“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

2, జులై 2019, మంగళవారం

రెండవ లక్నో యాత్ర - 2

గెస్ట్ లెక్చరర్స్ లో డా. రాజేష్ హర్షవర్ధన్ ఒకరు. ఈయన లక్నో లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ లో ఒక విభాగానికి ఇన్ చార్జ్ గా ఉన్నారు. చాలా డిగ్రీలున్న ప్రముఖుడు. 'మెడికల్ వేస్ట్ మేనేజిమెంట్' అనే సబ్జెక్ట్ మీద ఈయన మాకు లెక్చర్ ఇచ్చారు. ఎక్కువగా పర్యావరణం గురించి, దానిపట్ల మనకున్న బాధ్యత గురించి, ప్రకృతిని కాపాడవలసిన అవసరం గురించి తాత్వికంగా మాట్లాడాడు. ఈయనకు మెడికల్ నాలెడ్జ్ తోడు మన భారతీయ వేదాంతం మీద మంచి అవగాహన ఉన్నట్లుగా తోచింది.

క్లాస్ అయిపోయింది. టీ బ్రేక్ సమయంలో అటెండర్ వచ్చి 'ప్రొఫెసర్ శుక్లా గారు మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు' అన్నాడు.

నేను లేచి విశాలమైన లాన్స్ మీదుగా అడ్మిన్ బ్లాక్ కి నడుచుకుంటూ వెళ్లాను. నేను వెళ్లేసరికి ప్రొఫెసర్ శుక్లా గారు, డా. హర్షవర్ధన్ గారు కూర్చుని 'టీ' సేవిస్తున్నారు.

'రండి శర్మాజీ. వీరు డా. హర్షవర్ధన్ గారు' అంటూ శుక్లాగారు నాకు పరిచయం చేశారు.

నేనాయన్ని విష్ చేసి, 'మీ లెక్చర్ చాలా బాగుంది. మీకు పర్యావరణ పరిరక్షణ మీద మంచి అవగాహన ఉంది' అన్నాను.

ఆయన చిరునవ్వు నవ్వాడు.

అంతలో గ్రీన్ టీ వచ్చింది. దాన్ని సేవిస్తూ ఉండగా మాటలు సాగాయి.

'మీ వెబ్ సైట్ చూచాము. చాలా బాగుంది. డాక్టర్ గారు మీ ఇంగ్లీష్ బ్లాగ్ ఫాలో అవుతారట. క్లాస్ రూమ్ లో మిమ్మల్ని చూచి గుర్తుపట్టారు. నా రూమ్ కి రావడం తోనే, విషయం చెప్పారు. ఇద్దరం కలసి మీ వెబ్ సైట్ చూస్తున్నాము' అన్నారు శుక్లా గారు.

ఎదురుగా ఉన్న శుక్లా గారి లాప్ టాప్ వైపు చూచాను. 'ఆలోచనా తరంగాలు' బ్లాగ్ పేజి కనిపించింది. తెలుగు అర్ధం కాకపోయినా దాన్ని చూస్తున్నారు వాళ్ళు.

'మీ పుస్తకాలలో ఇంగ్లీష్ పుస్తకాలు కూడా ఉన్నాయి కదా. అవి మాకు కావాలి, మీ సబ్జెక్ట్స్ మాకు చాలా ఇంటరెస్టింగ్ గా ఉన్నాయి.' అన్నాడాయన.

 'పంపిస్తాను. ఇంకా వస్తున్నాయి. అవైతే మీకు ఇంకా బాగా ఇంటరెస్టింగ్ గా ఉంటాయి డాక్టర్ గారు' అన్నాను హర్షవర్ధన్ గారితో.

'ఏంటవి?' అన్నారు హర్షవర్ధన్ గారు.

'మెడికల్ ఆస్ట్రాలజీ' మీద పుస్తకం వ్రాస్తున్నాను. త్వరలో అయిపోతుంది. అందులో నూరు జాతకాలను విశ్లేషిస్తూ జలుబు నుంచి ఎయిడ్స్ వరకూ రకరకాల రోగాలు ఎలా వస్తాయో, అలా రావడానికి ఏయే గ్రహయోగాలు కారణాలు అవుతాయో వివరించాను. మీరు డాక్టర్ కదా, ఆ పుస్తకం మీకు బాగా నచ్చుతుంది' అన్నాను.

డా. హర్షవర్ధన్ గారు విభ్రమంగా చూచారు.

'చాలా బాగుంది. అంటే, మనుషుల మీద గ్రహాల ప్రభావం గురించి మీరు రీసెర్చి చేస్తున్నారన్న మాట' అన్నాడాయన.

'అవును. నా రీసెర్చి అంతా అదే' అన్నాను.

ముగ్గురం రిలాక్స్ గా కూచుని టీ సేవిస్తూ మాట్లాడుకుంటున్నాం.

'ఈ సబ్జెక్ట్ గురించి కొంత క్లుప్తంగా చెప్పగలరా?' అడిగాడాయన.

'ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను వినండి. ఆడవారి మెన్సస్ కీ, చంద్రుని మూమెంట్ కీ డైరెక్ట్ సంబంధం ఉన్నది. రెండూ సరిగ్గా 28.5 రోజులలో జరుగుతాయి. ఆడవారు cycle based beings. సముద్రం ఆటుపోట్లకు గురైనట్లు అందుకే వారు ఎక్కువగా చెదిరిపోతూ ఉంటారు. దీనికి చంద్రుని స్థితులు కారణం. ఒక స్త్రీ పుట్టిన తేదీ తెలిస్తే, ప్రతినెలా ఆమెకు మెన్సస్ ఏ రోజు వస్తుందో కరెక్ట్ గా చెప్పవచ్చు.' అన్నాను.

'అవును. ఇది నాకు తెలుసు. ఆడవారిలో ఇదొక్కటే సైకిల్ కాదు. ఇంకా చాలా ఉన్నాయి. వారి జీవితమే అనేక సైకిల్స్ లో సాగుతూ ఉంటుంది. మెడికల్ గా కూడా ఇది ప్రూవ్ అయింది.' అన్నాడాయన. 

'మగవారు కూడా అంతే, అయితే గ్రహప్రభావం వీరి మీద ఇంకొక రకంగా పనిచేస్తుంది. మళ్ళీ ఆడవారిలోనూ మగవారిలోనూ జనరల్ ప్రభావం వేరు. వారి వారి జాతకాన్ని బట్టి వ్యక్తిగత ప్రభావాలు వేరు. ఇదంతా నేను చాలా కాలం నుంచీ పరిశోదిస్తున్నాను' అన్నాను.

మధ్యలో కల్పించుకుంటూ శుక్లా గారు ' అసలు ఇన్ని పనులు చెయ్యడానికి మీకు సమయం ఎక్కడుంటుంది?' అన్నారు ఆశ్చర్యంగా.

'అదే నా జాతకం' అన్నాను నవ్వుతూ.

వాళ్ళు కూడా పెద్దగా నవ్వేశారు.

'శర్మాజీ. మీకు ఒక జాతకం ఇస్తాను. దానిని చూచి కొన్ని వివరాలు నాకు చెప్పాలి' అన్నారు శుక్లాగారు.

ఉత్త మాటలెందుకు? వీరికి కొంత ప్రూఫ్ చూపిద్దామని అనిపించింది. మనసులోనే ఆ సమయానికున్న ప్రశ్నచక్రాన్ని గమనించాను. లగ్నం నుంచి చంద్రుడు సప్తమంలో ఉన్నాడు. లగ్నాధిపతిని చూస్తున్నాడు. శుక్రుడు బలమైన స్థితిలో ఉన్నాడు.

'మీరు అడగాలనుకుంటున్నది మీ భార్య గురించి' అన్నాను.

త్రాగుతున్న టీ కప్పును టేబిల్ మీద ఉంచాడు శుక్లాగారు.

'ఇంకా చెప్పండి?' అన్నాడు.

'ఆమె ఆరోగ్యం గురించి మీరు అడగాలనుకుంటున్నారు' అన్నాను.

కాసేపు మౌనంగా ఉన్న ఆయన ఇలా అన్నాడు - 'శర్మాజీ. నేనేమీ ఆశ్చర్యపోవడం లేదు. ఎందుకంటే, మా బాబాయి గారు మంచి జ్యోతిష్కుడు. ఆయన దగ్గర ఇలాంటి విచిత్రాలు చాలా చూచాను. మీరు సరిగానే ఊహించారు.' అంటూ ఆమె జనన వివరాలు ఇచ్చాడాయన. నిదానంగా జాతకం చూచి మిగతా వివరాలు చెబుతానని ఆయనతో చెప్పాను.

'ఈ సారి మీరు లక్నో వస్తే మా యింటికి తప్పకుండా రావాలి. మా హాస్పిటల్ చాలా పెద్దది. మీకు దగ్గరుండి అన్నీ చూపిస్తాను.' అన్నాడు డా. హర్షవర్ధన్ గారు.

సరేనని చెప్పాను.

నా ఫోన్ నంబర్ ఇద్దరూ తీసుకున్నారు. నా పుస్తకాలు పంపమని మరీ మరీ చెప్పారు. టీ త్రాగడం అయిపొయింది. వారి దగ్గర సెలవు తీసుకుని క్లాస్ కి బయల్దేరాను.

క్యాంపస్ చాలా పెద్దది. చెట్ల మధ్యలో నడుస్తూ అడ్మిన్ బ్లాక్ నుండి క్లాస్ రూమ్స్ కి రావడానికి ఒక అయిదు నిముషాలు పడుతుంది. నడుస్తూ ఉండగా నాకే నవ్వొచ్చింది.

ఇరవై ఏళ్ళ క్రితం మా ఫ్రెండ్ వెంకటాద్రి గారు ఒక మాట అంటూ ఉండేవాడు. 'జ్యోతిష్యం, వైద్యం బాగా తెలిస్తే ప్రపంచంలో ఎక్కడైనా బ్రతికెయ్యవచ్చు. మంచి పేరూ, గౌరవమూ సంపాదించవచ్చు'. అంటూ.

ఈ రెంటికోసమూ నేనెప్పుడూ ప్రాకులాడలేదు. కానీ, తెలుగు రాని హిందీవాళ్ళు కూడా నన్ను గుర్తుపట్టి, గౌరవించడం గమనించి, మనస్సులోనే నా గురువులకు, ఇష్టదైవానికి ప్రణామాలు అర్పిస్తూ క్లాస్ రూమ్ కి చేరుకున్నాను.