“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

3, మే 2009, ఆదివారం

బోధి ధర్మ-2: షావోలిన్ వీర విద్యలు


బోధిధర్మ చైనాలోని షావోలిన్ మఠం చేరేసరికే అక్కడ బౌద్ధమతం కనీసం అయిదువందల సంవత్సరాల చరిత్రను కలిగిఉన్నది. సర్వసంగ పరిత్యాగులైన బౌద్ధభిక్షువులు దానిలో ఉన్నారు.షావోలిన్ మఠం చైనాలో గల హెనాన్ రాష్ట్రంలోని జంగ్ ఝు పట్టణానికి దగ్గరిలోని సాంగ్ షాన్ పర్వతశ్రేణులలోగల షావోషి పర్వతం మీద ఉన్నది. షావోలిన్ అనే పదానికి నవారణ్యం అని అర్థం ఉన్నది. ఈ పర్వతం బౌద్ధమతానికే గాక అంతకు ముందే వేలసంవత్సరాలుగా చైనాలో ఉన్నటువంటి ప్రాచీన టావోమతానికి పవిత్ర్రప్రదేశంగా ఆరాధించబడుతూ ఉన్నది.


షావోలిన్ మఠంలో గల బౌద్ధభిక్షువులు సూత్రపారాయణకు,నియమ పాలనకు ఎక్కువ సమయాన్ని కేటాయించేవారు. శరీరవ్యాయామానికి విలువ ఇచ్చేవారు కాదు. బలహీనులుగా ఉండి గంటలు గంటలు ఝాన్ లో కూర్చోనలేక పోయేవారు.

చైనా భాషలో ఝాన్ అనగా 'ధ్యానములో కూర్చొనుట'అని అర్థం .సంస్కృతం లో ధ్యానం అనేది పాళీభాషలో 'ఝాన్' అయింది. ఇదే చైనాభాషలో 'చాన్' అయింది. చాన్ బుద్ధిజంలో ముఖ్య అభ్యాసం ఏకాంత మౌనధ్యానం.బోధిధర్మ వీరి స్థితిని చూచి, ముందుగా వీరికి ఆసనసిద్ధి కావలెనని భావించాడు.ఆసనసిద్ధి అనగా ఒకే ఆసనంలో కనీసం మూడుగంటలు కదలకుండా కూర్చొని,కాళ్ళ నొప్పులు తిమ్మిరి మొదలైన ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండగలగటం.దీనికోసం బలహీనులుగా ఉన్న చైనా బౌద్ధభిక్షువులకు ఆయన కొన్నివ్యాయామాలు నేర్పించాడు. వాటినే (sinews transforming exercises) కీళ్ళు మజ్జలను శక్తివంతంచేసే వ్యాయామాలు అంటారు.

బోధిధర్మ వ్యాయామాలను ఎక్కడ నేర్చుకున్నాడు అనేదాని మీద భిన్న అభిప్రాయాలు ఉన్నవి. ఆయన పల్లవరాజు కుమారుడు కనుక చిన్న తనంలో క్షత్రియసహజమైన వీరవిద్యలను నేర్చుకొని ఉండవచ్చు అని పలువురు చరిత్రకారులు ఊహించారు.తమిళనాడులోని మదురై ప్రాంతంలో ఈనాటికీ ఉన్నటువంటి కూట్టువరిసై,సిలంబం,మర్మఅడి మొదలైన వీర విద్యలలో ఆయన నిపుణుడు అయి ఉండవచ్చు.కలారిపాయట్టు శాఖలకు చెందినవారు, కేరళ కలారిపాయట్టులో ఆయన మంచిప్రావీణ్యాన్ని కలిగి ఉండవచ్చు అని భావిస్తున్నారు.కాని ఆయన తమిళనాడులోని మదురై ప్రాంతానికి చెందినవాడు కనుక కూట్టువరిసై,మర్మఅడి వంటి తమిళ వీరవిద్యలలో ప్రవేశం ఉండి ఉండవచ్చు అనేది తార్కికంగా తోస్తుంది.


వ్యాయామాలను అభ్యాసం చేసిన భిక్షువులు మంచి ఆరోగ్యవంతులై ధ్యానాన్ని గంటలకొలది సేపు చేయగలిగేవారు. క్రమేణా ఇవే వ్యాయామాలు పెరిగి పెరిగి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన షావోలిన్ కుంగ్ఫూగా రూపాంతరం చెందాయి. షావోలిన్ కుంగ్ఫూ చరిత్రను దానిలోని శాకోపశాఖలను మరో సారి చూద్దాము.

ప్రపంచంలో నేడు ఉన్నటువంటి అనేక మార్షల్ఆర్ట్స్ అన్నిటికీ షావోలిన్ కుంగ్ఫూను మూలవిద్యగా భావిస్తున్నారు. అంతకుముందే మనదేశంలో అనేక వీర విద్యలున్నవి. కాని మనకు సహజమైన నిర్లక్ష్యధోరణితో వాటిని అన్నింటినీ పోగొట్టుకున్నాము.


కాని దక్షిణ ఆసియాదేశాలలో ఉన్న అన్ని వీరవిద్యల మాస్టర్లు షావోలిన్ మఠాన్ని మరియు బోధిధర్మను ఓంప్రథమంగా స్మరిస్తారు.షావోలిన్ మఠాన్ని తలచి నమస్కరిస్తారు.పాతకాలపు దోజోలలో బోధిధర్మ పటం తప్పక గోడకు వేలాడుతూ కనిపిస్తుంది. లేదా 'దామో' అనే ఆయన బొమ్మ ఉంటుంది. విధంగానైనా కనీసం మన ప్రాచీనవిద్యలు స్మరించబడుతూ ఉన్నవి. అందుకు భారతీయులుగా మనం సంతోషించవచ్చు.


విధంగా బోధిధర్మ చైనాకు వెళ్ళటం ద్వారా షావోలిన్ కుంగ్ఫూ విద్యకు బీజం పడింది.ఇది అనుకోకుండా ప్రపంచానికి బోధిధర్మ చేసిన ఇంకొక మేలు.ప్రపంచ మతచరిత్రలో ఆరుగురు ముఖ్యమైన వ్యక్తుల పేర్లు చెప్పమని ఓషోరజనీష్ను అడిగితే వారిలో బోధిధర్మ పేరు తప్పక ఉండాలి అని ఆయన చెప్పాడు.కాని మనం ఈనాడు బోధిధర్మను మర్చిపోయాం.ప్రపంచానికి జెన్ బుద్దిజంను పరిచయం చేసిన మహాగురువు నేడు ఎవరికీ గుర్తులేడు. ఈయన ఎవరు అని అడిగితే మన సమాజంలో చాలామంది చెప్పలేరు. అదీ మన దుస్థితి.