“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

25, సెప్టెంబర్ 2019, బుధవారం

శుక్రుని నీచస్థితి - సెక్స్ కుంభకోణాలు - అర్ధాంతర మరణాలు

ప్రతి ఏడాదీ సెప్టెంబర్ లో శుక్రుడు నీచస్థితిలోకి (కన్యారాశిలోకి) వస్తూ ఉంటాడు. ఈ స్థితిలో ఆయన ఒక నెలపాటు ఉంటాడు. అదేచోట బుధుడు ఉఛ్చస్థితిలో ఉంటాడు. కన్యారాశి మూడోపాదంలో ఉన్నపుడు నవాంశలో వీరిద్దరి స్థితులు రివర్స్ అవుతాయి. అంటే బుధుడు నీచస్థితిలోకి, శుక్రుడు ఉఛ్చస్థితిలోకి పోతారు. రాశి నవాంశలలో వ్యతిరేక స్థితులలో వీరుండటం సమాజంలో గందరగోళ పరిస్థితులను సృష్టిస్తుంది. ముఖ్యంగా ఇవి, సెక్స్ కుంభకోణాలు, అసహజమైన మానవసంబంధాలు బయటపడటం, జలప్రమాదాలు జరగడం, శుక్రసంబంధమైన రోగాలతో మనుషులు చనిపోవడం మొదలైన రూపాలలో మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్నేళ్లపాటు సెప్టెంబర్ అక్టోబర్ లలో వార్తలను గమనిస్తే, నేను చెప్పిన ఈ ట్రెండ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మిమ్మల్ని ఆశ్చర్య చకితులను చేస్తుంది. మనుషుల మీద గ్రహప్రభావం ఖఛ్చితంగా ఉంది అనడానికి ఇదొక ఉదాహరణ. 

ఈ నెల 15 తేదీన శుక్రుడు నవాంశలో ఉఛ్చస్థితికి వచ్చాడు.  కానీ రాశిలో నీచస్థితిలో ఉన్నాడు. సరిగ్గా ఒకరోజు ముందు అంటే సెప్టెంబర్ 14 తేదీన స్వామి చిన్మయానంద్ తనను రేప్ చేశాడంటూ ఒకమ్మాయి ఫిర్యాదు చెయ్యడమే కాక, దానికి సంబంధించిన 43 వీడియో క్లిప్స్ ఉన్న పెన్ డ్రైవ్ ను సిట్ టీమ్ కి సమర్పించింది. ఈ వీడియో క్లిప్స్ ఇప్పుడు చాలామంది దగ్గర ఉన్నాయి. మా ఫ్రెండ్ ఒకడి మొబైల్లో కూడా ఉన్నాయి. చూస్తావా అని ఫ్రెండ్ గాడు నన్నడిగాడు. నాకు అక్కర్లేదని చెప్పాను. ఈ కేసు ఇంకా తేలలేదు. విచారణ జరుగుతూనే ఉంది.

సెప్టెంబర్ 16 న గోదావరిలో లాంచీ మునిగి దాదాపు 40 మంది చనిపోయారు. ఇది కూడా శుక్రుని నీచ/ఉఛ్చస్థితుల ప్రభావమే. చంద్రునితోబాటు శుక్రుడు కూడా నీటికి, వరదలకు, జలప్రమాదాలకు కారకుడని గుర్తుండాలి.

సెప్టెంబర్ 17 న రాజస్థాన్ లోని అనేక ప్రాంతాలు భారీ వర్షాల వల్ల జలమయం అయ్యాయి. ఇది కూడా శుక్రుని జలకారకత్వపు విపరీత పరిణామమే.

సెప్టెంబర్ 23 న సౌత్ ఢిల్లీలోని ఒక బార్ లో రాత్రి పదిన్నర సమయంలో , కొందరు యువకులు తమను వేధించారంటూ కొందరు యువతులు కేసు పెట్టారు. ఆ సమయంలో అమ్మాయిలు బార్లో ఉండి త్రాగడం ఏమిటని మాత్రం ఎవరూ అడగడం లేదు.

వానలకు అమీర్ పేట మెట్రో స్టేషన్ సీలింగ్ పెచ్చు ఊడి తలమీద పడి 26 ఏళ్ల యువతి మొన్న చనిపోయింది. వానలు, యువతీ, రెండూ శుక్రుని కారకత్వం లోనివే.  

నిన్నటినుండీ ఆంధ్రా తెలంగాణాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న హైదరాబాద్లో పడిన వానకు అనేక రోడ్లు పూర్తిగా మునిగిపోయాయి. చాలాచోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. జనం నానా అవస్థలు పడ్డారు. స్కూటర్లు మునిగిపోయేంత నీరు పారడం హైదరాబాద్లో నేను స్వయంగా చూచాను. ఇదీ శుక్రుని జలకారకత్వ పరిధిలోదే.

ఇవిగాక ప్రతిరోజూ చిన్నాచితకా సెక్స్ కుంభకోణాలు, వెర్రిపోకడలు మన దేశంలో బయటపడుతూనే ఉన్నాయి. ఇక భూమ్మీది మిగతా దేశాలలోని వార్తల గురించి నేను వ్రాయబోవడం లేదు. మీరే చూసుకోండి.

ఇవి గాక, ఇదే సమయంలో కోడెల శివప్రసాద్ బలవన్మరణమూ (ఇది బుధుని స్థితివల్ల జరిగింది. దీనివల్ల తీవ్రమైన మానసిక అలజడి అశాంతి పుట్టుకొస్తాయి), నేడు సినీనటుడు వేణుమాధవ్ చనిపోవడమూ కూడా శుక్రుని నీచస్థితి పరిణామమే. వేణుమాధవ్ ఏదో నయంకాని రోగంతో బాధపడుతున్నాడని ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అందులో నిజం ఉంటే, ఇదీ శుక్రుని కారకత్వమే.

జాగ్రత్తగా గమనిస్తే, గ్రహస్థితులకూ మన చుట్టూ జరిగే సంఘటనలకూ ఈ విధమైన సూక్షసంబంధాలను మనం తెలుసుకోవచ్చు.