అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

11, ఆగస్టు 2018, శనివారం

'మా అబ్బాయి ఎక్కడున్నాడు?' - ప్రశ్నశాస్త్రం

పెరిచెర్లలో ఒక కాలేజీలో జరుగుతున్న స్టాఫ్ సెలక్షన్ ఎగ్జాంకు అబ్జర్వర్ గా మొన్న తొమ్మిదో తేదీన వెళ్ళవలసి వచ్చింది. ఆ సందర్భంగా జరిగిన సంఘటన ఇది.

టైము సాయంత్రం 4.00 అయ్యింది. పరీక్ష మూడో షిఫ్ట్ మొదలైంది. కాండిడేట్స్ అందరూ ఆన్లైన్ పరీక్ష రాస్తున్నారు. మాల్ ప్రాక్టీస్ ఏదీ జరక్కుండా మేము గమనిస్తున్నాము. టీ టైం కదా? ఇంతలో ఆ కాలేజీలో ఉండే సపోర్ట్ స్టాఫ్ అనుకుంటాను ఒకామె నాకు టీ తెచ్చి ఇచ్చింది. పల్లెటూరి మనిషిలాగా ఉంది.

టీ కప్పు నా టేబిల్ మీద పెడుతూ - 'సార్ మీరు రైల్వేనా?' అడిగింది.

'అవును' అన్నాను.

'మీరు పోలీసు అధికారా?' అడిగింది.

'కాదు' అన్నాను.

'మరి మీతో పోలీసులు వచ్చారు ఎందుకు?' అడిగింది.

'ఎగ్జాంకు సెక్యూరిటీగా మాతో వచ్చారు. ఏం కావాలి మీకు?' అన్నాను.

'మా అబ్బాయి ఇంట్లోనుంచి వెళ్ళిపోయాడు. రెండేళ్ళు అయింది. మీ రైల్వే పోలీసులకు ఏమైనా తెలుస్తుందా వాడెటు పోయాడో?' అడిగింది.

'వాళ్ళకెలా తెలుస్తుంది? సివిల్ పోలీసులకు కంప్లెయింట్ చెయ్యండి' అన్నాను.

'ఎక్కడికైనా పారిపోవాలంటే రైలెక్కుతాడు కదా? అప్పుడు చూసి ఉంటారేమో?' అడిగింది.

ఆమెది అమాయకత్వమో లేక అతితెలివో అర్ధం కాలేదు. కొంతమంది ఇలా అమాయకత్వం నటించి మనల్ని ఆడుకునేవాళ్ళను ఇంతకుముందు చూశాను. ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలని అనుకుంటూ - 'ఎంత వయసులో ఇంట్లోంచి పారిపోయాడు?' అడిగాను.

'పందొమ్మిది ఉంటాయి' చెప్పింది.

ఎగ్జాం అయిపోవడానికి ఇంకా గంట టైముంది. ఈమెను చూస్తే దిగాలుగా ఉంది. పేదరాలులాగా కనిపించింది. ప్రశ్నచార్ట్ చూచి ఈమెకు జవాబు చెబుదాం అని నాకే ఒక ఆలోచన వచ్చింది. ఆ రోజు గ్రహస్థితి మనకు తెలుసు గనుక, లగ్నాన్ని గమనించాను. ధనుర్లగ్నం అయింది.

పంచమాధిపతి కుజుడు లగ్నంలోకి వచ్చి ఉన్నాడు. అతనే ద్వాదశాధిపతి కూడా అయ్యాడు. దూరప్రాంతాన్ని సూచిస్తూ సప్తమంలో ఉన్న చంద్రుని దృష్టి లగ్నంమీద ఉంది. కనుక కొడుకు తప్పిపోయాడని అడుగుతోంది. లగ్నంలో శనిదృష్టి చంద్రుడి మీద ఉంది, కనుక ఈమె అబద్దం చెప్పడం లేదు. నిజంగానే బాధపడుతోంది.

ఆమె ముఖంలోకి చూచాను. దిగాలుగా కళ్ళక్రింద వలయాలతో ఉంది. మనిషి నల్లగా ఉండి శనిని సూచిస్తోంది.

కుటుంబ స్థానాధిపతి శని ద్వాదశంలోకి పోతున్నాడు. బుధుడు చంద్రునితో కలిసి సప్తమంలో ఉంటూ లగ్నాన్ని చూస్తున్నాడు. ఆ సప్తమం సహజ తృతీయం అవుతూ మాటామాటా పెరగడాన్నీ, గొడవలనూ సూచిస్తోంది. కనుక వీళ్ళ కుటుంబంలో గొడవలు తారాస్థాయిలో జరిగి ఉండాలి.

నా ఆలోచనకు నాకే నవ్వొచ్చింది. గొడవలు జరగకపోతే ఇంట్లోనుంచి ఎవరైనా ఎందుకు పారిపోతారు?

'అదలా ఉంచుదాం. వీళ్ళ కుటుంబంలో ఏం గొడవలు జరిగి ఉంటాయి?' అని ఆలోచిస్తూ దశమం వైపు దృష్టి సారించాను. ఏ జాతకంలోనైనా దశమం బలమైన స్థానం. అక్కడ నీచ శుక్రుడున్నాడు. పైగా హోరాధిపతి కూడా శుక్రుడే అయ్యాడు. కనుక ఆయన హోరలో మనకు ఇలాంటి సంఘటనలే ఎదురవ్వాలి. ద్వితీయంలో బలంగా ఉన్న కుజునితో కోణదృష్టిలో శుక్రుడున్నాడు. పంచమాధిపతిగా కుజుడు ఈమె కొడుకును సూచిస్తున్నాడు. అంటే అమ్మాయిల వ్యవహారాలన్న మాట ! లేబర్ కుటుంబాలలో ఇలాంటివి మామూలుగా జరుగుతాయి. పైగా అబ్బాయికి 19 అంటోంది. వాడి వయసు కూడా సరిపోయింది. లవ్వు ముదిరి చంపుకునే వరకూ వచ్చి ఉంటుంది. అందుకని వీడు ఇంట్లోంచి జంప్ అయి ఉంటాడు.

'మీ వాడికి ఆ వయసులోనే అమ్మాయిల వ్యవహారాలెందుకమ్మా?' అడిగాను టీ సిప్ చేస్తూ.

ఆమె ఏడ్చినంత పని చేసింది.

'మా ఖర్మ సార్ ! ఏం చెప్పమంటారు?' అంది ఎవరైనా వింటున్నారేమో అని చుట్టూ చూస్తూ.

'మీకు తెలిసిన అమ్మాయే కదా? ఆ అమ్మాయి ప్రస్తుతం బాగానే ఉంది. మీవాడు మాత్రం ఇంట్లోనుంచి వెళ్ళిపోయాడు' అన్నాను టీని ఇంకో గుక్క త్రాగి, చతుర్ధం మీద ఉన్న శుక్రుని దృష్టిని, నవాంశలో అతని ఉచ్చస్థితిని గమనిస్తూ.

'అవును సార్ ! మాకు తెలిసిన వాళ్ళే! ఆ అమ్మాయి అంత మంచిది కాదు. ఇప్పుడు ఇంకోడితో హాయిగా ఉంది. ఈ గొడవ జరిగాక మావాడు మాత్రం ఎటో వెళ్ళిపోయాడు.' అంది.

'అలాగా!' అన్నాను నీచలో ఉన్న శుక్రుడిని, ఉచ్చలో ఉన్న కుజుడిని వాళ్ళమధ్యన కోణదృష్టినీ మనోనేత్రంతో గమనిస్తూ.

ఇన్ని గొడవలు జరుగుతుంటే వీళ్ళాయన అనబడే శాల్తీ ఏమయ్యాడా అని అనుమానం వచ్చింది. అటువైపు దృష్టి సారించాను.

సప్తమాధిపతి బుధుడు అష్టమంలో సూర్యునికి చాలా దగ్గరగా ఉండి పూర్తిగా అస్తంగతుడయ్యాడు. అంటే వీళ్ళాయన చనిపోయి ఉండాలి. లేదా అతని వల్ల వీళ్ళకు ఏమీ ఉపయోగం లేదని అర్ధం. అష్టమాధిపతి చంద్రుడు సప్తమంలో ఉన్నాడు. అమావాస్యకు చాలా దగ్గరలో ఉన్నాం. చంద్రుడు జలగ్రహం. అంటే వీళ్ళాయన ఏదో జలప్రమాదంలో చనిపోయి ఉండాలి.

ఆమె ముఖంలోకి మళ్ళీ ఒకసారి చూచాను. బొట్టు లేదు. కానీ, క్రిష్టియన్స్ కూడా బొట్టు పెట్టుకోరు. ఈమెను చూస్తే క్రిస్టియన్ లాగే కనిపిస్తోంది. పైగా ఈ కాలేజీ కూడా కేథలిక్ మిషన్ వాళ్ళదే. ఈ సెన్సిటివ్ విషయాన్ని ఎలా అడగాలా అని కొంచం సంశయించి - 'మీ ఆయన?' అని అర్ధోక్తిలో ఆపేశాను.

'ఈ గొడవ జరగక ముందు ఇక్కడ దగ్గరలోనే క్వారీలో పడి చనిపోయాడు సార్ ! వానలు పడి బాగా నీళ్ళు నిండి ఉన్నాయి వాటిల్లో. అందులో దూకి చనిపోయాడు.' అంది.

నాకనుమానం వచ్చింది.

లగ్నాధిపతి గురువు లాభస్థానంలో ఉన్నాడు. అంటే ఈమె ఫ్రెండ్స్ ని సూచిస్తున్నాడు. అతని దృష్టి సప్తమంలో ఉన్న చంద్రునిపైన ఉన్నది. కుటుంబస్థానాధిపతి అయిన శని దృష్టి కూడా సప్తమంలో ఉన్న చంద్రుని పైన ఉన్నది. చంద్రుడు అమావాస్యకు దగ్గరలో ఉన్నాడు. చంద్రస్థానంలో రాహువున్నాడు. అంటే, ఏవో కుటుంబ గొడవలలో ఈమె భర్త చంపబడి ఉండాలి. చంపినవాళ్లు ఎవరో ఈమెకు బాగా తెలిసే ఉండాలి.

'తనే దూకి చనిపోయాడా? లేక ఏవైనా గొడవలు జరిగాయా?' అడిగాను.

ఆమె కొంచం తటపటాయించింది.

'ఏదో అంటారు సార్ ! నాకూ ఎక్కువగా తెలీదు. సావాసగాళ్ళతో తాగిన గొడవల్లో వాళ్ళే ఏదో చేశారని అంటారు. ఏం జరిగిందో మాకూ తెలీదు' అంది నేలచూపులు చూస్తూ చిన్న గొంతుతో.

ఆమె బాడీ లాంగ్వేజి చూశాక నా అనుమానం బలపడింది.

'తెలిసినా నువ్వెందుకు చెబుతావులే?' అనుకున్నా లోలోపల. మామూలుగా లేబర్ కుటుంబాలలో ఇలాంటి కధలు జరుగుతూనే ఉంటాయి.

'సర్లే అదంతా మనకెందుకులే' అనుకుని - 'మీవాడు ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడు. బాధపడకు. ఎంతో దూరం పోలేదు. దక్షిణాన ఇక్కడికి దగ్గర ఊర్లోనే ఉన్నాడు. త్వరలోనే ఇంటికి తిరిగి వస్తాడు.' అని ఆమెతో చెప్పాను లగ్నంలోకి వస్తున్న కుజుని వక్రత్వాన్ని గమనిస్తూ.

'మీరు చల్లగా ఉండాలి సార్ ! మీ మాటే నిజమైతే మీ కాళ్ళకి మొక్కుతాను' అందామె పల్లెటూరి సహజమైన యాసతో.

'అంతపని చెయ్యకు తల్లీ ! సాటి మనిషిగా ఏదో నాకు తోచినమాట చెప్పాను. అంతే !' అన్నాను.

టీకప్పు తీసుకుని ఆమె వెళ్ళిపోయింది.

సాయంత్రానికి పరీక్ష ముగించుకుని అక్కడనుంచి వచ్చేశాము. ఆ విధంగా ప్రశ్నశాస్త్రం ఉపయోగించి, మనకు ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తి కుటుంబం గురించి వివరాలను తెలుసుకొని, ఆమెకు కొంత ఓదార్పును ఇవ్వడం జరిగింది.
read more " 'మా అబ్బాయి ఎక్కడున్నాడు?' - ప్రశ్నశాస్త్రం "

6, ఆగస్టు 2018, సోమవారం

సాధనా సమ్మేళనం - ఆగస్ట్ - 2018 విశేషాలు

తిధుల ప్రకారం ఆగస్ట్ నాలుగు (ఆషాఢ బహుళ సప్తమి) నా పుట్టినరోజు అయింది. అందుకని నాలుగు అయిదు తేదీలలో సాధనా సమ్మేళనం పెట్టుకున్నాం. మామూలుగా అయితే శ్రీశైలంలోనో, లేదా ఇంకెక్కడో జరిగేది. కానీ ఈసారి మన సభ్యుల సూచన మేరకు గుంటూరులోనే ఈ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, విజయనగరం, కరీంనగర్, కదిరి, మలేషియా మొదలైన చోట్ల నుండి వచ్చిన దాదాపు నలభై మంది పంచవటి సభ్యులతో ఈ రెండురోజుల కార్యక్రమం చాలా బాగా జరిగింది.

మొదటి రోజు ఉదయం ఎనిమిదికి మొదలైన ఈ కార్యక్రమం రాత్రి ఎనిమిది వరకూ యోగాభ్యాసం, ధ్యానం, ఉపన్యాసాలు, సభ్యుల సంభాషణలు, ఆస్ట్రో వర్క్ షాప్, సందేహాలు - సమాధానాలు మొదలైన అనేక interactive కార్యక్రమాలతో నిరాటంకంగా జరిగింది.

రెండవరోజున అందరం కలసి జిల్లెళ్ళమూడి యాత్ర చేసి రావడం, అక్కడ అమ్మ, హైమక్కయ్యల దర్శనం, అమ్మచేతి గోరుముద్దలు తింటున్నామన్న భావనతో అక్కడ భోజనం చెయ్యడం, వసుంధరక్కయ్య, అప్పారావన్నయ్యలతో సమావేశమై వారి ఆశీస్సులు తీసుకోవడం, ఆ తర్వాత పెరేచెర్లలోని పంచవటి సభ్యుడు రామ్మూర్తిగారి ఇంట్లో సమావేశం అయ్యి మాట్లాడుకోవడం, ఆ తర్వాత వెన్యూకి వచ్చి డిన్నర్ చెయ్యడంతో ముగిసింది.

ఈ రెండురోజులూ, సభ్యులకు కలిగిన కలుగుతున్న అనేక సందేహాలకు జవాబులు చెప్పి వాటిని తీర్చడం, ఆధ్యాత్మిక మార్గదర్శనం చెయ్యడం జరిగింది.

కార్యక్రమంలో ముఖ్యమైన ఘట్టాలను ఫేస్ బుక్ ద్వారా అమెరికా సభ్యులకోసం లైవ్ ప్రసారం చెయ్యడం జరిగింది. రాత్రంతా మేలుకుని ఉండి దీనిని వీక్షించిన అమెరికా శిష్యులకు నా కృతజ్ఞతలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఇప్పటివరకూ లేని ఎన్నో insights తప్పకుండా కలిగి ఉంటాయని నా నమ్మకం.

"ఈ అనుభవాలను, ఆలోచనలను పోగొట్టుకోకండి. ప్రతిరోజూ వాటిని నెమరు వేసుకోండి. అవి చూపిస్తున్న దారిలో నడచి మీ జీవితాలను ఉజ్జ్వలంగా దిద్దుకోండి. అసలైన ఆధ్యాత్మిక మార్గంలో నడవండి. ప్రపంచం అంతా వెదికినా ఈ మార్గం మీకు దొరకదు. ఎంతోమంది దీనికోసం అలమటిస్తున్నారు. కానీ వారికి దొరకడం లేదు. మీకు దొరికింది. దీని విలువ గ్రహించండి. దీనినుంచి జారిపోయి దురదృష్టవంతులుగా మారకండి. దీనిని సక్రమంగా ఉపయోగించుకోండి" - అని పంచవటి సభ్యులందరినీ కోరుతున్నాను. 

రాబోయే సాధనా సమ్మేళనం డిసెంబర్ - 2018 లో వరంగల్ 'కాకతీయ గ్రాండ్' హోటల్లో జరుగుతుంది. మీకు ప్రస్తుతం నేర్పినవన్నీ ప్రతిరోజూ క్రమం తప్పకుండా అభ్యాసం చేస్తూ రాబోయే సాధనా సమ్మేళనానికి ఈరోజు నుంచే సాధనాపరంగా తయారుగా ఉండమని సభ్యులను కోరుతున్నాను. 

ఈ సమ్మేళనానికి ఎంతో దూరం నుండి ఎంతో కష్టపడి వచ్చిన సభ్యులకందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉన్నతమైన వ్యక్తిత్వంతో కూడిన సాధనామార్గంలో ఎదగడానికి, అసలైన ఆధ్యాత్మికమార్గంలో నడవడానికి తయారై, దీక్షాస్వీకారం గావించిన నూతన శిష్యులకు ఆశీస్సులు  తెలియ జేస్తున్నాను.

ఈ కార్యక్రమంలో తీసిన కొన్ని ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.




























read more " సాధనా సమ్మేళనం - ఆగస్ట్ - 2018 విశేషాలు "

1, ఆగస్టు 2018, బుధవారం

బ్లాగుభేతాళ కధలు - 1 (స్వామి సంపూర్ణానంద కాపి)

మిత్రుడు సూర్యకు ఈ మధ్య స్వామీజీల పిచ్చి బాగా పట్టుకుంది. ఎవరైనా ఒక మంచి పవరున్న స్వామీజీ దొరక్కపోతాడా అని అదేపనిగా లీవు పెట్టుకుని మరీ వెతుకుతున్నాడు.

'ఎందుకు నీకీ వెదుకులాట? నేనున్నాను కదా? నీ డౌట్లేంటో చెప్పు నేను క్లారిఫై చేస్తాను.' అంటే వినడు.

"వాళ్ళు చెప్పే చిట్కాలు నువ్వు చెప్పవు కదా? ఏది జరిగినా నీ మంచికే అనుకోమంటావు. అదేంటంటే జిల్లెళ్ళమూడి అమ్మగారు, రమణమహర్షి, రామకృష్ణులు అదే చెప్పారంటావు. నాకేమో నా పనులు ఫాస్ట్ గా కావాలి. అలా జరగాలంటే, మంత్రాలు, తంత్రాలు అప్పనంగా చెప్పే గురువులు దొరకాలి. నువ్వు చెప్పేదేమో నాకు సరిపోవడం లేదు. ఎలా మరి? అందుకే వెదుకుతున్నాను" - అంటాడు.

'సరే నీ ఇష్టం. వెతుక్కో.' అని తనకు చెబుతూ ఉంటాను.

ఈ మధ్యనే తన దగ్గర నుంచి ఫోనొచ్చింది.

"స్వామి సంపూర్ణానంద కాపి గురించి విన్నావా?" అడిగాడు.

'అదేం పేరు? ఆ పేరుతో ఉన్న ఒకాయన గురించి తెలుసు గాని. చివర్లో కాపి ఏంటి?" అడిగాను అనుమానంగా.

"కాపి అంటే కామపిశాచి అని అర్ధం." అన్నాడు గొంతు తగ్గించి రహస్యంగా.

నేనాశ్చర్యపోయాను.

"అవునా? ఆయనకు ఆ టైటిల్ ఉందా? ఆయనే పెట్టుకున్నాడా? లేక శిష్యులు పెట్టారా/" అడిగాను.

"ఎవరూ పెట్టలేదు. నేనే పెట్టాను." అన్నాడు.

"అదేంటి? నువ్వు అలాంటి పేరు పెట్టడమేంటి? ఆయనకు చాలా ఫాలోయింగ్ ఉంది కదా సొసైటీలో?" అన్నాను.

"ఉంది. కానీ అసలు విషయాలు ఎవరికీ తెలీవు. కొంతమంది దగ్గర వాళ్ళకే ఈ సంగతులు తెలుస్తాయి." అన్నాడు.

"నువ్వాయనకు అంత దగ్గరివాడివి ఎప్పుడయ్యావు? ఎలా అయ్యావు? ఆ కధను కాస్త వివరించుము?" అడిగాను.

"నువ్వు ఆఫీసు పనుల్లోనూ, పుస్తకాలు వ్రాయడంలోనూ, పాటలు పాడటంలోనూ, నీ శిష్యులతోనూ, ఇంకా లక్ష పనులలో బిజీ కదా. నీకు కొంచం రిలాక్స్ గా ఉండటం కోసం ఈ మధ్యనే జరిగిన ఒక యదార్ధగాథ చెప్తా విను." అంటూ చెప్పడం మొదలు పెట్టాడు సూర్య.

"ఈ స్వామీజీకి మా కజిన్ బాలాజీ చాలా క్లోజ్.  మొదట్లో ఆయన పెడుతున్న వీడియోలు చూచీ, ఆయన ఉపన్యాసాలు వినీ ఆయనంటే ఎంతో గొప్ప క్రేజ్ పెంచుకున్నాడు. కొన్నేళ్లుగా ఆయన దగ్గరకు వెళుతూ వస్తూ ఉండేవాడు. ఆ క్రమంలో ఆయనకు బాగా దగ్గరయ్యాడు. ఆయన ఆశ్రమంలో కూడా VIP అయిపోయాడు.

ఈ లోపల ఆశ్రమంలో జరుగుతున్న ఇన్సైడ్ సంగతులు ఈయనకు చూచాయగా తెలుస్తూ ఉండేవి. అవి నిజమా కాదా అనే సందిగ్ధావస్థలో ఉండగా సత్యవతి దాన్ని చిటికెలో తేల్చేసింది." అన్నాడు.

"మధ్యలో ఈ కేరెక్టర్ ఎవరు?" అడిగాను.

"ఆ అమ్మాయిది పెద్దాపురం. పెద్దాపురం పాప (పేపా) అనేది ఆమె ముద్దుపేరు." అన్నాడు.

"అదికూడా నువ్వే పెట్టావా ఆమెకు?" అడిగాను నవ్వుతూ.

"లేదు. ఆమెతో నాకంత చనువు లేదు. మా బాలాజీ గాడికి ఆ అమ్మాయి మంచి ఫ్రెండ్ అనడం కంటే అంతకంటే ఎక్కువ అనవచ్చు. ఏదో బలహీనక్షణంలో వాడే ఆ పేరు పెట్టాడు ఆ అమ్మాయికి. ఇంతకంటే నేను చెప్పలేను" అన్నాడు.

"సరే అర్ధమైందిలే. ప్రొసీడ్ విత్ ద స్టోరీ" అన్నా.

ఒకరోజు మాటల మధ్యలో ఆ అమ్మాయి పందెం కాసిందట. "మీ స్వామీజీ అంత గొప్ప పత్తిత్తు ఏమీ కాదు." అంటూ.

"తప్పు. అలా మాట్లాడకు. కళ్ళు పోతాయి" అన్నాడు బాలాజీ.

"కళ్ళూ పోవు ఒళ్ళూ పోదు గాని, నే చెప్పేది నిజం" అంది పేపా.

"ఎలా చెప్పగలవ్" అడిగాడు బాలాజీ.

"అదే మీకూ మాకూ తేడా. మీరు కనిపెట్టలేనిది మేము క్షణంలో పట్టేస్తాం. అతని చూపులూ ఆ వాలకాన్ని బట్టి మాకు చిటికెలో అర్ధమైపోతుంది అతనెలాంటి వాడో" అంది పేపా.

"ఊరకే మాట్లాడటం కాదు. ప్రూవ్ చేస్తావా?" అడిగాడు బాలాజీ.

"చాలెంజ్. నన్నొక్కసారి ఆశ్రమానికి తీసుకెళ్ళు. ఆ తర్వాత నువ్వు క్యూలో ఉంటావు. నేను సరాసరి VVIP గా నీ ముందే డైరెక్ట్ గా స్వామీజీ దర్శనానికి వెళ్ళడం నువ్వే చూస్తావు." అంది పేపా.

మనవాడు అయిష్టంగానే ఈ ప్లాన్ కి ఒప్పుకున్నాడు.

అనుకున్నట్లుగానే, ఒకరోజున ఇద్దరూ ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమంలో అడుగుపెట్టాక ఒకరికొకరు తెలియనట్లు నటిస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి, స్వామీజీ సెక్రటరీని పరిచయం చేసుకుని పావుగంటలో స్వామీజీ ఇంటర్వ్యూ సంపాదించింది. ఒక అరగంట స్వామీజీ గదిలో ఉండి, విజయగర్వంతో నవ్వుకుంటూ బయటకొచ్చింది. ఈలోపల వీడు బయట లాంజ్ లో కూచుని వెయిట్ చేస్తున్నాడు.

ఇద్దరూ వెనక్కు బయల్దేరారు.

మౌనంగా కార్ డ్రైవ్ చేస్తున్న బాలాజీ, సస్పెన్స్ భరించలేక - " ఏమైంది?" అన్నాడు.

"నేను చెప్పాక ఫెయిల్ అవడం ఉండదు బాలూ. నీ అనుమానం కరెక్టే. వాడొక పెద్ద కాపీగాడు. ఆడదానికి పడనివాడు ఈ లోకంలో ఎవడూ ఉండడు." అంది పేపా.

"ఎలా చెప్పగలుగుతున్నావ్? లోపల ఏమైందో చెప్పు?" అడిగాడు బాలాజీ.

"కొన్ని కొన్ని చెప్పలేం బాలూ. ఇంతవరకూ మాత్రమె చెప్తా. నెక్స్ట్ టైం మనిద్దరం మళ్ళీ ఆశ్రమానికి వద్దాం. ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ వస్తుందో నువ్వే చూడు" అంది నవ్వుతూ పేపా.

అనుకున్నట్టు గానే మళ్ళీ ఒక నెల తర్వాత ఇద్దరూ ఆశ్రమానికి వెళ్ళారు. కారులో పోతూ ఉన్నప్పుడే, ఈ నెలలో స్వామీజీ తనకు చేసిన కాల్స్ ఎన్నున్నాయో, మెసేజీలు ఎన్నున్నాయో బాలాజీకి చూపించింది పేపా.

అవి చూచి బాలాజీకి మతి పోయింది.

ఇంతలో ఆశ్రమం రానే వచ్చేసింది. కారు పార్క్ చేసి దిగారు ఇద్దరూ.

వీళ్ళను చూస్తూనే స్వామీజీ పీయే పరిగెత్తుకుంటూ వచ్చాడు. తనకోసమేనేమో అనుకున్నాడు బాలాజీ. ఎందుకంటే, స్వామీజీ వస్తున్నాడని తెలిస్తే, తనే ఎయిర్ పోర్ట్ కు కారేసుకుని వెళ్లి మరీ ఆయన్ను ఎన్నోసార్లు రిసీవ్ చేసుకునేవాడు. అది పీయే కు కూడా తెలుసు.

బాలాజీని ముక్తసరిగా పలకరించిన పీయే, పేపా వైపు తిరిగి, " మేడం, రండి, మీకోసం స్వామీజీ వెయిట్ చేస్తున్నారు." అన్నాడు నవ్వుతూ.

బాలాజీకి మతిపోయింది. గుడ్లప్పగించి చూస్తున్నాడు.

"మీరలా కూచోండి బాలూగారు. మేడం బయటకొచ్చాక మీతో మాట్లాడతారు స్వామీజీ" అని చెప్పి అతన్ని హాల్లో కూచోబెట్టి, సత్యవతిని డైరెక్ట్ గా స్వామీజీ గదిలోకి తీసుకెళ్ళాడు పీయే. అప్పటికే క్యూలో ఉన్న దాదాపు ఏభైమంది గుడ్లప్పగించి వీళ్ళవంక పిచ్చివెధవల లాగా చూస్తున్నారు. పీయే అదేమీ పట్టించుకోకుండా తలుపు తీసి పట్టుకున్నాడు సత్యవతి లోపలకి వెళ్ళడానికి వీలుగా.

'వీడి దుంప తెగ. ముందొచ్చిన కొమ్ముల కంటే వెనకొచ్చిన చెవులు వాడిగా ఉన్నాయే? ఇదేనేమో కలియుగ మహిమ?" అని తిట్టుకుంటూ బాలాజీ హాల్లో కూచుని వెయిట్ చేస్తున్నాడు.

చూస్తుండగానే గంట, రెండు గంటలు, మూడు గంటలు గడిచాయి. లంచ్ టైం అవుతోంది. ఇక ఇలా కాదని, లేచి, ఆశ్రమం క్యాంటీన్లో లైట్ గా స్నాక్స్ తీసుకుని మళ్ళీ వచ్చి సోఫాలో కూలబడుతూ ఉండగా బయటకొచ్చింది పేపా.

"ఈ రోజుకు దర్శనాలు కేన్సిల్. స్వామీజీ అలసిపోయారు. అందరూ సాయంత్రం ఆరుగంటలకు ప్రేయర్ హాల్లో స్వామీజీని దర్శించుకోవచ్చు." అని ఎనౌన్స్ చేశాడు పీయే.

క్యూలో ఉన్నవాళ్ళందరూ విసుగ్గా ముఖాలు పెట్టుకుని డిస్పర్స్ అయిపోయారు.

వెనక్కు వస్తూ ఉండగా "నువ్వు చెప్పినట్టే జరిగింది. అయిదేళ్ళనుంచీ నుంచీ కుక్కలాగా వీడిదగ్గరకు వస్తున్నాను. నాచేత ఎన్నెన్ని పనులు చేయించుకున్నాడో లెక్కేలేదు. చివరకు నెలక్రితం వచ్చిన నువ్వు ముఖ్యమైపోయావు వీడికి. నాకేమో కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు." అన్నాడు ఏడుపు ముఖంతో.

"నే ముందే చెప్పలా? మా అంచనా ఎప్పుడూ తప్పు కాదని?" అంది పేపా నవ్వుతూ.

"అప్పట్నించీ బాలాజీ ఆశ్రమానికి వెళ్ళడం మానేశాడు" అని చెప్పి కధ  ముగించాడు సూర్య.

"కానీ పేపా మాత్రం రెగ్యులర్ గా వెళుతూనే ఉంది" అన్నా నేను నవ్వుతూ.

"కరెక్ట్. ఎలా కనిపెట్టావ్?" అడిగాడు సూర్య నవ్వుతూ.

"సింపుల్ కామన్ సెన్స్. సెలబ్రిటీ అయిన స్వామీజీని పట్టాక ఒక మామూలు గవర్నమెంట్ ఆఫీసర్ అయిన బాలాజీ ఎలా నచ్చుతాడు పేపాకి? సింపుల్ లాజిక్" అన్నా నేనూ నవ్వుతూ.

"కధ ఇంకా ఉంది. విను. ఇంతకు ముందులా వీళ్ళు తన దగ్గరకు రావడం లేదని కనిపెట్టిన స్వామీజీ ఒకరోజున కారేసుకుని పొద్దున్నే వీళ్ళింటికి వచ్చేశాడు. ఇంతకు ముందైతే, స్వామీజీ వస్తే, వీళ్ళు హైరానా పడిపోయి గందరగోళం అయిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా ఎగ్జైట్ కాకుండా తాపీగా ఆహ్వానించారు. స్వామీజీ ఆ తేడాను కనిపెట్టాడు.

"ఏం బాలాజీ ! మునుపటిలా ఆశ్రమానికి రావడం లేదు? మా స్టాఫ్ వల్ల ఏమైనా అపచారం జరిగిందా?" అడిగాడు నవ్వుతూ.

"వాళ్ళవల్ల ఏ అపచారమూ జరగలేదు. నీవల్లే జరిగింది. నీవల్ల నా గర్ల్ ఫ్రెండ్ నాకు దూరమైంది." అని మనసులో అనుకున్న బాలాజీ బైటికి మాత్రం నవ్వుతూ - ' అబ్బే ! అదేం లేదు స్వామీజీ! ఆఫీసులో పని ఎక్కువగా ఉండి రాలేకపోతున్నా అంతే !" అన్నాడు.

అది అబద్దమని తేలికగా గ్రహించాడు స్వామీజీ. అతను కూడా తక్కువ వాడేమీ కాదు. ఆవులిస్తే పేగులు లెక్కిస్తాడు.

"సర్లే బాలాజీ ! ఈరోజు మీ ఇంట్లో భోజనానికి వచ్చాం" అన్నాడు సోఫాలో కూలబడుతూ.

ఇక తప్పదు కదా ! అందుకని రాధ లేచి వంటింట్లోకి వెళ్ళింది. రాధంటే బాలాజీ భార్యన్న మాట. తను వంట చేసేలోపు స్వామీజీ, ఆయన వెంట వచ్చిన బృందం, బాలాజీతో ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ కూచున్నారు హాల్లో.

ఇంతకు ముందైతే, ముందు స్వామీజీకి భోజనం పెట్టి, దగ్గరుండి భయభక్తులతో వడ్డించి, ఆ తర్వాత ఈ దంపతులు తినేవాళ్ళు. ఇప్పుడు ఆయనతో బాటే కుర్చీలు లాక్కుని కూచుని వడ్డించుకుంటూ తింటున్నారు. మధ్యమధ్యలో "స్వామీజీ ! పప్పు బాగుంది. కొంచం ఆ గిన్నె ఇటు పాస్ చెయ్యండి' అని ఆయన్నే అడుగుతున్నారు. మధ్యమధ్యలో కాళ్ళు డైనింగ్ టేబుల్ కిందనుంచి ఆయన కాళ్ళకు తగిలినా "సారీ" చెప్పడం లేదు.

ఇదంతా స్వామీజీ గమనిస్తూనే ఉన్నాడు. ఈ తేడాకు కారణం ఏంటో ఆయనకు అర్ధం కావడం లేదు. పేపా, బాలాజీకి ఫ్రెండ్ అన్న సంగతి స్వామీజీకి తెలీదు. కానీ అవసరం తనది కాబట్టి దాన్నంతా మౌనంగా భరించాడు.

భోజనాలయ్యాక అసలు విషయం కదిలించాడు స్వామీజీ.

"ఒక వారంలో మన ఆశ్రమంలో పెద్ద హోమం పెట్టుకున్నాం. మీరంతా వచ్చి తలో చెయ్యీ వెయ్యాలి" అన్నాడు తాపీగా.

"ఎందుకు వెయ్యం? నువ్వైనా మేమైనా చేతులేగా వేసేది?" అనుకున్నాడు బాలాజీ లోలోపల. బయటకు మాత్రం వినయంగా నవ్వుతూ - "తప్పకుండా స్వామీజీ. మా అదృష్టం ! అంతకంటే ఇంకేం కావాలి మా జన్మకి?" అన్నాడు.

"రాధ బాగా వంట చేస్తుంది కదా ! ఆమె చెయ్యి పడితేనే వంటకు రుచి వస్తుంది. అందుకని ఆరోజున ఆశ్రమం కిచెన్ అంతా ఆమె చూసుకోవాలి" అన్నాడు స్వామీజీ.

"ఈ చేతులు వెయ్యడం, చెయ్యి పడటం ఏంటో ఈ గోల? వీడికి మాట్లాడటం కూడా సరిగ్గా రాదు, మా ఖర్మ" అనుకున్నాడు బాలాజీ. పైకిమాత్రం "అలాగే స్వామీజీ" అన్నాడు అతివినయాన్ని నటిస్తూ.

అనుకున్నట్లుగానే, ఆ రోజుకు ఆశ్రమానికి వెళ్ళారు గాని, ఏదో అంటీ ముట్టనట్లుగా అక్కడ ఉండి ఆ కార్యక్రమం కాస్తా అయిందనిపించి వెనక్కు వచ్చేశారు బాలాజీ దంపతులు. అలా, కొన్నాళ్ళకు ఆశ్రమానికి వెళ్ళడం పూర్తిగా తగ్గించేశారు.

ఇదంతా చెప్పిన సూర్య ఇలా అన్నాడు.

"సరేగాని, ఒక విషయం చెప్పు. సమాజం ఇంతలా చెడిపోయిందేమిటి? మరీ స్వామీజీలు కూడా ఇలా తయారౌతున్నారేంటి?" అన్నాడు సూర్య.

"ఏమో నాకేం తెలుసు? నేనింకా స్వామీజీని కాలేదుగా? అయ్యాక చెప్తా. ఇన్నాళ్ళబట్టీ నేను చెబుతుంటే నువ్వు నమ్మడం లేదుకదా? అందుకని నీకు పేపానే కరెక్టు గురువు. పేపాని అడుగు. జ్ఞానోపదేశం చేస్తుంది" అన్నా నేనూ నవ్వుతూ.

"ఆ ! ఆమె మనకెక్కడ దొరుకుతుంది? స్వామీజీతో యూరప్ యాత్రలో ఉందిట ప్రస్తుతం" అన్నాడు సూర్య నీరసంగా.

"ఏంటీ యాత్ర ఉద్దేశ్యం?" అడిగాను.

"ఏమో? ఇండియన్ కల్చర్ మీద స్వామీజీ ఉపన్యాసలిస్తున్నారట యూరప్ లో. ఆయన వెంట ఈ అమ్మాయి కూడా వెళ్ళింది" అన్నాడు సూర్య.

"మొత్తం మీద స్వామీజీ కాపి అంటావ్? మరి ఈయన్ను వదిలేసి మళ్ళీ నీ వేట మొదలుపెట్టావా?" అన్నా నవ్వుతూ.

"తప్పుతుందా మరి? ప్రస్తుతం ఇంకో స్వామీజీ ఆశ్రమానికి రెగ్యులరుగా వెళుతున్నా. త్వరలో ఇంకొన్ని నమ్మలేని నిజాలను నీకు చెబుతా" అన్నాడు సూర్య.

"ఆల్ ద బెస్ట్" అన్నా నవ్వుతూ.

ఆ విధంగా నాకు మౌనభంగం కావడంతో అప్పటిదాకా మాట్లాడుతున్న సూర్య తన ఫోన్ ను కట్ చేశాడు.
read more " బ్లాగుభేతాళ కధలు - 1 (స్వామి సంపూర్ణానంద కాపి) "

30, జులై 2018, సోమవారం

మీ వ్రాతలు వాళ్ళవిగా చెప్పుకుంటున్నారు

నా పోస్టులను ఇష్టపడే ఒకరినుంచి నిన్నొక మెసేజ్ వచ్చింది.

'ఫలానా "టెలిగ్రాం గ్రూపు" లో చేరండి. ఇందులో మంత్ర, తంత్ర, జ్యోతిష, ఆధ్యాత్మిక, భారతీయ సంస్కృతి వగైరా విషయాల మీద చర్చలుంటాయి. మీకు స్వాగతం' అని అందులో ఉంది.

నేను మర్యాదగా, "నాకు చేరాలని లేదు. సారీ !" అని జవాబిచ్చాను.

'ఈ గ్రూపులో ఒకాయన మీ వ్రాతలను తనవిగా పోస్టు చేసుకుంటున్నాడు. గ్రూపులో అతనికి చాలా appreciation వస్తోంది.' అని రిప్లై వచ్చింది.

నాకు జాలేసింది.

'అది అతని ఖర్మ. చేసుకోనివ్వండి. నేను పాడిన పాటల్ని కూడా తనవిగా చెప్పుకోమనండి ఇంకా బాగుంటుంది. ఇంతకీ అతని పేరేంటి?' అడిగాను.

'గ్రూపులో ఉన్నవాళ్ళ పేర్లు మాకు కనిపించవు. అతని పేరు LK అని మాత్రం వస్తుంది' అని మెసేజ్ వచ్చింది.

'ఈ విషయాలు సాధన చేసి అనుభవంలో తెలుసుకోవలసినవిగాని చర్చలలో పొద్దు పుచ్చేవి కావు. కాబట్టి మీ గ్రూపులో చేరే ఉద్దేశ్యం నాకు లేదు. సారీ. నన్ను ఆహ్వానించినందుకు థాంక్స్' అని మెసేజ్ ఇచ్చాను.

సో కాల్డ్ సూడో ఆధ్యాత్మిక లోకంలో ఒక విచిత్రం ఉంది. 'నాకింత తెలుసు' అని ప్రదర్శించుకుని ఎదుటివారి నుంచి "ఆహా ఓహో" అని పొగడ్తలు వస్తే ఉబ్బిపోతూ అదే ఏదో పెద్ద ఘనతగా చాలామంది భావించుకుంటూ ఉంటారు. ఇలాంటివారిని చూస్తె నాకు నవ్వూ జాలీ రెండూ వస్తూ ఉంటాయి.

ఆధ్యాత్మికత అనేది విజ్ఞాన ప్రదర్శనలో లేదు. అది సాధనలోనూ అనుభవంలోనూ ఉంటుంది. అందులోనూ, ఈ విధంగా ఇతరులనుంచి వచ్చే మెప్పులు, పొగడ్తలు, లోలోపల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో నిండిపోయి ఉన్నవారికి పనిచేస్తాయి గాని ఇంకెందుకూ కొరగావు.

చర్చలతో ఆధ్యాత్మికత రాదు. అది సాధనతో వస్తుంది. వేరేవాళ్ళ బ్యాంక్ ఎకౌంట్ ను తనదిగా చెప్పుకున్నంత మాత్రాన ఆ ఎకౌంట్లో ఉన్న డబ్బు తనదెలా అవుతుంది?

ఇలాంటి వారిని చూచి జాలిపడటం తప్ప ఇంకేం చెయ్యగలం?
read more " మీ వ్రాతలు వాళ్ళవిగా చెప్పుకుంటున్నారు "

27, జులై 2018, శుక్రవారం

"విజ్ఞాన భైరవ తంత్రము" - Telugu E Book నేడు విడుదలైంది

ఈరోజు గురుపూర్ణిమ.

సమస్త జగత్తులకూ పరమగురువగు పరమేశ్వరుని స్మరిస్తూ ఈ రోజున మా "పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్" నుంచి ఆరవ E-Book గా "విజ్ఞాన భైరవతంత్రము" ను విడుదల చేస్తున్నాము. తంత్రాచారములలో ఇది కౌలాచారమునకు చెందినది. ఆగమములలో భైరవాగమమునకు చెందినది. దీనియందు, పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించినట్లుగా చెప్పబడిన నూట పన్నెండు ధారణా విధానములు ఇవ్వబడినవి. తాంత్రిక ధ్యానాభ్యాసులకు ఇదొక భగవద్గీత వంటిది.

దీనిలోని అన్ని సాధనలను శ్రీరామకృష్ణులు తమ సాధనా కాలమున కొద్ది రోజులలో సాధించగలిగినారు. మనబోటి సామాన్యులకు వీటిలోని ఒక సాధనకు ఒక జన్మ పడుతుంది.

దాదాపు తొమ్మిదేళ్ళ క్రితం నేను బ్లాగు వ్రాయడం ప్రారంభించిన కొత్తల్లో 'విజ్ఞాన భైరవతంత్రం' మీద వరుసగా పోస్టులు వ్రాద్దామని అనుకున్నాను. అది నాకు చాలా ఇష్టమైన పుస్తకం, ఎందుకంటే, చిన్నప్పటి నుంచీ నేను చేసిన సాధనలు దానిలో చాలా ఉన్నాయి. కానీ అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిదీ అందరికీ చెప్పడం ఎందుకు? అన్న ఉద్దేశ్యంతో ఆ ప్రయత్నాన్ని విరమించాను. అది "పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్" నుంచి పుస్తకంగా విడుదలయ్యే ముహూర్తం ఇప్పటికి వచ్చింది.

దీనికి అనేక వ్యాఖ్యానములు ఎప్పటినుంచో ఉత్తర భారతదేశమున ఉన్నవి. నవీన కాలపు వివాదాస్పద గురువులలో ఓషో రజనీష్ దీనిపైన ఉపన్యాసాలిచ్చాడు. బైటకు చెప్పినా చెప్పకున్నా మోడరన్ గురువులందరూ చాలావరకూ దీనినే అనుసరిస్తున్నారు. ఈ గురువులందరూ వారి వారి అనుభవములను బట్టి జ్ఞానమును బట్టి దీనిని వ్యాఖ్యానించారు. నేను కూడా నా అనుభవములను ఆధారము చేసికొని దీనికి వ్యాఖ్యానమును వ్రాశాను.

ఇదొక ప్రాక్టికల్ గైడ్ బుక్. కానీ దీనిలోని ధారణల లోతుపాతులు అనుభవం ఉన్న గురువు దగ్గర వ్యక్తిగతంగా నేర్చుకున్నప్పుడే అర్ధమౌతాయి. నా శిష్యులలో అర్హులైనవారికి, నమ్మకంగా నన్ను అనుసరించేవారికి ఈ ధారణల లోతుపాతులను ప్రాక్టికల్ గా నేర్పించడం, అసలైన తంత్రసాధన అంటే ఏమిటో వారికి రుచి చూపించడం జరుగుతుంది.

అతి తక్కువకాలంలో (మూడు వారాలలో) ఈ పుస్తకాన్ని వ్రాయడంలో ఎంతో సహకరించిన నా అమెరికా శిష్యులకు కృతజ్ఞతలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను.

ఈ E-Book కావలసిన వారు google play books నుంచి డౌన్లోడ్ చేసుకొనవచ్చును.
read more " "విజ్ఞాన భైరవ తంత్రము" - Telugu E Book నేడు విడుదలైంది "

25, జులై 2018, బుధవారం

Mujhe Peene Ka Shouk Nahi - Shabbir Kumar, Alka Yagnik


Mujhe Peene Ka Shouk Nahi
Peeta Hu Gham Bhulane Ko

అంటూ షబ్బీర్ కుమార్, ఆల్కా యాజ్ఞిక్ మధురంగా ఆలపించిన ఈ యుగళగీతం 1983 లో వచ్చిన Coolie అనే చిత్రంలోనిది. ఈ పాటను రఫీ పాడాడని చాలామంది అనుకుంటారు గాని రఫీ 1980 లోనే గతించాడు. షబ్బీర్ కుమార్ స్వరం చాలావరకూ రఫీ స్వరంలాగా ఉంటుంది.

రఫీ అంత్యక్రియలలో పాల్గొంటున్నపుడు ఆ గోతిలో షబ్బీర్ చేతి గడియారం పడిపోయిందట. తన తర్వాత తన పరంపరను కొనసాగించమని అదొక దైవసూచనగా షబ్బీర్ స్వీకరించాడు. ఆ తర్వాత అతను దాదాపు 1500 పాటలు పాడాడు. కానీ తర్వాత రోజులలో అతను ప్లే బ్యాక్ సింగింగ్ నుంచి విరమించుకుని స్టేజి షోలకు అంకితమయ్యాడు. బహుశా సినిమా లోకపు కుళ్ళు రాజకీయాలే దీనికి కారణం కావచ్చు.

చిన్నప్పటి స్నేహం చాలా మధురంగా ఉంటుంది. ఎందుకంటే అది చాలా అమాయకమైనది. అందులో స్నేహం తప్ప ఇంకేమీ ఉండదు. అలాంటి చిన్ననాటి స్నేహితులిద్దరూ పెద్దయ్యాక కూడా ఒకర్ని ఒకరు మర్చిపోలేక, ఆ బాధలో త్రాగి, ఒకరిని ఒకరు వెదుక్కుంటూ పాడుకునే పాట ఇది. చాలా మధురమైన భావం !

కొన్ని పాటలు చూస్తే బాగుండవు. వింటేనే బాగుంటాయి. ఈ పాట కూడా అలాంటిదే. మీకు ధైర్యం ఉంటే చూడండి !

ఆ తర్వాత నా స్వరంలో కూడా ఈ మధుర గీతాన్ని వినండి మరి !

Movie:--Coolie (1983)
Lyrics:--Anand Bakshi
Music:--Laxmikant Pyarelal
Singers:--Shabbir Kumar, Alka Yagnik
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
------------------------------
Mujhe peene ka shouk nahi – Peeta hu gham bhulane ko – 2
Teri yaade mitane ko -2
Peeta hu gham bhulane ko

Mujhe peene ka shouk nahi – Peeti hu gham bhulane ko – 2
Teri yaade mitane ko -2
Peeti hu gham bhulane ko
Mujhe peene ka shouk nahi – Peeta hu gham bhulane ko

Lakho me hazaaro me – Ek tuna nazar aayi- 2
Tera Koi khat aaya – Na koi khabar aayi
Kya tune bhula dala -2
Ap--ne is diwane ko
Mujhe peene ka shouk nahi – Peeti hu gham bhulane ko

Koi vo kitabe dil – Jis dilka hai ye kissaa-2
Is hisso he paas mere - tere baat hai ek hissa
Mai pura karu kaise - Is dil ke fasane ko
Mujhe peene ka shouk nahi – Peeta hu gham bhulane ko

Mil jate agar ab ham – Aag lag jaati paani me – 2
Bachpan se vahi dosti - hojati javani me
Chahat me badal dete
Chahat me badal dete - Hum is dostani ko
Mujhe peene ka shouk nahi – Peeti hu gham bhulane ko
Mujhe peene ka shouk nahi – Peeta hu gham bhulane ko

Meaning

I am not fond of drinking, I just drink to forget my sadness
I just drink to forget your memories

Among thousand and millions of people
You are not found anywhere
There is no trace or news of you
What? Did you really forget this mad fellow?

My heart was the chapter of a book
and that book was lost
A part of it is with me, another part is with you
How should I complete the story of my heart?

If we meet now, then fire will be created in water
The sweet friendship that we had in our childhood
will become alive again
Then we will convert that friendship
into a passionate love

I am not fond of drinking, I just drink to forget my sadness
I just drink to forget your memories

తెలుగు స్వేచ్చానువాదం

త్రాగడం అంటే నాకేమీ ఇష్టం లేదు
కానీ ఈ బాధను మర్చిపోవడం కోసం త్రాగుతున్నాను
నీ జ్ఞాపకాలను మర్చిపోవడం కోసం త్రాగుతున్నాను

వేలాది లక్షలాది మందిలో నిన్ను వెదుకుతున్నాను
కానీ నీ జాడా లేదు జవాబూ లేదు
ఈ పిచ్చివాడిని నిజంగా మర్చిపోయావా నువ్వు?

నా హృదయమనేది ఒక పుస్తకంలో ఒక అధ్యాయం
ఆ పుస్తకం ఇప్పుడెక్కడో పోయింది
సగం నా దగ్గరుంది సగం నీ దగ్గరుంది
ఈ కధను నేనెలా పూర్తి చేసేది?

ఇప్పుడు మనం కలుసుకుంటే
నీళ్ళలో అగ్ని చెలరేగుతుంది
చిన్నప్పటి మన స్నేహం మళ్ళీ చిగురిస్తుంది
ఆ స్నేహాన్ని ఇప్పుడు మనం
ఒక మధుర ప్రేమగా మార్చుకుందాం

త్రాగడం అంటే నాకేమీ ఇష్టం లేదు
కానీ ఈ బాధను మర్చిపోవడం కోసం త్రాగుతున్నాను
నీ జ్ఞాపకాలను మర్చిపోవడం కోసం త్రాగుతున్నాను
read more " Mujhe Peene Ka Shouk Nahi - Shabbir Kumar, Alka Yagnik "

24, జులై 2018, మంగళవారం

27-7- 2018 పౌర్ణమి + చంద్ర గ్రహణం ప్రభావాలు

27-7-2018 న పౌర్ణమి + చంద్ర గ్రహణం వస్తున్నాయి. దీని ప్రభావం చాలా ఎక్కువగా మనుషుల మీద ఉండబోతున్నది. నిజానికి నిన్నటి నుంచే దీని ప్రభావం మనుషుల మీద మొదలైంది. మీరు గమనించుకుంటే ఈ క్రింది ప్రభావాలు మీలోనూ మీ చుట్టూ ఉన్నవారిలోనూ కన్పిస్తాయి.

1. నిన్నా ఇవాళా, మనుషులు తేలికగా చిరాకు పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఫేస్ బుక్, వాట్స్ అప్ లాంటి యాప్స్ ఎప్పుడూ వాడే వాళ్ళు, ప్రెండ్స్ తో చాటింగ్ చేసేవాళ్ళ మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గమనించండి.

2. చెప్పుడు మాటలు వినడం, ఒకళ్ళను ఒకళ్ళు అపార్ధం చేసుకోవడం, అనవసరంగా ఇతరుల మీద చిరాకు పడటం, మనస్సులు చెడిపోవడం, డిప్రెషన్ కు గురికావడం, ఏడవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఆడవాళ్ళలో కనిపిస్తుంది. మొగవాళ్ళు కోపతాపాలకు, ఉక్రోషాలకు, పగలకు గురౌతారు.

3. ఈ చంద్ర గ్రహణ ప్రభావం ముఖ్యంగా మకర, కుంభ రాశుల మీద ఉంటుంది. ఈ రాశులలో చంద్రుడు గాని, సూర్యుడు గాని, లగ్నంగాని ఉన్న జాతకుల మీద ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. టీవీ జ్యోతిష్కులు, పత్రికా జ్యోతిష్కులు చెప్పే మాటలు నమ్మి, ఇది మకర రాశి వారికేగాని, కుంభరాశి మీద ఏమీ ఉండదని అనుకోకండి. వారి మీద కూడా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే, సాయన సిద్ధాంత రీత్యా గ్రహణం కుంభ రాశిలో ఏర్పడుతోంది. అనుభవంలో సాయన, నిరయన సిద్ధాంతాలు రెండూ పని చేస్తాయి. తేదీల పరంగా జనవరి 14 నుంచి మార్చి 15 లోపు పుట్టినవారి మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 

4. ఈ ప్రభావం వల్ల, ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులకు ప్రాణగండం ఉన్నది. అది రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు. వారికి పూర్తి మెడికల్ కేర్ అవసరం.

5. ఈ రోజునుంచీ జూలై 31 వరకూ కోపతాపాలను, అనవసర ఆవేశాలను తగ్గించుకుని కంట్రోల్ లో ఉంటె మంచిది. స్పీడ్ డ్రైవింగులు, ఈతలు, ప్రమాదకర స్థలాలకు విహార యాత్రలు, దూరప్రయాణాలు మొదలైన సాహసాలకు దూరంగా ఉండాలి.

6. తేలికగా మనస్సు బేలన్స్ తప్పే వారికీ, హిస్టీరికల్ గా ప్రవర్తించే వారికీ, ముఖ్యంగా ఆడవారి మీద ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో వాళ్ళు తేలికగా అన్ బేలన్స్ అయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు. గమనించండి.

సులువైన ఈ జాగ్రత్తలు పాటించి ఈ గ్రహణ ప్రభావాలనుండి బయట పడండి.
read more " 27-7- 2018 పౌర్ణమి + చంద్ర గ్రహణం ప్రభావాలు "

23, జులై 2018, సోమవారం

Tae Kwon Do Grand Master Jhoon Rhee - Astro analysis














"A picture is worth a 1000 words; an action is worth a 1000 pictures;" -- Grand Master Jhoon Rhee, 10th degree black belt, Tae Kwon Do

Tae Kwon Do సర్కిల్స్ లో ఝూన్ రీ పేరు తెలియని వారుండరు. ఈయనా బ్రూస్లీ మంచి ఫ్రెండ్స్. బ్రూస్లీ అందరికీ తెలుసు. కానీ ఈయన టైక్వాన్ డో సర్కిల్స్ లో మాత్రమే తెలుసు. బ్రూస్లీ వాడే హైకిక్స్ అన్నీ ఝూన్ రీ దగ్గర నేర్చుకున్నవేనని, అవి కుంగ్ ఫూ కిక్స్ కావని, టైక్వాన్ డో కిక్స్ అనీ తెలిస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది.

ఉదాహరణకు, Return of the Dragon సినిమాలో, చక్ నారిస్ కూ బ్రూస్లీకీ జరిగే కోలోజియం ఫైట్ లో, బ్రూస్లీ వాడినవి అన్నీ టైక్వాన్ డో కిక్సే. అతను చేసినది కుంగ్ ఫూ కాదు. తన పర్సనల్ స్టైల్ అయిన Jeet Kune Do మరియు టైక్వాన్ డో కలిపి ఆ సీన్లో బ్రూస్లీ వాడాడు.

ఝూన్ రీ జనవరి 7 - 1932 న సౌత్ కొరియా లోని Asan అనే ఊళ్ళో పుట్టాడు. 30-4-2018 న అమెరికాలోని వర్జీనియా స్టేట్,  ఆర్లింగ్ టన్ లో తన 86 వ ఏట చనిపోయాడు. ఈయనకు Father of American Tae Kwon Do అనే పేరుంది. ఈయన 1960 లలో అమెరికాకు వలస వచ్చాడు. Washinton DC లో తన మొదటి స్కూల్ పెట్టాడు. తర్వాత అదే రాష్రంలో అనేక స్కూల్స్ స్థాపించాడు. క్రమేణా సెలబ్రిటీ అయ్యాడు.

నేను స్వతహాగా టైక్వోన్ డో అభ్యాసిని కాను. కానీ అందులోని "కార్ట్ వీల్ కిక్" లాంటి కొన్ని కిక్స్ అంటే నాకున్న ఇష్టం వల్ల వాటిని నేర్చుకుని నా పర్సనల్ స్టైల్లోకి తీసుకున్నాను. నాకు ప్రత్యేకంగా ఒక మార్షల్ ఆర్ట్ అంటే ఇష్టమూ ఇంకొకటంటే ద్వేషమూ ఏమీ లేవు. Take everything that is useful అనే బ్రూస్లీ సూక్తిని నేను పాటిస్తాను. అందుకని రకరకాల మార్షల్ ఆర్ట్స్ లోనుంచి నేను అనేక టెక్నిక్స్ నేర్చుకుని వాటిని కలగలిపి వాడుతూ ఉంటాను.

టైక్వోన్ డో అనేది కొరియన్ మార్షల్ ఆర్ట్. దీనిలో 80% కిక్స్, 20 % పంచెస్ ఉంటాయి. ప్రధానంగా ఇది హైకిక్స్ ని ఎక్కువగా వాడే ఆర్ట్.

గ్రాండ్ మాస్టర్ ఝూన్ రీ జాతకాన్ని గమనిద్దాం. ఈయన పుట్టిన సమయం తెలియదు. కనుక మన పద్ధతులు ఉపయోగిద్దాం. ఇతని జాతకంలో కుజుడు ఆత్మకారకుడయ్యాడు. కుజుడు ఆత్మకారకుడైతే లేదా జాతకంలో బలంగా ఉంటే, అతనికి వీరవిద్యలు గాని, వ్యాయామాలు గాని చెయ్యడం వస్తుంది. మార్షల్ ఆర్ట్స్ వీరుల జాతకాలలోనూ, బాక్సింగ్ వీరుల జాతకాలలోనూ, కుజుడు బలంగా ఉండటం గమనించవచ్చు. ఎందుకంటే కుజుడు యుద్ధప్రియుడు. Red planet, Planet of War అని ఇతనికి పేర్లున్నాయి.

కారకాంశ ధనుస్సు అయింది. చంద్రలగ్నం కూడా ధనుస్సే అయింది. సూర్యలగ్నం కూడా ధనుస్సే అయింది. కనుక ఇతని జాతకంలో ధనుస్సుకు ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నది. ఇతను అమావాస్య రోజున పుట్టాడు.

లగ్నంలో నవమాధిపతి అయిన సూర్యుడు ఉండటంతో ఈయన అమెరికాలో స్థిరపడ్డాడు. అష్టమస్థానం యుద్ధాన్నీ మరణాన్నీ గాయాలనూ సూచిస్తుంది. అష్టమాదిపతి అయిన చంద్రుడు కూడా లగ్నంలో ఉండటమూ, అదికూడా వీరవిద్యలకు అధిపతి అయిన కుజునితో కలసి ఉండటమూ ఈయనను టైక్వాన్ డో గ్రాండ్ మాస్టర్ని చేశాయి. అష్టమంలో గురువు వక్రించి ఉండటమూ, శరీర శ్రమకూ, కష్టాన్ని ఓర్చుకోవడానికీ కారకుడైన శని అష్టమాన్ని చూస్తూ ఉండటమూ, ఆ శని షష్ఠస్థానాధిపతి అయిన శుక్రునితో కలసి ఉండటమూ గమనిస్తే ఈయనకు వీరవిద్యలు ఎందుకు పట్టుబడ్డాయో అర్ధమౌతుంది.

1964 లో California లో జరిగిన Ed Parker's Long Beach Karate Championship Event లో మొదటి సారిగా బ్రూస్లీ, ఝూన్ రీని కలిశాడు. అక్కడ వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అప్పటి వరకూ బ్రూస్లీ తన Wing Chun Style లో ఉన్న హ్యాండ్ టెక్నిక్స్ ఎక్కువగా వాడేవాడు. కానీ ఆ తర్వాత అతను ఝూన్ రీ దగ్గర Kicks నేర్చుకున్నాడు. తర్వాత తర్వాత బ్రూస్లీ డెవలప్ చేసిన Jeet Kune Do లో బేసిక్ టెక్నిక్ గా ఝూన్ రీ దగ్గర నేర్చుకున్న Side Kick ను తీసుకున్నాడు. ఈ విధంగా బ్రూస్లీ కిక్స్ వెనుక ఝూన్ రీ శిక్షణ ఎంతో ఉంది. ఈ సంగతి చాలా మందికి తెలియదు. ఇక్కడ ఝూన్ రీ, బ్రూస్లీ ఇద్దరూ చేస్తున్న సైడ్ కిక్ ను గమనిస్తే ఈ సంగతి తేలికగా అర్ధమౌతుంది. ఇది టైక్వాన్ డో కిక్ మాత్రమే, కుంగ్ ఫూ లో ఇలాంటి కిక్స్ ఉండవు. అవి వేరుగా ఉంటాయి.

అంతేకాదు. మహమ్మద్ ఆలీకి Accu Punch అనేదాన్ని నేర్పించింది Jhoon Rhee అనే సంగతీ చాలామందికి తెలియదు. బహుశా దీనిని Jhoon Rhee, బ్రూస్లీ దగ్గర నేర్చుకుని ఉండవచ్చు. ఎందుకంటే Tai Kwon Do లో పంచెస్ కి అంత ప్రాధాన్యత ఉండదు. కానీ బ్రూస్లీ నేర్చుకున్న Wing Chun Kung Fu లో ఎక్కువగా పంచెస్ నే వాడతారు. వింగ్ చున్ సిస్టంలో హైకిక్స్ కి ప్రాధాన్యత ఉండదు. ఉంటేగింటే,  లోకిక్స్ ఉంటాయి లేదా బెల్ట్ లెవల్ కిక్స్ ఉంటాయి. అంతే. ఆ విధంగా Accu Punch అనేది బ్రూస్లీ నుంచి, ఝూన్ రీ ద్వారా, మహమ్మద్ అలీకి చేరింది. 1975 లో ఈ పంచ్ ని ఉపయోగించే, UK Heavy Weight Boxing Champion Richard Dunn ని మట్టి కరిపించానని అలీ చెప్పేవాడు.

మార్షల్ ఆర్ట్ అనేది, అది ఏ రకమైన మార్షల్ ఆర్ట్ అయినా సరే, ఊరకే రాదు. ప్రతిరోజూ బద్దకాన్ని వదల్చుకుని కఠోరంగా శ్రమిస్తేనే దానిలో మాస్టరీ వస్తుంది. 86 ఏళ్ళ వయసులో కూడా ఝూన్ రీ ప్రతిరోజూ క్రమం తప్పకుండా మూడు గంటలు ప్రాక్టీస్ చేసేవాడంటే అర్ధం చేసుకోండి మరి అతనికి 10th Degree Black Belt ఎలా వచ్చిందో? అతను అమెరికాలో అంత సెలబ్రిటీ ఎలా అయ్యాడో?

జాతకంలో కుజుడూ శనీ బలంగా ఉన్నప్పుడు కష్టపడే తత్త్వమూ పట్టుదలా అవే వస్తాయి. అలాంటి వాళ్ళకే మార్షల్ ఆర్ట్స్ పట్టుబడతాయి.
read more " Tae Kwon Do Grand Master Jhoon Rhee - Astro analysis "