“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

22, ఫిబ్రవరి 2023, బుధవారం

అల్లా, యెహోవాలలో ఎవరు బలవంతుడు?

ఈరోజు పొద్దున్నే మెలుకువొచ్చింది.

ఇంకా పక్కమీద నుంచి పూర్తిగా లేవకముందే ఒక పెద్ద డౌటు కూడా వచ్చింది.

అల్లా, యెహోవాలలో ఎవరు బలవంతుడు? అనేదే ఆ ప్రశ్న.

మన డౌట్లన్నీ తీర్చేది కర్ణపిశాచే కదా? అందుకని దాన్నే అడిగా.

అయితే, ఈ ప్రశ్న రావడానికి ఒక కారణముంది.

సిరియా, తుర్కీయేలు మొన్నటి భూకంపం దెబ్బనుండి ఇంకా పూర్తిగా తేరుకోలేదు. ఈలోపల మళ్ళీ దెబ్బ పడింది. తుర్కీయేలో మళ్ళీ భూకంపం వచ్చింది. ఈ సారి 300 మంది మాత్రమే గాయపడ్డారని చెబుతున్నారు. గాయపడ్డానికి గాని, పోవడానికి గాని పెద్దగా మనుషులు లేరేమో ఆ ప్రాంతంలో?

'సర్లే, ఎంతమంది పోతే మనకెందుకులే?' అనుకొని, 'అసలు అల్లా, యెహోవాలలో ఎవరు బలవంతుడు?' అని ప్రశ్నించుకుంటే, 'ముమ్మాటికీ యెహోవానే బలవంతుడు' అని కర్ణపిశాచి జవాబిచ్చింది.

'ఎలా?' అని మళ్ళీ అడిగాను.

కర్ణపిశాచి నవ్వేసింది.

'చాలా సింపుల్. సిరియా తుర్కీయేలు అల్లాని ప్రార్ధిస్తాయి. ఇజ్రాయెల్ చూద్దామంటే యహోవాని ప్రార్ధిస్తుంది. సిరియాకు ఇజ్రాయెల్ కు యుద్ధం ఎప్పటినుంచో జరుగుతోంది. అంటే, అల్లాకీ, యెహోవాకి జరుగుతున్నట్టే. మరి, సిరియా వైపే మళ్ళీమళ్ళీ భూకంపాలొస్తున్నాయంటే ఏంటి అర్ధం? యెహోవా గెలుస్తున్నట్టే. అల్లా ఓడిపోతున్నట్టే.  అదీగాక సందులో సందంటూ నిన్న సిరియాని ఇజ్రాయెల్ ఒక మిసైల్ తో ఎటాక్ కూడా చేసింది. అంటే యెహోవా చాలా పవర్ ఫుల్లుగా ఉన్నట్టేగా మరి? ఈక్వేషన్ ఇంత సింపుల్ గా ఉంటే, దీనికి కూడా నీ డౌటేంటి?' అంది కోపంగా

'ఓహో అదా సంగతి? అలా అయితే, పాకిస్తాన్ దివాళా తీసి బెగ్గర్ కంట్రీ అయిపోయింది. నేడో రేపో సివిల్ వార్ వచ్చేలాగా ఉందక్కడ. నాలుగు ముక్కలు కావడానికి సిద్ధంగా ఉంది. మరి వాళ్ళు కూడా అల్లానే తెగ పూజిస్తారు కదా ! మరి అల్లా, వాళ్ళ గోడు కూడా వినడం లేదెందుకు?' అడిగా అమాయకంగా.

'వయస్సు పెరిగే కొద్దీ నీకు మతి పోతున్నది. ఇందులో ఏముంది పెద్ద డౌటు? యెహోవాతో యుద్ధంలో ఓడిపోయి అల్లా చాలా ఇబ్బందుల్లో ఉంటే, నువ్వేంటి? పాకిస్తాన్ సంగతి చూడమంటావు? ఆయనమాత్రం ఎన్నని చూస్తాడు? నీకసలు మతుందా?  ఒకపక్క ఇల్లు తగలబడుతుంటే ఎవడో వచ్చి సైగలు చేస్తున్నాడని ఒక సామెతుంది. అలా ఉంది నీ డౌటు' అరిచింది కర్ణపిశాచి.

'నా ప్రశ్నకి సూటిగా జవాబు చెప్పచ్చు కదా? ఏవేవో సామెతలు చెప్తావేంటి?' మళ్ళీ అడిగా భయంభయంగా నసుగుతూ.

'ముమ్మాటికీ యెహోవానే స్ట్రాంగ్. అల్లా, జీసస్ ఇద్దరూ యెహోవా నుంచి వచ్చినవాళ్లే. ఈ ముగ్గురిలోకీ యెహోవానే పాతకాలం వాడు. అందుకని ఆయనే బలవంతుడు. ఇక పని చూస్కో' అని కసురుకుంది కర్ణపిశాచి.

దీన్ని బట్టి నాకొక విషయం అర్ధమైంది.

మనుషులందరూ అర్జెంటుగా మతాలు మారి, యూదులై పోయి, ఏకైకదేవుడైన యహోవాని నమ్ముకోవడం మంచిది. ప్రస్తుతం ఆయనకే స్టార్ బాగుంది. మనుషులందరూ అంతే కదా ! ఏ దేవుడి స్టార్ బాగుంటే వాడివైపు మారిపోవడం వాళ్లకు అలవాటే కదా !

ఏ గాలికా గొడుగు. వెరీ సింపుల్.

ఇది కూడా కర్ణపిశాచిని అడుగుదామనుకున్నా.

అడిగేశా.

'పొద్దున్నే భలే ప్రశ్నలు అడుగుతున్నావు గాని, ముందు పక్కమీదనుంచి లేచి బాత్రూం కెళ్ళు. తర్వాత చూద్దాం నీ ప్రశ్నల్ని', కసురుకుంది కర్ణపిశాచి.

మళ్ళీ భయమేసింది. కర్ణపిశాచికి కోపమొస్తే ఏమౌతుందో నాకు బాగా తెలుసు.

అందుకని ప్రశ్నలాపి, పక్కమీదనుంచి హడావుడిగా లేచా.

'జై యహోవా' అని అరుస్తూ బాత్రూం లోకి దారి తీశా.

కధ కంచికి, మనం బాత్రూం లోకి.