“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

8, నవంబర్ 2023, బుధవారం

యోగా నేర్పడానికి మీరేం తీసుకుంటారు?

ఎక్కడైనా ఆచారాలను, సంప్రదాయాలను పోషించేవాళ్ళు ఆడవాళ్లే. ఇల్లంతా వారి అధీనంలో నడుస్తుంది గనుక, ఆచారాలు పద్ధతులు ఇంటిలోనే పాటించబడతాయి గనుక, వాటికి పట్టుగొమ్మలు స్త్రీలే. ఏ మతంలోనైనా ఇది సత్యమే. మన హిందూమతంలో ఇంకా సత్యం. పల్లెటూళ్లలో అయితే ఇంకా ఎక్కువ. ఒకటి నచ్చి, దాన్ని పట్టుకుంటే ఇక వదిలిపెట్టరు. 

మొన్నొకామె ఇలా అడిగింది.

'ఇక్కడ భజన బృందం ఆడవాళ్లు మన ఆశ్రమానికి వద్దామనుకుంటున్నారు. మీ దగ్గర యోగా నేర్చుకుందామని వాళ్ళ ఆలోచన'

'నేను నేర్పేది జిమ్ముల్లో చేసే 'యోగా' కాదు. మాకు అదికూడా తెలుసు. ఇక్కడ నేర్పబడేది యోగశాస్త్రం, మీరనుకునే 'యోగా' కాదు' అన్నాను.

'పోనీ అదే అనుకోండి. వాళ్లలో అదికూడా నేర్చుకునేవాళ్లున్నారు. రమణమహర్షి భక్తులున్నారు. పల్లెటూరు కదా అని తక్కువగా అనుకోకండి' అందామె.

'మంచిదే. మహర్షిది సనాతనమైన జ్ఞానమార్గం. అది మా సాధనలో అంతర్భాగమే' అన్నాను.

'మరి మీరేం తీసుకుంటారో కూడా చెప్పండి' అందామె.

'ఏంటి తీసుకునేది?' అన్నాను.

'అదేనండి. డబ్బులు' అన్నదామె.

జాలేసింది. నవ్వొచ్చింది.

'రమణమహర్షి ఏం తీసుకున్నాడు?' అడిగాను.

'ఆయన వేరు కదండీ?' అంది.

'ఆ వేరులోదే ఈ మొక్క' అన్నాను.

పల్లెటూర్లలో పట్టుదలలు ఎక్కువ.

'అవుననుకోండి. కానీ సంస్థ నడవాలంటే డబ్బు కావాలి కదా?' అందామె.

'ఇన్నాళ్లూ ఎలా నడిచింది?' అడిగాను.

'అదేననుకోండి. మీరు 'ఇంత' అని పెట్టకండి. వాళ్ళు ఇచ్చినది తీసుకోండి. అప్పుడు ఇద్దరికీ బాగుంటుంది' అందామె.

నాకు విసుగేసింది.

'అమ్మా. విను. మా సిద్ధాంతాలు ఆదర్శాలు వేరు. ఇది బిజినెస్ కాదు. మంత్రాలు సాధనలు అమ్ముకునే సద్గురువులు చాలామంది మార్కెట్లో ఉన్నారు. అక్కడికెళ్ళమని మీ వాళ్లకు చెప్పండి' అన్నాను.

'మీరేమనుకోకపోతే ఒక మాట' అందామె 

'ఇంకా అనుకునేదేముంది? చెప్పండి' అన్నాను.

'అందరు గురువులూ మొదట్లో ఇలాగే అంటారు. తరువాత డొనేషన్లు గుంజుతారు. మాకు తెలుసు' అందామె.

'నిజమే కావచ్చు. ఒక బిజినెస్ గా వారి సంస్థను నడపాలని అనుకునేవాళ్లు అలా చేస్తారేమో. మాది బిజినెస్ కాదని ముందే చెప్పాను. ఇది సాధనానిలయం. ప్రపంచంతో ఎంత తక్కువ సంబంధం ఉంటే మాకు అంత మంచిది. అలాగే ఉంటుంది కూడా. మీరనుకునే విధంగా మా ఆశ్రమం ఉండదు. నిజమైన సాధకులకే ఇక్కడ నివాసం. లోకాన్ని ఉద్దరించాలని, ఆ తరువాత రాజకీయ పార్టీలు పెట్టాలని, నల్లడబ్బు వెనకెయ్యాలని, కర్మ మూటగట్టుకోవాలని మాకు లేదు. ప్రస్తుతం మీకు నమ్మకం కలగకపోవచ్చు. ముందు ముందు మీకే అర్ధమౌతుంది' అన్నాను.

'అయితే మావాళ్లకు ఏం చెప్పమంటారు?'అడిగిందామె.

'ముందు మా దారి ఏమిటో తెలుసుకోమని చెప్పండి. దానికి నా పుస్తకాలున్నాయి. చదవమనండి. ఇంకా కావాలంటే వచ్చి నాతో మాట్లాడమనండి. ఆ తరువాత  మా దారిలో నడిచి సాధనలు చేయమనండి. అంతే. అవి డబ్బుతో కొనగలిగేవి కావు. నేను అమ్ముకునేవాడినీ కాను. ఇది చెప్పండి మీ వాళ్ళకి' అన్నాను.

'సరేనండి. చెబుతాను' అందామె.

'ఒకపని చెయ్యండి. ఒకరోజున మీ మహిళామండలి అందరితో ఒక మీటింగ్ పెట్టండి. అది మా ఆశ్రమమైనా సరే, లేదా మీ గుడిలో పెట్టినా సరే. అక్కడకు నా శిష్యుడిని, ఒక శిష్యురాలిని పంపుతాను. వాళ్లొచ్చి మీకు మా మార్గం గురించి వివరిస్తారు. అప్పుడు మీకు కొంత అర్ధమౌతుంది. ఆ తరువాత ఇంట్రెస్ట్ ఉంటే, ఇంకా నేర్చుకోవచ్చు. మా సాధనామార్గంలో నడవవచ్చు' అన్నాను. 

'సరేనండి. ఇది బాగుంది. ఇలా చేద్దాం' అని ఆమె వెళ్ళిపోయింది.

లోకంలోని కమర్షియల్ గురువులందరినీ చూసి మనం కూడా అదే టైపని అనుకుంటున్నారు వీళ్ళు. తప్పు వీళ్లది కాదు. లోకం అలా ఉంది మరి !

డబ్బుతో దైవత్వాన్ని కొనగలమా? సాధ్యమౌతుందా అసలు?