“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

7, ఆగస్టు 2020, శుక్రవారం

అయోధ్యలో రామాలయ శంకుస్థాపన ముహూర్తం - పరిశీలన


5-8-2020 బుధవారం నాడు మధ్యాన్నం 12. 44 కి అయోధ్యలోని రామాలయానికి శంకుస్థాపన జరిగింది.

ఈ ముహూర్తాన్ని నా విధానం లో  పరిశీలిద్దాం.

శ్రావణ బహుళద్వితీయ,  బుధవారం, శతభిషానక్షత్రం, బుధహోర,అభిజిత్ ముహూర్తంలో ఈ కార్యక్రమం జరిగింది.

చరలగ్నమైన తుల ఉదయిస్తున్నది. సాధారణంగా స్థిరలగ్నాన్ని ఇలాంటి పనులకు వాడతారు. కానీ  ఇక్కడ చరలగ్నాన్ని వాడారు. దశమంలో రవిని ఉంచుతూ అభిజిత్ మూహూర్తం  సాధించడం కోసం ఈ లగ్నాన్ని ఎంచుకున్నట్లు తోస్తున్నది. దినాధిపతి, హోరాధిపతి అయిన బుధుడు కూడా దశమంలోనే ఉండటం ఈ ముహూర్తానికి బలాన్నిస్తున్నది.

లగ్నం మీద పరస్పర విరుద్ధములైన గ్రహప్రభావాలున్నాయి. ఉఛ్చ స్థితిలో ఉన్న రాహుకేతువులు నవమ - తృతీయ భావాల ఇరుసులో ఉండటం ఈ ముహూర్తానికి గొప్ప బలం. రాహువు నవమంలో ఉంటూ ఉఛ్చబుధుడిని సూచిస్తున్నాడు. ఇది చాలా మంచిది.

నాలుగింట వక్రశని ఉండటం మంచిది కాదు. దేశంలో కొన్ని వర్గాలనుండి ఈ చర్యకు వ్యతిరేకత ఉంటుందని ఇది సూచిస్తున్నది. వారెవరో ఊహించడానికి పెద్ద జ్యోతిష్యజ్ఞానం  అవసరం లేదు. కానీ శని వక్రతవల్ల, తృతీయకేతువుతో చేరడం వల్ల, వారుకూడా దీనిని ఆమోదించవలసిందే (సుప్రీం కోర్ట్ రూలింగ్ వల్ల)  అని తెలుస్తున్నది.

అయిదు తొమ్మిది భావాలనుండి లగ్నానికి శుభార్గళం కలిగింది. ఇది బలమైన హిందూ సెంటిమెంట్ ను సూచిస్తున్నది.

అయితే, ఈ ముహూర్తానికి కొన్ని చెడుయోగాలున్నాయి. అవి - శత్రుస్థానంలో కుజునిస్థితి, శత్రుస్థానాధిపతి గురువు తృతీయంలో వక్రిగా ఉంటూ ద్వితీయంలోకి రావడం. ముహూర్తభాగంలో ఇవన్నీ చూడకూడదని సాంప్రదాయ జ్యోతిష్కులు అంటారుగాని,  అది తెలిసీతెలియక మాట్లాడే మాట. ఫలితభాగమైనా, ముహూర్త భాగమైనా ఎక్కడైనా జ్యోతిష్యం ఒకటే. జాతకభాగానికి వేరుగా, ముహూర్తభాగానికి వేరుగా సూత్రాలు తయారుచేసి పుస్తకాలు వ్రాసినవాళ్ళే జ్యోతిష్యాన్ని భ్రష్టు పట్టించారు. 

లగ్నం మీద గురువు, కుజుల బలమైన డిగ్రీ దృష్టి ఉన్నది. ఈ ఆలయంమీద ఇప్పటికే ఉన్న శత్రువుల కన్నును ఇది సూచిస్తుంది. రామాలయం కట్టబడినా, గట్టి సెక్యూరిటీ మధ్యలోనే ఇది ఎప్పటికీ ఉండవలసిన అవసరాన్ని ఈ గ్రహయోగాలు సూచిస్తున్నాయి. ఈ సమయానికి ఉన్న రాహు - రాహు - రవి దశ కూడా ఇదే ఫలితాన్ని గట్టిగా సూచిస్తోంది. ఇది గ్రహణదశ కనుక ముస్లిం తీవ్రవాదుల నుంచి ఈ ఆలయాన్ని కాపాడుతూ ఉండవల్సిన అవసరం ఎప్పటికీ ఉంటుంది. వారిని నమ్మడం కష్టం.

నక్షత్రాధిపతి రాహువు ధర్మాన్ని సూచించే నవమంలో లగ్నాధిపతి అయిన శుక్రునితో కలసి ఉఛ్చస్థితిలో ఉండటం, అభిజిత్ ముహూర్తం కావడం, రాహుకేతువులు మంచి స్థానాలలో ఉఛ్చస్థితులలో ఉండటం -- ఈ ముహూర్తానికి బలమైన పునాదులు. ఉన్నంతలో ఇది చాలామంచి ముహూర్తమే.

అనుకున్నట్లుగా ఈ భవ్యమైన ఆలయం మూడేళ్ళలో పూర్తికావాలని మనం కూడా ప్రార్ధిద్దాం.

జై శ్రీరామ్ !