“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

28, మార్చి 2009, శనివారం

గుళిక ఫలితాలు

ఒక్కొక్కసారి దశ అన్తర్దశలు, గోచారం అన్నీ బాగున్నా చెడు సంఘటనలు జరుగుతాయి. కారణం వెదికితే దొరకదు. అటువంటప్పుడు మాంది, గుళిక లను బట్టి చూస్తె ఆశ్చర్య కర ఫలితాలు అగుపిస్తాయి.

ఉదాహరణకు రవీంద్రనాథ్ టాగూర్ జాతకంలో గురువు కటకంలో ఉచ్చ స్థితి. లగ్నం మీనం. మీనంలో చంద్రుడు. ఈయన మరణం గురు దశ/గురు అంతర్దశలో జరిగింది. లగ్నాధిపతి పంచమంలో ఉచ్చ స్థితిలో ఉండగా, పంచమాధిపతి లగ్నంలో ఉండగా, వీరిద్దరి పరివర్తన యోగం లో ఉన్న స్థితి మారక దశ ఎట్లా అయింది? దీనికి సమాధానం దొరకదు.

ఇప్పుడు గుళిక ను గమనిస్తే, బిందువు తులా రాశిలో గురువు గారి విశాఖా నక్షత్రంలో ఉంది. లగ్నాత్ అష్టమ రాశి. కనుక తన మారక శక్తిని గురు దశలో గురు అంతర్ దశలో ఉపయోగించి మారకం చేసింది. కనుక గుళిక అనేది చాలా ముఖ్య మైన బిందువు అని తెలుస్తూంది. ఇటువంటి అనేక ఉదాహరణలు ఇవ్వ వచ్చు.

కొన్ని గుళిక ఫలితములు

గుళిక తో కూడి ఉన్న గ్రహ దశ యోగించదు. అనేక కష్ట నష్టాలు పెడుతుంది. అప్పుడు మన తెలివి తేటలు, స్వ శక్తి కబుర్లు ఎందుకూ పనికి రావు. గుళిక బిందువు లగ్న బిందువుకు ఎంత దగ్గిరగా ఉంటే అంత దోషం. వీరికి అవయవ లోపం ఉండవచ్చు. చిన్న తనంలో తీవ్ర అనారోగ్యం తో భాద పడవచ్చు. రకంగా భావం లో ఉంటే భావ కారకత్వాలు పాడు అవుతాయి. గ్రహంతో కలిసి ఉంటే గ్రహ కారకత్వాలు నాశనం అవుతాయి.

గులికను శని భగవానుని సంతానంగా చెబుతారు. ఈయన లక్షణం ప్రతీ దాన్ని ఆలశ్యం చెయ్యటం. భ్రమకు లోను చెయ్యటం. ఆటంకాలు కల్పించటం. నిరాశకు గురి చెయ్యటం మొదలైనవి.

చిన్న ఉదాహరణ. ఒకరి జాతకంలో గుళిక నాలుగో భావంలో ఉంది. వ్యక్తి విద్యా రంగంలో తీవ్ర ఆలశ్యం, ఆటంకాలు కలిగాయి. ఇంట్లోని వారి ఒత్తిడి వల్ల తనకు పూర్తిగా ఇష్టం లేని శాఖలో చదువు సాగింది.

గుళిక పూర్తిగా చెడు చెయ్యదు. ఒక్కో సారి మంచినీ చేస్తుంది. ఉదాహరణకు, మనం ఎక్కాల్సిన రైలో బస్సో మనం లేటు చెయ్యటం వల్ల వెళ్ళిపోతుంది. తిట్టుకుంటాం. కాని తరువాత తెలుస్తూంది, దానికి ఏక్సిడెంట్ అయి జనం చనిపోయారు అని. ఇటువంటి మంచి కూడా గుళిక వల్ల జరుగుతుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతుల జాతకాల్లో గుళిక మంచి చేస్తుంది. వారికి ఉన్న అంతర్ముఖత్వం, ప్రపంచం మీద నిర్లిప్త ధోరణి చాలా వరకు శని, గులికుల వల్లనే కలుగుతాయి.

గుళిక 3,6,10,11 ఉపచయ స్థానాలలో మంచి చేస్తుంది. ఆయా రాశి నాధులు కేంద్రాలలో ఉంటే రాజయోగాన్ని కూడా ఇస్తుంది. ఒక వ్యక్తికి గులికతో కలిశిన చంద్ర దశ ప్రారంభం కావటం తోనే చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆఫీసర్ సెలెక్షన్ వచ్చింది. కారణం చంద్రుడు కేంద్ర స్థానంలో గురువుతో కలిసి గజకేసరి యోగం లో ఉండటమే.

గుళికకు 180 డిగ్రీలలో ఉన్న బిందువును ప్రమాణ గుళిక అంటారు. దీనికి కూడా ప్రాముఖ్యత ఉంది. రెండు బిందువుల మీద శని గోచారం అత్యంత చెడు ఫలితాలు ఇస్తుంది. ఒకరి జాతకంలో ప్రమాణ గుళిక బిందువు మీద శని గోచారంలో అనుకోకుండా తండ్రి మరణం జరిగి కుటుంబం చిన్నా భిన్నం కావటం జరిగింది.

గులికతో కలిశిన గ్రహం కారకత్వాలు పూర్తిగా ధ్వంసం అవుతాయి అని పైన చెప్పాను. ఒక ఉదాహరణ. ఒక జాతకంలో గుళిక చంద్రునితో దగ్గిరగా కలిశి ఉంది. జాతకుని తల్లిగారు జీవితమంతా విపరీత బాధలతో గడిచింది. ఇంకొక జాతకునికి గుళిక రవితో ఒకే డిగ్రీలో కలిశి ఉంది. జాతకుని తండ్రి అసహజ మరణం పాలయ్యాడు. ఇట్లా ఎన్ని ఉదాహరణలైనా ఉన్నాయి.

జాతకుని తండ్రి గారు ఇలా చనిపోతారు అని ఆరేళ్ల ముందుగానే దీన్ని బట్టి చెప్పటం జరిగింది. విషయం చెప్పి తగిన రేమేడీలు సూచించినపుడు వాళ్లు నవ్వి, తేలికగా కొట్టి పారేశారు. కాని ఆరేళ్ల తర్వాత సంఘటన జరిగినప్పుడు వాళ్ల కుటుంబం వారు అందరూ వచ్చి బాధపడ్డారు, రేమేడి చేసుంటే బాగుండేదే అని.

ఇంకొక జాతకునికి గుళిక కుజునితో కలిశి ఆరవ రాశిలో ఉంది, ఇతడు ఒక ఫేక్షన్ లీడర్. కుజ దశ ప్రారంభం కావటం తోనే జరిగిన కొట్లాటలో నడి రోడ్డు మీద పట్ట పగలు హత్య చెయ్య బడ్డాడు.

గులికను బట్టి ఇంకా సూక్ష్మ వివరాలు చెప్ప వచ్చు. ముఖ్యమ్గా పూర్వ జన్మ దోషాలు గులికను బట్టి తేట తెల్లం గా తెలుస్తాయి. సర్ప దోషం మొదలైనవి కేరళ జ్యోతిష్కులు అత్యంత ఖచ్చితంగా దీన్ని బట్టే చెప్ప గలుగుతారు.

గుళిక డిగ్రీని బట్టి దశలను గుణించే విధానం ఒకటి ఉంది. దీన్ని గుళిక దశ అంటారు. జీవితంలో రాబోయే కష్ట కాలాన్ని ఇది ఖచ్చితంగా చూపుతుంది. దానిని బట్టి తెలివైన వారు ముందే జాగర్త పడి రేమేడీలు చేసుకొని యా బాధల నుంచి తప్పుకోవచ్చు.

ప్రశ్న విధానంలో గుళిక ను బట్టి వారి కుటుంబంలో తరంలో ఎవరు దోషం చేసారు. దానికి నివారణ ఏమిటి అనేది కేరళ జ్యోతిష్కులు ఆశ్చర్య కరమైన వివరాలు చెప్ప గలరు. విచారిస్తే ముందు తరాలలో తాత ముత్తాతలో అటువంటి పని చేసినట్టు తెలుస్తూంది. ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

రాహు కాలం అందరికీ చెడు చేస్తుంది. కాని జాతకంలో రాహువు మూడింట ఉన్న వారికి మంచి చేస్తుంది. అలాగే గుళికకాలం కూడా. గుళిక ఒక జాతకంలో రాజ యోగాన్ని ఇస్తుంటే అతనికి గులికోదయ కాలం చాలా మంచిని చేస్తుంది. సమయంలో చేసిన పని సఫలం అవుతుంది. ఇది ప్రతిరోజూ గమనించ వచ్చు.