అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

16, నవంబర్ 2025, ఆదివారం

మా 75 వ పుస్తకం ' దేవీగీత ' విడుదల

నా కలం నుండి వెలువడుతున్న 75 వ పుస్తకంగా 'దేవీగీత' అనే ప్రాచీనగ్రంధమునకు నా వ్యాఖ్యానమును నేడు 
విడుదల చేస్తున్నాను.

100 గ్రంధములను వ్రాయాలన్న నా సంకల్పము 75 వరకూ వచ్చినది. తక్కిన 25 గ్రంథముల వరుసలో 'దేవీగీత' కూడా ఉన్నది. కానీ వెనుకవరుసలో ఉన్నది. దానికంటే ముందుగా నడుస్తున్న పుస్తకములు కొన్ని ఉన్నాయి. ఈ మధ్యలో మిత్రుడు పాలపర్తి శ్రీకాంతశర్మ ఫోనుచేసి 'దేవీగీత' కు మీరు వ్యాఖ్యానము వ్రాస్తే బాగుంటుందని సూచించినాడు. శ్రీకాంత్ నాకు 15 ఏళ్ళనుంచీ మిత్రుడు. సన్మిత్రుల సూచన తప్పక పాటించవలసినదే గనుక, వెనుకవరుసలో ఉన్న ఈ గ్రంధమును ముందుకు తెచ్చి, పూర్తి చేసి, నేడు విడుదల చేస్తున్నాను.  

ఇది 800 సంవత్సరాల నాటి ప్రాచీనగ్రంధము 'దేవీభాగవత పురాణము' లోనిది. విషయవివరణలోను, ఉపాసనామార్గముల సమన్వయ విధానంలోను, దీనికి భగవద్గీతకు చాలా పోలికలున్నాయి.

ఈ గ్రంధములో పది అధ్యాయములున్నాయి. అవి, పరబ్రహ్మతత్త్వము, మాయాతత్త్వము, సృష్టిక్రమము, జ్ఞాన-యోగ-భక్తిమార్గములను, చతుర్విధభక్తులను, దేవియొక్క క్షేత్రములను, పూజావిధానములు, ఉత్సవములు, వ్రతములను, జగదంబయొక్క బాహ్యాంతరిక ఉపాసనావిధానములను క్లుప్తముగా వివరించినవి.

వేదాంతప్రతిపాదితమైన బ్రహ్మతత్త్వమును, తంత్రోక్తమైన జగదంబయొక్క ఉపాసనావిధానమును, యోగశాస్త్రమును,  మంత్రయోగమును, కుండలినీయోగమును, సతీదేవి మరియు గౌరీదేవుల ప్రాచీనచరిత్రలతో సమన్వయము గావించే ప్రయత్నము దీనిలో గోచరిస్తుంది. 

ఈ గ్రంధాన్ని వ్రాసి, ప్రచురించే పనిలో సహాయపడిన నా శిష్యులందరికీ ఆశీస్సులందిస్తున్నాను. 

'ఈ - బుక్' ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది. డిసెంబర్ 19 నుండి జరుగబోయే హైదరాబాద్ పుస్తకప్రదర్శనలో అందుబాటులో ఉంటుంది.

శాక్తతంత్రాభిమానులకు, అమ్మవారి భక్తులకు మా ఈ గ్రంధం ఆనందాన్ని కలిగిస్తుందని భావిస్తున్నాను.