అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

20, అక్టోబర్ 2025, సోమవారం

రెమెడీ చెప్పమంటావా?

ఇవాళ మా ఫ్రెండ్ మరొకడు ఫోన్ చేశాడు.

'25 వ తేదీ దగ్గరకొస్తోంది. గుర్తుందిగా?' అడిగాడు.

'గుర్తుంది' అన్నాను.

'మరొస్తున్నావా హైద్రాబాద్?' అడిగాడు.

'రావడం లేదు' అన్నాను.

'మొన్న వస్తానని చెప్పావుగా మన ఫ్రెండ్ తో?' అన్నాడు.

'ఇప్పుడు రానంటున్నాను' అన్నాను.

'అదేంటి రోజుకోమాట చెప్తావ్?' అన్నాడు.

'మాటమీద నిలబడటం నాకలవాటు లేదు. నేలమీద మాత్రమే నిలబడతాను' అన్నాను.

ఇలా కాదనుకున్నాడో ఏమో మాట మార్చి, 'ఖాళీగా ఉండి ఏం చేస్తున్నావు?' అన్నాడు.

'ఖాళీగా ఉండటాన్ని ఎంజాయ్ చేస్తున్నాను' అన్నాను.

'బోరు కొట్టడం లేదా?' అన్నాడు.

'కొడదామని చూస్తోంది. అది కొట్టేలోపు నేనే కొట్టేస్తున్నాను, మార్షల్ ఆర్ట్స్ ఇలా ఉపయోగపడుతోంది' అన్నాను.

'జ్యోతిషం నేర్చుకున్నావుగా. కనీసం అందరికీ రెమెడీలు చెబుతూ ఉండు. సోషల్ సర్వీసు చేసినట్టు ఉంటుంది' అన్నాడు.

' సర్వీసు పూర్తయింది. ఇక చెయ్యను' అన్నాను.

'పోన్లే నీ ఇష్టంగాని, మా ఫ్రెండ్ ఒకడున్నాడు.  ఇంకంటాక్స్ డిపార్ట్ మెంటులో పెద్ద పొజిషన్లో రిటైరయ్యాడు. సంపాదించిందంతా షేర్లలో పెట్టాడు. అంతా పోయింది. మిగిలిన డబ్బుని ఇంకొక ఫ్రెండ్ చేస్తున్న బిజినెస్ లో పెట్టాడు. ఇప్పుడు వాడు వడ్డీ ఇవ్వడంలేదు. అసలుకూడా ఇవ్వడం లేదు. ఏం చెయ్యమంటావో రెమెడీ చెప్పు. ప్లీజ్' అడిగాడు.

'మీ ఫ్రెండ్ ఎక్కడుంటాడు?' అడిగాను.

'కేరళలో' అన్నాడు.

'అక్కడ ముళ్లపెరియార్ డ్యాం అని ఒకటుంటుంది' అన్నాను.

'అయితే?' అన్నాడు అనుమానంగా.

'అందులో దూకి చావమను. భూమికి భారం తగ్గుతుంది' అన్నాను. 

'అదేంటి అంత మాటనేశావ్?' అన్నాడు.

'అవినీతి సంపాదన అలాగే పోతుంది. కనీసం కష్టార్జితమైనా తన కుటుంబం కోసం మిగుల్చుకుందామన్న జ్ఞానం లేని దురాశాపరుడికి, ఇదే సరైన రెమెడీ. వెంటనే వెళ్లి దూకమను. లేటైతే వాటర్ లెవల్ తగ్గుతుంది' అన్నాను.

'ఇదా నువ్వు నేర్చుకున్న జ్యోతిషం?' అన్నాడు చనువుగా. 

'అవును. దొంగలకు రెమెడీలు చెప్పకూడదని నేర్చుకున్నాను. రిటైరయ్యాక మీ ఫ్రెండ్ గాడికి అంత దురాశ అవసరమా?' అన్నాను.

మాటమార్చి 'నేను ప్రస్తుతం తమిళనాడులో ఉన్నాను. గుళ్ళు తిరుగుతున్నాను' అన్నాడు.

'మంచిదే. నీ ఓపిక' అన్నాను.

'నీకు నాడీజ్యోతిషం వచ్చా?' అడిగాడు.

'వచ్చు' అన్నాను.

'ఈ మధ్యనే నాడీజ్యోతిషం చూపించుకున్నా' అన్నాడు.

'ఎక్కడ? వైదీశ్వరన్ కోయిల్ వెళ్ళావా?' అడిగా.

'కాదు. ఇక్కడే తాంబరంలో. ఇక్కడ వాళ్ళ బ్రాంచి ఉంది. నాకు 80 ఏళ్ళు ఆయుష్షని చెప్పాడు. శివుణ్ణి పూజచేస్తే ఇంకో ఐదేళ్లు ఎక్కువ బ్రతుకుతావన్నాడు. అందుకే తమిళనాడులో శివాలయాలు తిరుగుతున్నా' అన్నాడు.

'అంత కష్టపడి ఇంకో ఐదేళ్లు బ్రతక్కపోతే ఏం?' అన్నాను.

'ట్రై చేస్తే తప్పులేదు కదా?' అన్నాడు.

' అందుకని ఈ ఐదేళ్ళు ఇలా గుళ్ళు తిరుగుతావా?' అడిగాను.

'అంటే?' అన్నాడు.

'అయిదేళ్లకోసం ఐదేళ్ళు గుళ్లు తిరగడం కంటే, ఉన్నచోట ఉండి 80 కి పోవడం బెటరేమో?' అడిగాను.

'నీతో కష్టంరా బాబు' అన్నాడు.

'సరే అదలా ఉంచు. నీక్కూడా ఏదైనా రెమెడీ చెప్పమంటావా?' అడిగాను నవ్వుతూ.

'బాబోయ్. నాకొద్దు నీ రెమెడీలు' అన్నాడు.

'అందుకే ఫోన్ పెట్టెయ్. హైద్రాబాద్ రాను. ఇక ఫోన్లు చెయ్యకండి. మన వాళ్లందరికీ చెప్పు' అని నేనే డిస్కనెక్ట్ చేశాను.