నా కలం నుండి వెలువడుతున్న 76 వ గ్రంధంగా, 'జ్ఞానసంకలినీ తంత్రము' అనబడే ప్రాచీనగ్రంధమునకు నా వ్యాఖ్యానమును నేడు విడుదల చేస్తున్నాము.
తంత్రములన్నీ శివశక్తుల సంవాదరూపములై యుంటాయి. ఈ గ్రంధము కూడా అటువంటిదే. దీనియొక్క పేరునుబట్టి, అనేక ఇతరతంత్రముల నుండి సేకరించబడిన జ్ఞానము ఈ గ్రంధములో ఒకచోట కూర్చబడినదని తెలుస్తున్నది.
పెద్దదైన ఏ ఇతర గ్రంధమునకూ ఇది అనుబంధము కాకుండా, స్వతంత్రరచనగా కనిపిస్తున్నది. దీనిలోని భావములు కూడా, వివిధ యోగోపనిషత్తులనుండి, జ్ఞానోపనిషత్తులనుండి సేకరించబడినట్లుగా ఉన్నాయి. దీని ప్రతిధ్వనులు భగవద్గీతలో కూడా మనకు దర్శనమిస్తాయి.
దీనిలో సృష్టిక్రమము, పంచభూతములు, చక్రములు, నాడులు, వాయువులు, వాటియొక్క పనులు, ఓంకారము, దానియొక్క మూడుభాగములు, ఆయాభాగముల తత్త్వములు, కుండలినీసాధన మొదలైన విషయములు వివరింపబడినాయి. ఆచారములు, తంతులకు భిన్నమైన జ్ఞానమార్గము, యోగశాస్త్రముతో మేళవింపబడి దీనిలో దర్శనమిస్తున్నది.
మధ్యయుగములనాటి అనేకగ్రంథములలో వలె, దీనిలో కూడా, వేదాంతమును, యోగశాస్త్రమును, తంత్రశాస్త్రమును సమన్వయపరచాలనిన ప్రయత్నం కనిపిస్తుంది. వేదాంత, యోగ, తంత్రశాస్త్రాభిమానులకు, జిజ్ఞాసువులకు మరియు సాధకులకు ఈ గ్రంధం ఉపయోగకరంగా ఉంటుందని మా విశ్వాసము.
ఈ గ్రంధము కూడా తిరుపతి బుక్ ఫెస్టివల్ లోని 35 వ నంబరు స్టాల్లో లభిస్తుంది. లేదా మా తక్కిన గ్రంధాలలాగే ఆన్లైన్ లో లభిస్తుంది. జిజ్ఞాసువులు, పాఠకులు మరియు మా అభిమానులు దీనిని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం.

