక పద్ధతిలో నిష్ణాతుడై ఉండవచ్చు.

సామాన్యముగా ఇటువంటి ముద్రలు క్రియలు శైవ సాంప్రదాయం లోనూ, శాక్త సాంప్రదాయం లోనూ కనిపిస్తుంటాయి. నవీన కాలంలో క్రియా యోగాన్ని ప్రచారం లోకి తెచ్చిన లాహిరీ మహాశయులు కూడా ఈ ఖేచరీ ముద్రలో నిష్ణాతులే.

యోగ గ్రంధాల ప్రకారం ఈ క్రియ చెయ్యటం వలన తలలోనుంచి అమృతము అనబడే ఒకానొక ద్రవము జారి అంగిలి లో పడుతుంది. దానిని సరాసరి మింగటం వలన ఆకలి దప్పిక లు తగ్గిపోతాయి. కాని మనిషికి నీరసం అలసట ఉండదు. ముఖంలో ఒక విధమైన తేజస్సు ఎప్పుడూ ఉంటుంది. నిత్య ఉత్సాహంగా, చురుకుగా మనిషి ఉండగలదు. వార్ధక్యం వాయిదా వెయ్య బడుతుంది. దేహ పుష్టి స్థిరంగా ఉంటుంది. రోగాలు దగ్గరకు రావు. ఇదే కాక అతీత యోగ సిద్దులు కాల క్రమేణా కలుగుతాయి.

కాని ఈ క్రియ చెయ్యటానికి పెద్ద ప్రతిబంధకం నాలుకను కిందకు పట్టి ఉంచే ఫ్రెన్యులం అనబడే ఒక చర్మపు అతుకు. దీనిని తొలగించటానికి అనేక క్రియలు యోగంలో ఉన్నాయి. చేదనము దోహనము అనే క్రియలు యోగులకు తెలుసు. ఈ అతుకును శుభ్రమైన పదునైన కత్తితో రోజుకు వెంట్రుక వాసి అంత కోస్తూ దానికి ప్రత్యేకం గా తయారు చేసిన మూలికా మిశ్రమం అద్దుతూ ఉంటే కొద్ది నెలలలో అది మొత్తం తొలగించ బడి నాలుక పూర్తిగా వెనుకకు తిరిగి కపాల కుహరం లోకి ప్రవేశించ గలుగుతుంది.

కాని ఈ క్రియను చాలా జాగ్రత్తగా చెయ్యాలి. తేడా వస్తే మాట పడి పోయి మూగ తనం వస్తుంది. దీనికి తోడుగా రోజూ వెన్న రాస్తూ పాలను పితికి నట్లు నాలుకను ఒక ప్రత్యెక పద్దతిలో సాగతియ్యాలి. దీన్ని దోహన క్రియ అంటారు. (దయ చేసి దీనిని ఎవరికీ వారే పొరపాటున కూడా ప్రయత్నం చెయ్యవద్దని ప్రార్ధన. ఒకవేళ చేస్తే వచ్చే ఫలితాలకు నేను బాధ్యున్ని కాను).

ఇదికాక మండూక క్రియ అని ఇంకొక క్రియ కూడా ఉన్నది. ఇది అంతగా ప్రమాద కారి కాదు. ఇది క్రమేణా ఫ్రెన్యులం అనబడే పొరను సాగదీస్తూ నాలుక సులభంగా వెనుకకు తిరిగి కపాల కుహరం లోకి ప్రవేశించి కనుబొమల మధ్య వరకూ లోపలనుంచి వెళ్ళేటట్లు చేస్తుంది.

ఈ క్రియను కొన్నేళ్ళు అభ్యాసం చెయ్యటం వల్ల మనిషి పక్షి వలె ఆకాశంలో సంచారం చెయ్యగలుగు తాడు. అటువంటి సిద్ధులు యోగికి ఇవ్వగల అద్భుత క్రియ ఇది. దీని వల్ల ఎం జరుగుతుందో చెప్తాను.

పుర్రె లోపలి భాగం లో నిద్రానం గా ఉన్నా పిట్యూటరీ, పినియాల్ గ్లాండ్స్ ఈ క్రియ వల్ల ఉత్తెజితాలు అవుతాయి. ఇవి మాస్టర్ గ్లాండ్స్. అనగా శరీరం లోని ఇతర ఎందోక్రిన్ గ్లాండ్స్ అయిన థైరాయిడ్, హైపోథాలమస్, ఎడ్రినల్ గ్లాండు లను ఇవి నియంత్రించగలవు. వీటికి నాలుకతో ఉత్తేజం ఇవ్వటం ద్వారా వాటి హార్మోన్ స్రావాలు సరాసరి నాలుక మీదుగా జారి గొంతులోకి పడి సరాసరి కడుపులోకి చేరుతాయి.

ఈ క్రియ వల్ల శరీరంలో అనూహ్య మార్పులు కలుగుతాయి. అయితే ఒక విషయం . దీనివల్ల హార్మోన్ సిస్టం అతలాకుతలమై బట్ట తల వచ్చే ప్రమాదం ఉంది. ఈ క్రియ టేస్తోస్తేరాన్ అనబడే మేల్ హార్మోన్ ను విపరీతం గా పెంచుతుంది. దానివల్ల బట్ట తల వస్తుంది. యోగులకు శరీరం మీద మోజు ఉండదు కనుక వారికి బాధ లేదు. కాని ఇతరులు ప్రయత్నం చేస్తే భంగ పాటు పడక తప్పదు.

ఈ క్రియ వల్ల కలిగే పరమ ప్రయోజనం ఏమనగా భ్రూ మధ్యంలో ఉన్నఆజ్ఞా చక్రం జాగృతం అవుతుంది. ఈ చక్రం జాగృతం కావటం వల్ల క్రమేణా క్రిందవైన మిగిలిన అయిదు యోగ చక్రాలూ జాగృతం అవుతాయి. తద్వారా పంచ భూతాల మీద అధికారం ప్రాప్తిస్తుంది. అతీత యోగ సిద్దులు కలుగుతాయి. అయితే ఇదంతా రాసినత తేలిక కాదు. ఓపికగా బ్రహ్మ చర్యాన్ని పాటిస్తూ శరీరంలో నిలవ అవుతున్న శక్తిని భరిస్తూ మానసిక మార్పులకు తట్టుకుంటూ కొన్నేళ్ళు సాధన చేస్తే ఇవన్నీ సాధ్య పడుతాయి.

మన యోగంలో ఉన్న రహస్య క్రియలకు ఇదొక ఉదాహరణ మాత్రమె. ఈ క్రియ అన్ని క్రియలకు ముద్రలకు తలమానికం అని యోగ గ్రంధాలు కొనియాడాయి. లాహిరీ మహాశయులు ఈ క్రియను సాధించటం వల్లనే యోగిరాజు అన్న బిరుదును పొందగలిగాడు.

కాని ఇది ప్రమాదకరమైన క్రియ. సమర్ధుడైన గురువు లేనిదే స్వయంగా దీనికి పూనుకుంటే దుష్పరిణామాలు కలుగుతాయి. శాశ్వతంగా మాట పోయి మూగ తనం రావచ్చు. లేదా ఒకవేళ సాధించినా శరీరంలో కలిగే హార్మోన్ మార్పులకు తట్టుకోలేక పిచ్చెక్క వచ్చు. ఇది ఎకాడమిక్ ఇంటరెస్టు తో చదవండి. కాని ప్రయోగం చెయ్యకండి. ఒకవేళ చేస్తే వచ్చే ఫలితాలకు నేను బాధ్యున్ని కాను.