“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

19, మే 2009, మంగళవారం

బుద్ధుని బోధనలు-2

అస్సజి బుద్దుని మొదటి అయిదుగురు శిష్యులలో ఒకడు. మిగిలిన నలుగురు భద్దియ, కొండన్న, మహానామ,వప్ప. వీరు బుద్ధుడు నిరాహారిగా ఉంటూ తీవ్ర సాధనాలు చేస్తున్న సమయంలో ఆయనను అనుసరించి ఉండేవారు. ఆహారంమానేసి శరీరాన్ని కృశింప చేసి ఇంద్రియ దాస్యం నుంచి ముక్తి పొందటమే మోక్షం అని ఒక భావన కాలంలో ఉండేది. కాని బుద్దుడు ఇది తప్పు అని స్వానుభవం ద్వారా తెలిసుకొని ఆహారాన్ని తీసుకోవటం ప్రారంభం చేస్తాడు. ఇది చూచి అయిదుగురు భిక్షువులూ ఆయన సాధనా మార్గంలో భ్రష్టుడై నాడని తలచి, విడచి తమ మార్గాన పోతారు.

తరువాత కొంత కాలానికి బుద్దుడు జ్ఞానోదయాన్ని పొంది, తానూ కనుగొన్న మార్గాన్ని లోకులలో ఎవరికీ బోధించాలిఅని దివ్య దృష్టి తో చూస్తాడు. తాను ఒకప్పుడు శిష్యరికం చేసిన గురువులైన అలార కలాముడు, ఉద్డక రామ పుత్రుడుఅనేవారు గతించారన్న విషయాన్ని దివ్య చక్షువుతో చూచి, తన అనుచరులైన అయిదుగురు భిక్షువులు కాశీసమీపంలోని సారనాథ్ వద్ద ఉన్నారని గ్రహిస్తాడు.

తరువాత వారికి చేసిన బోధనే ధర్మ చక్ర ప్రవర్తనం అంటారు. విధం గా బుద్ధ ధర్మం ప్రచారంలోకి వచ్చింది. అయిదుగురు శిష్యులలోని వాడే అస్సజి లేక అశ్వజిత్ అనే భిక్షువు. తరువాత వీరందరూ బుద్ధుడు చెప్పిన మార్గాన్నిసాధన చేసి బుద్ధత్వాన్ని పొందారు.

అస్సజి వద్దకు సారిపుత్రుడు వచ్చి బుద్ధుని బోధనలు ఏవి? ఆయన కనుగొన్న మార్గం యొక్క వివరాలు ఏమిటి ? అని ప్రశ్నిస్తాడు. దానికి అస్సజి " అయ్యా, నేను జ్ఞానములో అంత పండితుడను కాను. బుద్ధుడు కనుగొన్న మార్గంయొక్క వివరాలు నాకు పూర్తిగా తెలియవు. కాని స్థూలంగా చెప్పగలను. జీవులకు కలిగే దుఖం యొక్క కారణాలు, కారణాలను నిర్మూలించే మార్గం ఆయన కనుగొన్నాడు". అని చెబుతాడు. దానికి సారిపుత్రుడు ఆనంద భరితుడైమౌద్గాల్యాయనుని తో కలసి బుద్ధ ధర్మాన్ని స్వీకరిస్తాడు.

అస్సజి బుద్ధుని మార్గాన్ని చక్కగా నిర్వచించాడు. ఎవరైనా బుద్ధ ధర్మమును గురించి చెప్పవలెనంటే ఇంతకంటేక్లుప్తముగా చక్కగా చెప్పటం కష్టం. బుద్ధుని సమస్త బోధల సారాంశం ఇందులో ఇమిడి ఉన్నది.