నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

24, డిసెంబర్ 2023, ఆదివారం

మా 62 వ పుస్తకం 'స్వర చింతామణి ' విడుదల

వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు మొదలై, నిన్నటి నుండి మా ఆశ్రమంలో మొదటి  స్పిరిట్యువల్ రిట్రీట్ జరుగుతున్నది. ఇది మూడు రోజులపాటు జరిగే కార్యక్రమం. ఇంతకు ముందు పంచవటి సంస్థలో ఎన్నో రిట్రీట్స్ జరిగినప్పటికీ, ఆశ్రమం మొదలైన తరువాత జరుగుతున్న మొదటి రిట్రీట్ మాత్రం ఇదే.

ఈ రిట్రీట్ లో భాగంగా ఈ రోజున మా క్రొత్తపుస్తకం 'స్వర చింతామణి' ని విడుదల చేస్తున్నాము. ఇది శ్వేతకేతుయోగిచే రచించబడిన ప్రాచీన స్వరశాస్త్ర గ్రంధము. దీనికి నా వ్యాఖ్యానమును నేడు విడుదల చేస్తున్నాము. ఇది నా కలం నుండి వెలువడుతున్న 62 వ గ్రంధము.

కఠినములైన జ్యోతిష్య శాస్త్ర సూత్రముల జోలికి పోకుండా, కేవలం రెండు స్వరములు, అయిదు తత్త్వముల ఆధారంగా త్రికాలజ్ఞానమును పొందే విధానములు ఈ గ్రంధంలో చెప్పబడినాయి. మానవ జీవితంలో జరిగే సమస్తమునూ ఈ విధానం ద్వారా తేలికగా అర్ధం చేసుకోవచ్చు. అంతేగాక, ప్రశ్న విధానమును ఉపయోగించి భవిష్యత్తును గ్రహించవచ్చు. దూరంగా జరుగుతున్న సంఘటనలను  కూడా తెలుసుకోవచ్చు.

ఆయుర్వేదము, వశీకరణము, వాజీకరణము, అనేక రోగములకు పనికి వచ్చే మూలికా యోగములు మొదలైనవి ఈ గ్రంధపు ప్రత్యేకతలు.

పురుషార్ధములైన ధర్మ, అర్ధ, కామ, మోక్షములను శ్వాస ద్వారా పొందే విధానములను ఈ గ్రంధం తేటతెల్లం చేస్తున్నది. మానవజీవితానికి ఉపయోగపడే అత్యుత్తమములైన గ్రంధములలో ఇది ఒకటి. అందుకే దీనికి నా వ్యాఖ్యానమును వ్రాశాను.

ఈ గ్రంధం వ్రాయడంలో, ప్రచురించడంలో నాకు తోడ్పడిన సరళాదేవి, అఖిల. లలిత,  ప్రవీణ్, చావలి శ్రీనివాస్ లకు నా ఆశీస్సులు.

ఈ పుస్తకం కూడా మా వెబ్ సైట్ నుండి ఇక్కడ లభిస్తుంది.